లోకాభిరామం

మరోసారి నాగపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగడిలో ఒక సరుకు కొంటారు. కొంతకాలం తరువాత అదే అంగడికి వచ్చి అదే సరుకు అడిగారు అంటే, ఆ సరుకు నచ్చిందని కదా అర్థం! నాగపూర్‌లో శివాజీ కాలేజ్ వాళ్లు నన్ను మళ్లీ ఉపన్యాసానికి పిలిచారు. ఈసారి కూడా అదే అంశం గురించి మాట్లాడమన్నారు. నాకు ఒక్క క్షణం నిరాశ కలిగినట్టుంది. కానీ, శ్రోతలు, సభికులు మారతారు గదా, అని నన్ను నేను ఊరడించుకుని ఉపన్యాసానికి సిద్ధం అయ్యాను. మామూలుగా పాత ప్రెజెంటేషన్‌నే వెంటబెట్టుకుపోయి, పాత మాటలే చెప్పడం, ఇలాంటి సమావేశాలలో జరుగుతూ ఉంటుంది. నాకొక సిద్ధాంతం ఉంది. వినేవాళ్లు కొత్తవాళ్లయినా పాత పాట పాడుతుంటే, ముందు నాకు అసౌకర్యంగా ఉంటుంది. కనుక ‘సైన్స్ ఎందుకు?’ అనే పాత అంశం గురించి కొత్త ప్రెజెంటేషన్ తయారుచేసుకున్నాను. ఈ విషయం గురించి ఇంత కాలంలో ఎంత చదివాను? ఎంత ఆలోచించాను? వీటన్నిటినీ పక్కనబెట్టి పాత మాటలు ఎలా ఒప్పజెప్పగలను? వ్యాపార నిర్వహణలో, ఒక మాట చెబుతారు. నీకు నీవే మొట్టమొదటి కస్టమర్ అంటారు. సరుకు నీకే చప్పగా ఉంటే, ఎక్సయిట్ చేసేదిగా లేకుంటే, మిగతా వారికి ఏం నచ్చేను?
ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర గురించి తెలియని వారుంటే తెలుసుకొమ్మని మనవి. ప్రయాణాలను, ఆ సందర్భంగా ఎదురయ్యే అనుభవాలను వివరించే రచనలను యాత్రా చరిత్ర, ట్రావెలాగ్ అంటారు. నిజంగా ఏనుగు మీద బయలుదేరిన వీరాస్వామయ్య ప్రయాణంలో ఎన్నో విశేషాలు. అది చాలా సాగింది అని విడిగా చెప్పనవసరం లేదు. నాకు ఏనుగు లేదు. రైలుంది. విమానం కూడా ఉంది గానీ, అది గోల. నేరుగా నాగపూర్ వెళ్లదు. సమావేశం ప్రారంభ సభ తరువాత, మొదటి టాక్ నాదేనన్నారు. మరీ బాగుంది. ఏ మధ్యాహ్నమో ఉంటే, ఆనాటి ఉదయాన చేరేట్టు పోయి, రాత్రి బయలుదేరి మరుసటి నాటికి ఇల్లు చేరవచ్చు. మెట్లు కూడా దిగకుండా ఇంట్లో ఉంటున్నానేమో ‘ఆచ్చి’ పోవాలంటే ఆసక్తిగా ఉంది. పగటి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. రాజధాని అని ఒక రైలు. అందులో పొద్దునే్న ఎక్కితే, సాయంత్రానికి నాగ్‌పూర్ చేరుకుంటాం. కానీ చెప్పొద్దూ? ఈసారి పగటి ప్రయాణం బోర్ కొట్టింది. ఎవరూ మాట్లాడడంలేదు. ఆ రయిల్లో ఆశ్చర్యంగా తిండి బాగుంటుంది. తినడం, ఏదో చదువుతూ, లేక దిక్కులు చూస్తూ కూచోవడం. పక్కన ఒక యువకుడు ఉన్నాడు. అతను అదే పనిగా లాప్‌టాప్‌లో ఏదో పని చేస్తున్నాడు. అతని ముందు ఒక అమ్మగారున్నారు. వాళ్ల అమ్మగారు కారు. మరెవరో, ఆమె కూడా నాగ్‌పూర్‌లో దిగడానికి సిద్ధమవుతున్నారు. ఆ కుర్రవాడు, అప్పుడు ఆమెతో మాట్లాడి, సాయం చేస్తాను అన్నాడు. నేను ఏదో అన్నాను. అతను నన్ను ‘మీరు డాక్టరా?’ అని అడిగాడు. ‘కాదు. జెనెటిక్స్‌లో డాక్టరేట్’ అన్నాను. ‘అమ్మో. అది చాలా కష్టం’ అన్నాడతను. ‘్భమిని తవ్వి కదిలించడం కంటేనా?’ అన్నాను నేను. అందరూ బిత్తరపోయారు. అతను మాత్రం గట్టిగా నవ్వి ‘మీరు చాలా తెలివి గలవారు’ లాంటిదేదో అన్నాడు. ఆ అబ్బాయి వద్ద ఒక బ్యాగ్ ఉంది. దాని మీద బి.ఇ. ఎం.ఎల్ అనే అక్షరాలున్నాయి. ఆ కంపెనీ అర్త్ మూవింగ్ చేస్తుంది. డ్యాంలు, భవనాలు కట్టేచోట మట్టితోడే యంత్రాలను తయారుచేస్తుంది. దాన్ని నేను గమనించాను. డిటెక్టివ్ సాహిత్యం వల్ల నాకు అలవడిన లక్షణాలలో ఈ పరిశీలన ముఖ్యమయినది.
