లోకాభిరామం

భారతదేశం.. పేరెలా వచ్చింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర రాయడం చాలా సులభం. కానీ రాసిన తరువాత దాని నుంచి ఏదయినా తెలుసుకోవాలి. తేల్చుకోవాలి అంటే మాత్రం చాలా కష్టం. -వాల్తర్ నెర్న్‌స్ట్. ఈయన జర్మనీకి చెందిన వైజ్ఞానికుడు.
* * *
భరతుడు పాలించిన దేశం కనుక భారతదేశం అని చెబుతారు. ఈ దేశాన్ని పాలించిన వారిలో భరతుడు అందరికన్నా గొప్పవాడా? ఇది నా ప్రశ్న కాదు! చాలామంది అడిగారు. మన దేశానికి నిజానికి ఎవరు పేరు పెట్టారు? ఇది మాత్రమే నా ప్రశ్న!
1930 ప్రాంతంలో దేశం ఇంకా స్వతంత్రం రాని కాలంలో పండిత్ జవహర్‌లాల్ నెహ్రూగారు ఒకచోట ఉపన్యాసం చేస్తున్నారు. అది పెద్ద రాజకీయ సభ. వెయ్యికి పైగా జనం ఉన్నారు. స్వాతంత్య్ర పోరాటం, (ఇది నిజానికి తప్పుడు సమాసం) స్వాతంత్య్ర సంగ్రామం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. తెల్లదొరల పాలనను కూలదోయాలని ఆలోచనతో ప్రజలంతా ఉద్యమిస్తున్నారు. నెహ్రూ వంటి నాయకులు వారిని ఉత్సాహపరిచేందుకు గాను ఉద్రేకంగా ఉపన్యాసాలు చేస్తున్నారు. కనుక సందర్భం వచ్చినప్పుడు అంతా ప్రజలు భారత్ మాతాజీ జై అని నినాదాలు చేస్తున్నారు. గడచిన వారం వ్యాసంలో మా ఇంటి చుట్టుపక్కల గల స్ర్తిలు ఇదే నినాదాన్ని చేయడం గురించి రాశాను. ఆ ముక్క మీరు చదవుకున్నా సరే ముందుకు సాగండి! మీకు ఇక్కడ కొన్ని విచిత్రమైన విశేషాలు కనపడతాయి. భారత్ మాతాకీ జై అంటే ఏం అర్థం? భారత మాతకు జయమగు గాక! అని. అంటే ఆ భారతమాత ఎవరితోనన్నా పోరాడుతున్నదా? ఇది నా మనసులో కలిగిన ప్రశ్న! దేవుడిని ప్రార్థించే భక్తులు, గొప్ప వాగ్గేయకారుల మొదలు మామూలు వారి దాకా ఎంతసేపు కావవయ్యా, బ్రోవవయ్యా అంటూ బీద అరుపులు అరుస్తూ ఉంటారు. ఏదో కష్టం వచ్చినప్పుడు కాక సుఖంలో ఉన్న వారిని ఏ రకంగా రక్షించడం? సరే పక్కదారి పట్టకుండా నెహ్రూగారి దగ్గరకి వద్దాం! ఆయన నాకంటే కొంచెం మొరటు రకం అని నాకు అనిపిస్తుంది. ప్రజలు అదే పనిగా నినాదం చేస్తుంటే, నెహ్రూగారు ఉపన్యాసం ఆపి ప్రజల వైపు సూటిగా చూస్తూ ఎవరు ఈ భారతమాత? అని ప్రశ్నించారు. ఆ మాటకు అర్థం ఏమిటి?’ అని అడిగారు. పోయిన వారంగాని, ఈ వారంగాని భారతమాత అన్న భావన గురించి నేను చర్చిస్తున్నాను. అంటే దేశం పట్ల కావలసినంత అభిమానం ఉంది. అందులో గజిబిజి లేకుండా ఉండాలని అనుకుంటున్నాను కనుక మాత్రమే.
