లోకాభిరామం

సంగీతం.. మరింత సంగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటక హిందుస్థానీ సంగీతం రికార్డింగులను సేకరించి పదుగురితో పంచుకోవడం చాలా సంవత్సరాలుగా నాకు ప్రవృత్తిగా సాగుతున్నది. కొంతమంది మిత్రులు ఈ సంగతి తెలిసిన వారు కనుక నాకు రికార్డింగులు పంపుతుంటారు. ఈ మధ్యన అనుకోకుండా ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి రికార్డింగులు బోలెడు వచ్చాయి. అవి పంపిన వారి పేరు నాకు తెలియలేదు. తెలుసుకోవాలని అడిగాను. అసలు నాకు రికార్డింగులు పంపాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని కూడా అడిగాను. ఆవిడగారు చాలాకాలంగా సంగీత రంగంలో నా సేవను అలాగే నా సాహిత్య సేవలను కూడా ఎరిగి ఉన్నవారట. నాకెంతో సంతోషం కలిగింది. ఆవిడ పంపిన సుదీర్ఘ సమాధానంలో మా చుట్టుపక్కల వారు తమ దగ్గర క్యాసెట్లు ఉన్నాయి. వాటిని కంప్యూటర్లోకి మార్చడానికి తగిన వాళ్లు ఎవరు దొరకడం లేదు అంటున్నారని ప్రస్తావించారు. నేను నిజానికి కొంతకాలంగా ఈ క్యాసెట్లను అంటే వాటిలోని రికార్డింగులను డిజిటైజ్ చేయడం అనే కార్యక్రమాన్ని కొంత తగ్గించాను. దశాబ్దం పైన ఆ పనిని ఒక సరదాగా కాక మరింత సీరియస్‌గానే చేశాను. రకరకాల కారణాలుగా ఈ మధ్య ఆ పని కొంత తగ్గింది. కానీ నాకు ఇప్పటివరకు అందని రకం రికార్డింగులు దొరుకుతాయి అన్న అవకాశం కనిపిస్తున్నది కనుక మళ్లీ ఒకసారి ఆ పని మొదలుపెట్టాలి అనిపించింది. ఆ మాటే ఆవిడగారితో చెప్పాను.
అసలు ముందు ఈ క్యాసెట్లు నన్ను తరిమే పద్ధతిని గురించి చెబితే బాగుంటుంది. నేను పరిశోధనలో ఉండగానే క్యాసెట్ ప్లేయర్ కొన్నాను. అది కొన్న పద్ధతి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. కూరగాయల కని బయలుదేరాను. దారిలో ఎలక్ట్రానిక్స్ దుకాణం కనిపించింది. సరదాగా అందులోకి వెళ్లి ఒక టూ ఇన్ వన్ ఎంపిక చేసుకున్నాను. ఇల్లు పక్కనే గల్లీలో ఉంటుంది కనుక ఆ పరికరాన్ని పట్టుకుపోయి తరువాత డబ్బులు తెచ్చి ఇచ్చినట్టు గుర్తుంది. యంత్రం మాత్రం వస్తే ఏమిటి లాభం? అందులో వేసి వినడానికి క్యాసెట్లు ఉండాలి కదా! ఇక సేకరణ నెమ్మదిగా మొదలైంది. అప్పట్లో ఆదాయం చాలా తక్కువగానే ఉండేది. సంగీతం రికార్డింగ్ ఉన్న క్యాసెట్లు కొనాలంటే నాకు కొంచెం అందుబాటులో లేని పద్ధతిగా ఉండేది. నాలాంటి వాళ్లు మరి ఎంతోమంది ఉన్నట్టు గుర్తించారు. కాచిగూడ చౌరస్తాలో ఇద్దరు సోదరులు కలిసి నడుపుతున్న క్యాసెట్ల అంగడి ఒకటి దొరికింది. అక్కడ వారు క్యాసెట్‌లకు నకిలీలు చేసి ఇచ్చేవారు. క్యాసెట్ ధరతో పాటు మరో పది రూపాయలు తీసుకుని ఆ నకిలీ ఇచ్చేసేవారు. చేసిన పాపం చెబితే పోతుంది అంటారు. నా సంగీత సేకరణ దొంగతనంగా మొదలైంది అన్నమాట. ఆదాయం కొంచెం పెరిగిన కొద్దీ అసలు క్యాసెట్లు కొనడం కూడా మొదలుపెట్టాను. నకిలీ పద్ధతి మానేశాను. ఇక కావలసిన రికార్డింగులను వెతుకుతూ ఊరంతా తిరగడం నేర్చుకున్నాను. అన్ని అంగళ్ల వాళ్లు నన్ను గుర్తించడం మొదలైంది. నేను కనిపించగానే నాకు నచ్చే రకం క్యాసెట్లను అడగకుండానే ఇవ్వడం మొదలైంది. ఆ రకంగా నా దగ్గర సేకరణ పెరగసాగింది. ముందు బ్రీఫ్‌కేసు నిండింది. ఆ తరువాత అట్టపెట్టెలలో నిండసాగాయి. రానురాను వాటి సంఖ్య పెరగసాగింది.
