కర్నూల్

కాస్త తగ్గిన ఉష్ణోగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 28 : జిల్లాలో ఉష్ణోగ్రతల్లో కాస్త తగ్గుదల కనిపించింది. గత రెండు, మూడు రోజులుగా 45 డిగ్రీల స్థాయికి చేరిన ఉష్ణోగ్రత గురువారం కాస్త తగ్గి జిల్లా వ్యాప్తంగా సగటున 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కర్నూలు నగరంలో 43.4, నంద్యాలలో 43, ఆదోనిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే వడగాలుల ప్రభావం మాత్రం అలాగే కొనసాగుతోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ప్రజలకు ఉపశమనం లభించవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నా ధీమాగా చెప్పలేకపోతున్నారు. లెనినో ప్రభాతం బలహీన పడుతున్న దశలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వారంటున్నారు. దీంతో సహజ వాతావరణానికి ప్రస్తుత పరిణామాలకు పొంతన లేకుండా ఉందని వెల్లడిస్తున్నారు.

మార్కెట్‌యార్డుల
ఆదాయం రూ. 472 కోట్లు
* గుంటూరు, ఆదోని యార్డుల ఆధునీకరణ
* రాష్ట్ర కమిషనర్ మల్లికార్జున
ఆదోనిటౌన్, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని మార్కెట్‌యార్డుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంగాను రూ.472 కోట్లు ఆదాయం వచ్చిందని, లక్ష్యం కన్నా మూడు కోట్లు ఎక్కువ ఆదాయం సాధించామని మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర కమిషనర్ మల్లికార్జున స్పష్టం చేశారు. గురువారం రాత్రి మార్కెట్‌యార్డులో ఆయన యార్డు ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను యార్డు చైర్మన్ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. గతంలో కన్నా ప్రస్తుతం యార్డులో పారిశుద్ధ్యం మెరుగు పడిందని, తాగునీటి విభాగం మరింత అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో గుంటూరు, ఆదోని మార్కెట్‌యార్డులో అతి పెద్దవని, వీటి ఆధునీకరణకు ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గుంటూరు మార్కెట్‌యార్డులో ఏడాదికి రూ.5వేల కోట్లు వ్యాపారం జరుగుతుందని, ఆదోని యార్డులో రూ.2వేల కోట్లు వ్యాపారం జరుగుతున్నట్లు వివరించారు. ఇందులో ఆదోని యార్డులోనే వేలాది మంది రైతులు, వివిధ రకాల పంటల ఉత్పత్తులు అమ్మకాలు చేస్తున్నారని, అలాగే ఈయార్డు ద్వారా వేలాది మంది ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని, అందువల్ల ఈయార్డు అభివృద్ధికి అధి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రూ.13కోట్లు అభివృద్ధి పనులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. గుంటూరు, ఆదోని యార్డుల్లో ఆన్‌లైన్ అమ్మకాలు, రైతుల ఉత్పత్తుల రాక, పోకపై జీయోట్యాగింగ్ చేయడం జరుగుతుందని, అలాగే వేమెన్ విధానాన్ని కూడా ఆన్‌లైన్ చేస్తున్నామన్నారు. ఈటెండర్ విధానంతో ఎక్కడి నుండైన కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయకట్టు రోడ్లు అభివృద్ధికి మార్కెటింగ్‌శాఖ నుంచి ఆయా మార్కెట్‌యార్డుల ద్వారా రూ.86 కోట్లు నిధులు కేటాయించామని, దీనికి ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద మరో రూ.86 కోట్లు కేటాయించిందని, మొత్తం రూ.172కోట్లుతో ఆయకట్టు రోడ్లు అబివృద్ధి చేస్తామన్నారు. ఈరోడ్లు నిర్మాణం పంచాయతీరాజ్ శాఖ వారే పట్టే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. మార్కెటింగ్‌శాఖ ఇంజనీర్ల కొరత ఉందన్నారు. అలాగే త్వరలోనే మార్కెట్‌యార్డులో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం తక్కువ ధరలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీని కోసం జిల్లాలో మూడు మార్కెట్లతోపాటు రాష్ట్రంలో 10 మార్కెట్లలో అమలు చేస్తున్నామన్నారు. మార్కెట్‌యార్డు ఎస్‌బిఐ బ్యాంకు నిర్మాణ పనులపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు మరుగుదొడ్లు లేవని బ్యాంకు మహిళ ఉద్యోగిని ఫిర్యాదు చేశారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ పిడిఎం సుబ్బన్న, ఎడిఎం సత్యనారాయణచౌదరి, జెడి సుధాకర్, మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ కోలిమి రాముడు, డైరెక్టర్లు రంగస్వామినాయుడు, సుధాకర్‌చౌదరి, యువరాజు, కమీషన్ ఏజెంట్ల సంఘం అధ్యక్షులు గుడిసె శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
* కార్పొరేషన్‌కు రూ. 167.77 కోట్లు మంజూరు
* 7న సిఎం పర్యటన : డిప్యూటీ సిఎం కెఇ
