లోకాభిరామం

అలుకు పూతలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు ఎన్నడూ లేనంతగా బాధ పెట్టినయి ఈసారి. ఎండలు ఎన్నడూ లేనంతగా ఉన్నవి అని నేను అనడం లేదు. హైదరాబాద్ నగరంలో 44 డిగ్రీల ఎండలు రావడం నాకు గుర్తుంది. ఐదవ అంతస్తు పైన ఆకాశం కింద, చాప పరచుకొని పండుకోవడం మనసులో తాజాగా ఉంది. తెల్లవారుజామున చలి పెట్టి దుప్పటి కప్పుకొన వలసిన అవసరం వచ్చేది. గాలి మరీ ఎక్కువగా ఉండటంతో పైన పడుకోవడం అంత సుఖంగా లేకుండా మారింది. నిజానికి నాన్న ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి రానే లేదు. అంతకు ముందు ఉన్న మూడవ అంతస్తు ఇంటికి వచ్చాడు. ఇంట్లో నాకు ఉక్కిరిబిక్కిరిగా ఉన్నది, కింద పడుకుంటాను అన్నాడు. అది కుదరదు అని ఆయనకు నచ్చజెప్పడానికి నాకు తల ప్రాణం తోకకు వచ్చింది. జన్మలో ఎప్పుడన్న ఇట్ల మనము తలుపులన్నీ మూసుకొని పండుకున్నమా? చెప్పు, అని ఆయన నన్ను ప్రశ్నించడం నాకు మెదడులో ఇంకా పైపొరలలోనే గుర్తున్నది.
అది మూడవ అంతస్తులో ఇల్లు. అక్కడికి నాన్నను లిఫ్టులో ఎక్కించి తీసుకు వచ్చినరు. మా గోపయ్య ఇంటికి పోయేటందుకు తొట్లెలో ఎక్కించి తీసుక పోయినరు, అన్నడు నాన్న. ఆయనకు మరి దేశం తిరిగిన అనుభవం ఉంది కానీ, లిఫ్ట్ ఎక్కిన అనుభవం ఉన్నట్లు లేదు. ఇక ఇంట్లో రెండు బాత్రూమ్‌లు ఉన్నవి. మూడవది కూడ ఉండేది. దాన్ని నేను ముందు స్టోర్ రూమ్‌గా, తరువాత దేవుని గదిగా మార్చిన కనుక రెండే బాత్‌రూమ్‌లు మిగిలినవి. వాటిలో పాలరాతి నేల ఉన్నది. అంతకన్నా మించి స్నానానికి షవర్‌లు ఉన్నయి. నాన్నను అవి చాలా ఆకర్షించినయి. పెరుమాండ్లకు నిత్య పూజా కార్యక్రమంలో భాగంగా స్నానాసనం ఉంటుంది. సాలగ్రామాలను చిల్లుల పళ్లెంలో పెట్టి, గౌరవంగా తీర్థం ఉంచుతూ స్నానం చేయిస్తారు. ఇక విగ్రహాలకు అభిషేకం అనే స్నానం చేయించిన తరువాత, నీళ్లు గుమ్మరించుకుండా ఒక చిల్లుల పళ్లెం పట్టుకుని, అందులో నెమ్మదిగా పోసే నీరు విగ్రహాల మీద ఒక పద్ధతిగా, సన్నని ధారలుగా పడేటట్లు స్నానం చేయిస్తారు. ఆ కార్యక్రమానికి, చిల్లుల పళ్లానికి శత ధార, లేదా సహస్రధార అని పేరు. షవర్ చూచిన తరువాత నాన్నకు వెంటనే ఈ తతంగం గుర్తుకు వచ్చినట్టు ఉన్నది. గోపయ్య ఇంట్లో స్నానానికి సహస్రధార ఉంది, అని అందరికీ చెప్పి మురిసిపోయినడు.
