లోకాభిరామం

కథల సాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ కథా సాహిత్యాన్ని తెలుగు పాటకులకు అందించాలని తపన పడుతున్న వారిలో నేను కూడా ఒకడిని. అందుకొరకు నేను చాలా మంది రచయితల కథలు ప్రపంచం నలుమూలల నుంచి సేకరించే పనిలో పడ్డాను. చాలా సేకరించాను. ఎంతమంది రచయితలు? ఎన్ని రకాల కథలు? వాళ్లందరి రచనలు, కనీసం నేను సేకరించినవి చదవడానికి నాకు సాధ్యం కాదని అర్థమయింది. కానీ అక్కడక్కడ ఒక రచయిత ఎదురయి, నన్ను అంత సులభంగా తప్పించుకోలేవు, అన్న పరిస్థితి ఎదురవుతుంది.
ఒక పిరాండెల్లో, ఒక నసీబ్ మహఫూజ్ కథ చదివితే, ముఖంలో గుద్దినట్టు ఉంటుంది. నిజంగా గుద్దితే నొప్పి పుడుతుంది. ఈ కథకుల దెబ్బలో గొప్ప ఆనందం కలుగుతుంది. అటువంటి వారిలో సాకీ ఒకడు. పేరు వింటే, ఇతను మన దేశం, మరీ అంటే మధ్యప్రాచ్యం రచయిత అనిపిస్తుంది. అతను అసలు సిసలయిన ఆంగ్ల రచయిత. కానీ, సాకీ అని కలం పేరు పెట్టుకున్నాడు. మనకు తెలిసి సాకీ అనే మాట రెండు సందర్భాలలో వస్తుంది. ఒకటి పాటలో అర్థంతో పని లేకుండా, పలికే రాగం. రెండవది ఒక అందమయిన అమ్మాయి. ఆమె మన సంప్రదాయం కాదు. పానశాలలో అందమయిన అమ్మాయిలు ఉండి తాగేవాళ్ల పాత్రలు నింపడం, మనకు తెలిసి, లేదా ఉర్దూ గజల్ షాయరీలలో ఈ రకం సాకీలు, జామ్ అనే పాన పాత్రను అందిస్తుంటారు. ఈ రచయిత ఆ అమ్మాయి సామూహికమయిన పేరును కలం పేరుగా పెట్టుకున్నాడు. అసలు పేరు హెక్టర్ హ్యూ. ఇంటి పేరు మన్రో.
మన మన్రో, అంటే కథారచయిత మన్రో బర్మాలో పుట్టాడు. అంతా మిలిటరీ ఆఫీసర్ల వరుస! అమ్మవేపు, నాన్న వేపు అంతా మిలిటరీయే. పెద్దన్నయ్య మాత్రం రచయిత. అతని ప్రభావంతోనే సాకీ కూడా రచనలు మొదలుపెట్టాడు. 1890లో ఈ కలం పేరును ఎంచుకున్నాడు. వ్యంగ్యం రాయడం మొదలుపెట్టాడు. ఇంగ్లీషు దొరల డాబు బతుకుల గురించి రాయసాగాడు. అసలయిన సాకీలు అందించే సారాయి కంటే, సాకీ కథలు మరింత ప్రభావం చూపించసాగాయి. తనకు జీవితంలోని అందం పట్ల అలవిమాలిన అభిమానం అని అతను మొదట్లోనే చెప్పుకున్నాడు. ‘నాకు అభిమతమయిన విషయం ఒకటి ఉంది. అది యవ్వనం’ అని కూడా అన్నాడతను.
త్వరలోనే హెక్టర్ మన్రో కన్నా సాకీ పేరు బలంగా వినిపించసాగింది. నిజానికి శరీరపరంగా బలహీనుడు. ఆలోచనలు మాత్రం తీవ్రమయినవి. ధనస్వాముల మధ్యన పుట్టినా, ఆ డాబు బతుకులు అతనికి నచ్చలేదు. కథలలో ఆ బతుకుల మీద సరదాగా కనిపించే, వినిపించే చెణుకులు అందరికీ నచ్చాయి.
