రాష్ట్రీయం

రహదారి భద్రత గాల్లో దీపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైవేల పక్కనే మద్యం దుకాణాలు
సుప్రీం ఆదేశాలూ పట్టని ప్రభుత్వం
31తో ముగియనున్న గడువు
రాజమండ్రి, డిసెంబర్ 6: జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు పక్కన ఉన్న మద్యం దుకాణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించటం లేదు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు పక్కన సుమారు 800కుపైగా మద్యం దుకాణాలు ఉన్నాయి. రోడ్డు భద్రతలో భాగంగా ఈ మద్యం దుకాణాలను, హోర్డింగులను తొలగించాలని రాష్ట్రప్రభుత్వాలను ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి విదితమే. కానీ ఇప్పటికీ రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు అత్యంత సమీపంలోనే మద్యం దుకాణాలు, హోర్డింగులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాలకు ఇచ్చిన గడువు డిసెంబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలను, హోర్డింగులను గడువులోగా తొలగించాల్సి ఉంది. కానీ అలాంటి చర్యలేవీ అటు ఎక్సైజ్‌శాఖ లేదా ఆర్‌అండ్‌బి శాఖ తీసుకుంటున్నట్టు కనిపించటం లేదు. 2014లో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8వేల మంది మృతి చెందితే, ఇందులో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో 8.9శాతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంటే, 10.8శాతం మంది మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తోంది.
జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు నిర్దిష్టమైన దూరంలోనే మద్యం దుకాణాలు ఉండాలన్న ఆదేశాలేవీ తమకు లేవని, ప్రజల కోరిక మేరకు మాత్రమే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు దూరంగా కొన్ని చోట్ల తరలిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం 13 జిల్లాల్లో ఉన్న కోర్ రోడ్ నెట్‌వర్క్ రోడ్ల జాబితాలో, ప్రతిపాదిత కోర్ రోడ్ నెట్‌వర్క్ రోడ్లు జాబితాలో ఉన్న 14,721 కిలోమీటర్ల రోడ్లు రాష్ట్ర హైవేలుగా మార్పుచెందనున్నాయి. రాష్ట్ర హైవేలుగా మార్పు చెందనున్న రోడ్లు శ్రీకాకుళంలో 958కి.మీ, విజయనగరంలో 790కి.మీ, విశాఖపట్నంలో 790కి.మీ, తూర్పుగోదావరి జిల్లాలో 1274కి.మీ, పశ్చిమగోదావరిలో 1224కి.మీ, కృష్ణాలో 1179కి.మీ, గుంటూరులో 1274కి.మీ, ప్రకాశంలో 1186కి.మీ, నెల్లూరులో 1200కి.మీ, చిత్తూరులో 1102కి.మీ, కడపలో 1130కి.మీ, అనంతపురంలో 1258కి.మీ, కర్నూలులో 1195 కిలోమీటర్ల రోడ్లు రాష్ట్ర హైవేలుగా మారనున్నాయి. కొత్తగా రాష్ట్ర హైవేలుగా మారిన 14వేల 721కిలోమీటర్ల రోడ్లకు సమీపంలోని మద్యం దుకాణాలను కూడా సుప్రీంకోర్డు ఆదేశాల ప్రకారం తొలగించాల్సి ఉంటుంది.