కర్నూల్

ఆందోళనలతో అట్టుడికిన ఆర్‌జిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణ్యం, నవంబర్ 18 : బి.టెక్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో ఆర్‌జిఎం ప్రాంగణం అట్టుడికింది. ఆర్‌జిఎం ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉషారాణి వాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కళాశాలలో ర్యాగింగ్ శృతిమించుతోందని, ర్యాగింగ్ నివారణకు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకో లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు విద్యార్థిని ఆత్మహత్యపై విచారించేందుకు కర్నూలు డిఐజి రమణకుమార్, ఓఎస్‌డి రవిప్రకాష్ శుక్రవారం సాయంత్రం ఆర్‌జియం కళాశాలకు చేరుకున్నారు. ఉషారాణి ఆత్మహత్యపై సహ విద్యార్థినులు, సీనియర్లు, అధ్యాపకులు, యాజమాన్యాన్ని డిఐజి విచారించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తమ కళాశాలలో ఇప్పటి వరకు ర్యాగింగ్ జరిగిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది. ఉషారాణి మృతిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు డిఐజి తెలిపారు. కాగా కళాశాలలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు ఉషారాణి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కాలేజి యాజమాన్యం స్పష్టం చేసింది. ఉషారాణిని బయటకు తీసుకువెళ్లేందుకు ఆమె తండ్రి జయరామిరెడ్డి గురువారం అనుమతి తీసుకుని వెంటబెట్టుకుని వెళ్లాడని, తరువాత కళాశాలకు తీసుకురాలేదని యాజమాన్యం పేర్కొంది. తన కూతురు ఆత్మహత్య చేసుకొనేందుకు వాస్మొల్ మందు తాగిందని తండ్రి జయరామిరెడ్డి ఫోన్ చేసి చెప్పారని యాజమాన్యం పేర్కొంది. ఉషారాణి ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం అని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుండగా కళాశాల యాజమాన్యం మాత్రం తమ కళాశాలలో ర్యాగింగ్ ఎప్పుడూ జరగనేలేదని పేర్కొంటోంది. పోలీసులు విచారణ జరిపితే తప్ప అసలు నిజం బయటకురాదు.
నా వారసుడు శ్యాంబాబు..
* రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలి
* డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
పత్తికొండ,నవంబర్ 18: తన కుమారుడు కెఇ శ్యాంబాబును పత్తికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి మహిళలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో డిఆర్‌డిఏ, వెలుగు ఆధ్వర్యంలో మహిళలకు పసుపు, కుంకమ పెట్టుబడి నిధి పథకం కింద మంజూరు చేసిన నగదు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మహిళలు ఉద్దేశించి కెయి మాట్లాడారు. టిడిపికి కంచుకోటగా ఉన్న పత్తికొండ నియోజకవర్గం నుండి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు కెయి శ్యాంబాబును గెలిపించాలన్నారు. మహిళల అభివృద్ధికి సిఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారనిఅన్నారు. పసుపు, కుంకుమ పెట్టుబడి నిధి కింద పత్తికొండ నియోజకవర్గంలోని మహిళ గ్రూపులకు రూ. 11.17 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఒక్కో మహిళకు రూ. 3 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో వేశామన్నారు. మహిళలు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో టిడిపికి అండగా నిలువాలన్నా రు. మహిళ అభ్యున్నతికి టిడిపి కృషి చేస్తుందన్నారు. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్‌తో పాటు ఆర్థికంగా సహాయం చేయాలనే లక్ష్యంతో సిఎం పలు చర్యలను తీసుకుంటున్నారన్నారు. హంద్రీ కాలువ ఉన్న ప్రాంతంలో రైతులు వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులకు ప్రభుత్వం సబ్సిడీతో డిజిల్ మోటార్లను అందిస్తుందని, ఈపథకం కింద హోసూరు గ్రామానికి చెందిన రైతులకు ఆయిల్ మోటార్లను పంపిణీ చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మండల పరిధిలోని చక్రాల గ్రామంలో జనచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాజశేఖర్, నియోజకవర్గం ఇన్‌ఛార్జి కెయి శ్యాంబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, పత్తికొండ జడ్పీటీసీ సుకన్య, పలువురు సర్పంచులు, మండల అధికారులు, వెలుగు అధికారులు పాల్గొన్నారు.
నేడు రైతు మహాసభ
* జయప్రదం చేయండి
* కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
కర్నూలు సిటీ, నవంబర్ 18:ఈ నెల 19వ తేదీ కోడుమూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాసభ నిర్వహించనున్నామని, ఆ సభను జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ‘రైతు మహాసభ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తులసిరెడ్డి మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ఒకనాడు వ్యవసాయం దండుగ అని ప్రకటించి ప్రస్తుతం రైతు జపం చేస్తున్నారని విమర్శించారు. బాబుకు వ్యవసాయం దండుగ అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయం పండుగ అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణ త్యాగం చేసి, వ్యవసాయ రంగంలో విప్లవం తెచ్చిన విప్లవ సారధి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం కోడుమూరు పట్టణంలో రైతు మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు ఇందిరాగాంధీ వాటిని అధిగమించి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడులనిచ్చే కొత్త వంగడాలను ప్రవేశపెట్టి కొరతను తీర్చిందన్నారు. అలాగే రాజ ఆభరణాల రద్దు, బ్యాంకుల జాతీయం వంటి అనేక సంస్కరణలు చేసి రైతుకు అండగా నిలిచి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుందన్నారు. దీంతో ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సంవత్సరం పొడవునా ఆమె చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఇందిరమ్మ నిర్ణయాలతో ఇంటింటా సౌభాగ్యం వెలసిందని ప్రజలు, రైతులకు మరోసారి గుర్తుచేసేందుకే రైతు మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సభకు ప్రజలు, రైతులు, అన్నివర్గాల ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో రాజ్‌కుమార్, సర్దార్ బుచ్చిబాబు, అశోకరత్నం, ఆకెపోగు వెంకటస్వామి, శివకుమార్, చున్నుమియా, ఖలీల్‌బాషా, పెద్దారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ రాజ్యం రావాలి
* పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి
కోడుమూరు, నవంబర్ 18:దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. కోడుమూరులో ఈ నెల 19వ తేదీ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు మహాసభను విజయవంతం చేయడంలో భాగంగా శుక్రవారం ఆయన ఇక్కడకు వచ్చారు. తొలుత రైతు మహాసభ ప్రాంగణాన్ని పరిశీలించా రు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును తూర్పారబట్టారు. ప్రస్తుత పాలక వర్గాల పాలనతో ప్రజా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని, కరవు పరిస్థితులతో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక పరిస్థితులు క్షీణించాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రాచరికపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. నోట్ల రద్దుపై ఏక పక్షం నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. దేశ ప్రయోజనాలను తుంగలోతొక్కి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మోదీ పాకులాడుతున్నారని విమర్శించారు. ఇక ఏపికి ప్రత్యేక హోదా సాధనలో సిఎం చంద్రబాబు ఘోరంగా విఫలం అయ్యారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల శ్రేయస్సు పట్టడం లేదని, దేశంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో టిడిపి ప్రభుత్వం రైతులు, విద్య, కార్మిక రంగాలను అథోగతి పాలుచేశారని ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో చంద్రబాబు పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను విస్మరించారని, రాష్ట్ర మంత్రులు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఆర్భాటాలు తప్ప ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు ఇంతవరకూ ఎక్కడా చేపట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనంతా సువర్ణయుగంలా సాగిందని, నేడు బిజెపి, టిడిపి పాలనతో అభివృద్ధి కనుమరుగైందన్నారు. దేశంలో, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప ప్రజల కష్టాలు తీరవన్నారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కోడుమూరులో తలపెట్టిన రైతు మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రఘువీరాతో పాటు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, రవిచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, తులసిరెడ్డి, కోట్ల హర్షవర్ధనరెడ్డి, కోడుమూరు సర్పంచ్ సిబి లత, హేమాద్రిరెడ్డి, మధుసూదనరెడ్డి, తదితరులు ఉన్నారు.
పెద్ద నోట్ల రద్దు కొత్తకాదు..
* అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలకు ఇబ్బందులు
* కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
కర్నూలు సిటీ, నవంబర్ 18 : దేశంలో పెద్ద నోట్ల రద్దు అనేది కొత్తేమీకాదని, అయితే ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ నకిలీ కరెన్సీ, నల్లధనం, అవినీతి, ఉగ్రవాదులు, మావోయిస్టుల కరెన్సీ విలువను తగ్గించాలన్న ఉద్దేశ్యంతో పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఉద్దేశ్యం మంచిదే కానీ తీసుకున్న నిర్ణయం, ఆచరించాల్సిన పద్ధతులు పాటించకపోవడం వల్ల సామాన్య ప్రజలు కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. నల్లధనాన్ని అరికట్టడం అటుంచితే నీతివంతంగా పొదుపు చేసుకున్న వారి గుండెల్లో గునపం గుచ్చినట్లుగా ఉందని, పెద్దలకు తగలాల్సిన బాణం పేదలకు తగిలి విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకూ 3సార్లు పెద్దనోట్లు రద్దు చేశారన్నారు. ప్రప్రథమంగా స్వాతంత్య్రం రాక మునుపే 1946లో బ్రిటీష్ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని, అప్పుడు కరెన్సీ విలువ రూ. 1,230 కోట్లు కాగా వాటిలో కేవలం రూ. 143 కోట్లు పెద్ద నోట్లు, రూ. 1,087 కోట్లు చిన్న నోట్లు ఉన్నాయన్నారు. రెండవసారి 1978లో రూ. 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని, అప్పుడు దేశ కరెన్సీ రూ. 9,152 కోట్లు కాగా వాటిలో 1.6 శాతం పెద్ద నోట్లు, అంటే రూ. 146 కోట్లు పెద్దనోట్లు కాగా రూ. 9,006వేల కోట్ల చిన్న నోట్లు ఉన్నాయన్నారు. 2016లో రూ. 16.96 లక్షల కోట్లు దేశ కరెన్సీ విలువ కాగా 86శాతం పెద్ద నోట్లు అయితే కేవలం 14శాతం మాత్రమే చిన్ననోట్లు ఉన్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని సమయానికి చిన్ననోట్లు అందుబాటులో ఉంచి పెద్దనోట్లు రద్దు చేసి ఉంటే ఇన్ని ఇబ్బందులు తలెత్తేవి కాదన్నారు. అంతేకాకుండా అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం 2015లోనే రూ. 535 కోట్ల వంద నోట్లు అవసరం కాగా వాటిలో రూ. 409 కోట్ల వంద నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ వీటిలో ఏదీ పరిగణలోకి తీసుకోకుండా అనాలోచితంగా నిర్ణయం తీసుకుని ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే అన్నదాత పంటల సాగు కోసం బ్యాంకుల్లో రూ. లక్ష రుణం తీసుకుని సకాలంలో చెల్లించకపోతే వారి ఆస్తులను జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు రైతులను బెదిరించడం వల్ల కొందరు రైతులు అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. అటువంటిది బడా బాబులు వేలాది కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి చెల్లించకపోయినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ బడా బాబులకు చెందిన రూ. 7,106 కోట్లు రద్దు చేస్తూ ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా ప్రధాని మోదీ స్పందించి రూ. 50, రూ. 100 నోట్లను పెంచి ప్రజల ఇబ్బందులను తొలగించాలని లేనిపక్షంలో ఇతర దేశాల అధ్యక్షులపై ప్రజలు తిరుగుబాటు చేసినట్లుగా దేశ ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.
ఓటరు సవరణ దరఖాస్తులను
క్షుణ్ణంగా పరిశీలించాలి
* 30లోగా తుది జాబితా ప్రచురణ
* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
కర్నూలు, నవంబర్ 18:ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితాలో నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక ఓటర్ల నమోదు, పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఓటర్ల జాబితా ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులు అధికసంఖ్యలో పెండింగులో వున్నాయని, ఫారం 6,7,8,8ఎలకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి డిసెంబర్ 28వ తేదీలోగా ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలో విస్తత్రంగా ప్రచారం చేయాలన్నారు.