ఒక చిన్న కప్పదాటు వేసి కథను కొంచెం ముందుకు తీసుకుపోవాలి. సంగీతప్రియ అనే సంగీతాభిమానుల వర్గంలో నేను ఒక్కడినే అయ్యాను. వాళ్లకు వెబ్సైట్ వచ్చింది. అందులో ఇలాంటి వాళ్లను కొంతమందిని ఇవ్వడం మొదలుపెట్టాము. అది జరిగేలోగా క్యాసెట్లు నన్ను తరిమే పద్ధతి చిత్రంగా మారింది. అంతకు ముందు అందరికీ అందుబాటులో లేని రికార్డింగులను సంపాదించాలి. వాటిని డిజిటైజ్ చేయాలి. అప్పుడు వాటిని నెట్ ద్వారా అందరితో పంచుకోవాలి. సంగీతప్రియకు ముందు ఈ కార్యక్రమం మరొక పద్ధతిలో జరిగేది. దాని గురించి అంతగా ప్రచారం కూడా జరిగేది కాదు. కానీ సంగీతప్రియ రావడంతో పరిస్థితి బాగా మారింది. మిత్రులు వేణుగాన విద్వాంసులు ఎం.ఎస్.శ్రీనివాసన్ గారి క్యాసెట్ల కలెక్షన్ వాళ్లింట్లో భద్రంగా ఉందని తెలుసు. సారధి గారిని అడిగి ఆ క్యాసెట్లు కొద్దికొద్దిగా తేవడం మొదలుపెట్టాను. హాయ్ రా నిజంగా మంచి కచేరీలను రికార్డు చేసి ఉంచారు. ఇక నేను కూడా అంతకు ముందు రేడియో నుంచి రికార్డ్ చేసిన క్యాసెట్లు చాలా నా దగ్గర ఉండేవి. సంగీతప్రియ బృందానికి ఈ రకమైన రికార్డింగులు ఇవ్వడంతో ప్రపంచంతో సంగీతం పంచుకోవడం అనే కార్యక్రమం మొదలైంది. చాలా అరుదైన కచేరీలను సంగీతాభిమానులకు ఇవ్వగలిగే అవకాశం నాకు కలిగింది. వాక్యం వెనుక చాలా తతంగం ఉంది. అది కొంత లోకాభిరామంలో ఇంతకు ముందే ప్రస్తావించాను కూడా. కనుక ఇక్కడ మళ్లీ చెప్పను. ఇక్కడ కథ క్యాసెట్లు పోగు చేయడం గురించి.
కమర్షియల్‌గా కంపెనీల వారు విడుదల చేసే కచేరీలను సంగీత ప్రియలో పంచుకునే పద్ధతి లేదు. అవి జరిగిన కచేరీలో రికార్డింగులు అయి ఉండాలి. కనీసం రేడియో నుంచి చేసిన రికార్డింగులు అయినా అయి ఉండాలి. నా దగ్గర కొంతకాలానికి క్యాసెట్ల సంఖ్య అడుగంటింది. ఈలోగా కొన్ని విచిత్రాలు జరగడం మొదలైంది.