సాకీ కథలను గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఇంచుమించు అతని రచనలు అన్నీ సంపాదించాను. కొన్ని కథలు, అవే పాత్రలలో వరుసగా సాగాయి. కాని కథ దేనికదే స్వంతంగా నిలబడింది. చదివిన కథల్లో ఒకటి నాకు మరీ నచ్చింది. ‘ఓపెన్ విండో’ అనే ఆ కథను వెంటనే తెలుగులో రాశాను. కానీ, తరువాత వెతికితే, కథ అప్పటికే, సారంగ, వెబ్ పత్రికలో కనిపించింది. మరింత పరిశోధన సాగిస్తుంటే, ఈ కథ నిజంగా ప్రపంచ ఖ్యాతి అందుకున్నదని అర్థమయింది. మన దేశంలో కథలు రాయడం గురించి కోర్స్ అందించే విశ్వవిద్యాలయం ఏదయినా ఉందేమో తెలియదు. పడమటి దేశాలలో చాలా యూనివర్సిటీలలో సృజనాత్మక రచన, అందునా కథానిక రచన కోర్సులున్నాయి. అటువంటి కోర్సులున్న ప్రతిచోట సాకీ, సింగర్ కథలను ఆదర్శ కథానికలుగా సిలబస్‌లో చెపుతుంటారని తెలిసింది. సింగర్ కథ, ‘అమెరికా కొడుకు’, సాకీ కథ ‘కిటికీ’ రెండూ నన్ను ఆకర్షించడంలో ఆశ్చర్యం లేదన్న మాట. నా ఎంపిక సరయినది, అన్న ధీమా కూడా నాకు కలిగింది. సందర్భం కనుక చెపుతున్నాను. అమెరికా కొడుకు, మరిన్ని కథలు, అని ఒక కథా సంచలనం ప్రచురించాను. పుస్తకంలో సాకీ కథలు కూడా ఉన్నాయి. అందంగా పుస్తకం వేయడం చేతనయింది గానీ, ఆర్భాటం, ప్రచారం నాకు చేతగాలేదు.
సొంత గోడును కొంత మాని అసలు సంగతి చూడవోయ్ అన్నది ఆదర్శం కనుక తిరిగి కిటికీ దగ్గిరకు. ఈ రచయిత ఎన్నో నవలలు, వందకు పైగా కథలు రాశాడు. అయినా అందరూ ఈ ‘ఓపెన్ విండో’ కథను గురించి చర్చించినట్టు అర్థమవుతుంది. ఈ కథ 1914లో మృగాలు - మహా మృగాలు అని అర్థం వచ్చే శీర్షిక గల సంకలనంలో వచ్చింది. అంటే ఈనాటికి అతన కుర్రవాడు మాత్రం కాదు. అయినా, కథలో ఒక అమ్మాయిని ఆధారంగా పెట్టుకుని, అతను సృష్టించిన సందర్భం ఒక రకంగా చూస్తే భయంకరంగా ఉంటే, ఓపికతో చూస్తే అంతకంటే చిలిపితనం మనకు ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. సరదాగా చదవదలచుకుంటే, అంతకంటే సరదా కథ మరెక్కడా దొరకదు. కథ చెప్పిన తీరు మాత్రం కొంచెం పాతగా ఉంటుంది. కేవలం విషయాన్ని పట్టించుకుంటే శిల్పం సంగతి గుర్తురాదు. ఇంత ఊరిస్తున్నాను గనుక కథలో ఏముందో చెప్పాలి న్యాయంగా! కానీ నేను అన్యాయం చేయదలుచుకున్నాను. కథను తెలుగులో చదవదలుచుకుంటే క్రియేటివ్ లింక్స్ వారు వేసిన నా పుస్తకం వెతకండి. లేదంటే సారంగ పత్రికలో (ఇంటర్‌నెట్‌లో) వెతకండి. నేను నా పుస్తకం అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాను. అనిపిస్తే క్షమించండి. ప్రత్యామ్నాయం కూడా చూపించాను గద. ఇక ఇంగ్లీషులో చదవదలచుకున్న వారికి నా సాయం అవసరం లేదు.
