మెయన్ ఫీచర్

సమర్థనేత సుష్మా స్వరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని విజయపథంవైపు నడిపించిన నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో రాజకీయ, పరిపాలన అనుభవంతో పార్టీలో అందరికన్నా సీనియర్ అయిన సుష్మాస్వరాజ్‌కు మంత్రివర్గంలో అసలు స్థానం లభిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రివర్గ కూర్పు గురించి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అరుణ్‌జైట్లీతో సమాలోచనలు జరిపిన ప్రధానమంత్రి ఆమెను అసలు సంప్రదించలేదు. నరేంద్రమోదీతో ఆమెకు సాన్నిహిత్యం లేకపోవటమే కాదు, దూరం కూడా ఎక్కువగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. అయితే క్రిస్‌మస్ పర్వదినంనాడు మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా, దౌత్యవర్గాలకు సైతం విస్మయం కలిగించే విధంగా నరేంద్రమోదీ అకస్మాత్తుగా లాహోర్‌లో దిగడం, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌ను కలవడం జరిగింది. దౌత్యపరంగా ఇదొక్క పెద్ద ‘తిరుగుబాటు’ (కూప్) అని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతోపాటు, ఆయన మనుమరాలు వివాహంలో కూడా పాల్గొన్నారు. అత్యంత నాటకీయంగా జరిగినా ఈ సాహసోపేత చర్యతో రెండు పొరుగు దేశాలమధ్య సంబంధాలలో అనూహ్యంగా పెద్ద ముందడుగు వేసినట్లు అయింది.
దేశంలో అంతర్జాతీయంగా ఈ సాహసోపేత చర్యకు పూనుకున్న మోదీ ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ చారిత్రాత్మక ముందడుగుకు అసలు సూత్రధారి సుష్మాస్వరాజ్. కానీ ఆమె తన గొప్పతనం చాటుకొనే ప్రయత్నం చేయలేదు. మోదీ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడి వలే వ్యవహరించారని ఆమె కొనియాడారు. రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు ఇదే విధంగా ఉండాలని కూడా చెప్పారు. విదేశాంగశాఖ మంత్రిగా తనకు అప్పగించిన బాధ్యతలను అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఆమె పనితీరు చూసి మోదీ ముగ్ధులయ్యారు. అందుకనే ఆమెను విశ్వాసంలోకి తీసుకోవడం ప్రారంభించారు. నేడు ఆయన మంత్రివర్గ సభ్యులు అందరిలోకెల్లా సమర్ధవంతంగా విజయవంతంగా పనిచేస్తున్న మంత్రి ఎవరంటే ఆమె పేరు తప్ప మరొకరికి పేరు ప్రస్తావించడానికి ఆస్కారం లేదు.
మొదట్లో మోదీతో సంబంధాలు ఆమెకు సవ్యంగా లేకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. 2002లో గుజరాత్ అల్లర్ల సందర్భంగా ముఖ్యమంత్రి పదవికి ‘రాజధర్మ’ పాటించి రాజీనామా చేయాలని నాటి ప్రధానమంత్రి వాజపేయి కోరినప్పుడు ఆయనను సుష్మా సమర్ధించారు. 2013లో పార్టీలో అత్యధికులు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ పేరును ప్రస్తావించినప్పుడు ఆమె ఎల్.కె.అద్వానీ వెంట ఉన్నారు. దానితో మోదీతో ఆమెకు దూరం బాగా పెరిగింది.
నేడు భాజపాలో పదవులలో ఉన్న నాయకులు ఎవ్వరూ రాజకీయాలలోకి రాకముందే 1977లో 25 ఏళ్ళ వయస్సులో ఆమె హర్యానా మంత్రిగా పనిచేశారు. 1980వ దశకంనుండి వాజపేయి తర్వాత ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకొనే విధంగా ప్రసంగించగల నాయకురాలు కూడా ఆమెనే. అంతటి అనుభవం, ప్రజాదరణ ఉన్న ఆమె పార్టీలో ఎన్నడూ గ్రూపులు కట్టలేదు. నాయకుడిని నమ్ముకొని, అప్పచెప్పిన బాధ్యతను అంకితభావంతో నెరవేర్చే ప్రయత్నం చేసేవారు.
