కర్నూల్

సోషల్ మీడియాలో ‘మండలి’ ప్రచారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 8 : కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల శాసనమండలి నియోజకవ్గంలో ఎన్నికల ప్రచారంలో క్రమేణా వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, యూ ట్యూబ్‌లను ప్రచార సాధనాలుగా వినియోగించుకుంటూ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. టిడిపి మద్దతుతో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కెజె రెడ్డి, వైకాపా మద్దతుతో వెన్నుపూస గోపాల్‌రెడ్డి పోటీపై ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక వామపక్ష పార్టీల మద్దతుతో పోటీ చేయాలని భావిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ గేయానంద్, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈశ్వరయ్య అభ్యర్థిత్వంపై నిర్ణయం వెలువడాల్సి ఉంది. పోటీ చేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థులు తమకు మద్దతు ఇవ్వాలని పట్ట్భద్రులను కోరుతూ సామాజిక మాధ్యమాలను పెద్దఎత్తున వినియోగించుకుంటున్నారు. ఓటర్ల జాబితాలో పేరు చేర్చేందుకు ఇంతవరకూ దృష్టి సారించిన అభ్యర్థులు గడువు ముగియడంతో ప్రచారం ప్రారంభించారు. ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా పేజీ తయారు చేసి ఎన్నికల్లో విజయం కట్టబెట్టాలని కోరుతున్నారు. తాము గెలిస్తే పట్ట్భద్రుల ప్రయోజనాలకు ఏం చేస్తామనేది వివరిస్తున్నారు. మరోవైపు వాట్సాప్, యూ ట్యూబ్‌లలో కూడా వారు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వ్యక్తిగత, రాజకీయ విమర్శలకు తావు లేకుండా వ్యవహరిస్తున్న అభ్యర్థులు తమ ప్రత్యర్థుల లోటుపాట్లను వెతికే పనిలో పడ్డట్లు సమాచారం. తమకు ప్రధానంగా పోటీ ఇచ్చే అభ్యర్థులెవరో తేలిన తరువాత వారి వ్యాపార, వ్యవహారాలు, రాజకీయ జీవితాల్లోని తప్పులను వెతికి పట్టి ప్రచారంలో వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు కుల సంఘాల నాయకులను కలిసి మద్దతు కూడగట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ పార్టీ చేసింది, చేయబోయేది చెప్పుకుంటున్నారు. వైకాపా ప్రధానంగా ప్రత్యేక హోదాపై ఆధారపడగా, అధికార పార్టీ ఏపిపిఎస్‌సి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం, పలు కులాల సంక్షేమం కోసం బ్యాంకు రుణాలు, సబ్సిడీలు ఇస్తున్న విషయాన్ని ప్రచారంలో వాడుకుంటున్నారు. వైకాపా అవినీతిపై టిడిపి తయారు చేసిన వీడియోలు, గతంలో, ప్రస్తుతం జగన్ ఆస్తులపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వైకాపా సైతం ప్రభుత్వం వైఫల్యం చెందిన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వీడియోను తయారు చేయడమే కాకుండా ఆ పార్టీ మద్దతునిస్తున్న కెజె రెడ్డి వ్యాపారంలో చోటు చేసుకున్న అనేక వివాదాస్పద అంశాలను ప్రచారంలో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడవుతోంది. కాగా వామపక్ష పార్టీల తరఫున అభ్యర్థి ఎవరన్నది తేలితే ప్రచారంలో వినియోగించుకునే అంశాలు మారవచ్చని స్పష్టమవుతోంది. కాగా వామపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు వైకాపా నేతలు ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారి తరఫున ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థిని పోటీలో పెడితే తాము మద్దతు ఇస్తామని చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
‘నోట్ల’ గుబులు!
* పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరుల ఆందోళన..
* కరెన్సీ మార్పిడికి వ్యూహాలు..