బెంగుళూరులో రాజాంగ శివకుమార్ గారని ఒక పెద్దమనుషులు ఉన్నారు. ఆయన తీవ్రమైన సంగీతాభిమాని. కొన్ని సంవత్సరాలుగా ఆ నగరంలో జరుగుతున్న కచేరీలకు వెళ్లి వాటిని రికార్డ్ చేస్తూ నా దగ్గర ఉన్న సంగీతంలో ఉన్నారు. కమర్షియల్ క్యాసెట్లు కూడా చాలా కొన్నారు. మొత్తానికి పెద్ద భాండాగారం చేరింది. కానీ కొన్ని కారణాలుగా ఆయన ఆ క్యాసెట్లను వదిలించుకోవలసిన పరిస్థితి వచ్చినట్లు ఉంది. కనీసం అవి పదిమందికి పనికి రావాలన్న ఆలోచన అయినా వచ్చి ఉండాలి. శివకుమార్ గారు నాకు మెయిల్ పంపించారు. ఆ తర్వాత మాట్లాడుకున్నాము. నేను ఈ క్యాసెట్లను ఏ రకంగానూ వాడలేక పోతున్నాను. నీ వంటి వారికి ఇస్తే వాటిలోని కచేరీలు పది మంది వినే వీలు కలుగుతుంది అన్నారు. నా ఆనందం ఆకాశాన్ని అందుకున్నది. కానీ క్యాసెట్లు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రావాలి. ఆ కార్యక్రమంలో నాకు సహాయం చేసిన వారి అందరి పేర్లు చెప్పలేను కానీ శివరాంప్రసాద్ గారిని చెప్పకుండా ఉంటే తప్పు అవుతుంది. మొత్తానికి మూడు పెట్టెల నిండా క్యాసెట్లు మా ఇంటికి చేరుకున్నాయి. వాటి సంఖ్య సుమారు 600 వరకు ఉంది. నాకు చేతినిండా పని. కంపెనీల వారి కచేరీలను కేవలం వినడానికి పక్కన పెట్టుకున్నాను. నిజానికి ఈ మధ్యన సుమారు 200పైగా క్యాసెట్లను ఒక సాంస్కృతిక సంస్థ వారికి ఇచ్చాను. నా దగ్గర ఇంకా ఎన్నో క్యాసెట్లు ఉన్నాయి.
అయితే అసలు కచేరీలను డిజిటైజ్ చేసి పాటలను విడదీసి రాగాలు తాళాలు గుర్తించి, వాటిని సంగీతప్రియలో అప్లోడ్ చేసి పంచుకోవడం ముమ్మరంగా మొదలైంది. నిజానికి ఈలోగానే మద్రాసులో ఉన్న మరొక అన్నగారు నాకు కన్వర్షన్ శ్రమ లేకుండానే డిజిటల్ రూపంలో ఉన్న రికార్డింగులు వందల కొద్దీ కచేరీలు ఇచ్చారు. మొత్తానికి నేను సంగీతప్రియలో ఇచ్చే కచేరీల నాణ్యత బాగా పెరిగింది. దీన్ని చాలామంది గుర్తించసాగారు. అందులో కొందరు తమ వద్ద ఉన్న రికార్డింగులను నాకు పంపే ప్రయత్నం కూడా చేశారు. బాంబే నగరం నుంచి ఒక మిత్రుడు పంపించిన రికార్డింగులు నిజంగా గొప్పవిగా ఉన్నాయి. ఆ నగరంలో సంగీత సభల వారు నిర్వహించే కచేరీలను సభ్యులకు కొంత ధరకు క్యాసెట్లలో అందజేసే పద్ధతి ఒకటి ఉన్నట్టుంది. కనుక నాకు మంచి రికార్డింగులు పంపగలిగారు. అక్కడి నుండి మరొక ఆవిడ కూడా నాకు మంచి రికార్డింగులు పంపారు. మొత్తానికి మా ఇల్లు క్యాసెట్లు లైబ్రరీగా మారిపోయింది.
తమిళనాడు, కర్ణాటక నుంచి క్యాసెట్లు, రికార్డింగులు సంపాదించగలిగాను. నిజానికి విదేశాలలో ఉన్న వారు కూడా కొంతమంది నాకు రికార్డింగులు ఇచ్చే ప్రస్తావన వచ్చింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించినట్టు గుర్తులేదు. ఒక్క మాట చెప్పాలి. చుట్టుపక్కల ఉన్న వారు మాత్రం ఎవరూ నాకు సంగీతం ఇచ్చే పద్ధతి కనిపించలేదు. చాలామందిని అడిగాను. వారి వద్ద ఉన్న సంగీతం తీసుకుని నేను లాభపడి పోతానేమో అన్నట్టు మాట్లాడారు. ఇందులో నాకు సమయం, ద్రవ్యం ఖర్చు అయ్యాయి కానీ లాభం అన్నది ఏ రకంగానూ అందలేదు. నాకు సంగీతం మీద వల్లమాలిన అభిమానం ఉంది. ఒక కొత్త కచేరీ వినడంలో ఉన్న ఆనందం కోట్ల కన్నా ఎక్కువగా కనిపిస్తుంది. మంచి కచేరీలను మరింత మందికి వినిపించగలిగారు అన్న ఆనందం అంతకన్నా గొప్పదిగా కనిపించింది. అంతే తప్ప ఈ కార్యక్రమాన్ని వ్యాపార పరంగా మాత్రం ఎప్పుడూ చూడలేదు.
