కర్నూల్

ఉల్లి రైతు కంట కన్నీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మార్చి 21: ఉల్లి ధరలు మ రింత తగ్గిపోయాయి. కర్నూలు మార్కెట్‌లో కుప్పులు తెప్పలుగా ఉల్లి అమ్మకానికి వస్తుండడంతో వ్యాపారులంతా కుమ్ముకై తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధర మార్కెట్‌లో ఒకే సారి క్వింటాల్‌కు రూ.1300లు తగ్గిపోవడంతో ఉల్లి పంటలు పండించిన రైతులకు తగ్గిన ధరలు కంట నీరు పెట్టిస్తున్నాయి. అయితే రిటైల్ ఉల్లి వ్యాపారస్థులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు ఉల్లి గడ్డలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారుల మాయ జాలం తో ఉల్లి రైతులు విల విలాడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఉల్లిరైతులు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం లో బహిరంగ మార్కెట్‌లో రైతులు పండించిన ఉల్లి ధరకు క్వింటాల్ రూ.2వేల ప్రకారం ఉండడంతో రైతులు ఎంతో సంతోషంగా పంట కోతలను మొదలు పెట్టి మార్కెట్‌కు ఉల్లిగడ్డలను అమ్మకానికి తీసుకొస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర రూ.700లకు పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఉల్లి రైతులు పేర్కొన్నారు. క్వింటాల్‌కు రూ.1300లు ధర తగ్గడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రెండు నెలల క్రితం కిలో ఉల్లి ధర రూ.100లకు చేరింది. తీరా రైతులు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చే సరికి ధర పడిపోవడంతో రైతులు వ్యాపారుల చర్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రైతులు వద్ద క్వింటాల్‌కు రూ.700లు కొనుగోలు చేసిన వ్యాపారులు అవే ఉల్లిగడ్డలను ప్రజలకు కిలో రూ.20ల ప్రకారం అ మ్ముతూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. ఈవిధంగా చూసుకుంటే రైతుల వద్ద కొనుగోలు చేసే ఉల్లిగడ్డల ధరలు కనీసం రూ.1500ల నుంచి రూ.1600లకు క్వింటాల్ ప్రకారం కొనుగోలు చేయాలి. కాని రైతుల వద్ద మాత్రం క్వింటాల్ రూ.700ల ప్రకారం వ్యాపారులు కోనుగోలు చేస్తున్నారు. ఉల్లి వ్యాపారులు ఏకమై రైతులను నష్ట పరుస్తున్నరన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వ్యాపారులు కుమ్ముకై ఇప్పు డు ధరలను మరింత తగ్గించి వేశారు. అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆదోనిలో ఉల్లిగడ్డల మార్కెట్ లేకపోవడంతో కర్నూలు మార్కెట్‌కు తీసుకొని వెళ్తున్నారు. అక్కడ ఒక్కొక్క సారి తమ ఇష్టవచ్చినట్లు ధరలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. తిరిగి తీసుకురాలేక వచ్చిన ధరకే అమ్ముతున్నామన్నారు. ఒక్కొక్క సారి రూ.600లకే క్వింటాల్ అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇక్కడ కొనుగోలు చేసిన సరుకును మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు ఎక్కువ ధరకు తరలిస్తున్నారు. వ్యాపారులు మాత్రం తక్కువకు కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకొని ఇతర ప్రాంతాలకు అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. ఈసమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలో దిగి రైతుల వద్ద ఉన్న సరుకులను కనీసం రూ.1500 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి గడ్డలను చౌక దుకాణాల ద్వారా లేదా కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో రూ.10లేదా రూ.15లకు కిలో ప్రకారం సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల వ్యాపారుల మాయ జాలానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. అంతేకాకుండా ఉల్లి వ్యాపారులు, మధ్య దలారులు తక్కువ ధరకు రైతులకు కొనుగోలు చేసి, స్టాక్ పెట్టి ధరలు వచ్చినప్పుడు అమ్మేదుకు సన్నద్ధం అవుతున్నారు. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో అన్ని గ్రామాల్లో బావుల కింద ప్రతి సంవత్సరం 20వేల ఎకరాల్లో ఉల్లి పంట వేస్తారు. ఇప్పుడు కోతకు రావడం జరిగింది. ఇలాంటి సమయంలో ఉల్లి గడ్డల వ్యాపారులు ధరలు తగ్గించి రైతుల కడుపుతున్నారు. ఉల్లిగడ్డల వ్యాపారుల అక్రమ దందాకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం రంగంలోకి దింపి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఉల్లి రైతులకు ఆత్మహత్యాలే శరణ్యం.