కర్నూలు, నవంబర్ 8:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో నల్ల కుబేరుల గుండెల్లో గుబులు రేకెత్తుతోంది. తమ వద్ద ఉన్న నల్ల ధనం మార్పిడి ఎలాగంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్న మూడు గంటల వ్యవధిలో రాత్రి 12 గంటల నుంచి రూ. 500, రూ. వెయ్యి కరెన్సీ నోట్ల చెల్లుబాటు రద్దయింది. అంతేగాకుండా బుధవారం నుంచి బహిరంగ మార్కెట్‌లో ఈ రెండు కరెన్సీ నోట్లు చెల్లుబాటు కావని వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి రూ. 100 కరెన్సీ నోట్లుగా మార్చుకోవాల్సిందిగా ప్రధాని సూచించడంతో తాత్కాలికం గా సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బుధ, గురువారాలు ఏటిఎంలు పని చేయకపోవడంతో పాటు బుధవారం బ్యాంకు లావాదేవీలు ప్రజలకు సేవలందించబోవని స్పష్టమవుతోంది. దీంతో తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో వ్యవహారం ముగించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక నుంచి బ్యాంకుల్లో, ఏటిఎంలలో ఒక రోజుకు కేవలం రూ. 10 వేలు, వారంలో రూ. 20వేలకు మించి తీసుకోవడానికి వీలుండని కేంద్రం స్పష్టం చేసింది. దీని కారణంగా సామాన్యుడు సైతం చెక్ బుక్కును అందుబాటులో ఉంచుకోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. ప్రతి ఆర్థిక లావాదేవీ బ్యాంకు ద్వారా జరుగాల్సి ఉంటుందని తెలియడంతో సామాన్యుడు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నా అది తాత్కాలికమేనని వారం, పది రోజుల్లో సర్దుకుంటుందని బ్యాంకర్లు వెల్లడిస్తున్నారు. పెద్దఎత్తున జీరో వ్యాపారం చేసే వారు, నగదు లావాదేవీలకు ప్రాధాన్యత ఇచ్చే వారు, నల్ల ధనం ఉన్న వారు మాత్రం తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. నెల రోజుల క్రితం నల్లధనం వివరాలు వెల్లడించడానికి సమయమిచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ అవకాశం వినియోగించుకోకుండా అజాగ్రత్తగా ఉన్న వారు తమ వద్ద ఉన్న నల్ల ధనం మార్పిడికి ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
భూముల కొనుగోలుకు ప్రాధాన్యం..
కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నల్ల కుబేరులు రైతుల నుంచి భూములను అధిక ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వెండి, బంగారం కొనుగోలుకు ఇప్పటికే పలు నిబంధనలు అమలులో ఉన్న దృష్ట్యా భూములు, ఇంటి స్థలాలు, ఇళ్ల కొనుగోలు వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. పెద్దనోట్ల మార్పిడికి డిసెంబర్ 31వ తేదీ వరకూ సమయం ఇవ్వడంతో తమ వద్ద ఉన్న పెద్ద కరెన్సీ నోట్ల మార్పిడికి ఇదే సులువైన మార్గమని వారు ఆలోచించవచ్చని బ్యాంకర్లు భావిస్తున్నారు. దీని కారణంగా భూముల ధరలకు రెక్కలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అధిక ధరకు అమ్ముడవడమే కాకుండా కేవలం గంటల వ్యవధిలో సొమ్ము చేతికి వచ్చి భూములు వారికి బదిలీ చేసే అవకాశం ఉండటంతో వ్యవసాయంలో దెబ్బ తిన్న రైతులు భూముల విక్రయాలకు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. అంతేగాక పట్టణాల్లో రియల్ వ్యాపారం స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలుకు కూడా ప్రాధాన్యత ఇవ్వవచ్చని భావిస్తున్నారు. వీటిని బినామీ పేర్లతో కొనుగోలు చేసి అంతా సర్దుకున్నాక తిరిగి తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న కరెన్సీని మార్పిడి చేసుకునేందుకు ఇప్పటికే తమ ఆర్థిక సలహాదారులతో సమావేశమైనట్లు వెల్లడవుతోంది. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న హఠాత్ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు వ్యూహ రచనలో మునిగినట్లు తెలుస్తోంది.