ఇప్పటి ఇంటికి వచ్చి ఉంటే ఇంకా ఆయన ఏమి అనేవాడు నాకు అర్థం కాలేదు. పాత ఇంట్లో గోడలకు లప్పం లేదు. అవి ఇంకా కొంచెం పాత పద్ధతిలోనే మొరటుగానే ఉన్నాయి. లప్పం గోడలు నాకు కూడ కొత్తగనే కనిపించినయి. పిల్లలకు మరింత నచ్చినయి. ముందు కొన్ని దినాల పాటు అందరిని గోడలు ముట్టుకోవద్దని వాండ్లు వారించడము వచ్చిన వాండ్లకు చిత్రంగ తోచింది కూడా. అక్కడి నేల మొత్తం పాలరాయి కాదు. అదేదో మొజాయిక్ పద్ధతి ఉంది. ఆ మధ్యన ఇంటిని రినొవేట్ చేసినప్పుడు అంటే మెరుగు పరిచినప్పుడు ఖరీదయిన టైల్స్ వేయించినము. ఇక్కడ ఇల్లంతా పాలరాయి ఉన్నది. ఈ రాతిని పాలరాయి అని ఎవరు అన్నారో నాకు తెలియదు గానీ, ఇందులో పాల లక్షణం ఎక్కడా కనిపించదు. కొంతపాటి తెలుపు కనిపిస్తుంది కనుక అట్ల అంటరేమో నాకు తెలియదు. వీళ్లను చూస్తే నాన్న ఏమి అనేవాడు అని నేను ఆలోచిస్తూ ఉంటాను.
చిన్ననాటి మా ఇంట్లో పాత ఇంట్లో అయితే మట్టి నేల ఉండేది. అది ఎవరో మేస్ర్తిలు వేసిన నేల కూడా కాదు. ఎప్పటికప్పుడు పాడైపోతుంది కనుక దాన్ని ఎప్పటికప్పుడు మేమే బాగు చేసుకుంటాము. మట్టి నేల వేయాలంటే ఏదో ఒక మట్టి పనికి రాదు. పుట్ట మన్ను తేవాలి. పుట్ట అనగానే అందరికీ పాము గుర్తుకు వస్తుంది. కానీ ఆ పాము పుట్టను కట్టలేదు. దానికి ఆ విద్య చేతకాదు. నిజం ప్రపంచంలో లాగే బడుగు జీవులు అయిన చీమలు ఆ పుట్టలను కడతాయి. అందులోకి దాష్టీకంగా పాములు చేరుకుంటాయి. మానవుల ప్రవృత్తికి ప్రకృతిలోనే ఉదాహరణలు ఉన్నాయి అనడానికి ఇది మంచి సూచన. చీమలు చిన్న జీవులు. అవి గడ్డలను, పెడ్డలను తీసుకురాలేవు. కష్టపడి అసలు సిసలైన మట్టి కణాలను మాత్రమే అవి పోగేసుకుంటాయి. అందులో ఇసుక, రాళ్లు మొదలైన వాటికి చోటు లేదు. నిర్మాణం కార్యక్రమంలో భాగంగా చీమలు తమ శరీరంలో నుంచి కొన్ని స్రావాలను వెలికి తెచ్చి మట్టిలో కలుపుతాయి. మొత్తానికి ఆ మట్టికి ఒక జిగి అంటే అంటుకునే లక్షణం ఏర్పడుతుంది. కనుకనే ఇంట్లో నేలకు ఆ మట్టి బాగా పనికి వస్తుంది. అది ఎంతో నాణ్యమైన మట్టి. పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి, అన్న పాట ఎవరికన్న గుర్తు ఉందేమో ఆలోచించండి. అటువంటి మట్టిని తెచ్చి పొక్కిలి పోయిన చోట, అంటే నేలలో గుంతలు పడిన చోట చక్కగా పూయాలి. దాన్ని చేమన్ను పద్ధతి అంటరు. ఓపిక ఉంటే ఎక్కువ భాగాలను ఆ రకంగా కొత్త మట్టితో నింపాలి. ఆ తరువాత అది ఆరే లోపలనే బింగ రాయితో నునుపు వచ్చేటట్లు చేతనైనంతగా రుద్దాలి. బింగరాయి అంటే ప్రవాహం లేదా మరేదో కారణంగా నునుపు తేలిన రాయి అని ఎవరికైనా గుర్తుందా? ఇంటి నేలను మనమే వేసుకుంటము అంటే పిల్లలు నవ్వుతరేమో.
