కథ

దారి ఎటు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రాతికి శిల్పవిద్య ఎంతో, మనిషి ఆత్మకు చదువు అంటే - జోసెఫ్ అడిసన్
* * *
ప్రవాహంలో పడి కొట్టుకుపోవటం నరకం, ప్రవాహానికి ఎదురీదటం స్వర్గం అని ఎక్కడో చదివినట్టు గుర్తుంది. నేను మామూలు టెన్ ప్లస్ టు చదువు ఉండే బడీని వదిలి పనె్నండు దాకా ఒకే వరుసగా ఉండే మల్టీపర్పస్‌కు ఎందుకు వచ్చానో నాకే తెలియదు. నా మిత్రులు అంతా వచ్చారు కనుక నేను వచ్చాను. తొమ్మిదో తరగతి ముగిసింది. పదవ తరగతిలో ఆప్షనల్స్ ఎంచుకోవాలి. టెక్నికల్, లెక్కలు, బయాలజీ, వ్యవసాయం, హ్యుమానిటీస్ విభాగాలు ఉండేవి. నాకు వ్యవసాయం చదవాలని కోరిక. అప్పటికి మాకు ఇంతో అంతో పొలం ఉండేది. నా చదువు నా పొలంలో వాడాలి అని అనుకున్నట్టు ఉన్నాను. కానీ అందరు నన్ను నిరుత్సాహపరిచారు. నిజం చెబుతున్నాను. కాగితం ఇవ్వవలసిన రోజున అప్లికేషన్ రాసి, అందులో ఆప్షనల్ రాయవలసిన చోట మాత్రం లైన్ చివరిలో వచ్చేటట్టు ఏర్పాటు చేసి జాగా మిగిల్చి తీసుకొని వెళ్లాను. నాకు మిత్రులైన నలుగురు, ఐదుగురు బయాలజీ ఎంచుకున్నారు కనుక నేను కూడా అదే ఎంచుకుని వెళ్లి ‘సి’ సెక్షన్‌లో కూర్చున్నాను. పాలమూరులోనే పేరున్న లెక్కల పంతులు కర్నూలు సూర్యనారాయణగారు నేనున్న తరగతి దాకా వచ్చి, నన్ను లెక్కలోకి రావలసిందిగా ఎంతో ప్రేమగా పిలవడం గుర్తుంది. అంతకు ముందు మా అన్నయ్యలు కొంతమంది లెక్కలు చదువుకొని మంచి పేరు తెచ్చుకున్నారు. నేను బీఎస్సీ చదివాను. తెలియకుండానే ఎంఎస్సీ కూడా చదివాను. ఆ తరువాత పీహెచ్‌డీ కూడా చేశాను. అన్నీ అయిన తరువాత వాటిని వదిలేసి మరి ఎక్కడో ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి మరి ఏవో పనులు చేశాను. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, సలహా చెప్పేవారు లేక ఈ రకంగా కొట్టుకుపోయాను అని నాకు ఇవ్వాళ అర్థం అవుతున్నది.