క్వింటాల్ రూ.6001కి చేరిన వేరుశెనగ ధర
ఆదోనిటౌన్, మార్చి 21: క్వింటాల్ వేరుశెనగ ధర సోమవారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.6001కి ధర చేరింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్‌యార్డులో సుమారు 1669 క్వింటాళ్ళ వేరుశెనగ కాయలు అమ్మకానికి రాగా అందులో క్వింటాల్ గరిష్ట ధర రూ.6001గా కనిష్ట ధర రూ.2736 కాగా మద్దతు ధర రూ.5003లు ధర పలికినట్లు మార్కెట్‌యార్డు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వేరుశెనగ సాగు కోసం రైతులు ఎక్కువశాతం విత్తనాలు నిలువ చేసుకునేందుకు వేరుశెనగను వ్యాపారుల కంటే రూ.100 నుంచి రూ.200ల దాక పెంచి కొనుగోలు చేశారు. అలాగే మార్కెట్‌లో వేరుశెనగ ధర నూనే ధర పెరగడంతో కూడా వ్యాపారులు పోటీపడి వేరుశెనగను కొనుగోలు చేశారు. ఈవారంలో క్వింటాల్‌పై మరో రూ.100లు పెరిగి రూ.6001కి చేరింది. అలాగే సోమవారం మార్కెట్‌లో 7656 క్వింటాళ్లు పత్తి అమ్మకానికి రాగా పత్తి గరిష్ట ధర క్వింటాల్‌కు రూ.4700లు కాగా కనిష్ట ధర రూ.3859 ధర పలుకగా మద్దతు ధర రూ.4128 ధర పలికింది. పత్తికి రైతులు ఆశించిన మేరకు ధర రావడం లేదని, వేరుశెనగకు మంచి ధర లభిస్తుందని అయినా కూడా పెట్టుబడులు గిట్టుబాటు కాలేదని రైతు సంఘం నాయకులు అన్నారు.

ఎండల నుండి ప్రాణాలు కాపాడుకోండి
కర్నూలు, మార్చి 21:పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులు, పోలీసులకు దాహార్తి తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ప్రారంభిస్తామని ఎస్పీ ఆకే రవికృష్ణ చెప్పారు. సోమవారం నగరంలోని కర్నూలు తాలుక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఉమేష్‌చంద్ర మెమోరియల్ సంస్థ ఆధ్వర్యంలో సిఐ నాగరాజుయాదవ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు ఎండ వేడిమి నుండి తమ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. ఎండలేని సమయంలో తమ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు స్వచ్చంధ సంస్థలు మందుకు రావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నీరు వృథా చేయకుండ పొదుపుగా వాడుకోవాలని ప్రజలను ఎస్పీ కోరారు. ఈ ఏడాది వర్షాలు లేనందున రాబోయే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ప్రభలే ప్రమాదం ఉందని, నీటి పొదుపుగా వాడుకుంటే కొంత వరకు ప్రయోజనం పొందవచ్చున్నారు. ప్రధానంగా ఎండి వేడిమి నుండి ప్రతి ఒక్కరు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించాలని ఎస్పీ కోరారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీసుస్టేషన్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాహర్తిని తీరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ రమణమూర్తి, ఎస్సీ, ఏస్టీ సెల్ డిఎస్పీ వినోద్‌కుమార్, సిఐలు నాగరాజుయాదవ్, ములకన్న, మధుసూదన్‌రావు, నాగరాజారావు, ఎస్‌ఐలు చంద్రబాబునాయుడు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

తాలుక పోలీసుస్టేషన్ తనిఖీ
కర్నూలు, మార్చి 21:నగరంలోని కర్నూలు తాలుక రూరల్ పోలీసుస్టేషన్‌ను సోమవారం జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని ఎస్పీ సూచించారు. రికార్డులు, స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. తాలుక స్టేషన్ పరిధిలోని ఓర్వకల్లు, ఉలిందకొండ, నాగులాపురం పోలీస్‌స్టేషన్ రికార్డులను కూడ ఎస్పీ పరిశీలించారు. కర్నూలు డిఎస్పీ రమణమూర్తి, సిఐ నాగరాజుయాదవ్, ఎస్‌ఐలు చంద్రబాబునాయుడు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నయనానందకరం..