నాకు శాఖా చంక్రమణం బాగా అలవాటు. ఒక విషయంతో మొదలుపెట్టి, తెలుసును కదా అని మరేదో విషయం చెప్పడం. అందులో నాకు కొంత సుఖం ఉంటుందేమో కానీ, కొంతసేపటికి అయినా అసలు కథకు తిరిగి వస్తే ఎత్తుకున్న అంశానికి న్యాయం జరుగుతుంది. మట్టి నేల ఇంట్లో వారానికి కనీసం రెండుసార్లు అందరూ పేడ అనే పెండతో అలక వలసిన అవసరం వస్తుంది. ఈ పని కొన్ని పరిస్థితులలో నేను కూడా చేసిన అంటే ఎవరన్న నమ్మగలరా? ఇంటిని చక్కగా నిర్వహించాలంటే ఇటువంటి పనులు అన్నీ వచ్చి ఉండాలి. ఇల్లు అలకడం అంటే ముందు పెండ కలిపిన నీళ్లను ఇల్లంతా చక్కగా పూయాలి. అది కొంత ఆరిన తరువాత పొడిబట్ట పెట్టి ఇల్లంతా మళ్లీ తుడవాలి. అప్పుడు పెండలోని గడ్డి మొదలైన భాగాలు పొడిగా వచ్చి చేరుకుంటాయి. వాటిని ఊడ్చి తీసేయాలి. ఇల్లు అలికినంత మాత్రాన సరిపోదు. ముగ్గులు వేయాలి. ముగ్గు ఒక రంగు అయితే సరిపోదు. మిగతా రంగులు కూడా చేర్చాలి. పాలరాతి ఇంట్లో పనిమనిషి పొద్దునే్న తడిగుడ్డ పెట్టి తుడిచిపోతుంది తప్ప ఇటువంటి అలంకారాలు, ఆర్భాటాలు ఏమీ లేవు. పాలరాతిలోని రకరకాల గీతలు, డిజైన్లు ఉంటాయి. నేను వాటిలో తెలిసిన ఆకారాల కొరకు, మనుషుల ముఖాల కొరకు వెతుకుతూ ఉంటాను.
పల్లెలో పాత ఇంటి గోడలు కూడ మట్టివే. అలికి పూసిన చోట గువ్వ గుడ్డు పెట్టింది అని ఒక మాట ఉన్నది. ఇప్పటి వరకు నేలతోటి పడిన బాధ అలుకుడు. ఇక అదే తంతు గోడలతోటి జరిగితే అది పూసుడు. ఇల్లంత అలికి శుభ్రము చేసి ముగ్గులు వేసిన తరువాత అక్కడ గువ్వ గుడ్డు పెట్టింది అంటే గూడు కూడ కట్టింది అని అర్థం కదా! చేసిన కష్టము పాడయింది అని ఆ మాటకు సారాంశము. ఇంక గోడల సంగతికి వస్తే పూత అని ఒక కార్యక్రమం. సామాన్యంగా ఇది దసరా, దీపావళి ముందు జరుగుతుంది. వాన కాలం ముగుస్తుంది. ఆ తాకిడికి గోడలు కొంత పాడవుతయి. కనుక వాటిని పుట్టమన్ను తోటి బాగ చేసి, మంటితో మరింత ఎర్రమన్ను కలిపి, అందుట్లో కొంత పెండ కూడా కలిపి ఒక మిశ్రమం తయారుచేయాలి. అందులో ఈ కలిపిన మిశ్రమాన్ని ఒకటి రెండు రోజులు మగ్గనివ్వాలి. అంతకు ముందు మనుషులు దాంట్లోకి దిగి కాళ్లతోటి కసపిసా తొక్కాలి. చివరకు మంచి జిగి గల ఒక పూత పదార్థం తయారవుతుంది. జిగి అంటే అతుక్కునే లక్షణం అని ఇది వరకే చెప్పినట్లు ఉన్న. మిద్దె మీద ఎక్కి గోడ పొడుత ఈ పూతను పోస్తుంటే నిచ్చెన వేసుకున్న మనుషులు దాన్ని గోడ మీద చక్కగ పులుముతరు. మొత్తం అయిన తరువాత, నేల మీద ముగ్గులు పెట్టినట్లే, గోడ మీద సున్నం, జాజు పట్టెలు పోస్తరు. నామాల వాండ్లము కనుక ఇంటిని చూడంగనే ఇంట్లో ఉండే వారి సంగతి తెలుస్తుంది. ఇంటికి ఇంత అలంకారము అవసరమని ఎవరికైనా ఇప్పుడు చెప్పగలిగేమా?