కేంద్ర ప్రభుత్వం వారు విద్యార్థులను బేసిక్ సైనె్సస్ చదువుకోవడానికి ఉత్సాహపరచాలని దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్ ఫైనల్‌లో మంచి మార్కులు సంపాదించిన ఇంటర్ విద్యార్థులను ఒకచోట పోగు చేసి, పెద్ద పెద్ద వాళ్లను పిలిపించి సైన్స్ చదివి ఏమి చేయవచ్చును అన్న అంశం అర్థమయ్యేటట్లు ఉపన్యాసాలు, వగైరాలను ఏర్పాటు చేస్తారు. చిత్రంగా ఇటువంటి క్యాంపులలో పిల్లలకు మార్గదర్శనం చేసే అవకాశం నాకు కూడా దొరికింది. నేను మాట్లాడి నచ్చజెప్పిన తీరు చాలా బాగుందని నన్ను మళ్లీ మళ్లీ ఉపన్యాసాలకు పిలుస్తున్నారు. అదే వరుసలో నేను ఈ మధ్యనే నాగపూర్‌లోని శివాజీ కాలేజీ వారు నిర్వహించిన ఇన్‌స్పైర్ క్యాంప్‌లో రెండు ఉపన్యాసాలు చేసి వచ్చాను. అందులో బయాలజీ యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి వివరించిన ఉపన్యాసం అందరికీ నచ్చింది. నా గురించి స్థానిక పత్రికలలో కూడా రాసినట్టు అక్కడివారు చూపించారు. మహారాష్టల్రోని నాందేడ్‌లో కూడా విశ్వవిద్యాలయంలో ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొన్నాను. మన దగ్గర ఉన్న కార్పొరేట్ ఇంటర్మీడియెట్ కాలేజీల కారణంగా, ఈ ఇన్‌స్పైర్ కార్యక్రమం ఎంత మాత్రం నడవడం లేదని నాకు దేశ రాజధాని వాళ్లే చెప్పారు. ఏలూరులో ఒకసారి ఇటువంటి క్యాంప్‌లో పాల్గొని చాలా విజయవంతంగా పిల్లలతో ఇంటరాక్షన్ చేయడం నాకే కాదు అందరికీ ఆనందం కలిగించింది.
ఈ సంగతి నా గొప్పతనం గురించి చెప్పడానికి చెప్పడం లేదు. ఆ సందర్భాలలో పల్లెటూర్లో లోని ఇంటర్మీడియెట్ కాలేజీల నుంచి వచ్చిన పిల్లలు నన్ను అడిగిన ప్రశ్నలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. వాళ్లంతా చాలా తెలివిగల పిల్లలు. కానీ పల్లెటూరి రకం, నాలాగే. అయితే దేశంలోనూ, మునుముందు విదేశాలలోనూ చదువుకు గల అవకాశాలను గురించి వాళ్లకే కాదు కదా, వాళ్లకు చదువు చెపుతున్న గురువులకు కూడా తెలిసినట్టు కనిపించలేదు. నా పరిస్థితి అలాగే ఉండేది. తెలివిగలవాడు అనడం తప్పితే, ఆ తెలివితో నేను చేయగలిగింది సూచించిన దిక్కు లేదు. ఎడ్యుకేషనల్ కౌనె్సలింగ్ అన్న పద్ధతి మన దేశంలో ఎంత మాత్రం లేదన్న సంగతి నన్ను చాలా కుంగదీసింది. పిల్లలలో కొంతమంది పల్లెటూరి వాళ్లు విదేశాలకు కూడా వెళ్లగల వెసులుబాటు ఉన్నవాళ్లు. వాళ్ల బంధువులందరూ వేర్వేరు దేశాలలో ఉన్నారు. అక్కడికి వెళ్లి చేయగలిగినది ఏమిటి అన్న సంగతి మాత్రం పిల్లలకు అంతుబట్టడం లేదు. వాళ్లు ఇంటర్నెట్ వాడుతున్నారు. అర్థం లేని పనులు చేస్తున్నారు తప్ప, ప్రపంచంలో జరుగుతున్న చదువులు, పరిశోధనల గురించి తెలుసుకోవాలన్న సంగతి మాత్రం వాళ్లకు ఎవరూ చెప్పినట్టు లేదు. నేను ఒక్కడిని ఆ నాలుగు గంటలలో వాళ్లకు ఎన్ని సంగతుల చెప్పగలను? చేతనైనంత చేశాను. కార్యక్రమ నిర్వాహకులు నా చుట్టూ పిల్లలు చేరడం చూచి కళ్లు అప్పగించారు. నా ఓపికని మెచ్చుకున్నారు. నేను ఒకనాడు పడిన బాదను ఇప్పటి పిల్లలు పడకూడదన్న నా తపన వాళ్ల దాకా వెళ్లినట్టు లేదు. ఒక్కసారి ఒక గంతు వేసి మళ్లీ వచ్చి మా ఇంట్లో పడతాను. హాయిగా సాయంత్రం కూర్చుని ఏదో చదువుకుంటున్నాను. ఈ బిల్డింగ్‌లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. మొదట్లో మా పక్కనే ఉన్న ఒక అమ్మాయి ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి అయింది. ఆమె నడుస్తూ నా ఇంట్లోకి వచ్చింది. అట్లా అందరూ నా ఇంట్లోకి వస్తారు. ఆ తల్లి మొదటి పాప చిన్నప్పుడు నా దగ్గర ఆడుకునేది. ఆ పాపకు ఒకానొక రోజు స్నానం పోసి గుడ్డలు వేసి తిండి కూడా పెట్టాను. ఆ పాప ఇప్పుడు ఇంటర్ పూర్తయిన తరువాత చదువు విషయంగా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉంది. పాప ఫ్రెంచ్ భాష చదువుకోవాలని నిశ్చయించింది. అందుకోసం కర్ణాటకలోని ఒక విశ్వవిద్యాలయానికి అప్లికేషన్ పంపుకునే పనిలో ఉంది. అప్లికేషన్‌లో వాళ్లు అడిగిన వివరాలు ఎలా ఉండాలి అన్న అనుమానాన్ని నాతో మాట్లాడి తీర్చుకోవాలని పాప అనుకుంటున్నది. కానీ తనకు భయం. కనుక ముందుగా వాళ్ల అమ్మను పంపింది. నేను పాపను పిలిచాను. పాత సంగతులు గుర్తు చేశాను. తాను తరువాత ఒక భాష మీద ఆధారపడి చదువు ముందుకు సాగించాలని ఎందుకు అనుకుంటున్నది, అన్న విషయం గురించి కొంత చర్చ జరిగింది. పిల్లలకు ప్రస్తుతం ఉన్న అవగాహన గురించి నాకు ఆ క్షణాన ఆశ్చర్యం కలిగింది. నాకు తెలిసిన, తోచిన సంగతులు నాలుగు చెప్పి పాపాయిని పంపించాను. తాను చాలా సంతోషించింది అన్న సంగతి నాకు ఎదురుగానే కనిపించింది. ఒకసారి వాళ్ల అమ్మ కనిపించి ఫ్రెంచ్ నేర్చుకోవడం, దాని తరువాత ఉద్యోగ అవకాశాలు మొదలైన అంశాల గురించి చర్చించింది. నాకు తెలిసిన సంగతులు చెప్పాను. అందరూ డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని సతమతమవుతున్న ఈ సమయంలో ఈ పాపాయికి ఒక భాషని నేర్చుకోవాలని ఆలోచన రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ పాపాయికి సీటు వచ్చిందని తెలిసిననాడు కలిగిన ఆనందం గొప్పది.
