లోకాభిరామం

వద్దనుకున్నాను...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అంటే కర్ణాటక సంగీతం వినపడుతూ వుండేది. అది నా గొప్పతనం కాదు. సంగీతం ఎవరినయినా పట్టుకుంటే అట్లా పట్టుకుంటుంది. నా కొడుకు అప్పటికి డైనింగ్ టేబుల్ ఎత్తు కూడా లేడు. ఒక రాత్రి నేను అన్నం తింటున్నాను. వాడు నా ముందు వచ్చి గంభీరంగా నిలబడ్డాడు. సంగీతం పెట్టకుండా అన్నం తింటున్నావు ఎందుకు? అంటూ నన్ను నిలదీశాడు. మొత్తానికి పిల్లలిద్దరికీ కూడా సంగీతం వినడం అలవాటు అయింది. మాయావిడ రిటైర్ అయిన తరువాత కూడా సంగీతం క్లాసులకు వెళుతూ వుండేది. ఈ మధ్య ఎందుకో క్లాసులకు వెళ్లటంలేదు.
కేసెట్లు చాలామంది దగ్గర నుంచి సేకరించి వాటిని కంప్యూటర్ సంగీతంగా మార్చడం నా ఇంట్లో ఒక పరిశ్రమగా సాగింది. రెండు మూడు సంవత్సరాలుగా అది కొంచెం తగ్గింది. ఈ మధ్యన పుస్తకాల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటున్నది. మొత్తానికి ఇంట్లో పెట్టెలు పెట్టెలు కేసెట్లు చేరాయి. 2019 సంవత్సరంలో వాటిని, క్షేమంగా ఉంచగలడు అని నమ్మకం కలిగిన ఒక మిత్రుని దగ్గరికి తరలించాను. నాకు ఈ సంవత్సరం బాగా గుర్తుండి పోతుంది. పుస్తకాల విషయంలో కూడా ఇటువంటి భావన బలంగా కలుగుతున్నది. మనం సంరక్షించుకోలేని విషయాలను, వస్తువులను సేకరించుకుని లాభం లేదు. పిల్లలిద్దరూ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోని పనికిరాని వస్తువులు చాలా బయటపడేసి పోయారు. ప్లాస్టిక్ వాడకూడదు అన్న మరొక నియమం పెట్టి మరిన్ని వస్తువులు బయట పడేసి పోయారు. మొత్తానికి 2019వ సంవత్సరం ట్వీకింగ్ అనే పద్ధతిలో పనికిరాని వస్తువులను పడవేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ సంవత్సరంలోనే సంగీతం మళ్లీ వినడం అన్న పద్ధతి కూడా మొదలైంది. అమెజాన్ ద్వారా వస్తువులు కొనడం అలవాటుగా మారింది. అందులో ప్రైమ్ అనే పద్ధతికి డబ్బులు చెల్లిస్తే కొన్ని వెసులుబాట్లు కలుగుతాయి. సినిమాలు, టీవీ కార్యక్రమాలు ఉచితంగా చూసే ఒక ఛానల్ అందుబాటులోకి వస్తుంది. అట్లాగే ప్రైమ్ మ్యూజిక్ అనే సంగీతం ఛానల్ సెల్‌ఫోన్‌లో, ట్యాబ్‌లో, కంప్యూటర్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో సినిమా పాటలు