నన్ను ఆకర్షించిన సాకీ కథలో ‘ద డస్క్’ అన్నది మరొకటి. దీన్ని సాయంత్రం, సంజవేళ అనుకోవచ్చు. ఏ ఆలోచన లేకుండా, కథ చదివితే, చాలా మామూలు, నేలబారు రచనగా తోస్తుంది. కానీ, సాకీ ముద్ర ఆ కథలో కనబడుతుంది. కథలో కథ చెప్పడం సాకీ ప్రత్యేకత. కిటికీ అనే కథలో వేరా అనే అమ్మాయి చెప్పేది కూడా కథ కింద లెక్క. చాలా కథల్లో సాకీ ఈ పద్ధతి పాటించాడు. సాయంత్రం కథలో ఒక యువకుడు కథ చెపుతాడు. నిజానికి కథలో కథ అని అర్థం వచ్చే పేరుతో సాకీ మరొక కథ రాశాడు. అది నిజంగా కథ చెప్పడం గురించిన కథ. ఆ కథ నా పుస్తకంలో లేదు. అలాగని కనీసం మూలం మీకు దొరకదని కాదు.
రయిల్లో ఒక తల్లి, కొంతమంది పిల్లలతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ పిల్లలతో సతమతం అవుతుంటుంది. పక్కన ఉన్న ఒక యువకుడు పిల్లలను పిలిచి కథ చెప్పడం మొదలుపెడతాడు. పిల్లలు అతనిని వశులయిపోతారు. గోల మానేస్తారు. ‘మీకు, కథ చెప్పడం రాదు’ అంటాడు యువకుడు ఆ తల్లితో. కథ, ఇంత సులభంగా సాగదు. అదే మరి రచయిత గొప్పదనం.
సింగర్ అనే ఐజక్ బషేవిస్ సింగర్ కథలను సంకలనంగా తెస్తే, తెలుగు పాఠకులు చదువుతారని నా నమ్మకం. సాకీ కథలను అంత సులభంగా అంగీకరించరని నా అనుమానం. పరిచయం లేని ఒక సంస్కృతి గురించిన మనస్తత్వాలు, మాటలు మనకు అంత సులభంగా తలకు ఎక్కవు. అనువాదాలతో వచ్చిన చిక్కును చాలామంది పట్టించుకోవడం లేదు. ఒక రచన తెలుగులో ఒదుగుతుందా అన్న పరిశీలన కూడా జరగాలి. లేదంటే, ఆ వాతావరణాన్ని కథ ద్వారానే పరిచయం చేసే వీలు రచనలో ఉండాలి. నవలలకన్నా, కథల విషయంలో ఈ కోణం ఎంతో కీలకం.
వందల సంఖ్యలో పాత - కొత్త - సమకాలీన రచయితల రచనలు సంపాయించాను. అవన్నీ చదివే ప్రయత్నంలో ఉన్నాను. నాకు మంచి రచన ఏది చదివినా, నా తెలుగువారు ఇంతటి రచన చదవకుంటే ఏం లాభం అనిపిస్తుంది. వంద దేశాలు - వంద రచయితలు - వంద కథలు అని ఒక సంకలనం వెయ్యి అన్నాడు ఒక మిత్రుడు. ఆ పని సులభంగానే చేయవచ్చు. డబ్బు కూడా పుడుతుంది అనిపిస్తుంది. అంత పుస్తకాన్ని ఎంత మంది ఆదరించి కొంటారు? ముందే ఓడిపోవడం నా పద్ధతి కాదు. వేసిన పుస్తకాలన్ని వెర్రిగా అమ్ముడుపోయి, నేనేమీ డబ్బులలో దొర్లడం లేదు. నాకు రాయాలి అనిపించింది గనుక రాయడం. వీలుంటే అచ్చువేయడం. ఆ తరవాత పాఠక మహాలోకం దయ! నా ఈ లోకాభిరామం మాత్రం, అందరూ, అంటే అందరూ చదువుతున్నారని రాస్తున్నానా? మీరు చదువుతున్నారు. చాలదా?

కె. బి. గోపాలం