ఎవరు ఈ భారతమాత? భరతుని తల్లి శకుంతలనా? లేక మనందరికీ కలిపిన ఒక తల్లి మాత్రమేనా? జవహర్‌లాల్ ప్రశ్న విని ప్రజలంతా అవాక్కయ్యారు. అంటే నోట మాట రాలేదు అని అర్థం. రాజకీయ నాయకులు ఏదో చెపుతారు అంతేకానీ, బడిలో పంతులు లాగా ప్రశ్నలు అడగడం అప్పటికి ఎవరికీ అనుభవంలో లేదనుకుంటాను. అయినా జవాబు చెప్పాలని ఆశతో కొంతమంది తమ కాళ్ల కింద ఉన్న నేల వైపు చూపించారట. దేశమంటే మట్టికాదోయ్ అ మరి గురజాడ చెప్పనే చెప్పారు. నెహ్రూ నిజానికి అంత మెత్తని మనిషి కాదు. గొప్ప ఓపికగల మనిషి కూడా కాదు. అవగాహన లేని ఆ ప్రజలను చూసి ఆయన తను చెప్పివలసింది చెప్పేశాడు. భారతమాత అంటే నేల కాదు. మీ వంటి ప్రజలు. అందరు ప్రజలు కలిస్తే ఆ మాత పడుతుంది! అని ఆశ్చర్యంలో ముంచుతూ జవాబు చెప్పాడు. నా దృష్టిలో సత్యం చెప్పాడు.
ఇటువంటి భావన అర్థం కావాలంటే చిక్కు వచ్చి పడుతుంది. అహం బ్రహ్మాస్మి అని ఒక సూత్రం ఉంది. అంటే నేనే పరబ్రహ్మమును అని అర్థం. కనుక త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, ఒక పుస్తకం ప్రారంభంలో ప్రార్థన చేస్తూ నాకు నేనే నమస్కరించుచున్నాను. ఎందుకనగా నేనే పరబ్రహ్మమును! అన్నారు. ఇది మామూలు వారికి అర్థమయ్యే విషయం కాదు. అచ్చంగా అదే పద్ధతిలో భారతమాత అంటే మీరే అని నెహ్రూ చెబితే ఆ జనానికి అర్థం అయి ఉండదు. అయినా సరే గొప్ప అర్థం అయినట్లు జయజయ ధ్వానాలు చేశారు. ఈసారి బహుశా నెహ్రూకి జై అని ఉంటారు. మళ్లీ భారతమాత అంటే ఆయన ఏమంటారో తెలియదు. ఈ సంఘటన ఇప్పటివారికి తెలుసా అన్నది నా అనుమానం. నెహ్రూ జీవిత చరిత్రలలో చాలాచోట్ల ఈ వివరణ కనిపిస్తుంది.
ఆనాటికి నెహ్రూ ఆ సమావేశంలో ఉన్న ప్రజలకు దేశమంటే నేనే అన్న ఒక గొప్ప భావనను కలిగించారు. అది చాలా బాగుంది. కానీ ఇంతకు భారతదేశం అంటే ఏమిటి? ఇండియా అన్న మాట వెనుక దాగి ఉన్న భావన ఏమిటి? ఏదో సమావేశంలో ఉపన్యసిస్తూ ఉంటే ఒక యువకుడు లేచి భారతీయత అంటే ఏమిటి అని నన్ను అడిగాడు. తనకు అనుమానం రావడం ఆ భారతీయతకు మూలం అని నేను అనుకున్నాను.
