కర్నూల్

ప్రత్యక్ష ఎన్నికలపై తమ్ముళ్లలో భిన్నాభిప్రాయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 13 : స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల అధ్యక్ష, పురపాలక, నగర పాలక సంస్థల అధ్యక్ష పదవికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనకు తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల కారణంగా క్షేత్రస్థాయిలో ఏర్పడే ఇబ్బందులను నాయకులు తమ అధినేత ముందు ఏకరువు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం స్థానిక సంస్థలకు అయిదంచెల వ్యవస్థ ఉండగా ప్రత్యక్ష ఎన్నికలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మూడంచెల వ్యవస్థగా మారుతుంది. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యత్వం రద్దవుతుంది. దీంతో వేలాది మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు పదవులు లేకుండా పోతాయి. దీని కారణంగా కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయడానికి ఆసక్తి కనబరచరని టిడిపి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అంతేగాక ఎన్నికల సమయంలో తమకు ఖర్చులు తడిసి మోపెడవుతాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. పదవులు వస్తాయన్న ఆశతో కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి డబ్బులు ఆశించకుండా ఎన్నికల్లో పని చేస్తారని అందులో విశ్వసనీయత కూడా ఎక్కువగా ఉంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాదేశిక సభ్యత్వం రద్దయితే కార్యకర్తలు ఖర్చుల కోసం తమను వేధిస్తారని డబ్బులు ఇచ్చినా ఏ మేరకు కష్టపడి పని చేస్తారోనన్న అనుమానం కూడా ఉంటుందని నాయకులు వెల్లడిస్తున్నారు. ఇక ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్ లేని స్థానాల్లో అభ్యర్థులు ఆయా పదవులకు తమ సొంత ఖర్చుతో పోటీ చేస్తారని అయినా తామూ ఎంతో కొంత ఖర్చు చేయాల్సి వస్తుందని చంద్రబాబుకు నివేదించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ ఉన్న స్థానాల్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో పేద వారినే నిలపాల్సి వస్తుందని అలాంటి చోట్ల పూర్తి ఖర్చు సంబంధిత స్థానిక సంస్థ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జిలపై పడుతుందని వెల్లడించినట్లు సమాచారం. పరోక్ష పద్ధతిలో అయితే కొంతమందికి ఆర్థిక సహాయం చేసినా సరిపోతుందని ప్రత్యక్ష ఎన్నికలకయ్యే ఖర్చు రాదని స్పష్టం చేశామని టిడిపి నేతలు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణకు సిద్ధమై త్వరలో జీఓ జారీ చేయాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కాగా పరోక్ష ఎన్నికలను వ్యతిరేకించిన నాయకులు సైతం ఉన్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పరోక్ష ఎన్నికల కారణంగా ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా అసమ్మతి, అలకల పర్వం ప్రారంభమై ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిలో కొందరు ఆర్థికంగా లాభం చేకూరిస్తే సర్దుకుపోతారని, మరి కొందరు భవిష్యత్తుపై ఆశతో వెనక్కి తగ్గినా కేవలం పదవి కోసమే ఉన్నవారు మాత్రం స్థానిక ఎన్నికల్లోనే కాకుండా శాసనసభ ఎన్నికల్లో సైతం పార్టీకి వ్యతిరేకంగా చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని వెల్లడించినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కంటే ఈ అలకల ఇబ్బందులే పార్టీని ఇరుకున పెట్టిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, కావున ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణకే నిర్ణయం తీసుకోవాలని కోరారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సిన స్థానాలకు గతంలో మాదిరే నిర్వహించి 2019 స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటే మంచిదని పార్టీలోని సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తన నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు.