కర్నూల్

బంగారం కొనుగోళ్లపై ఐటి దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 9 : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత నల్ల కుబేరులు కొనుగోలు చేసిన బంగారంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దృష్టి సారించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున బంగారు అమ్మకాలు జరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఐటి అధికారులు ఆ వివరాలపై మరింత కూపీ లాగుతున్నట్లు సమాచారం. నవంబర్ 9వ తేదీ నుంచి జరిగిన బంగారు లావాదేవీలను పరిశీలించగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 1,800 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోందని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇదికాకుండా ఎలాంటి బిల్లులు లేకుండా కూడా పాత నోట్లను తీసుకుని అధిక ధరకు బంగారు బిస్కెట్లను విక్రయించారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 10వ తేదీ నుంచి వారం రోజుల పాటు 10 గ్రాముల బంగారం జీరో వ్యాపారంలో రూ. 45వేల వరకూ విక్రంచినట్లు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో వచ్చిందని ఆయన గుర్తుచేశారు. నోట్ల రద్దు, బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ కారణంగా సామాన్య ప్రజలు వివాహాలు ఉన్నా బంగారు కొనలేని పరిస్థితుల్లో ఉండగా రాత్రివేళల్లో నల్ల కుబేరులు ఎలాంటి బిల్లులు లేకుండా కొంత తప్పుడు పేర్లతో మరి కొంత బంగారు, వెండి, వజ్రాలు కొనుగోలు చేశారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి బంగారు నల్ల ధనవంతుల వద్ద దాగి ఉందని దాన్ని వెలికి తీసేందుకు ఐటి అధికారులు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నల్ల ధనవంతులు తమ వద్ద ఉన్న ఆస్తులను వెల్లడించి జరిమానాతో బయట పడవచ్చని ప్రవేశపెట్టిన పథకం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఆ తరువాతే ఐటి అధికారులు రంగ ప్రవేశం చేస్తారని భావిస్తున్నారు. బంగారు కొనుగోలు చేసిన నల్ల ధనవంతులనే కాకుండా వారికి సహకరించిన దుకాణదారులను కూడా విచారిస్తారని అవసరమైతే వారిపై కూడా కేసులు నమోదు చేస్తారన్న చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో బెంబేలెత్తిన నల్ల ధనవంతులు డిక్లరేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం మేలన్న అభిప్రాయంతో తమ ఆర్థిక సలహాదారులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కరెన్సీ కష్టాలు
సామాన్యులకేనా!
* బ్యాంకుల వద్ద కనిపించని బడాబాబులు..
నంద్యాల, డిసెంబర్ 9 : కరెన్సీ కష్టాలన్నీ పేద, మధ్యతరగతి ప్రజలకేనా అంటే 90 శాతం మంది బ్యాంకు ల వద్ద క్యూలైన్లలో కనపడుతున్నది పేద, మధ్యతరగతి ప్రజలు, వేతనజీవులు మాత్రమే. ధనవంతులు, ఉన్నతాధికారులు బ్యాంకులోనికి అడుగు పెట్టకుండానే కరెన్సీ కష్టాలన్నీ లోపాయికారిగా తీర్చుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద బ్యాంకు అధికారుల చలవతో నల్లకుబేరులు, ధనికులు గుట్టు చప్పుడు కాకుండ కరెన్సీ కట్టలు తమ ఇంటికే తెప్పించుకుంటున్నా పేద ప్రజలు మాత్రం బ్యాంకుల వద్ద నెల రోజులుగా గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తీరా కౌంటర్ వద్దకు వెళ్తే రూ.4 వేలు మాత్రమే ఇస్తామని చేతిలో పెట్టడం మరి దారుణంగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసి నెల గడిచిపోతున్నా ఎటిఎంలు తెరుచుకోలేదు. బ్యాంకుల వద్ద వేల సంఖ్యలో పేద, మధ్యతరగతిప్రజలు క్యూలైన్లలో నిలబడి తాము కష్టపడి దాచుకున్న సొమ్మును తీసుకొనేందుకు బ్యాంకు అధికారులతో చీవాట్లు తినాల్సిన దుర్గతి ఏర్పడింది. వేతన జీవులకైతే పరిస్థితి మరింత