అక్షర

మంచితనానికి మన్నన కూర్చే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రియే చారుశీలే’
సుజలగంటి
కథా సంపుటి
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

సంగీత సాహిత్యాలు రెండు కళ్లుగా ప్రవృత్తి మార్గంలో పురోగమిస్తున్న సుప్రసిద్ధ రచయిత్రి సుజలగంటి (అనూరాధ). 2011లో రచనా వ్యాసంగం చేపట్టి 7 నవలలు, 40 కథలు రాశారు. వీటిలో మూడు నవలలు బహుమతులు పొందాయి. చాలా కథలకూ బహుమతులు వచ్చాయి. ‘ప్రియే చారుశీలే’ సుజలగారి మొదటి కథా సంపుటి. దీనిలో 30 కథలున్నాయి. రచయిత్రి చెప్పుకొన్నట్టు వీటిలో కొన్ని ఆమె దృక్కోణం నుంచీ ఆమె చూసిన జీవితాల చిత్రణ.
సంపుటిలో మొదటి కథ ‘ఒక పువ్వు పూచింది’. చిత్తశుద్ధితో నిర్మాణాత్మకంగా సామాజిక సేవని చేపట్టి ఒక చిరుదీపాన్ని వెలిగించింది ఒక స్ర్తిమూర్తి, సాధారణ గృహిణి. పూనమ్ అనే మురికివాడల పిల్లని విద్యావంతురాలిని చేసింది. కాలం గడిచింది. పూనమ్ ఎదిగి పద్మశ్రీ పొంది సన్మానం పొందుతోంది. తన రోల్‌మోడల్‌ని ప్రశంసిస్తూ పూనమ్ ఆమెకి పాద నమస్కారం చేసింది. తాను వెలిగించిన దీపం మరికొన్ని దీపాల్ని వెలిగిస్తూ అభ్యుదయ పథంలో సాగుతూ ఉండడం ఆనందబాష్పాలు దొరలించక ఏం చేస్తుంది! పూని ఏదైనను ఒక మంచి పని చేయమనే సందేశాన్నిచ్చిన మంచి కథ.
మంచి పనికి పూనుకుంటే వెయ్యి విఘ్నాలు, లక్ష అవరోధాలు! వాటిని అధిగమించి పరిణిత మనస్సుతో నేర్పుతో కులాంతర వివాహాన్ని సాధ్యం చేసుకుంటారు ప్రేమజంట. కథ పేరు ‘ప్రేమైక కులం’!
ఇద్దరూ ఉద్యోగాలు చేసే కొందరి తల్లిదండ్రుల మధ్య సంతానం పొందేది నిరాశే, చిన్న చిన్న కోరికల వైఫల్యమే.. ఇదే ఇతివృత్తం ‘గుండుగాడు’ వంటి కొన్ని కథానికల్లో. ‘అమ్మవీలునామా’ వంటి కొన్ని కథల్లో మారుతున్న కుటుంబ సంబంధాలు, మనుషుల మధ్య మనస్తత్వ వైరుధ్యాలు, వాటి పర్యవసానాలు చిత్రితమైనాయి. మనసులో ఇరుకుని పెంచుకోకుండా కవి గోపాలచక్రవర్తి అన్నట్టు ‘జీవితం అంతలో కరిగిపోయే మంచు, ఉన్నంతలో నలుగురికీ పంచు’ అన్న కవితా వాక్యానికి కథాత్మక సందేశం ‘ఇరుకు’ కథానిక. ఎయిడ్స్ రోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రోది చేసే కథ ‘మార్గదర్శి’. ‘అమ్మా! నన్ను ఈ ప్రపంచంలోకి రానీయకమ్మా!’ శీర్షికే కథా వస్తువుని తేటతెల్లం చేస్తుంది. వర్తమాన సామాజిక పరిస్థితుల్లో మహిళల దుస్థితిని-వ్యాస కథగా లేక కథా వ్యాసంగా అక్షరీకరించారు రచయిత్రి. ‘ఫేస్‌బుక్’ని ఒక ఉపయుక్త సాధనంగా మలచుకుని కూతురి దురదృష్టకర మరణాన్ని ఆ కూతురి ఎకౌంట్ ద్వారా ఆర్ద్రంగా ఆవిష్కరిస్తుంది ఒక తల్లి. కథ పేరూ ‘ఫేస్‌బుక్’! ‘శ్రీనివాస కల్యాణం’, ‘మంగళసూత్రధారణ’, ‘అత్తయ్య పెళ్లిచూపులు’ వంటి సరదా కథల్లో కులాసా కథలు, అలతి హాస్యంతో అలరిస్తాయి. అలాగే ఆదర్శాన్ని ఉన్నతీకరిస్తూ, భావనాధారంగా రాసిన కథ ‘అనుబంధాలు’.
కాగా సంపుటిలోని మరీ మంచి కథ ‘మనసు గెలిచింది’. నీటి దుర్వినియోగమూ, సామాజిక బాధ్యతల చుట్టూ తిరుగుతున్న కథ-చివరికి వచ్చేసరికి- ఒక అద్భుత వాస్తవికతతో, ఉన్నత మానవీయ స్పర్శతో-నానమ్మా మనవడూ, మనవరాలూ మధ్య మమతల మాధుర్యాన్ని తెమ్మెరలా ప్రసరింపచేస్తుంది! వస్తురూపాల మేలి కలయికతో పాఠకుల్ని అలరించే నిక్కమైన కథానీలం ఇది! కథాత్మక వాస్తవికతకి మంచి ఉదాహరణగా పేర్కొనదగిన కథానిక.
సంపుటిలోని కథలన్నిటా అనుభూతి ప్రాధాన్యం - చదివించే గుణం మెండుగా ఉన్నది. రచయిత్రి నిరాడంబర కథన శైలే వాటికా గుణ విశేషాన్ని సమకూర్చి పెట్టింది. మధ్యతరగతి వారి ఎత్తుపల్లాల బతుకు బాటలోని ఆనంద విషాదాల్ని ఆలోచనీయం చేస్తూ సాగిన కథా సంపుటి ‘ప్రియే చారుశీలే’!

-విహారి