ఒక్క కొమాండూరి శేషాద్రిగారి కుటుంబాన్ని గురించి మాత్రం విడిగా చెప్పుకోవాలి. వాళ్లు ఇంట్లో ఉన్న క్యాసెట్లు మొత్తం నాకు తెచ్చి ఇచ్చారు. వాటిలో చాలా మటుకు శేషాద్రి గారి గాత్రం, వయొలిన్, వయోలా రికార్డింగ్‌లలు ఉన్నాయి. ఆయన తన అబ్బాయిలతో కలిసి వాయించిన కచేరీలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చాలా మటుకు డిజిటైజ్ చేసి ఇచ్చాను. కొన్నింటిని నెట్‌లో పంచుకున్నాను. శేషాద్రిగారు నాకు మరొక రెండు రకాలుగా సంగీతాన్ని ఇప్పించారు. విజయవాడలోని మిత్రులు ఒకాయన కలకాలంగా దాచుకున్న క్యాసెట్లను కన్వర్ట్ చేసి సీడీల రూపంలో ఇస్తున్నట్టు తెలుసుకొని శేషాద్రిగారు సి డిల సెట్లను నాకు ఇప్పించారు. నా దగ్గర ఉన్న సంగీతంలో వైవిధ్యం మరింత పెరిగింది. బెంగళూరులోని ఒక మిత్రుడు, మద్రాస్‌లోని మరొక మిత్రుడు, రాజమండ్రిలోని ఇంకొక మిత్రుడు అందరూ కూడా ఏదో ఒక రకంగా నాకు సంగీతాన్ని దానం చేశారు. మరొక యువమిత్రుడు వద్దంటున్నా సరే దగ్గరున్న కమర్షియల్ కచేరీల క్యాసెట్లు మొత్తం తెచ్చి నా తల మీద గుమ్మరించాడు. అవి నేను వినడానికి మాత్రమే పనికి వచ్చాయి. పదుగురితో వాటిని పంచుకునే పద్ధతి లేదు. నా సంగీత సేకరణ గురించి చాలామందికి తెలిసినట్లు ఉంది. సికిందరాబాద్‌లో ఉంటున్న ఒక తమిళ మిత్రుడు అలా రికార్డింగులు క్యాసెట్లు ఇచ్చాడు.
ముందే చెప్పినట్టు నా దగ్గర ఇంకా బోలెడు క్యాసెట్లు మిగిలి ఉన్నాయి కానీ, వాటిని పట్టించుకుని డిజిటైజ్ చేసే కార్యక్రమం సరిగ్గా ముందుకు సాగడం లేదు. ఈలోగా నిజానికి రెండు చోట్ల నుంచి నాకు క్యాసెట్లు వచ్చాయి. కానీ వారు నాకు క్యాసెట్లు ఇచ్చి డిజిటైజ్ చేయించిన తీరులో కొత్త అర్థం నాకు తోచింది. వాళ్ల దగ్గర అరుదైన పాత కాలపు రికార్డింగులు కూడా ఉన్నాయని నాకు తెలుసు. కానీ వాళ్లు అవి నాకు ఇవ్వలేదు. తాము డిజిటైజ్ చేయించాలి అనుకున్న కొన్నింటిని మాత్రమే ఇచ్చారు. అయినా పర్వాలేదు నాకు మంచి సంగీతం దొరికింది. కనుక నేను చేయవలసింది చేశాను.
చివరగా ఒక మాట. ఈ నాలుగు ముక్కలు చదివిన వాళ్లు కొంతమంది దగ్గర రేడియో రికార్డింగులు లేదా కచేరి రికార్డింగులు ఉంటే ఉండవచ్చు. వాటిని నాకు ఇవ్వాలి అని అభిప్రాయం వారికి కలగవచ్చు. కానీ నాకు ఇప్పుడు మరింత సంగీతం పోగుచేసి డిజిటైజ్ చేసే వెసులుబాటు లేదు. ఇంట్లో ఇప్పటికే చేరుకున్న సంగీత భాండాగారాన్ని జాగ్రత్త చేయాలన్న ఆలోచన నా మెదడును కలత పెడుతున్నది. ఎందరో అభిమానంగా నాకు ఇచ్చిన ఈ సంగీత సేకరణను నేను ఏదో ఒక పద్ధతిలో కాపాడాలి. ఆ పని నేను చేయగలిగితే చాలు!

-కె.బి.గోపాలం