కర్నూల్

వలసల పర్వం పునఃప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 17 : అధికార తెలుగుదేశం పార్టీలోకి మరోమారు వలసల పర్వం ప్రారంభమైంది. కొందరు ఎంపిలు, ఎమ్మెల్యేలు రెండేళ్ల క్రితం ప్రతిపక్ష వైకాపాను వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్న తరువాత వలసలకు బ్రేక్ పడింది. ఆ తరువాత అనేక దఫాలు వైకాపా ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడనున్నారన్న వార్తలు వచ్చినా అవి వాస్తవ రూపం దాల్చలేదు. నంద్యాల ఉపఎన్నిక అనంతరం ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కర్నూలు ఎంపి బుట్టా రేణుక వైకాపాను వీడాలని నిర్ణయం తీసుకుని అమరావతిలో సిఎం చంద్రబాబును కలిసి ఆయనకు సంపూర్ణ మద్దతు పలికారు. ఆమె వెంట వెళ్లిన ముఖ్య అనుచరులు కొందరు అక్కడే చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరినా ఆమె మాత్రం పార్టీలో ఇప్పుడే చేరబోనని త్వరలో బహిరంగ సభ నిర్వహించి పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఆమెతో పాటు వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి కూడా పచ్చ కండువా కప్పుకోనున్నారు. నవంబర్ మొదటి వారంలో చంద్రబాబును కర్నూలుకు ఆహ్వానించి భారీ సభ నిర్వహించి తన బలాన్ని చాటుకోవడానికి ఆమె కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కర్నూలు సభలో బుట్టా రేణుకతో పాటు మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు కూడా టిడిపిలో చేరబోతున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కర్నూలు ఎంపి బుట్టా రేణుకను టిడిపిలో చేర్చడానికి డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కృషి చేశారని ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. అయితే ఆమె సిఎం చంద్రబాబు విదేశాల నుంచి వచ్చిన తరువాత అట్టహాసంగా పార్టీలో చేరుతానని పేర్కొన్నట్లు సమాచారం. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సైతం ఆమె అదే విషయాన్ని వివరించడంతో ఆయన అంగీకరించారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే వైకాపా అధినేత జగన్ బిసిలతో సదస్సు నిర్వహించి అధికారంలోకి వస్తే బిసిల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని ప్రకటించడంతో అదే వర్గానికి చెందిన బుట్టా రేణుక వైకాపాకు వీడ్కోలు పలికేలా చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. రాష్ట్రంలో వలసల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో జగన్ పాదయాత్ర ప్రారంభించే నాటికి చేరాలనుకున్న నాయకులందరినీ టిడిపిలో చేర్చుకుని ఆయన మానసిక స్థైర్యంపై దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నట్లు టిడిపి నేతల ద్వారా తెలుస్తోంది.