పల్లెలో పాత ఇల్లు పోయి, కొత్త ఇల్లు వచ్చే సమయానికి నేను అక్కడ ఉండే అవకాశం లేకపోయింది. కనుక ఆ ఇంటి నిర్మాణం మీద నాకు అవగాహన తక్కువగా ఉంది. అంతకు ముందు పాలమూరులో అన్నగారు ఇల్లు కట్టినప్పుడు ఉన్నాను. డంగు సున్నం, పలాస్ర్తి లాంటివి వాడడం చూచాను. తరువాత సిమెంటు వాడకం కూడా చూచాను. నావి కాకున్నా మరొక నలుగురు ఇల్లు కట్టుకోవడం చూశాను. పద్మారావునగర్‌లోని పాత ఇల్లు అంటున్న తోట్లె, సహస్రధార గల ఇల్లు నిర్మాణం సమయంలో చూడడం కుదరలేదు. ఇప్పుడు ఉంటున్న ఇంటిని మాత్రం అడుగడుగున పక్కన ఉండి పని చేయిస్తున్న భావంతో, ప్రతి నిత్యం నిర్మాణాన్ని చూచాను. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చిన్నతనంలో ఒక మాట విన్నట్టు గుర్తు ఉంది. అంటే ఈ పనులు అలవిమాలిన తెలివి అవసరమైనవి, కష్టపెడతాయి అని భావం కావచ్చు. నాకు రెండు అనుభవాలు ఉన్నాయి. నిజానికి రెండు కూడా నన్ను కష్టపెట్టలేదు. ఇల్లు కడుతుంటే, అందులో ఒక్కొక్క అంచె ముగుస్తుంటే చెప్పలేని ఆనందం కలిగింది. పెళ్లిలో అంతకన్నా ఆనందం కలిగింది. పెళ్లి చేసినప్పుడు కూడా చాలా పొరపాట్లు జరుగుతాయి. ఒకసారి పెళ్లి చేయవలసి వస్తే, ఎక్కువమంది పిల్లలు ఉండి ఆ అదృష్టం కలిగితే, ఈసారి ఆ మొదటిసారి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. నాకు ఉండేది ఒక్కడే అబ్బాయి. వాడి పెళ్లి జరిగింది. నేను మళ్లీ ఎవరికి పెళ్లి చేయాలి? ఒకటి కాదు రెండు ఇళ్లు ఉన్నాయి. ఇంకా నేను మళ్లీ ఇల్లు ఎందుకు కట్టాలి? ఇల్లు కట్టాను. పెళ్లి చేశాను. అనుభవం వచ్చింది. ఎన్నో సంగతులు తెలిశాయి. నా చాదస్తం మీ ముందు వెళ్లబోసుకున్నాను. మీకు ఎవరికి ఈ సంగతులు తెలియవని కాదు. తెలిసిన సంగతులు కల పోసుకోవడానికి కదా లోకాభిరామం ఉన్నది. కనుక నాకు తోచింది చెప్పాను. అవును అనిపిస్తే తల ఆడించండి. కాదనిపిస్తే అడ్డంగా ఆడించండి. నేను చూడ రాలేను కాబట్టి, మీ రియాక్షన్ నాకు తెలియదు. తెలిస్తే చాలా బాగుంటుంది.

-కె.బి.గోపాలం