లోకాభిరామం

అసలు - నకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట విని చాలా బాగుంది అంటుంటారు. బాగా పాడారు అంటే ఏమిటి అర్థం? ఆ పాట అంతకు ముందే మరెవరో పాడి ఉంటారు. దాన్ని మరొకరికి నేర్పించి ఉంటారు. లేదా ఈ పాడిన వారు ఆ పాట విని మాత్రమే పాడి ఉంటారు. అటువంటి పాట బాగుంది అంటే అందులో అర్థం, అంతరార్థం ఏమిటి? నన్ను అందరూ కోడిగుడ్డు మీద అదేదో చేస్తున్నాడు అని తప్పు పట్టకండి గాని, కొంచెం నా మీద సానుభూతి చూపి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. పాడిన వ్యక్తి అంతకు ముందు ఆ పాటను పాడిన వ్యక్తిని చాలా బాగా అనుకరించారు అనే కదా! ఇమిటేషన్ అన్నది గొప్ప విద్య. అది మక్కికిమక్కీగా విరామాలతో సహా అసలు పాటలాగే పాడాలి. ఇక ఈ కొత్త గాయకుని సొంత తెలివి అంతవరకే పరిమితం అయ్యింది అని నేను అంటే మీరు నన్ను తప్పు పడతారు.
శాస్ర్తియ సంగీతంలో మనోధర్మం అని ఒకటి ఉంది అని చెబుతుంటారు. ఇక హిందుస్తానీ సంగీతం ఇంచుమించు ఈ మనోధర్మం మీద ఆధారపడి అదొక పద్ధతిలో సాగుతుంది. అయితే చాలామటుకు పాటలలో, ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో అనుకరణ, నకిలీ చేయడం ఒక్కటే గొప్పతనం కింద లెక్క. స్వర ప్రస్తారం కూడా, లేక నెరవల్ వంటివి కూడా అంతకు ముందు మరెవరో చేసిన పద్ధతిలోనే చేసి తీరాలి. ఆలాపన విషయంలో అయినా ఇంచుమించు అంతే. ఎందుకంటే ఇక్కడ మనోధర్మానికి, ఒక నిర్మాణం, ఒక చట్రం, ఒక పరిధి ఉన్నాయి మరి! ఈ మాటలు చదివిన చాలామందికి కోపం రావచ్చు! కనీసం అసంతృప్తి కలగవచ్చు! అది జరగాలని, ఆ రకంగా కొంతమంది ఆలోచించాలని నా ఉద్దేశం అంటే నమ్మండి!
ఈ ప్రపంచంలో కొత్తదనానికి అర్రులు చాచేవారు కొంతమంది మాత్రమే. పడమటి వాడు థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటాడు. మరొకడు కొత్త దారులు తొక్కమంటాడు. కలలు కనండి అంటాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా అందులో ఎక్కడో ఒకచోట నకలు అన్న పద్ధతి ఉండనే ఉంటుంది. అందులో తప్పు ఏమీ లేదు. ప్రపంచం తీరే అంత. గతానుగతికో లోకః అన్న మాట ఉండనే ఉంది. కొత్తదారి తొక్కిన వారికి ముళ్ల సమస్య ఉంటుంది కనుక ముందు కనిపించిన దారిలోనే అందరూ పోతారు. కనుకనే అది ఒక దారిగా ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ ఒక కొత్త దిశగా నడిస్తే, అప్పుడు దారులు కనిపించవు. అడుగు జాడలు అంతకన్నా కనిపించవు. ఎక్కువమంది ఒకే మార్గంలో నడుస్తారు. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే కొత్త దారులు చూపిస్తారు.
మనిషికి మాటలు ఎట్లా వస్తాయి? మిగతా వాళ్ల మాటలు వింటున్నందుకే కదా? అందరూ బాబును లేదా పాపను ఒక పేరు పెట్టి పిలుస్తారు. అప్పుడు కొంతకాలానికి అది తన పేరు అని అర్థమవుతుంది. ఇందులో అనుకరణ కాకుండా అనుసరణ ఉందేమో? ఆ తరువాత అమ్మ, అత్త, లాల, బువ్వ అంటూ ఒక్కొక్కటిగా మాటలు ఎదుటి వారిని చూసి నేర్చుకోవడం తప్ప మరొక మార్గం లేదు. అదే సంగతి పాట విషయంలో జరిగితే ఇక్కడ మరొక రకంగా ఎందుకు ఆలోచనలు సాగుతాయి? అది నాకు మెదడులో కలకాలంగా ఉన్న ప్రశ్న! ఇక మీద కూడా ఉండి తీరుతుంది. నడక అయినా, తిండి అయినా మరొకటి అయినా పనులు మరొకరిని చూసి నకలు చేసి నేర్చుకోవలసిందే! ఇక కొంతకాలం తరువాత చదువు అని ఒక యజ్ఞం మొదలవుతుంది. అక్కడ కూడా ఉన్నది నకలు చేయడం మాత్రమే! తెలిసిన తరువాత కూడా అవగాహనను పెంచే రకం చదువులు అంతంత మాత్రంగానే ఉంటాయి. బడిలో పంతులు తెలివి గలవారిని, అంతంత మాత్రం వారిని, తెలివి లేని వారిని కూడా ఒకేచోట కూర్చోబెట్టి, ఒక సగటు పద్ధతిలో పాఠం చెబుతారు. అందులో నుంచి ఎవరికి చేతనైనంత వారు అందుకోవాలి. తెలివిగల పిల్లలు ఆ సంగతి అందరికీ అర్థమయ్యేటట్లు ఒక ప్రశ్న అడిగితే, కొంచెం ఆగమని, వారిని పక్కకు తీసుకువెళ్లి నీవు ప్రశ్నలు అడగకుండా ఉంటే బాగుంటుంది అని నచ్చచెబుతారు. ఈ సంగతి నాకు చిన్నప్పుడు బడిలో నుంచి మొదలు మొన్నమొన్నటి దాకా అనుభవంలో ఉన్న విషయం. ఇక నాకు ఆలోచించకూడదు, అనవసరంగా ప్రశ్నలు అడగకూడదు, అన్న భావం బలంగా నాటుకుని పోక మరేమవుతుంది?
పెద్ద చదువుల పేరున కొన్ని విషయాలు నేర్పిస్తారు. నేను జంతు శాస్త్రంలో ఎమ్మెస్సీ చదువుకున్నాను. జీవుల గురించిన ప్రాథమిక విషయాలైన శరీర నిర్మాణం, వాటి పని పద్ధతి ఇలాంటి మూల విషయాలు చెప్పారు తప్ప, నాకు అక్కడ చుట్టుపక్కల ఉండే జంతువుల గురించి కానీ, ప్రపంచంలో జంతువుల వ్యాప్తి గురించి గానీ, మనిషికి జంతువులు చేసిన సాయం గురించి గానీ, ఇప్పుడు చేయగల పనులను గురించి గానీ ముక్క కూడా చెప్పలేదు. కొంత పర్యావరణం గురించి చెప్పినట్లు జ్ఞాపకం. గుర్రం, ఏనుగు, ఒంటె లాంటివి పరిణామం చెంది ఇప్పటి పరిస్థితికి వచ్చిన వివరాలు కూడా కొంత చెప్పినట్టు గుర్తు. ఇవన్నీ చదువుకుని జంతువుల మధ్యకు వెళ్లి నేను ఏం అర్థం చేసుకోగలను? మాకు చదువు చెప్పిన ఒక పెద్ద మనిషి, ఒక పక్షిని గురించి చెబుతూ నూనె కాకి అన్నాడు. కానీ దాన్ని మామూలు ప్రపంచంలో చమురు కాకి అంటారని నాకు తెలుసు. ఆ సంగతి నేను చెబితే ఆ ప్రొఫెసర్ గారు వింటారా? నాది అతితెలివి అని కోపగించుకుంటారు బహుశా!
అది భౌతిక శాస్త్రంగానీ, రసాయన శాస్త్రం గానీ, ఇటు జనజీవితానికి సంబంధించిన సాంఘిక శాస్త్రాలు గానీ, వౌనిక అంశాలు చెప్పి వదులుతున్నారు కానీ, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, తన చదువును దానితో జతచేసి అవగాహన కలిగించుకోవడం వీలయ్యే చదువులు లేవు. కనుక ఎందుకు పనికిరాని ఆ చదువంతా నకలు పద్ధతిగా మిగిలిపోయింది. అందులో ఒకే ఒక విషయం గొప్పగా ఉంది. తెలివి గురించి ప్రశ్న లేదు. విషయాలను గుర్తుంచుకునే శక్తి, వాటిని యథాతథంగా పరీక్షలో వెళ్లగక్కే వెసులుబాటు ఎవరికి ఎంత ఎక్కువ ఉంటే వారు అంత గొప్పవారు. అంటే అవగాహన సంగతి పక్కనబెట్టి, కేవలం నకలు చేయడం నేర్చుకోండి అని చెబుతున్నారు. అదే మరి పరీక్షల్లో కూడా చూచి రాస్తాం అంటే మాత్రం ససేమిరా ఒప్పుకోరు! ఇది ఎంత విచిత్రం? గుర్తున్నది రాయడం సులభం! నకలు చేయడం చాలా కష్టం! మేము బిఎస్సీ పరీక్షలు రాసినప్పుడు మూకుమ్మడిగా అందరూ నకలు చేస్తున్నారు. నేను మాత్రం సొంతంగా రాస్తున్నాను. భాగ్యలక్ష్మి మేడంగారు వచ్చి, నాయనా నువ్వు కూడా చూచి రాయవచ్చు కదా? అని అడిగారు. చేతనైనంత రాస్తాను. మార్కులు వేసేవారికి ఆ సంగతి అర్థం కాకపోదు, అని జవాబు ఇచ్చినట్టు గుర్తు. అన్నీ పక్కనపెట్టి, మహా ఘనత వహించిన విశ్వవిద్యాలయం వారి నిర్ణయం ప్రకారం, మా కాలేజీలో ఎవరికీ ఫస్ట్‌క్లాస్ మార్కులు రానేలేదు. బతుకంతా బాగా చదువుకున్న నేను, బిఎస్‌సిలో మాత్రం సెకండ్ క్లాస్ మార్కులతో మాత్రమే పాస్ అయ్యాను. ఎందుకని? నేను నకలు చేయలేదు కనుకనా? లేక అందరూ చేశారు కనుకనా? జవాబు నాకు తెలుసు!
కానీ చెప్పను!
ఫ్యాషన్లు వస్తాయి పోతాయి. ఒక ఫ్యాషన్ వచ్చిందంటే అందరూ మూకుమ్మడిగా, వేలంవెర్రిగా వెంటపడి అనుకరిస్తారు. అనుసరిస్తారు. అంటే కూడా మరెవరి పద్ధతిని అయినా సరే అనుసరించి బతకడమే బాగుంటుంది అని ప్రపంచం అవగాహన అన్న మాట. ఆయనెవరో ఫ్యాంట్ వేసుకుని, పైన లాల్చీ వేసుకుని వచ్చాడు. ఆ పని నేను చేస్తే అందరూ నవ్వి ఉండేవారు. చేసింది ఒక మహానటుడు, అది కూడా ఒక సినిమాలో చేశాడు. దానికి డైరెక్టర్ ఒప్పుకున్నాడు. కనుక ఆ తరువాత మేమంతా ఆ రకంగా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాము. గురుశర్ట్ అనే ఓ పద్ధతి ప్రస్తుతం చాలా మామూలు అయింది. ఈ రకం లాల్చీలను మోకాళ్లు దాటిన దాకా వేసుకునే పద్ధతి ఆ మధ్యలో వచ్చింది. నేను అటువంటి కుర్తా వేసుకుని వెళ్లాను. సరిగ్గా అదే నాడు మా దగ్గర ఒక క్లాస్ ఫోర్ కూడా అట్లాంటిదే చొక్కా వేసుకుని వచ్చాడు. ఇదండీ నకిలీ పద్ధతి! అది జరగకూడని సంగతి కానే కాదు. నకలు చేయడంలో కూడా తెలివి ఉండాలి! ఎవరు దేన్ని నకలు చేయవచ్చు, దేన్ని చేయకూడదు అన్న ఒక వివేకం కూడా ఉండాలేమో! మెచ్చుకోవడానికి పతాకస్థాయి అనుకరణ, అని అర్థం వచ్చే ఇంగ్లీషు వాక్యం ఒకటి ఉన్నది. కనిపించిన ఒక విషయం మరీ ఎక్కువగా నచ్చితే, మనం కూడా అటువంటి విషయాన్ని సొంతం చేసుకోవాలి అన్నమాట. నేను ఇటువంటి మాటలు చెప్పడం ఎవరిని చూచి నేర్చుకున్నాను?
ఇవాళ మోకాళ్ల వరకు మాత్రమే ఉండే ఒక లాగు వేసుకొని బజార్లో తిరిగి వచ్చాను. కొంతమంది నా వైపు చూసినట్లు అనుమానం కూడా వచ్చింది. కానీ ప్రపంచమంతటా చాలామంది ఇలాగ షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారని చూశాను. కనుక నేను కూడా అదే పని చేశాను! తప్పేముంది?
అనుకరణ కారణంగా ఈ ప్రపంచమంతా ఒక కలగలుపు ఫ్రూట్‌జామ్ పద్ధతికి మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలను చూసినా తేడా తెలియకుండా ఉంది. సంస్కృతి అంటే మాట పాట, కట్టుబొట్టు, వంట వంటివి అని అనుకునే వాళ్లం. కానీ వాళ్ల ప్రపంచమంతటా ప్యాంట్లు వేసుకుంటున్నారు. భారతదేవమంతటా పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నారు. ఒకప్పుడు మా ఊరిలో ఈ పంజాబీ డ్రెస్‌ను కేవలం పాకీవాళ్లు మాత్రమే వేసుకునేవారు అని నేను చెబితే ఇవాళ చాలామందికి నచ్చకుండా ఉంటుంది. ఎంతో అనుకూలంగా ఉండే ఆ దుస్తులు ఇవాళ భారతీయతకు గుర్తింపుగా మారిపోయాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్ వారి విమానంలో విమాన కన్యక అసలు సిసలైన పంజాబీ దుస్తులలో కనిపించింది అంటే అదే మరి! అనుకరణ తప్పు కానే కాదు. అది నేర్చుకునే పద్ధతి అని నేను కూడా తెలుసుకున్నాను. అయితే పేరుతో అన్ని పాత పద్ధతులను అనుసరిస్తుంటే, ఇక మరి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించవలసిన ప్రశ్న. అడగవలసిన ప్రశ్న!
లోకాభిరామం వ్యాసాలు రాయడంలో నేను ఒకరిద్దరిని ఆదర్శంగా పెట్టుకున్నాను. అంతేకానీ అనుకరణ మాత్రం చేయడం లేదు. అది నిజానికి నా వల్ల కాదు. అంటే చేతకాదని అర్థం కాదు. నేను అనుకరించదలచిన ఒకరిద్దరు తమకంటూ చక్కటి గుర్తింపు గలవారు. కనుక నేను వారి పద్ధతిలో రాసిన మాటలు వెంటనే బయటపడి పోతాయి. కనుక నా దారిలో నేను రాయడానికి ప్రయత్నం చేయాలి. చేస్తున్నాను కూడా!

-కె.బి.గోపాలం