మోదీతో మంచి సంబంధంలేకపోయినా కీలకమైన విదేశీమంత్రిత్వ శాఖను ఇచ్చారు. అయితే అనుభవంతో ఆమెతో సాటిరాని రాజ్‌నాథ్‌సింఘ్‌కు రెండో స్థానం, అరుణ్‌జెట్లీకి నాలుగోస్థానం ఇవ్వగా, ఆమెకు మూడోస్థానం ఇచ్చారు. అయినా ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ప్రచారానికి పోకుండా కష్టపడి పనిచేయడం ప్రారంభించారు. మొదటి కొన్ని నెలలు అసలు కీలక అంశాలపై ఆమెను సంప్రదించేవారు కాదు. జాతీయ భద్రతాసలహాదారుడు అజయ్‌గోయల్, ప్రధానమంత్రి కలిసి వ్యవహరించేవారు. అయినా ఆమె ఏనాడూ బయటపడి ఒక్కమాట జారలేదు. ఈ హుందాతనమే నరేంద్రమోదీని మంత్రముగ్ధుడిని చేసింది.
తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కొనని అత్యంత క్లిష్ట సంక్షోభాన్ని గత జూన్, జూలైలో ఆమె ఎదుర్కొన్నారు. భర్త, కుమార్తె న్యాయవాదులుగా వ్యవహరించిన లలిత్‌మోడీకి వీసాపత్రాల మంజూరీలో ఆమె సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో ప్రధానమంత్రి ఆమెకు గట్టి మద్దతు ఇవ్వడం ఆమె ఊహించని పరిణామం. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేసినా ప్రధానమంత్రి తొణక లేదు. వీరిద్దరి మధ్య సంబంధాలు ఇంతగా మెరుగుపరచడానికి అంకితభావంతో ఆమె పనిచేయగలగడమే కారణం. తన విదేశీ పర్యటనలలో విదేశీ దౌత్యవర్గాల ద్వారా ఆమె పనితీరు గురించి తెలుసుకొని ప్రధానమంత్రి ముగ్ధులయ్యారు. అంతర్జాతీయంగా తనకు వస్తున్న కీర్తిని ఆమె తెరవెనుక చేస్తున్న కృషియే కారణం అని ఆయన గ్రహించారు. ఇక కొద్దినెలల ముందు భారత్-పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నట్లు ఎవ్వరూ ఊహించలేదు. ఈ అద్భుతం జరగడానికి నవాజ్‌షరీఫ్ కుటుంబంతో సుష్మాస్వరాజ్ సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవడం ప్రధాన కారణంకావడం గమనార్హం.
రెండుమూడు నెలలక్రితం మధ్యదరా ద్వీపదేశం మాల్టా రాజధాని వల్లెట్టాలో కామన్‌వెల్త్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్యుడుముందుగా ఉదయించే దేశాల ప్రతినిధులకు ఆ వరుసక్రమంలో సీట్లు ఏర్పాటుచేశారు. దానితో నవాజ్‌షరీఫ్, సుష్మాస్వరాజ్ ప్రక్కప్రక్కన కూర్చున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై పిచ్చాపాటిగా మాట్లాడుకొనే అవకాశం కలిగింది. ఆమె పంజాబీ, ఉర్దూలలో అనర్ఘళంగా మాట్లాడ గలగడంతో షరీఫ్ సన్నిహితంగా మాట్లాడగలిగారు. తన కుటుంబ సభ్యులను కలవడానికి ఆమెను తాను బసచేసిన చోటకు ఆహ్వానించారు. ఆయన తల్లి శమిమ్ అక్సర్, భార్య, కుమార్తె కూడా ఆయనతో వచ్చారు. అక్కడ మీడియావారు, అధికారులు, కెమెరాలు లేకుండా మనసువిప్పి మాట్లాడుకొనే అవకాశం కలిగింది. అప్పటినుండి పరిణామాల్లో చకచకా మార్పులు చోటుచేసుకున్నాయ. శమిమ్ అక్సర్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందినవారు. ఆ మరుసటి వారమే ప్యారిస్‌లో జరిగిన వాతావరణ సదస్సులో ప్రధానమంత్రులు ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. డిసెంబర్ 6న బ్యాంకాంగ్‌లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కలుసుకున్నారు. డిసెంబర్ 8, 9 తేదీలలో ఆప్ఘనిస్తాన్‌పై ఇస్లామాబాద్‌లో జరిగిన సదస్సులో పాల్గొనడానికి ఆమె వెళ్ళారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి, విదేశాంగశాఖ మంత్రి, అధికారులతో ఆమె సమాలోచనలు జరిపారు.