వైద్య ఆరోగ్యశాఖకు అధిక ప్రాధాన్యత
* తల్లీబిడ్డల సంరక్షణలో రాష్ట్రానికి మొదటిస్థానం
* వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
నంద్యాల, నవంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ నిధులను ఖర్చు చేస్తుందని అందుకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నంద్యాల జిల్లాస్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో పిపిపి విధానంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియలతో కలిసి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి నిధుల కొరతతో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పేద ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారని, దాని ఫలితాలు ఇప్పటికే ప్రజలకు అందడం వల్లనే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి శాతం బాగా పెరిగిందన్నారు. ప్రజలకు ప్రభు త్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల పట్ల నమ్మకం పెరగడం వల్లనే ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకంతోనే గర్భిణీ స్ర్తిలు ప్రసవం కోసం పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయించుకొనేందుకు ఎక్కువ సంఖ్యలో రావడం లేదనే రాష్ట్రంలో అక్కడకక్కడ ఒకే మంచంపై ఇద్దరు గర్భిణులు ఉండాల్సి వస్తుందన్నారు. ఆసుపత్రుల అవసరాన్ని బట్టి పడకల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఎన్‌టిఆర్ వైద్య సేవల కింద పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా 48రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయడంతో పాటు మందులు ఇస్తూ నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. నిధుల కొరత కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య సేవలు అందించే ఏజన్సీలకు రెండు నెలలుగా వేతనాలు సర్దుబాటు చేయలేకపోయామని, ఇప్పటి వరకు రూ.80కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. పేద మహిళ గర్భవతి అయినప్పటి నుంచి నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేయడంతో పాటు రెండుసార్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి సురక్షిత ప్రసవం అనంతరం తల్లీబిడ్డను ఎన్‌టిఆర్ కిట్‌తో పాటు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి 102 ఎక్స్‌ప్రెస్‌లో సురక్షితంగా ఇంటి వద్ద దింపడం జరుగుతుందని ఈవసతి ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోను లేదన్నారు. రాష్ట్రంలో 80 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత డయాలసిస్ సేవలు అందజేసేందుకు పిపిపి విధానంలో పొరుగు సేవలకు అందజేయడం జరిగిందని, కార్పొరేట్ ఆసుపత్రులలో ఒక డయాలసిస్‌కు రూ.2వేలు ఖర్చయితే, అత్యాధునిక సేవలు అందిస్తు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో ఒక్క డయాలసిస్‌కు రోగి తరపున ప్రభుత్వం ప్రైవేట్ ఏజన్సీకి కేవలం రూ.927లు చెల్లించడం జరుగుతుందన్నారు. వైద్యుని నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు చిత్తశుద్ధితో సేవలు చేయడం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆదరణ పొందుతున్నాయన్నారు. పట్టణ ప్రాంతాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకే అర్బన్ హెల్త్ సెంటర్లను అపొలో ఆసుపత్రి యాజమాన్యానికి అప్పగించడం జరిగిందన్నారు. నంద్యాలలో 4 కేంద్రాలు మంజూరు చేశారని, ఈ కేంద్రాలలో 28రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు వైద్య సేవలు అందజేస్తారన్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జిల్లాస్థాయి ప్రభుత్వ ఆసుపత్రిని 500 పడకలకు పెంచాలని వినతిపత్రం అందజేశారని, అయితే ఇప్పటికే 200పడకల స్థాయితో ఉన్న ఆసుపత్రికి మాతాశిశు సంరక్షణ కేంద్రం ద్వారా మరో 150 పడకలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈసమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డి, జిల్లా ఆరోగ్య శాఖ అధికారిణి స్వరాజ్యలక్ష్మి, నంద్యాల ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, కో ఆర్డినేటర్ రామకృష్ణ, నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.
టిడిపి హయాంలోనే
గ్రామాల అభివృద్ధి
* రాజధానికి ఆరు లేన్ల రహదారి..
* డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
క్రిష్ణగిరి, నవంబర్ 8: టిడిపి హ యాంలోనే గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి త్వరగా చేరుకునేందుకు 6 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మిస్తున్నామన్నారు. మండల పరిధిలోని పుట్లూరు, మాదాపురం, కర్లకుంట, అమకతాడు గ్రామా ల్లో మంగళవారం చేపట్టిన జన చైతన్యయాత్రల్లో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కెఇ.శ్యాంబాబు, మాజీ జడ్పీటిసి కెఇ.జయన్న పాల్గొనగా ప్రజలు ఘనం గా స్వాగతం పలికారు. తొలుత డిప్యూటీ సిఎం కెఇ ఆయా గ్రామాల్లో సిసి రోడ్లు, తాగునీటి ట్యాంకులు, అంగన్‌వాడీ భవనాలు, ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం కెఇ మాట్లాడుతూ టిడిపి పట్ల ప్రజల్లో నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయమన్నారు. మండలంలోని అమకతాడు పంచాయతీలో రూ. 1.5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అయితే అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు అవాకులు చెవాకులు చేస్తూ, కళ్లు లేని కబోదులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పిం ఛను మొత్తా న్ని రూ. 200 నుంచి రూ. 1000కు పెంచిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో సైతం విద్యత్ కోత ఉండేదని, నేడు గ్రామీణ ప్రాంతా ల్లో కూడా ఎలాంటి విద్యుత్ కోత లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తున్నామన్నారు. అలాగే రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం, రంజాన్, సంక్రాంతి, క్రిస్మస్ పండుగలకు పేదలకు ఉచితంగా తోఫాలు అందిస్తున్నామన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్‌కు ఏమి తోచనపుడు ప్రత్యేక హోదా నినాదం చేస్తారని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ ప్రతి ఏటా తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారని, అయితే జగన్ ఏనాడైనా తన ఆస్తుల గురించి ప్రకటన చేశారా అని ప్రకటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందుకు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ప్రజలు డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించి కసి తీర్చుకున్నారన్నారు. శ్యాంబాబు మాట్లాడుతూ కంబాలపాడుకు దీటుగా అమకతాడు పంచాయతీని అభివృద్ధి చేస్తామని, నియోజకవర్గంలోని మండలాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాకే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. కెఇ జయన్న మాట్లాడుతూ గాజులదినె్న ప్రాజెక్టు, హంద్రీనీవా కృష్ణా జలాలతో చెరువులను నింపడమే కాక పిల్లకాలువల ద్వారా పంట పొలాలకు నీరు మళ్లించి రైతుల కష్టాలను తొలగించామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపి పి మద్దిలేటి, ఎంపిపి సుంకులమ్మ, జడ్పీటీసీ లక్ష్మిదేవి, జిడిపి చైర్మన్ దేవేంద్ర, ఉపాధ్యక్షురాలు సుభాషిణి, టిడిపి మండల అధ్యక్షుడు మర్రి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు నబిసాహేబ్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ఫ్రీ, సర్పంచ్ లక్ష్మిదేవి, ఎంపిటిసి మధుసూదన్‌నాయుడు పాల్గొన్నారు.
350 పడకల స్థాయికి
నంద్యాల ప్రభుత్వాసుపత్రి
* కార్పొరేట్‌కు దీటుగా డయాలసిస్ సేవలు..
* వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
నంద్యాలటౌన్, నవంబర్ 8 : నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణలో, పారిశుధ్య విధానం అమలు చేయడంలో కార్పొరేట్ ఆసుపత్రులను తలపిస్తుందని, 200 పడకల సామర్థ్యంతో ఉన్న నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందడం వల్లనే ఓపి స్థాయి 200శాతం పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నంద్యాల పట్టణానికి విచ్చేసిన మంత్రి జిల్లాస్థాయి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పది పడకల డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులను పరామర్శించి వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతాయని హామీనిచ్చారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్‌బిఎ గ్రేడింగ్ రావడంతో జాతీయస్థాయి ఎంపికలో ఐదుగురు వైద్యులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు నియమించినట్లు ఆయన తెలిపారు. అలాగే 150 పడకల స్థాయిలో ఇటీవలనే నంద్యాల ఆసుపత్రికి అనుబంధంగా ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ కేంద్రానికి 5మంది స్పెషలిస్టు వైద్యులతో పాటు 10మంది గైనకాలజిస్టులు, 10మంది నర్సింగ్ సిబ్బంది, ముగ్గురు పారా మెడికల్ సిబ్బంది ఏర్పాటుకు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈనెలాఖరు నాటికి అన్ని పోస్టులు భర్తీ చేస్తామన్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 500 పడకల ఆసుపత్రిగా మార్చాలని మంత్రి కామినేనికు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వినతిపత్రం అందజేశారు. డయాలసిస్ కేంద్రంలో ఒక్కొక్క రోగికి డయాలసిస్ కింద 5గంటలు సమయం పడుతుందని మంత్రి తెలిపారు. మూడు షిప్టుల్లో పనిచేస్తారని, అయితే రోగుల సంఖ్య ను బట్టి డయాలసిస్ చేయడానికి 5 షిఫ్టుల్లో వైద్యులను నియమించి రాత్రిబవళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రుల్లోనే జన్మదిన సర్ట్ఫికెట్ కూడా వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే ఉచితంగా డయాలసిస్ చేసుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో కోటి 20లక్షలు మంది ఉన్నారన్నారు. జిల్లాస్థాయి ఆసుపత్రికి ఆయా ప్రాంతాల నుంచి రావడానికి పేదలు చిన్నచిన్న జబ్బులకు రాకుండా ఆయా ప్రాంతాల్లోనే అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో పేదలు నిరీక్షించే గదులకు ఎసి రూంలను కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. ఆసుపత్రుల్లో ఎవరిని నియమించాలన్నా, నిధులు మంజూ రు చేయాలన్నా విధి విధానాలు ఉంటాయన్నారు. ఏపి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నంద్యాలకు విచ్చేసిన మంత్రి కామినేని శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేసినట్లు బిసి ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థి సంఘం రామచంద్రుడు, ఎపిఎస్‌ఎఫ్ అధ్యక్షులు నాగనవీన్ తెలిపారు. నంద్యాల ప్రభు త్వాసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రిలో వౌళిక వసతులైన వీల్‌చైర్, ఫర్నిచర్ మంజూరు చేయాలని, పో స్టులు భర్తీ చేయాలని కోరారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మధుసూధన్‌రావు మంత్రికి వినతిపత్రం అందజేశారు. 10వ పిఆర్‌సి అమలై రెండేళ్లు గడుస్తున్నా నేటికి కాంట్రాక్ట్ ఉద్యోగు ల జీతభత్యాల పెంపు విషయమై పోస్టులలో నియమించబడి వందశా తం జీతం తీసుకుంట్ను వారికి అన్యా యం జరుగుతుందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుబంధ ఉత్తర్వులు వెలవడినా ట్రెజరీ అధికారులు జీతభత్యాలు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
జిల్లాకు 9,959 గృహాలు మంజూరు
* హౌసింగ్ పిడి రాజశేఖర్
బనగానపల్లె, నవంబర్ 8 : ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద జిల్లాకు 9,959 గృహాలను కలెక్టర్ విజయమోహన్ మంజూరు చేసినట్లు హౌసింగ్ పిడి రాజశేఖర్ తెలిపారు. పట్టణంలో ని హౌసింగ్ కార్యాలయంలో మంగళవారం హౌసింగ్ పిడి విలేఖరులతో మాట్లాడుతూ తాము 14,750 గృహాలకు ప్రతిపాదనలు పంపామన్నారు. అందులో 9,959 గృహాలు మంజూరు చేశారని ఇందులో తొలి విడతగా 3,437 గృహాలను లబ్ధిదారులకు కేటాయించామన్నారు, ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ. 1.5 లక్షలు ఇస్తారన్నారు. నంద్యాల అర్బన్ ఏరియాలో సొంత స్థలం ఉన్న 650 మందికి గృహాలు మంజూరయ్యాయని, వారికి రూ. 3.5 లక్షలు ఇస్తారన్నారు. ఇక ఎన్‌జిఎన్‌ఆర్ కింద 90 రోజుల ఉపాధి కార్మికులతో పనులు చేయిస్తామన్నారు. గృహ నిర్మాణంలో వస్తుసామగ్రికి రూ. 25,500 ఇస్తారని, ఈ నెలాఖరు లోపు పనులు ప్రారంభించాల్సి వుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ 300 గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గానికి 900 గృహాలకు ప్రతిపాదనలు పంపగా తొలివిడతగా 350 గృహాలు మంజూరయ్యాయన్నారు. దీంతో తాము గృహ నిర్మాణాలను పరిశీలించేందుకు మంగళవారం బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె, కోవెలకుంట్ల, దొర్నిపాడు మండలాలను పరిశీలించినట్లు తెలిపారు. పిడి వెంట ఇఇ సుధాకర్‌రెడ్డి, డిఇ కృష్ణారెడ్డి, తదితరులు వున్నారు.