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఏప్రిల్ 28:నగర పాలక సంస్థకు రూ. 167.77 కోట్ల నిధులు మంజూరయ్యాయని, కావున నగరాభివృద్ధికి పనులు చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మే 7వ తేదీ జిల్లాలో పర్యటించి ఇంకుడుగుంతల కార్యక్రమంలో పాల్గొననున్నారని, సిఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం తాగునీటి సమస్య, ఎన్టీఆర్ జలసిరి, కృష్ణా పుష్కరాలు, ఉపాధి హామీ పనులు, ఇంకుడు గుంతలు తదితరి అంశాలపై కెఇ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కలెక్టర్ విజయ మోహన్, ఎస్పీ ఆకే.రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ నగర సుందరీకరణలో జాప్యం లేకుండా పనులు చేపట్టాలని కమిషనర్‌ను ఆదేశించారు. ప్రధానంగా మురికినీటి కాలువలు, సిసి రోడ్లు, పారిశుద్ధ్యం, పైపులైన్, తదితర అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకుని పారదర్శకంగా పనులు చేపట్టాలని, అవినీతికి పాల్పడితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక రాష్ట్రంలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మజ్జిగ సరఫరా కోసం రూ. 50 కోట్లు మం జూరు చేశామన్నారు. కావున ఉపాధి పనులు జరిగే ప్రదేశాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే వారిని అభినందిస్తామన్నారు. ఇంకుడు గుంతలకు ఎన్ని దరఖాస్తులు వచ్చినా మంజూరు చే యాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద లేబర్ కాంపోనెంట్‌ను వీలైనంత వరకూ పెంచుకోవాలన్నారు. ఈ ఏడా ది పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 460 కి.మీ మేర సిసి రోడ్లు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించా రు. ఇక కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసి ఆ మేరకు పను లు వేగవంతంగా పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. జూలై నాటికి లక్ష ఫారంపాండ్స్ తవ్వకం పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ విజయమోహన్ పేర్కొన్నారు. జిల్లాలో వాగులపై 5,389 చెక్ డ్యాంలకు నిధు లు మంజూరు చేశామని తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, డ్వామా పిడి పుల్లారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు అన్యాయం జరిగితే సహించం..
* దత్తత గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టండి..
* పుష్కరాల బందోబస్తు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..
* నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ రవికృష్ణ
కర్నూలు, ఏప్రిల్ 28:ప్రజలకు అన్యాయం జరిగితే సహించమని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. జిల్లాలోని 141 దత్తత గ్రామాల్లోని పాఠశాలల అభివృద్ధిపై ఎస్‌ఐలు దృష్టి సారించాలన్నారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో గురువారం ఎస్పీ డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పుష్కరాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయాలని, బందోబస్తులో పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. పుష్కరాల బందోబస్తుకు వెళ్లే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సంగమేశ్వరం, సున్నిపెంట, లింగాలగట్టు, శ్రీశైలం తదితర ఘాట్‌ల దగ్గర ట్రాఫిక్, డైవర్షన్, తదితర సమస్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిఐలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన పోలీసు సిబ్బందితో పని చేయించుకోవాలన్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి విద్యార్థులు, సేవా సంఘాల సహకారం కూడా తీసుకోవాలన్నారు. పోలీసులు ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. 15 రోజులకు ఒకసారి ఘాట్‌ల స్థలాలను పోలీసు అధికారులు పరిశీలిస్తూ, అక్కడ ఉండే పుష్కరఘాట్‌ల సమస్యల వివరాలను ప్రత్యేక సెల్‌కు పంపించాలన్నారు. ఎస్‌ఐలు, సిఐలు క్రమశిక్షణతో మెలగాలని, చెడు చేస్తే సర్వీసుపై ఆ ప్రభావం పడి జీవితాలను నాశనం చేస్తుందన్నారు. అరాచకాలను అణచకపోతే పోలీసు ప్రతిష్ట దిగజారుతుందన్నారు. మహి ళ, గృహ హింస కేసులను పరిష్కరించడంలో జాప్యం తగదన్నారు. ఎవరు తప్పు చేసినా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. కాగా జిల్లా పోలీసు యంత్రాంగానికి హైదరాబాద్ తరహాలో ఆఫీసర్స్ మెస్ రప్పించడానికి కృషి చేస్తున్న ఎస్పీకి జిల్లా పోలీసులు అభినందనలు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ ఏఎస్పీ రాధాకృష్ణ, ఓఎస్‌డి రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, వీరరాఘవరెడ్డి, దేవదానం, హరినాథరెడ్డి, బాబాఫకృద్దీన్, ఈశ్వర్‌రెడ్డి, వినోద్‌కుమార్, మురళీధర్, రాజశేఖర్‌రావు, హుస్సేన్‌పీరా, సిఐలు, ఆర్‌ఐ రంగముని, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