ప్రపంచానికి మన దేశం పేరు ఇండియా. మనకు మాత్రమే భారతదేశం. క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే అక్కడ చేరిన యువకులు, గత వారం నేను ఉటంకించిన పద్ధతిలో ఉర్దూ భాషను అరువు తెచ్చుకుని జీతేగా భయ్ జీతేగా అంటారు. భారత్ వర్ష్ జీతేగా అన్నమాట వారికి తోచదు. అసలు ఇండియా అన్న ఈ పేరును మన దేశానికి పెట్టింది మనవారు కాదు అని మీకు ఎంతమందికి తెలుసు? సింధునది ప్రాంతంలో ప్రజలను గురించి పరిశీలించిన పర్షియనులు, గ్రీకులు అనుకోకుండా ఇండియా, ఇండియన్, హిందూ అనే మాటలను పుట్టించారు. సింధు అనేది సంస్కృతం మాట. కానీ పర్షియన్లు, గ్రీకు వారికి అది తలకు ఎక్కినట్లు లేదు. లేకుంటే బహుశా మన దేశం సింధియా అయి ఉండేది. రాజమహేంద్రవరాన్ని రాజమండ్రి చేసినట్టే సింధును వారు ఇండస్‌గా మార్చేశారు. సప్తసింధు అని ఒక ప్రాంతం ఉన్నది. అంటే 7 నదులు ప్రవహిస్తున్న ప్రదేశం అని అర్థం. ఐదు నదులు ప్రవహించే ప్రాంతం కూడా ఉన్నది. అది పంజాబ్. రెండు ప్రాంతాలు ఇంచుమించు కలగలసిపోయి ఉంటాయి. గంగ కన్నా పైన ఉండే నది పేరు సింధు. దాని ఉపనదులు పైన చెప్పిన ఏడు లేదా ఐదు నదులు. అక్కడి ప్రజలను గురించి చెప్పడంలో పర్షియన్, గ్రీక్ పద్ధతిలో మళ్లీ తేడా వచ్చింది. పర్షియనులు సింధు అనడానికి బదులు హిందూ అన్నారు. నా మిత్రుడు ఒకతను ఎయిర్టెల్ అనడానికి హేర్టెల్ అనేవాడు. అదన్నమాట ఇక్కడి పద్ధతి. గ్రీకువారు మాట్లాడే పద్ధతి కొంచెం మెత్తగా ఉంటుంది. కనుక వారు ఇండియా అన్నారు. భారతదేశపు పేరు ప్రపంచానికి తెలిసి విధానం ఎంత గజిబిజిగా ఉండిందో అర్థం అయి ఉండాలి!
హిందూ నుంచి హిందుస్థాన్ అనే మాట పుట్టింది. అది మొత్తం దేశానికి పేరుగా మారింది. ఇక హిందూ అన్నది ఇక్కడి మతానికి పేరుగా నిలబడిపోయింది. 16వ శతాబ్దిలోనే ప్రపంచం నలుమూలల నుంచి మన దేశానికి వచ్చిన పర్యాటకులు, పరిశోధకులు దేశాన్ని, ఇక్కడి ప్రజలను రకరకాల పేర్లతో పిలిచారు. పోర్చుగీసు వారు దీన్ని జెంటూ అన్నారు. అంటే బడుగు వర్గం అని అర్థం. ఈ మాట జెందూగా మారి కొంతకాలం వాడుకలో ఉండేది. మరొక పక్కన ఇస్లాం వారిని మూర్స్ అని పిలిచేవారు. తరువాత ఆ మాట ముస్లింలుగా మారినట్టు అనుమానం.
మరి కొంతకాలం గడిచింది. ఆసియా నుండి కూడా ఎంతోమంది భారతదేశానికి రావడం మొదలైంది. అప్పుడు ఒక కొత్త విచిత్రం బయటపడింది. ఈ దేశంలో ఒక మతం అంటూ లేదు. దానికి ఒక నిర్దిష్టమైన పేరు కూడా లేదు అని తెలిసింది. నిజంగానే హిందూ మతం అని ఒకటి ఉన్నదా? మనకు కేవలం ఒక సనాతన సంప్రదాయం ఉన్నది. దానిని ఎవరూ ప్రయత్నించి ప్రారంభించలేదు. అది కేవలం ఒక జీవన విధానం. ఇవాళ నేను ఏదో వినతిపత్రంలోని కాలమ్స్ నింపే సందర్భంలో హిందూ అని మాట రాస్తూ ఉంటే నా మీద నాకే అనుమానం కలుగుతోంది. ఏమిటి ఈ హిందూ అన్న మాటకు అర్థం? తెలియజెప్పే వారు ఎవరూ లేరు. అలాగని నాకు ఆ భావన లేకపోలేదు. ఆ భావన లేనివారు చాలా మంది ఉన్నారు అని మాత్రం నాకు తెలుసు. హిందువుల అంటే ఆ దేశంలో ఉండేవారి మతం కనుక అది హిందూ మతం అయింది. అంతకన్న హిందూమతం వేరుగా లేదు. ఈ మతం ఏవో కొన్ని సూత్రాల మీద ఆధారపడినది కాదు. కనుకనే ఇందులో ఎంతో గజిబిజి ఉంది. అది అవగాహనా రాహిత్యానికి దారితీస్తున్నది. గ్రీకు దేశంలో వారినందరినీ గ్రీకు మతస్థులు అని అంటారేమో తెలియదు. అనరు గాక అనరు అని నా నమ్మకం.