ఈ పర్యటనలో సుష్మాను, షరీఫ్ తన ఇంటికి ఆహ్వానించారు. వారి కుటుంబ సభ్యులతో తల్లి భార్య, కుమార్తె, మనవరాళ్ళతో నాలుగు గంటలసేపు గడిపారు. తిరిగి వస్తుండగా షరీఫ్ తల్లి భావోద్వేగంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచమని ఆమెను కోరుతూ, చేతిలో చేయి వేయించుకున్నారు. అమృత్‌సర్‌కు చెందిన తాను దేశ విభజన అనంతరం తిరిగి అక్కడకు వెళ్ళలేకపోయానని, కనీసం అక్కడినుండి వచ్చిన వారెవ్వరినీ కలువలేక పోయానని ఆమె ఆవేదనగా చెప్పారు. మొదటిసారిగా అమృత్‌సర్‌నుండి వస్తున్న సుష్మాను కలుస్తున్నానని అంటూ సౌహార్ధ హృదయంతో చెప్పారు. అంబాలాకు చెందిన సుష్మా చిన్నతనంనుండి తరచూ అమృత్‌సర్‌కు వెడుతూ ఉంటారు. గత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేసిన ఆమెను భారతదేశ పర్యటనకు వచ్చే వివిధ దేశాధిపతులు, దౌత్యవేత్తలు కలుస్తూ ఉండేవారు. దానితో వివిధ దేశాల దౌత్యబృందాలతో ఆమె తేలికగా మమేకం కాగలిగారు.
గత మే 30న మంత్రి పదవి చేపట్టిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా తన విజయ రహస్యాలను వివరిస్తూ ‘‘మీడియాకు దూరంగా ఉండటం, అప్పచెప్పిన పనిని అంకితభావంతో పనిచేయడం’’అని ఆమె పేర్కొన్నారు. ఈ అణుకువ, సమర్ధత ఆమెను నరేంద్రమోదీని ఆకట్టుకొనే విధంగా చేసింది. నితిన్ గడ్కరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకు సహాయ నిరాకరణ చేస్తుండగా ఆమె మాత్రం ఆయనకు మద్దతుఇచ్చారు. ఎప్పుడూ పార్టీ నాయకత్వానికి, నిర్ణయానికి విధేయురాలిగా ఉండటం కారణంగా ఆమె ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎదగలేకపోయారనే అభిప్రాయం ఉంది.
సాధారణంగా లోక్‌సభలో పార్టీ నాయకుడికి రాజ్యసభలో నాయకుడిని నియమించే అధికారం పార్టీ నిబంధనావళి కల్పిస్తుంది. 2009లో లోక్‌సభలో పార్టీ నాయకురాలుగా ఎన్నికైనప్పుడు ఆమె ఆ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. ఎల్.కె. అద్వానికోసం ఎన్.డి.ఎ. చైర్మన్ పదవి సృష్టించి, ఆయనకు ఆ అధికారం ఇవ్వడంతో ఆయన అరుణ్‌జెట్లీని నియమించారు. అప్పటినుండి జెట్లీ ఆమెకు పోటీ అధికార కేంద్రంగా మారారు. తన మంత్రిత్వశాఖకు సంబంధించి ఫైళ్ళను ఎప్పుడూ పెండింగ్‌లో ఉంచరు. అర్ధరాత్రి ఏ సమస్య తన దృష్టికివచ్చినా వెంటనే స్పందిస్తారు. కాంగ్రెస్, వామపక్షాలు మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కార్యదక్షత ఆమెను అత్యంత విజయవంతంగా పనిచేస్తున్న మంత్రిగా గుర్తింపు తీసుకువస్తున్నది.

- చలసాని నరేంద్ర