కృష్ణ

సమస్యల సుడిలో గ్రంథాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిధుల లేమి, సిబ్బంది కొరతతో సతమతం
* నూతన పాలకవర్గం ముందు సవాలక్ష సమస్యలు
* నిధులు తెచ్చేందుకు కృషి చేస్తా:ఈడ్పుగంటి
మచిలీపట్నం, డిసెంబర్ 27: అన్నివర్గాల ప్రజలకు విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిధుల లేమి, వౌలిక వసతుల కొరత, అరకొర సిబ్బంది, తదితర సమస్యలు గ్రంథాలయాలను పట్టిపీడిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాశీన వైఖరి వల్ల గ్రంథాలయాల్లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రజల నుండి వసూలు చేస్తున్న విద్యాసెస్సును స్థానిక సంస్థలు గ్రంథాలయాలకు అందించకపోవటంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయ సంస్థ కునారిల్లుతోంది. పురోభివృద్ధి సాధించాల్సిన గ్రంథాలయాలు తిరోగమన బాట పడుతున్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందినా గ్రంథాలయాల్లో విద్యార్థులు పూర్తిస్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకోలేక పోతున్నారు. వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే ఇంజనీరింగ్ విద్యార్థులు, పండితులకు కావాల్సిన రిఫరెన్స్ పుస్తకాలు కూడా లభించని దౌర్భాగ్య పరిస్థితి గ్రంథాలయాల్లో నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థకు పాలకవర్గం లేకపోవటంతో సమస్యలు మరింత జటిలంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. కైకలూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఈడ్పుగంటి వెంకట్రామయ్య, మరో ఆరుగురిని డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ పాలకవర్గం సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించనుంది. కొత్తగా ఏర్పడిన పాలకవర్గం గ్రంథాలయాలను ఏమేర గాడిలో పెట్టనుందో వేచిచూడాల్సిందే.
నిధులు తెచ్చేందుకు కృషి చేస్తా..
గ్రంథాలయాల్లో నెలకొన్న నిధుల కొరతను సవాల్‌గా తీసుకోనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఈడ్పుగంటి వెంకట్రామయ్య ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ప్రభుత్వం నుండి పెద్దఎత్తున నిధులు సమకూర్చేందుకు, ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.