అలాగే పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఓటర్ల నమోదుకు సంబంధించి స్వయంగా స్వీకరించిన దరఖాస్తులను రెండు రోజుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెల 23వ తేదీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి వచ్చే నెల 23వ తేదీలోగా ఓటర్ల జాబితాపై ఆక్షేపణలు, కొత్తగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించి విచారణ పూర్తి చేసి డిసెంబర్ 30వ తేదీలోగా తుది జాబితా ప్రచురించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా జిల్లాలో 28,093 దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయని, వాటిని త్వరితగతిన పరిశీలించి ఓటరు జాబితాలో పోందుపరుస్తామన్నారు. పట్ట్భద్రులకు సంబంధించి 87,057, ఉపాధ్యాయులకు సంబంధించి 7,419 దరఖాస్తులు వచ్చాయని ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి రాజకీయపార్టీలకు అందజేస్తామని నివేదించారు. ఎన్నికల సంఘం సూచించిన రివైజ్డ్ షెడ్యూల్డ్ ప్రకారం ఓటర్ల నమోదు ప్రక్రియకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ అధికారిని ఎంపిక చేసి విస్తత్ర ప్రచారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శాసనమండలి ఎన్నిలకు సంబంధించి స్వయంగా స్వీకరించిన దరఖాస్తులను రెండు రోజుల్లో ఆన్‌లైల్‌లో నమోదు చేస్తామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి-2రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, కర్నూలు, నంద్యాల ఆర్‌డిఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, జడ్పీ సిఇఓ ఈశ్వర్, డిపిఓ ఆనంద్‌నాయక్, అన్ని నియోజకవర్గాల తహశీల్దార్లు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు శాస్ర్తియ అంశాలపై
దృష్టి పెట్టాలి
* డిఇఓ రవీంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు సిటీ, నవంబర్ 18:విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాస్ర్తి య అంశాలపై దృష్టి సారించాలని డిఇఓ రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. స్థానిక ఏ.క్యాంప్ మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌ను శుక్రవారం డిఇఓ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిఇఓ మాట్లాడుతూ ప్రస్తుతం వాహనాల కాలుష్యం ఎక్కువగా ఉందని దీంతో ఆరోగ్య సమస్య లు తలెత్తటమే కాకుండా సహజ వనరులైన నీరు, గాలి అన్నీ కలుషితం అవుతున్నాయని, ఈ తరుణంలో అడవులను సంరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాస్ర్తియ అంశాలపై దృష్టి సారించి భవిష్యత్తులో దేశానికి, పర్యావరణ పరిరక్షణ కు ఉపయోగపడే విధంగా శాస్త్ర ఆవిష్కరణలు జరుపుతూ సుస్థిరాభివృద్ధి సాధించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు స్థానిక సమస్యలపై అవగాహన కల్పించి వాటి పరిష్కార మా ర్గానికి వినూత్న ఆలోచనలతో శాస్త్ర ఆవిష్కరణలు జరపాలన్నారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే శాస్త్ర ఆవిష్కరణలపై ఆసక్తి పెంచేందుకు బాలల సైన్స్ కాంగ్రెస్ చక్కటి వేదికగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రంగమ్మ, మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్ రాజశేఖర్, హెచ్‌ఎం శశికళ, రమాజ్యోతి, రీస్సోర్స్‌పర్సన్ కుమార్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి షాపులో ఈ-పాస్ మిషన్
* నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు
కర్నూలు సిటీ, నవంబర్ 18:నగరంలోని ప్రతి షాపులో యజమానులు ఈ-పాస్ మిషన్ ఏర్పాటు చేసుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు ఆదేశించారు. స్థానిక నగర పాలక సమావేశ భవన్‌లో శుక్రవారం రెవెన్యూ విభాగం, పొదుపు మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజల సౌకర్యార్థం నగరంలోని ప్రతి షాపులో నగదు రహిత విధానం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాటి కోసం రెవెన్యూ అధికారులు తమ పరిధిలో ఉన్న షాపుల్లో ఖచ్చితంగా ఈ-పాస్ మిషన్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బ్యాంక్ ఖాతా లేని వారికి ఖాతా ఓపెన్ చేయించి, నగదు రహిత పద్ధతిని అలవాటు చేయాలన్నారు. ఈపాస్ మిషన్ గురించి అవగాహన కల్పించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. సమావేశంలో కార్మికశాఖ ఉప కమిషనర్ మల్లీశ్వరకుమార్, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న సేవలో
కమలానందభారతిస్వామి
శ్రీశైలం, నవంబర్ 18: శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వా మి శుక్రవారం దర్శించుకొని స్వామి, అమ్మవార్లను సేవించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతుల గౌరవార్థం అమ్మవారి ఆశీర్వచన మండపంలో దేవస్థాన వేదపండితులు వేదగోష్టి నిర్వహించి కార్యనిర్వహణ అధికారి పీఠాధిపతిని సత్కరించారు. కమలానంద భారతి మాట్లాడుతూ దేవస్థానం గో శాలను సందర్శించడం జరిగిందని, మనప్రాచీన ఆయుర్వేదంలో పశువుల ఆరోగ్యానికి సంబంధించి గో ఆయుర్వేదం, అశ్వ ఆయుర్వేదం, గజ ఆయుర్వేదం అనే ప్రత్యేక విభాగాలు ఉన్నాయని, గో ఆయుర్వేదం పట్ల విస్తృత పరిశోధనలు జరిపి ఈ శాస్త్రానికి ఎంతో ప్రాచుర్యం కల్పించాల్సిన బాధ్యత దేవస్థానంపై ఉందని తెలిపారు. మన దేశంలో హిమాలయ పర్వతాల తరువాత అంతటి అరుదైన వన మూళికలు, ఔషద మొక్కలు దొరికే ప్రదేశం శ్రీశై లం అని వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపా రు. చెంచు గిరిజనులకు శ్రీశైల సంస్కృతి తో ఎంతో సంబంధం ఉందని, చెంచు వైద్యం పట్ల పరిశోదనలు జరిపించడం ఎంతో అవసరమని తెలిపారు. శ్రీశైలంలో ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం సమర్థించారు. గోమయంలో, యాగ భష్మాలతో దేవస్థానం వీభూది తయారుచేసి భక్తులకు అం దించడాన్ని ప్రశంసించారు. దేవస్థానం శివాజి గోపుర పునర్నిర్మాణం, ఆలయ మాడా వీధుల విస్తరణ జరుగడం ఆహ్వానించదగ్గ పరిణామం అని కొనియాడారు. వీరితోపాటు ఇఓ నారాయణ భరత్‌గుప్తా, జెఇఓ హరినాథ్‌రెడ్డి, ఆలయ అర్చక వేదపండితులు ఉన్నారు.
హుండీ ఆదాయం లెక్కింపు
శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. ఈ లెక్కింపులో రూ. 1,65,76,573 నగదు, 185 గ్రాముల బంగారం, 4 కిలోల 400 గ్రాముల వెండి దేవస్థానానికి రాబడిగా లభించింది. ఈ ఆదాయాన్ని భక్తులు గత 21 రోజుల నుండి సమర్పించినట్లు ఇఓ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. నగదుతోపాటు 142 యుఎస్‌ఎ డాలర్లు, 50 బ్రిటన్స్ పౌన్స్, 100 ఆస్ట్రేలియా డాలర్లు, 10 కెనడా డాలర్లు, 31 మలేషియ రింగిట్స్, 30 బిరహమ్స్, 78 సింగపూర్ డాలర్లు తదితర విదేశీ కరెన్సీ హుండీ లెక్కింపులో స్వామి వారికి రాబడిగా లభించింది. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులు, వ్యాపారులు, సత్రాల వారు, భక్తులు పాల్గొన్నారు.