రూ. 30 లక్షలతో కుంటల అభివృద్ధి
* ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి
కోవెలకుంట్ల, ఏప్రిల్ 28:మండల పరిధిలోని కలుగొట్ల, రేవనూరు గ్రామాల్లో ఉన్న 3 కుంటలను రూ. 30లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే బిసి ఆయా గ్రామాల్లో పూజలు చేసి కుంటల పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటి అవసరం మేరకు నీరు లభించడం లేదన్నారు. దీంతో భూగర్భ జాలలను పెంచేందుకు సిఎం చంద్రబాబు నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా చేపట్టారన్నారు. ఇందులో భాగంగా ఎన్నో ఏళ్లుగాగా అభివృద్ధికి నోచుకోని కుంట లు, చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే కలుగొట్లలోని పెద్దకుంట, చిన్నకుంట, రేవనూరు గ్రామానికి చెందిన నల్లకుంటలకు ఒక్కో దానికి రూ. 10లక్షల చొప్పున నిధులు కేటాయించి పూడికతీత, గట్లను పటిష్టపరచడం, పిచ్చిమొక్కలు తొలగించడం వంటి పనులు చేపడుతున్నామన్నారు. ప్రతి వర్షం నీటిబొట్టు వృథాకాకుండా కుంటలకు చేరి నిల్వ వుండేలా ప్రణాళికాబద్దంగా పనులు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట నీటిపారుదల ఏఇ నాగన్న, మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం నాగేశ్వరరెడ్డి,నాయకులు డాక్టర్ రామిరెడ్డి, బివి ప్రసాదరెడ్డి, గడ్డం రామకృష్ణారెడ్డి, కరిమద్దెల మురళి, మోహన్‌రెడ్డి, కలుగొట్ల రామేశ్వరరెడ్డి, భూపాల్‌రెడ్డి, రేవనూరు ఎంపిటిసి మల్లునాగిరెడ్డి, నరసింహారెడ్డి ఉన్నారు.

ఏడుగురు ఎమ్మెల్యేలు జగన్ వెంటే..
* వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 28: జిల్లా వైకాపా నుంచి టిడిపిలోకి ఎంతమంది పోయినా ఏడుగురు వైకాపా ఎమ్మెల్యేలు పార్టీకి గట్టిగా ఉంటారని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. గురువారం విలేఖరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను, నా సోదరుడు వై.సాయిప్రసాద్ రెడ్డి, గౌరు చరిత, గుమ్మనూరు జయరామ్, ఐజయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైకాపాలోనే ఉంటారని, ఎన్ని ప్రలోబాలు పెట్టినా పార్టీ మారే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రతి రోజు వైకాపా నుండి టిడిపిలోకి 10 నుండి 15 వరకు వస్తున్నారని అసత్యపు ప్రకటనలు చేస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మవద్దని, జిల్లాలో ఏడుగురు వైకాపా ఎమ్మెల్యేలు చీవరి రక్తం బొటు ఉన్నంతవరకు వై.జగన్ వెంటే ఉంటారన్నారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు వై.సితారామిరెడ్డి, ధరణి రెడ్డి, ప్రదీప్ రెడ్డి, ఆర్ ఇ.రాజు, శివకుమార్, రాంపురం స్వామి, అశోక్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మూలరాములకు ప్రత్యేక పూజలు
మంత్రాలయం, ఏప్రిల్ 28: పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు శ్రీ మూలరాముల దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి తులసి అర్చన, పంచామృతాభిషేకం, ఉత్సవ రాయల పాద పూజ, నిర్మల్య విసర్జన తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం బృందావన ప్రతిమను మఠం ప్రాకారంలో ఊరేగించారు. రాత్రి ప్రహ్లాద రాయలను గజవాహనం, కొయ్య, వెండి, బంగారు రథోత్సవాలపై ప్రహ్లాదరాయలను అధిష్టించి ప్రత్యేక పూజలు చేసి అశేష భక్తుల నడుమ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం ప్రహ్లాద రాయలకు ఊంజల సేవ నిర్వహించారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక నుండి వచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ఎండల నుంచి ఉపశమనం కోసం
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
* డిప్యూటీ సిఎం కెఇ