ఇంచుమించు అదే సమయంలో నా మనుమడు, అంటే మా అన్నయ్యగారి మనవడు ఇంటికి వచ్చాడు. అతను ఇంగ్లండ్‌లోని ఒక పెద్ద పేరుగల విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి కొరకు కృషి చేస్తున్నాడు. నా తమ్ముని కొడుకు, కోడలు ఇంజనీరింగ్ తర్వాత పరిశోధకులు అయ్యారు. అబ్బాయి పిహెచ్.డి. ముగిసింది. కోడలమ్మ పరిశోధన కొనసాగుతున్నది. ఇక నా కూతురు ఎంబీబీఎస్ తరువాత వైద్య పరిశోధన గురించి ఎం.ఎస్. చేసి ఇప్పుడు పిహెచ్.డి. ప్రారంభానికి సిద్ధంగా ఉంది. నా మనుమడు సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు చేస్తున్నాడు. తెలివిగా అందుకు విషయంగా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లోని సాగునీటి సమస్య, రైతుల కష్టాలు అన్న అంశాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం దేవరకొండలో ఉంటూ అక్కడి పల్లెలలో పరిశోధన సాగిస్తున్నాడు. ఆ అబ్బాయిని నేను పిహెచ్.డి. తరువాత ఏం చేస్తావు అని అడిగాను. యూనివర్సిటీలో పరిశోధనను కొనసాగిస్తూ ఉపాధ్యాయ వృత్తిలోకి వెళతాను అన్నాడు. ఒక్కసారిగా నా చదువు కళ్ల ముందు తిరిగింది. నేను జంతుశాస్త్రం చదివాను. తరువాత జెనిటిక్స్‌లో పిహెచ్.డి. చేశాను. ఇక్కడే ఉద్యోగం చేయాలంటే అందులో నేను చేయగలిగింది ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి. అంటే నా మనవడు గాని, అప్పట్లో నేను గాని మా వంటి వారిని మరి కొందరిని తయారుచేయడం తప్ప మరింత గొప్ప పని ఏమీ చేయలేము అని కదా అర్థం. నాకు అది నచ్చలేదు. అందుకే నేను నా దారి మార్చుకుని మరి ఎక్కడికో వెళ్లిపోయాడు. నాకు చేతనైన పద్ధతిలో మా వాడికి కూడా అటువంటి సూచనలే కొన్ని చేసి, నన్ను ఉదాహరణగా చూపించాను.
చదువులకు ఫలితం ఉద్యోగం ఒకటే కాకూడదు. అందులో రెండు పక్షాల వాళ్లకు మాత్రమే విజయం దొరుకుతుంది. ఇక మూడవ పక్షం అయిన సమాజానికి మన వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అన్న ఆలోచన అంత బలంగా రాదు. మన కృషి వల్ల, మన కొరకు జరిగిన ఖర్చు వల్ల సమాజానికి కూడా ఏదో సాయం జరగాలి. అందుకే నేను మాధ్యమాలలో చేరి, నా చేతనైన చోటికి కొన్ని మంచి పద్ధతులను, మార్గాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశాను. చేస్తున్నాను.
ఇవాళ నేను ఈ వ్యాసం రాస్తున్నాను. ఇన్ని పుస్తకాలు రాశాను అంటే సైన్స్‌తో బాటు భాషలో కూడా కొంత పట్టు సంపాదించగలిగాను కనుకనే కదా! భాష నేర్చుకున్న వాళ్లు, కేవలం తమ సంపాదన కోసమే కాకుండా, ఆ భాషలో కొంత నైపుణ్యం సంపాదించి మరేదో చేయడానికి ప్రయత్నించాలి అన్నది నా భావన. ఈ ప్రపంచానికి, కవులు, పండితులు అవసరం కూడా చాలా ఉంది. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ గారిని గురించి, సినిమా దర్శకులు రాజవౌళి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నిజంగా ఆశ్చర్యం కలిగింది. సినిమాలు కూడా ప్రజలకు ఎంతో కొంత తెలివి పంచగలుగుతాయి, అన్న దృష్టి ఎంతమందికి ఉంది?
ప్రవాహంలో పడి కొట్టుకుపోయి సమాజం నిండా ఇంజనీర్లు తయారైతే కొంతకాలానికి వారంతా క్లర్కులుగా కూడా పని చేయవలసి ఉంటుంది. క్లర్కుల అవసరం లేదని నేను అనడం లేదు. క్లర్కుగా పని చేయడానికి ఇంజనీరింగ్ అవసరం లేదు అంటున్నాను. అందుకు అవసరమైన చదువు వేరుగా ఉంది. దాన్ని చదువుకుంటే చాలు అంటున్నాను. తెలివిగా అడుగు ముందుకు వేయమని అభ్యర్థిస్తున్నాను.

-కె.బి.గోపాలం