రాష్ట్రీయం

లాకర్లలో న‘గలగలలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 21: ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఆస్తులపై రెండో రోజు ఏసిబి దాడులు కొనసాగాయి. విజయవాడలోని రెండు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను తెరచిన అధికారులు నివ్వెరపోయారు. గుట్టలు, గుట్టలుగా బంగారు, వెండి నగలతోపాటు ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సీజ్ చేసిన బంగారం, వెండి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన కేసులో ఆదిశేషును అరెస్టు చేసిన ఏసిబి అధికారులు గురువారం విజయవాడ ఏసిబి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఫిబ్రవరి 4వ తేదీ వరకు రిమాండు విధించారు. రెండోరోజూ విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో ఇళ్ళపై సోదాలు నిర్వహించినట్లు హైదరాబాద్ ఏసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ విచారణాధికారి ఎ రమాదేవి తెలిపారు. తొలి రోజు జరిపిన సోదాల్లో సుమారు రెండు కోట్లకు పైగా ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్రమాస్తులు కనుగొనగా.. వీటి విలువ మార్కెట్‌లో 80కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే రెండోరోజూ కొనసాగిన దాడుల్లో భాగంగా విజయవాడ సున్నపుబట్టీల సెంటర్‌లోని ఇతనికి చెందిన ఇంటితోపాటు, చాగల్లులోని అద్దెకుంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. వీటితోపాటు ప్రధానంగా నగరంలోని ఐఎన్‌జి వైశ్యా బ్యాంకు, ధనలక్ష్మీ బ్యాంకులో ఉన్న లాకర్లను గురువారం రాత్రి తెరిచారు. అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు, అతని భార్య కృష్ణకుమారితో పేరుతో ఉన్న ఐఎన్‌జి వైశ్యా బ్యాంకు లాకర్‌లో 30లక్షల రూపాయలు విలువైన ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ధనలక్ష్మీ బ్యాంకు నుంచి సుమారు ఏడు కేజీల బంగారు నగలు, నాలుగు కేజీలకు పైగా వెండి సామాగ్రిని గుర్తించారు. అయితే ధనలక్ష్మీ బ్యాంకు లాకర్ అకౌంట్ ఆదిశేషుకు దూరపు బంధువైన బండి జగన్మోహన్ తాతారావు అనే బినామీ పేరుతో 2007 నుంచి కొనసాగిస్తున్నాడు. ఈ లాకర్‌ను ఆదిశేషు భార్య కృష్ణకుమార్ ఆపరేట్ చేస్తోంది. బినామీ తాతారావు పేరుతో మరో రెండు బ్యాంకుల్లో అకౌంట్లు కూడా గుర్తించారు. దీనిలో భాగంగా బినామీ పేరుతో ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. భారీగా స్వాధీనం చేసుకున్న బంగారు నగలతోపాటు నాణ్యమైన డైమండ్ నెక్లెస్‌లు, కెంపులు, పచ్చలు, ముత్యాల హారాలు, 79గాజులు, మూడు వడ్డానాలు, నాలుగు బంగారు బిస్కెట్లు, కడియాలు, జడ దండలు, దండ వంకీలు, కాసుల పేర్లు, చంద్రహారాలు ఉన్నట్లు డిఎస్పీ రమాదేవి తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులను బట్టి నిందితుడు కాల్‌మనీ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సీజ్ చేసిన సామాగ్రి విలువ అదనంగా రెండు కోట్ల వరకు ఉంటుందని వీటిని కోర్టులో సమర్పించనున్నట్లు చెప్పారు.