నన్ను స్టేషన్‌లో స్వాగతించడానికి ముగ్గురు వచ్చారు. ఎంతో గొప్ప ఆనందం కలిగింది. వాళ్లలో ఒకరిద్దరి పేర్లు నాకు గుర్తున్నాయి. డేల్ కార్నిగీ చెప్పిన సూత్రాలలో పేర్లు గుర్తుంచుకోవడం ఒకటి. పేరు పెట్టి, ఇంతకాలం తరువాతయినా పలకరించేసరికి వారు కరిగి, నీరయిపోయారు. ఇక ఆనందం అన్ని పక్కలా ప్రవహించింది. మరి కొంతమంది గురించి అడిగాను. అందరినీ రేపు కలుద్దాం అన్నారు. ఆ రాత్రికి నన్ను ఒక గెస్ట్‌హౌస్‌లో దించారు. అది హోటేల్‌లాగ లేదు. కుటుంబాలు కాపురం ఉండే, పోష్ అపార్ట్‌మెంట్స్‌లో, ఒకటి రెండు అంతస్తుల్లో వ్యాపించి ఉంది. అక్కడ ఎదురయిన ఆదరణ అసాధారణంగా తోచింది. పాన్ (తాంబూలం) దొరుకుతుందా, దగ్గర్లో అని అడిగాను. ఎంతో దూరం పంపించి, నేను అడిగిన పాన్‌లు తెప్పించి పెట్టాడు ఆ మేనేజర్! అతనితో కొంతసేపు కబుర్లు పెట్టాను. ఆ రాత్రి అక్కడ తిన్న పరోఠా, కూరలను చాలాకాలం దాకా మరువలేను. మన వాళ్లకు రొట్టెలు తయారుచేయడం ఇంత బాగగా ఎందుకు రాదు? అనిపించింది.
పొద్దునే్న కాలేజీకి వెళ్లాము. అది చాలా పేరున్న కాలేజ్. చాలా చరిత్రగల కాలేజ్. నగరంలోని పెద్దలందరూ ఎంతో గౌరవంగా అక్కడి కార్యక్రమాలకు వస్తారు. వాళ్లంతా నిజంగా వీఐపీలు. నేను వాళ్లకు వెరీ ఇంటరెస్టింగ్ పర్సన్‌గా దొరికిన భావం నాకు మిగిలించారు. ప్రారంభ సభలో వక్తలు అందరూ నా పేరు ప్రస్తావించారు. పడిన కష్టం ఊరికే పోలేదు, అనిపించింది. అక్కడి వాళ్లందరూ కొంచెం పాత సంప్రదాయం మనుషులని నాకు ఎందుకో అనిపించింది.