మాత్రమే కాక రకరకాల సంగీతం ఉంటుంది. వాళ్లు భారీ ఎత్తున కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను సేకరించి పెట్టారు అన్నది ఆశ్చర్యకరమైన విషయం. అయితే అవన్నీ కమర్షియల్ గ్రామఫోన్ రికార్డులు, లేదా క్యాసెట్లో నుంచి తీసిన సంగీతం. కచేరీల క్యాసెట్లను కన్వర్షన్ చేయడం అనే పేరుతో నేను చాలా కాలం వరకూ కమర్షియల్ సంగీతం వినడానికి దూరంగా ఉండిపోయాను. అయితే డబ్బులు ఇస్తారు కనుక ఇటువంటి రికార్డులలో సంగీతం మరింత పకడ్బందీగా ఉంటుంది. పాడే వారికి అక్కడ మంచి మోటివేషన్ ఉంటుంది. రేడియోలో పాడేవారు కూడా ఇదే రకంగా అందరూ ఉంటారు అన్న భావనతో కొంచెం జాగ్రత్తగా పాడతారు. తమ నైపుణ్యాన్ని అక్కడ కనబరుస్తారు. ప్రయోగాలను కూడా అక్కడ చేసి చూపిస్తారు. వాళ్లు ఎంచుకున్న పక్క వాద్యాలు కాక రేడియోవారు, లేదా రికార్డింగ్ సంస్థ వారు ఎంచుకున్న వాద్యకారులు వస్తారు. మొత్తానికి ఈ రికార్డింగులు ఒక క్వాలిటీ విషయంలోనే కాక సంగీతం క్వాలిటీ విషయంలో కూడా బాగుంటాయి. నెట్‌లో స్పాటిఫై అనే మరొక వెబ్‌సైట్ ఉంది. అందులో కూడా ప్రపంచంలోని పాటలు అన్నీ ఉంటాయి. కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం కూడా అందులో కావలసినంత ఉంది. అందులో నుంచి చాలా శాతాన్ని డబ్బులు ఏవీ ఇవ్వకుండానే వినే అవకాశం ఉంది. నేను ఈ మధ్య నుంచి క్రమంగా వింటున్నాను.
ఆకాశవాణి వాళ్లు రాగం అని ఒక ఛానల్ మొదలుపెట్టారు. అది బాగా నడవదు అని నేను మొదట్లోనే అన్నాను. కొంతకాలం పాటు స్టేషన్‌లు అన్నీ తమ దగ్గర దాచి ఉంచిన పాత రికార్డింగ్‌లు పైకి తీసి ప్రసారం చేశారు. కొంతకాలానికి అవి అయిపోయినయి. ఇప్పుడు కొత్తగా వేయడానికి వాళ్లకి ఏమీ దొరకడం లేదు. అయినా మిగతా స్టేషన్ల రికార్డింగులు, అక్కడి కళాకారులను వినే అవకాశం దొరుకుతుంది. ఈ సందర్భంగా ఆకాశవాణి వారు ఇటీవలే తయారుచేసిన ఒక సదుపాయం గురించి చెప్పాలి. ప్రసార భారతి అన్న సైట్ నుంచి లైవ్ రేడియో లింకు ద్వారా ఇంట్లోనే అన్ని రేడియోలు, నిజంగా అన్ని స్టేషన్లు ఇంటర్నెట్ ద్వారా వినే సౌకర్యాన్ని ఆకాశవాణి వారు ఈ మధ్యనే కల్పించారు. ఆసక్తి ఉన్నవారు ఒక సంగీతమే కాక రకరకాల భాషలకు సంబంధించిన కార్యక్రమాలను ఇక్కడి నుండే వినవచ్చు.