శ్రీ ప్రహ్లాద వరదుని కల్యాణం
ఆళ్లగడ్డ, మార్చి 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో సోమవారం రాత్రి 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమ్మవార్ల కల్యాణం నయనానవందకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా తెప్పించిన పట్టువస్త్రాలతో, పూలమాలలతో అలంకరించి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ ఇఓ తిమ్మనాయుడు ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను వేరు వేరు పల్లకీల్లో కుర్చోబెట్టి ఆలయ ఆవరణలో నిర్వహించిన ఎదురుకోళ్ల కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది. అర్చకులు స్వామివారి ఎదుట చిందులు వేస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మేళ తాళాలు, భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల మధ్య ఉత్సవ మూర్తులను కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీసూక్తం, పురుషసూక్తం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తరపున అర్చకులు వేదమంత్రోచ్చరణల మధ్య జిలకర్ర, బెల్లం,కంకణ ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్ధానం వారు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారి తరపున అర్చకులు అమ్మవారి మెడలో మాంగళ్యాధారణ గావించారు. నూతన వధూవరుల సమక్షంలో హోమం నిర్వహించి 46వ జియ్యర్ స్వామి స్వామివారికి, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా పద్మశాలీయ సంఘం వారు వ్యవహరించారు. కల్యాణోత్సవం తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం శ్రీ ప్రహ్లాద వరద స్వామి గజవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కల్యాణోత్సవాన్ని పద్మశాలీయ సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి, గంగుల సుదర్శన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదతరులు తిలకించారు.
ఎగువ అహోబిలంలో...
పుణ్యక్షేత్రమైన అహోబిలంలో రాత్రి ఎగువ వాహనంపై శ్రీ జ్వాలా నరసింహస్వామి భక్తులకు అశ్వవాహనంపై దర్శణం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తి జ్వాలానరసింహస్వామి అర్చకులు అశ్వవాహనంపై కొలువుదీరిన జ్వాలా నరసింహస్వామి పూజలు నిర్వహించారు. అనంతరం అహోబిలంలో మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యమ్రమానికి తాడిపత్రికి చెందిన జలదుర్గం రామస్వామి ఉభయధారులుగా వ్వవహరించారు.

ఉచిత ఇసుక రవాణాపై
9 చెక్‌పోస్టులు

కర్నూలు, మార్చి 21:ఉచిత ఇసుక ఆక్రమ రవాణాను నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా 9చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ ఆకే రవికృష్ణ చెప్పారు. సోమవారం సాయంత్ర కర్నూలు తాలుక రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ రవికృష్ణ తనిఖీ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ ఇసుక ఆక్రమ రవాణాలో పట్టుబడిన వాహనాన్ని సీజ్ చేస్తామని, అదే విధంగా వాహన యాజమానితోపాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేస్తామని చెప్పారు. వాహనాన్ని వేలంలో విక్రయించి వచ్చిన డబ్బును ప్రభుత్వఖాతాలో జమ చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని మాదవరం, బైరాపురం, పంచలింగాల, జాతీయరహదారి తదతర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు 9మంది ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆక్రమ ఇసుక రవాణా చేసే వారి గురించి 100కు సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. చెక్‌పోస్టుల్లో మామూళ్ల వసూలు చేసినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఉచిత ఇసుక కర్నూలు జిల్లా వాసులు మాత్రమే నిర్మాణాలకు ఉపయోగించుకోవాలన్నారు. కర్నూలు జిల్లా ఇసుక ఇతర రాష్ట్రాలకు తలించకుండ గట్టి నిఘాతోపాటు నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆక్రమ ఇసుక రావాణకు ప్రజలు ఒక్కరు సహాకరించాలని ఎస్పీ కోరారు. కర్నూలు డిఎస్పీ రమణకుమార్తి, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ వినోద్‌కుమార్, 2వ పట్టణ సిఐ ములకన్న, 3వ పట్టణ సిఐ మధుసూధన్‌రావు, 4వ పట్టణ సిఐ నాగరాజారావు, కర్నూలు తాలుక రూరల్ సిఐ నాగరాజుయాదవ్, ఉలిందకొండ ఎస్సై వెంకటేశ్వర్లు, ఓర్వకల్లు ఎస్‌ఐ చంద్రబాబునాయుడు తదితరులు పాల్గొన్నారు.

నిరంతర అధ్యయనంతోనే అభివృద్ధి
కర్నూలు అర్బన్, మార్చి 21:విద్యార్థులు నిరంతర అధ్యాయనం చేస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చ ని రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ వై.నరసింహులు అభిప్రాయపడ్డారు. సోమవారం స్థానిక రాయలసీమ యూనివర్శిటీలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రబంధ సాహిత్యం-సాహితి కార్యక్రమాన్ని ఆ శాఖ అధ్యక్షులు ఆచార్య నరసిహులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ కోర్సులు పూర్తి చేసుకుని విద్యార్థులు సమాజంలో మంచి వ్యక్తులుగా స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. విశ్రాంత ఐఎఎస్ అధికారి కె.వెంకట శివయ్య మను చరిత్ర, పెద్ద కవితా రీతులను గురించి వివరించారు. తెలుగు శాఖ ఆచార్యులు నరసింహులు మాట్లాడుతూ అజరామరమైన సాహిత్యంతో పాటు తెలుగు భాష తియ్యదనాన్ని మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. తెలుగు భాషా వికాస ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి జెఎస్‌ఆర్‌కె.శర్మ రాయల వారి పద్యాల్లోని మాధుర్యాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం విసి నరసింహులు విశ్రాంత ఐఎఎస్ అధికారి వెంకట శివయ్యను జ్ఞాపికతో సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు రవిశంకర్, ఆంజనేయుడు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.