ఈ మధ్యన అందరూ డాక్టర్లు, ఇంజనియర్లు అయిపోవాలని తంటాలు పడుతున్నారు. మరి ‘అందరూ సైన్స్‌ను వాడుకునే వారే అయితే, కొత్త సైన్స్ ఎక్కడి నుంచి రావాలి?’ అనే ధీమాతో నేను ఉపన్యసించాను. ప్రపంచం అవసరాలను తీర్చడానికి కొత్త టెక్నాలజీ కావాలి. మరి అందుకు, కొత్త సైన్స్ కావాలి, అన్నాను. అందరికీ ఆ మాట నచ్చింది. టెక్నాలజీలో సంతృప్తి ఉంది. సైన్స్‌లో ఆనందం ఉంది అన్నాను. అందరూ నావేపు ప్రశ్నార్థకంగా చూచినట్టు తోచింది. నాకు చటుక్కున ఒక్కసారిగా మన తైత్తిరీయోపనిషత్తు జ్ఞాపకం వచ్చింది. నిజం గా అర్థం తెలుసుకుంటే, వేదం, ఉపనిషత్తులు ఛాదస్తం కానే కాదు. తైత్తిరీయం, విద్యకు సంబంధించిన విషయాలను చర్చిస్తుంది. శీక్షావల్లిలో ఆ సంగతులే ఉంటాయి. ఆ తరువాత భృగువల్లి, ఆనందవల్లి వస్తాయి. భృగువు అనే విద్యార్థి, తండ్రి వరుణుని వద్దకు వెళతాడు. పరబ్రహ్మం అంటే ఏమిటి? అని అడుగుతాడు. హార్వర్డ్ వారు చెబుతున్న ఎ,బి,సి మనుషుల పద్ధతిలో ఆ తండ్రి, ‘తెలివి గలవాడవు, ఆలోచించి తెలుసుకోరాదా?’ అంటాడు. అంతంత తెలిసిన వారికి మార్గం చెప్పాలి. మరీ మెతకవారికి వివరం చెప్పాలని పద్ధతి. భృగువు తదేకంగా ధ్యానం చేశాడు. అతనికి అన్నమే పరబ్రహ్మము అని తోచింది. ‘ఇంకా ఆలోచించు’ అంటాడు గురువయిన తండ్రి. తరువాత ప్రాణం బ్రహ్మము అంటాడు కొడుకు. మళ్లీ అదే సలహా. కొడుకును ‘సతపో తప్యత’ అంటాడు. ఆ కొడుకు ఆలోచించి ‘మనస్సు’ అంటాడు. మరోసారి వచ్చి ‘విజ్ఞానం’ బ్రహ్మము అంటాడు. తండ్రి మళ్లీ ‘పతపో తప్యత’ అంటాడు. తెలిసి ఉండడం ఒకటి బ్రహ్మం కాదట. విజ్ఞానం అంటే సైన్స్ ఒకటే కాదు. ఏ సంగతినయినా సరిగా అర్థం చేసుకోవడం. ఈసారి భృగువు మరింత తపించి, ‘ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్’ అంటాడు. తెలుసుకోవడంలో గల ఆనందము బ్రహ్మము, అంటాడతను. తండ్రి, ఇది బాగుంది అంటాడు. ఇది భృగువల్లి. ఈ సంగతులను చెప్పి, సైన్స్‌లో అటువంటి ఆనందం ఉంది అన్నాను. కాదనగలరా? ఆలోచనలో నుంచి ఒక విషయం కనపడుతుంది. ప్రయోగంలో అది నిగ్గు తేలుతుంది. ‘యురేకా’ క్షణం పుడుతుంది.
నాగపూర్‌లో శివస్వరూప్ గారు అని ఒక మిత్రులు. ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన ఆనాటి కార్యక్రమానికి వచ్చారు. నేను ఆ సాయంత్రం బయలుదేరి వచ్చేశాను. మరునాటి ఉదయం, ఇల్లు చేరిన తరువాత చూస్తే వాట్సాప్‌లో స్వరూప్‌గారి సందేశం. నాగపూర్‌లోని వార్తా పత్రికలలో నా ఫొటోతో సహా, నా ఉపన్యాసం గురించి రాసిన విశేషాలు ఆయన పంపించారు. నా వంటి వానికి అంతకంటే ఆనందం ఉంటుందా? అక్కడ నాకు పూలగుత్తి బదులు, ఒక కుండీ ఇచ్చారు. అందులోని మొక్క అందంగా పూలతో కళకళలాడుతున్నది. దాన్ని జాగ్రత్తగా వెంట తెచ్చుకున్నాను. మొక్కకు కూడా ఆనందం కలిగినట్లుంది. అది నా ఇంట్లో విరగబూసింది. పూస్తున్నది!
శివాజీ కాలేజ్ వారి ఆదరణ, వారు పెట్టే భోజనం గురించి మరోసారి వీలు చూచి మరింత వివరంగా చెప్పాలని ఉంది. అక్కడి నుంచి తెచ్చుకున్న పుస్తకాల గురించి కూడా చెప్పాలి!
*

కె. బి. గోపాలం