సంగీత ప్రియ అనే సంగీత ప్రియుల బృందానికి ఒక వెబ్‌సైట్ ఉందని లోకాభిరామంలో నేను చాలాసార్లు చెప్పాను. అందులో నేను కనీసం ఏడు వందలకు చేరువగా కచేరీలను అందించాను. ఈ మధ్యన నేను సంగీతం అప్‌లోడ్ చేయడం లేదు. కానీ కొంత మంది మాత్రం మంచి సంగీతాన్ని ఇస్తున్నారు. ఒక పెద్దాయన మద్రాసు రేడియో నుంచి ఎప్పటికప్పుడు కచేరీలను రికార్డ్ చేసి ఇందులోకి ఇస్తుంటారు. యూట్యూబ్ అనగానే అందరికీ వీడియో మాత్రమే జ్ఞాపకం వస్తుంది. యూట్యూబ్ వాళ్లు సంగీతం ఛానల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇంటర్నెట్ ద్వారా శాస్ర్తియ సంగీతాన్ని వినడానికి కూడా అవకాశాలు బాగా పెరిగాయి. కనుక నేను వెళ్లడం కూడా బాగా పెరిగింది. నేను సంగీతం కన్వర్ట్ చేసి అందరితో పంచుకుంటున్న రోజుల్లో కొంతమంది కళాకారుల రికార్డింగ్‌లకు మామూలుకన్నా ఎక్కువ ఆదరణ పొందింది. వారిలో బాలమురళి పేరు మొట్టమొదటిగా చెప్పుకోవాలి. ఆయన అరుదైన కొన్ని కచేరీలను నేను అందరికీ పంచగలిగాను. మహారాజపురం సంతానంగారి తండ్రి, శెమ్మంగుడికి కూడా గురువు విశ్వనాథ అయ్యగారి రికార్డింగులు నేను అందరితో పంచుకున్నాను. అంటే అది నా అదృష్టం. ఇక రంగాచారి గారి సహకారం కారణంగా శోభన గారు సంగీతాన్ని అందరితో పంచుకున్నారు. ఆవిడ గొప్ప గాయని. కానీ చిన్న వయసులోనే పోయారు. ఇక శ్రీరంగం గోపాలరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేనే లేదు. నా దగ్గర ఆవిడ రికార్డింగులు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఎం.ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మగారి గురించి ప్రత్యేకంగా చెప్పి తీరాలి. ఆయన రికార్డింగ్ అప్‌లోడ్ చేస్తే మద్రాస్ ప్రాంతంలోని కొంతమంది తెగ మురిసిపోయేవారు. ఆయన పాత కాలంలోనే మ్యూజిక్ అకాడెమీతో సహా పెద్ద సభలలో పాడి అందరినీ అలరించిన పండితుడు.
ఆశ్చర్యంగా పండిత పుత్రుల పద్ధతి కాకుండా ఆయన పిల్లలకు సంగీతం మీద అభిమానం కొనసాగుతున్నది. అనుకోకుండా వారిలో ఒక ఆయనతో పరిచయం కలిగింది. ప్రత్యక్షంగా చూసిన తరువాత ఆయన నాకంటే పెద్ద వయసు అని తెలిసింది. మొత్తానికి పిల్లలంతా కలిసి శర్మగారి రికార్డింగ్‌లలో దొరికినవి చోటికి సంపాదించి ఒక డివిడిగా వెలువరించారు. దానికి ప్రేరణ నేను అని వాళ్లు అన్నప్పుడు నాకు ఆశ్చర్యం ఎదురయింది. ఆ మధ్యన తండ్రిగారి స్మారక సభను ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా జరిపి నన్ను వక్తగా పిలిచారు. గౌరవంగా పిలిచినందుకు వెళ్లవలసి వచ్చింది. సభలో పట్టుమని పదిహేను మంది లేరు. మనకు కళా సాహిత్యాల పట్ల ఉన్న గౌరవం ఇంత గొప్పగా ఉంటుంది. అయితేనేం సభకు వెళ్లాను. మరొక ఇద్దరు ముగ్గురు సంగీత మిత్రులు కూడా నాతోపాటు వేదిక మీద ఉన్నారు. నాకు తోచిన విషయాలు నేను చెప్పాను. బాలసుబ్రహ్మణ్య శర్మగారిది లోతు తెలిసి పాడిన సంగీతం. ఆయన వింటున్న వారి కొరకు కాక సంగీతం కొరకు పాడేవారు. తన పాటలను తానే విని ఆనందించేవారు. మదురై సోమసుందరం గారిలో కూడా ఈ లక్షణాన్ని నేను చూశాను. కనుకనే శర్మగారిని ఆంధ్ర సోము అనేవారు అనుకుంటాను. ఆయన వరంగల్‌లో భద్రకాళి గుడిలో 1975లో పాడిన కచేరీకి నేను కూడా ముందు కూర్చున్నాను. సంగీతం పట్టని మనవారు గోల చేస్తున్నారు. పాడుతున్న శర్మగారు బడిపంతులు లాగా మైకంలోనే గట్టి కేక వేశారు. అందరూ నిశ్శబ్దంగా మారిన తర్వాత అమాయకంగా ఆయన మళ్లీ పాట మొదలుపెట్టారు. ఆయనకు సంగీతం మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఇలాంటి విషయాలు ఏవో నేను చెప్పి ఆ సభను మెప్పించడానికి ప్రయత్నించినట్లు ఉన్నాను.