కర్నూలు సిటీ, ఏప్రిల్ 28:ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నగరంలోని గాయిత్రి ఎస్టేట్ ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయం ముందు గురువారం కెఇ మజ్జిగ, చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలు ఎండ వేడిమి నుంచి బయటపడేందుకు మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లాకు రూ. 3కోట్లు కేటాయించిందని వివరించారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండ జాగ్రత్త వహించాలని సూచించారు. అధికారులు వడదెబ్బ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు సమీపంలో ఏర్పాటు చేసిన మజ్జిగ, చలివేంద్రాలను సద్వినియోగ పరుచుకోవాన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి టిజి వెంకటేష్, టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కెఇ ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్, సత్రం రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో శాంతి భద్రతలకు
విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు
* దోషులు ఎంతటివారైనా ఉపేక్షించం:ఎస్పీ
కర్నూలు, ఏప్రిల్ 28:గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలుగజేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదని ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే సంఘటనలను పోలీసుశాఖ తీవ్రంగా పరిగణిస్తుందని, అటువంటి వ్యక్తులపై కోర్టులో కఠిన శిక్షలు పడే విధంగా కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యే యంగా జిల్లా పోలీసు యంత్రాం గం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్పీ గురువారం ఉదయం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి వెళ్లి హత్యకు గురైన కప్పట్రాళ్ల కౌలుట్లయ్య(48) మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జానకమ్మ కౌలుట్లయ్య సహజీవనం చేస్తున్న కారణంగానే జానకమ్మ కుమారుడు వీరేష్, అల్లుడు కృష్ణ కలిసి హత్య చేసినట్లు తెలుస్తోందన్నారు. వారిద్దరు పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇటువం టి సంఘటనలు పునరావృతం కాకుం డా గట్టి చర్యలు తీసుకుంటామని, దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఎస్పీ వెంట పత్తికొండ సిఐ విక్రమ్‌సింహా, కర్నూలు 3వ పట్టణ సిఐ మధుసూదన్‌రావు, దేవనకొండ ఎస్‌ఐ శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.

రుణభారంతో గిరిజన రైతు అత్మహత్య
ఆత్మకూరు ఏప్రిల్ 28:అప్పుల బాధ తాళలేక గిరిజన రైతు అంకన్న బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గురువారం కొత్తపల్లెలో చోటుచేసుకుంది. అతడి భార్య లింగమ్మ తెలిపిన వివరాలు.. తన భర్త అంకన్న వ్యవసాయం కోసం అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే మార్గం లేక జీవితంపై విరక్తి చెంది గురువారం పురుగుల మందు తాగి పొలంలో ఉన్న తండ్రి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగినట్టు చెప్పాడు. దీంతో అతడి తండ్రి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. దీంతో పాములపాడుకు చెందిన 108 వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని అంకన్నను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు అంకన్నకు ప్రథమ చికిత్స చేసి మైరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేయగా అదే 108 వాహనంలో కర్నూలుకు బయల్దేరారు. అయితే మార్గమధ్యలో భానుముక్కల మలుపు వద్ద ఆ వాహనంలో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది. దీంతో నందికొట్కూరుకు సమాచారం ఇవ్వగా అక్కడి నుంచి 108 వాహనం రాగా ఎక్కించుకుని వెళ్తుండగా మార్గమధ్యలో అంకన్న మృతిచెందాడు. దీంతో మృతదేహన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటు పోలీసులు తెలిపారు.

యువకుడి ఆత్మహత్య
* ప్రేమ వ్యవహారమే కారణం..
మహానంది, ఏప్రిల్ 28: మహానందిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో గురువారం రాత్రి అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన రవీంద్రనాథ్‌రెడ్డి (24) ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. గురువారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రవీంద్రనాథ్‌రెడ్డి తన స్నేహితులు వస్తున్నారని చెప్పి ప్రైవేటు లాడ్జిలో రూమ్ తీసుకున్నట్లు తెలిపారు. మృతుడి సెల్‌ఫోన్ పరిశీలించగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన స్నేహితుల సెల్‌ఫోన్లకు మెసేజ్ పాస్‌చేశాడని, తన ప్రేమికురాలు మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడగా మనస్తాపానికి గురై తాను మహానందిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సమాచారం పంపినట్లు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.