సాహిత్యంతో సమాజంలో మార్పు
* తెలుగు భాషను పరిరక్షించుకోవాలి
* ప్రముఖ కవి విద్వాన్ కమాల్‌సాహెబ్
నందికొట్కూరు, నవంబర్ 8:సమాజాన్ని మార్చే శక్తి ఒక్క సాహిత్యానికే వుందని కడప జిల్లా జమ్మలమడుగు పట్టణానికి చెందిన ప్రముఖ కవి విద్వాన్ కమాల్‌సాహెబ్ పేర్కొన్నారు. ఆంగ్లభాషను ఆదరిస్తూనే ఆంధ్రభాషను కూడా కనీసం అదే స్థాయిలో పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగువాడిపై వుందన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ‘తెలుగుభాష నాడు- నేడు’ అంశంపై తెలుగు సాహితీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కమాల్‌సాహెబ్ మాట్లాడుతూ రాయల కాలంలో తెలుగుతల్లి గజ్జె కట్టి నాట్యమాడేదని, ఎటుచూసినా సాహితీ సభలు, సారస్వత చర్చలతో తెలుగుదనం ఉట్టి పడేదన్నారు. అనంతరం సుమారు 200 ఏళ్ల పాటు తెలుగుకు ఆదరణ కరువైందన్నారు. తిరిగి 17వ శతాబ్దంలో రఘునాథరాయ ఏలుబడిలో తెలుగు ఓ వెలుగు వెలిగిందన్నారు. అయితే ప్రస్తుతం తెలుగుభాషను దాదాపు మరచిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. తెలుగుభాషపై నేటి విద్యార్థుల్లో రోజురోజుకీ ఆసక్తి తగ్గిపోతుందన్నారు. తెలుగుభాషలోని ఔన్నత్యాన్ని తిరిగి విద్యార్థులు పొందగలిగేలా చేయాలన్న లక్ష్యంతో సాహితీసేవ చేస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో కూడా తియ్యనైన భాష తెలుగుభాష అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఇఓ రంగారెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పార్థసారధి, బాలికల పాఠశాల హెచ్‌ఎం విజయ, అధ్యాపకులు అమరనాథరెడ్డి, సుజాత, ఆదిశేషమ్మ, హైమావతి, ఫాస్టర్ అభిషేకం, రామకృష్ణ విద్యాపీఠం కరస్పాండెంట్ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతున్న విద్యార్థిని మృతి
బేతంచెర్ల, నవంబర్ 8:శెనగ శుద్ధ గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మనీషాకోయిరాల(15) కర్నూలు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ గౌస్ తెలిపారు. పోలీసుల వివరాలు.. మండల పరిధిలోని ఆర్.కొత్తపల్లె గ్రామానికి చెందిన మహేశ్వరి, మద్దులేటయ్య దంపతుల కుమార్తె మనీషాకోయిరాల స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ నెల 7వ తేదీ ఆమె తల్లి ఇంటిపని చూసుకొని పాఠశాలకు వెళ్లాలని సూచించి పొలానికి వెళ్లింది. అయితే పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేని మనీషాకోయిరాల తల్లి వస్తే మందలిస్తుందని భావించి ఇంట్లో ఉన్న శెనగశుద్ధి గుళికలు మింగింది. ఇది గమనించిన బంధువులు బాలికను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే విద్యార్థిని చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ గౌస్ తెలిపారు.