ఇండియా లేదా హిందుస్థాన్ అయిన మన దేశం మనకు మాత్రం భారతదేశం. ఈ భారతదేశంలోని వాళ్ల అందరము భారతీయులమే. అలాగని హిందుస్థాన్‌లోని వారు అందరూ హిందువులు అయినట్టు, భారతదేశంలోని వాళ్లందరూ భారత మతస్థులు కారు. అందరూ హిందువులు కూడా కారు. ఇక్కడ అన్ని మతాల వాళ్లకు చోటున్నది. మనలని మనం సెక్యులర్ దేశంగా చెప్పుకుంటున్నాం. భారతీయులందరూ భారత మతస్థులు అయ్యే పరిస్థితి ఉంటే చిత్రంగా ఉండేది. సినిమా రంగంలోని షారుక్‌ఖాన్, క్రికెట్‌లోని మరొక పెద్ద మనిషి నేను భారత మతస్థుడిని అని చెప్పుకోగలరా? వారు సగర్వంగా మేము ఇస్లాంకు చెందిన వారము అని చెప్పుకుంటారు. ఈ వెసులుబాటు ఒక్క మన దేశంలోనే ఉన్నది. కనుకనే ఇక్కడ కావలసినంత తికమక ఉన్నది. భారత్ మాతాకీ జై అన్నప్పుడు ఆ తల్లికి అన్ని రకాల వారు పిల్లలుగా ఉన్నారు. మనది వైవిధ్యభరితమైన దేశం. ఎంతో ఓపిక గలవాళ్లం మనం. అందరం కలిసి బతకడానికి ఇంత మాత్రం కూడా వెనుకకు వెళ్లము! చిత్రంగా హిందుస్థాన్‌కు సంబంధించిన వారు అందరూ హిందువులైతే, భారత వర్షానికి సంబంధించిన వారు కూడా హిందువులే కావాలి. ఈ రెండు మాటలకు తేడా లేదు. ఇండియా, హిందుస్థాన్, భారత్ అన్న మూడు మన దేశం పేర్లు. మన దేశానికి మూడు పేర్లుకాక ముప్పయి పేర్లు ఉన్నా అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ వాటి వెనుక భావాలలో కూడా మార్పు ఉంటే అది పెద్ద చిక్కు. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా మన దేశం వారు ఈ భావ వైరుధ్యం గురించి పట్టించుకోలేదు. రాజ్యాంగంలో భారత్ అన్న మాట వాడుకున్నారు. అక్కడ ఇండియా, హిందుస్థాన్ మాటలు లేవు. మన భాషలో మాత్రం భారత్ వర్ష లేదా భారతదేశం అన్న మాట మిగిలింది. మిగతా వారందరికీ ఆ పేరు పట్టదు. ఊర్ల పేర్లు మారుస్తున్నారు. ఏకంగా దేశం పేరు మార్చాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. రాష్ట్రాల పేరు మార్చినట్టు ఉన్నారు.
ఇప్పటికయినా మించిపోయింది లేదు. పెద్దలు నేను ప్రస్తావించిన సంగతులను పట్టించుకుంటే బాగుంటుంది.

-కె.బి.గోపాలం