క్రీడాభూమి

మరో లోస్కోరింగ్ మ్యాచ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు
నాగపూర్, నవంబర్ 24: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు కూడా లోస్కోరింగ్ మ్యాచ్‌గానే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాంతాలోని విదర్భ క్రికెట్ సంఘం (విసిఎ) స్టేడియంలో పిచ్ పొడిగా కనిపిస్తున్నది. ఇలాంటి పిచ్‌లు స్పిన్‌కు బాగా అనుకూలిస్తాయి. అదే జరిగితే, మొహాలీలోని జరిగిన మొదటి టెస్టు మాదిరిగానే మరోసారి లోస్కోరింగ్ మ్యాచ్ తప్పదు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టును భారత్ గెల్చుకోగా, బెంగళూరులో రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఒక రోజు ఆట మాత్రమే సాధ్యంకాగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 80 పరుగులు చేసింది. ఆతర్వాత వరుసగా నాలుగు రోజుల ఆట వర్షార్పణంకాగా, మ్యాచ్ డ్రా అయింది. మొహాలీ, బెంగళూరు పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించడంతో భారత్ ఆ రెండు టెస్టుల్లోనూ చెలరేగిపోయింది. దక్షిణాఫ్రికాను మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 184, రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ చేసింది. రెండో టెస్టులో సఫారీలు 200 పరుగుల మైలురాయిని అధిగమించగలిగినా, భారీ స్కోరు నమోదు చేయడంలో విఫలమయ్యారు. భారత బౌలింగ్‌లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారన్నది వాస్తవం.
బ్యాటింగ్ సంతృప్తికరం
టీమిండియా బ్యాటింగ్ గొప్పగా లేకపోయినా సంతృప్తికరంగా ఉందని చెప్పవచ్చు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 201, రెండో ఇన్నింగ్స్‌లో 200 చొప్పున పరుగులు చేసిన భారత్ రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లు ఆడి, వికెట్ నష్టం లేకుండా 80 పరుగులు చేసింది. తొలి టెస్టులోని రెండో ఇన్నింగ్స్‌లో 75, 47 చొప్పున పరుగులు చేసిన మురళీ విజయ్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా, మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ సున్నాకే అవుటై, అభిమానులను ఆందోళనకు గురి చేసిన శిఖర్ ధావన్ రెండో టెస్టులో అజేయంగా 45 పరుగులు చేసి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు నిరూపించుకున్నాడు. చటేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి స్టార్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నది. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో అతని స్థానంలో వికెట్‌కీపర్‌గా ఎంపికైన వృద్ధిమాన్ సాహా ఇంకా బ్యాట్స్‌మన్‌గా తనను తాను నిరూపించుకోలేదు. అతను కూడా ఫామ్‌లోకి వస్తే టీమిండియా బ్యాటింగ్ మరింత బలపడుతుంది. కాగా, తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో చూడాలి.
దక్షిణాఫ్రికాపై ఒత్తిడి
మొదటి టెస్టును చేజార్చుకొని, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉన్న దక్షిణాఫ్రికాపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. గత తొమ్మిదేళ్ల కాలంలో దక్షిణాఫ్రికా విదేశాల్లో ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. పైగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. భారత్ చేతిలో మొదటి టెస్టును కోల్పోవడంతో, ఈ ఆధిపత్యానికి గండిపడే ప్రమాదం ఎదురైంది. ఫలితంగా సఫారీలు తప్పక విజయాన్ని సాధించాల్సిన స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ టెస్టును చేజార్చుకుంటే సిరీస్‌ను కోల్పోతుంది. ఒకవేళ డ్రా చేసుకుంటే, చివరి టెస్టును తప్పక గెలవాల్సిన పరిస్థితి. కెప్టెన్ హషీం ఆమ్లా ఫామ్‌లో లేడు. ఎబి డివిలియర్స్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండగా, ఫఫ్ డు ప్లెసిస్, డీన్ ఎల్గార్ నిలకడలేని ఆటతో నిరాశ పరుస్తున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే వెర్నన్ ఫిలాండర్ ఇప్పటికే గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. డేల్ స్టెయిన్ ఫిట్నెస్ కూడా అనుమానంగానే ఉంది. దీనితో బౌలింగ్ బాధ్యతను పేసర్ మోర్న్ మోర్కెల్, స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ స్వీకరించాల్సి వస్తుంది. మొత్తం మీద, స్థూలంగా చూస్తే దక్షిణాఫ్రికా కంటే టీమిండియా కొంత మెరుగ్గా ఉంది. అయితే, ఆమ్లా ఫామ్‌లోకి వచ్చి నా, స్టెయిన్ ఫిట్నెస్ సమస్య నుంచి కోలుకున్నా భారత్‌కు సవాళ్లు తప్పకపోవచ్చు. (చిత్రం) ఫిజియోథెరపిస్టు పాయ్రటిక్ ఫర్హత్‌తో కలిసి మంగళవారం నెట్ ప్రాక్టీస్‌కు హాజరవుతున్న భారత ఓపెనర్ మురళీ విజయ్
===మ్యాచ్ బుధవారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. ==