ఘోరంగా మారింది. తాము అద్దెకు ఉంటున్న ఇంటి ఓనరు కూడా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ వద్దని నగదు మాత్రమే ఇవ్వాలని షరతులు విధిస్తున్నారు. అదేవిధంగా తమ పిల్లల ఫీజులు కట్టుకొనేందుకు, నిత్యావసర సరుకులు తెచ్చుకొనేందుకు కూడా సరిపడ డబ్బులు బ్యాంకుల నుండి ఇవ్వకపోవడంతో పరిస్థితి ఘోరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పెన్షన్లు బ్యాంకు ఖాతాలలో జమ అయినప్పటికీ చిల్లర నోట్లు లేని కారణంగా వారికి కూడా బ్యాంకు అధికారులు మొండి చేయి చూపిస్తున్నారు. ఇప్పటికి బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఇంత వరకు కొత్త రూ.500ల నోటు బ్యాంకులకు రాలేదని అధికారులు మొఖంమీదే అంటున్నారు. సామాజిక పెన్షన్లు చేతికి రాకపోవడంతో వృద్ధులు, వికలాంగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం దయతలచి బ్యాంకు అకౌంటుకు మార్చినా బ్యాంకుల వద్ద తీసుకొనేందుకు చుక్కలు కనపడుతున్నాయి. పట్టణంలో వందల సంఖ్యలో వైద్యులు, మెడికల్ షాపు యజమానులు, బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఉన్నప్పటికి వారెవరు బ్యాంకుల వద్ద కనపడడం లేదు. బ్యాంకుల్లో పొడుగుచేతుల పందేరం అన్న రీతిలో ధనవంతులైన ఖాతాదారులకు బ్యాంకు అధికారులు గుట్టు చప్పుడు లేకుండ వారికి అవసరమైన నగదును ఇళ్లకే పంపిస్తున్నట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. సామాన్య జనానికి రూ.4 వేలు చేతిలో పెట్టి ధనవంతులకు, తమకు కమిషన్లు ఇచ్చే వారికి లక్షల రూపాయలు బ్యాంకు దాటిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నోట్ల రద్దు విషయం ప్రకటించగానే నంద్యాలలో ఎటిఎంలలో డబ్బు పెట్టే ఏజెన్సీ మున్సిపల్ ఆఫీసు కార్యాలయం ముందు కోటి రూపాయల విలువ గల కొత్త నోట్లను ఇచ్చి పాత నోట్లను తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అప్పటికే ఎటియంలలో ఉన్న పాత నోట్లను సేకరించే పనిలో ఉండడంతో ఈ అవకాశం వారికి దక్కింది. పట్టణంలోని ఓ ఘరానా పెద్ద మనిషి పర్సెంటేజీ ఆశచూపి ఏజెన్సీ వారి నుండి కొత్త కరెన్సీ దక్కించుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా చాలా మంది బయటకు కనపడని ధనవంతులు, నల్లకుబేరులు బ్యాంకు అధికారులకు పర్సెంటేజీల ఆశ చూపి తమ పని చల్లగా కానిచ్చేసుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి బ్యాంకులో తన అవసరం నిమిత్తం రూ.70 వేలు కొత్త నోట్లు జమ చేయగా, ఓచరుపై పాత నోట్లు జమ చేసినట్లు రాసుకున్న బ్యాంకు సిబ్బంది తమ చేతి వాటాన్ని చూపించారు. మొత్తం మీద దేశంలో నల్ల కుబేరులకు, ధనవంతులకు కరెన్సీ కష్టాలు కనపడలేదనడానికి కర్నాటకలో గాలి జనార్ధన్‌రెడ్డి ఉదంతం, తమిళనాడులో టిటిడి బోర్డు సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి ఉదంతమే బట్టబయలు చేస్తున్నాయి. ధనికులకు, నల్ల కుబేరులకు కరెన్సీ కష్టాలు ఏమాత్రం లేకపోగా, పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రమే శాపంగా మారింది. శనివారం రెండవ శనివారం కావడంతో బ్యాంకు లావాదేవీలు జరుగవు. ఆదివారం యథావిధిగా సెలవు. సోమవారం మీలాద్- ఎ-నబీ పండుగను పురస్కరించుకొని జాతీయ సెలవుదినం కావడంతో మూడు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు నగదు అందక కరెన్సీ కష్టాలు చుక్కలు చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్దనోట్ల రద్దు కారణంగా వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి. అలాగే రైతులు తాము పండించుకున్న ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక, నగదు చెల్లించి ఇంటికి తెచ్చుకోలేక ఇప్పటికి ధాన్యం కళ్లాలోనే ఉంచి కాపు కాస్తుండడం దారుణం.