మొత్తానికి మళ్లీ సంగీతం వింటున్నాను. ఇంట్లో ఇంకా బోలెడు క్యాసెట్లు గ్రామఫోన్ రికార్డులు ఉన్నాయి. మరిన్ని సేకరించాలి అన్న కోరిక మళ్లీ ఒకసారి కలుగుతున్నది. ఈ నాలుగు ముక్కలు చదువుతున్న వారిలో ఎవరి వద్ద అయినా, లేక వాళ్లకు తెలిసిన వాళ్ల దగ్గర అయినా రేడియోలో రికార్డ్ చేసినవి, కచేరీలుగా రికార్డ్ చేసినవి క్యాసెట్లు ఉంటే నాకు తెలియ జేయవలసిందిగా మనవి. ఫోన్ రికార్డులు కూడా ఎవరి దగ్గర ఏమైనా పడి ఉంటే వాటిని నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఆ రికార్డులను పది మందితో పంచుకునే ప్రయత్నం చేస్తాను.
అన్నట్టు ప్రపంచంలో ఈ మధ్యన గ్రామఫోన్లు మళ్లీ అమ్ముడవుతున్నాయి. నా దగ్గర ఒక గ్రామఫోన్ ఉంది. దాన్ని కంప్యూటర్‌తో కలిపి రికార్డులోని సంగీతాన్ని డిజిటల్ సంగీతంగా మార్చవచ్చు. ప్లేయర్ కేవలం ఎల్.పిలను మాత్రమే వాడగలుగుతుంది. మిగతా రకాల రికార్డులను డిజిటైజ్ చేసి ఆ ట్రాక్‌లను సులభంగా వాటి అసలు స్పీడ్‌లోకి మార్చవచ్చు. గ్రామఫోన్ ప్లేయర్లు, రికార్డులు కూడా పని చేస్తున్న పరిస్థితిలో ఎవరి దగ్గరైనా ఉంటే నాకు తెలియజేయండి. వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తాను. నాణ్యతగల క్యాసెట్ డెక్, ఆంప్లిఫయర్ సెట్ల గురించి కూడా నాకు ఆసక్తి ఉంది. ఇదంతా నా కొరకు కాదు. సంగీతం కొరకు. నా దగ్గర మేట పడిన సంగీతాన్ని నలుగురికి ఉపయోగకరంగా ఉండేట్లు చేయాలన్నందు కొరకు...
రేడియో వింటున్న వారిలో మూడు శాతం మాత్రమే సంగీతం వింటారు అని కొన్ని దశాబ్దాల కింద వేసిన లెక్క. ఇప్పుడు అంతమంది కూడా వినడం లేదని నా అనుమానం. సంగీతాన్ని పట్టించుకోకుంటే అది మాయమై పోతుంది. కనీసం మరుగున పడిపోతుంది. దక్షిణ దేశంలో కుర్రవాళ్లు సంగీతాన్ని చాలా కష్టపడి నిర్వహిస్తున్నారు. కనుక అది మిగిలి ఉంటుంది అన్న ఆశ కొంతైనా ఉంది. మన దగ్గర పరిస్థితి గురించి నేను మాట్లాడను.

-కె.బి.గోపాలం