అక్షర

ముస్లిం పర్సనల్ ‘లా’ పై అపార్థాలకు వివరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లిం పర్సనల్ లా
- కొన్ని అపార్ధాలు
అనువాదం: మహమ్మద్ యాకూమ్
వెల.: రూ.40/-
ప్రతులకు:
అల్‌ఫరూఖ్ పబ్లికేషన్స్
20/373, మస్తాన్ వలి వీధి
కడప, ఆంధ్రప్రదేశ్.

ముస్లిం పర్సనల్ లాపై కొన్ని వర్గాల్లో యేర్పడిన అపార్థాల్ని తొలగించి, షరియత్ ఆదేశాలను న్యాయవేత్తలకు తెలియజేయడం, ఇస్లామియా బోధనల్లోని మర్మాన్ని వెల్లడించడానికి సంబంధించిన వ్యాస సంకలనమిది.
ముస్లిం పర్సనల్‌లాలోని వివిధ అంశాలకు సంబంధించిన కేసులు న్యాయస్థానాల్లో విచారణలో వున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా పర్సనల్ లాబోర్డు 2005, భూపాల్‌లో జరిపిన ఓ బహిరంగ సమావేశంలో ‘తఫ్ హీమ్ షరీయత్ కమిటీని’ ఏర్పాటుచేసింది. ముస్లిం పర్సనల్‌లా విషయంలో నెలకొన్న అపోహలు-అపార్థాల్ని పరిశీలించి వాటిని తొలగించడానికి వివరణలతోసహా వివిధ రకాల సాహిత్యాన్ని ప్రచురించింది. ఇందులో భాగంగానే తఫ్ హీమె షరీయత్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ వ్యాస సంకలనాన్ని ప్రచురించింది.
ఇందులో బాల్య వివాహాలు, బహుభార్యత్వం సమస్య, తలాఖ్ (విడాకులు)- ఇస్లామియా దృక్పథం, విడాకులకు ముందు మధ్యవర్తిత్వం, ఇస్లామ్ ధర్మశాస్త్రం, న్యాయ పరిధిలో విడాకులు పొందిన మహిళకు భరణం ఇవ్వడం, దత్తత తీసుకోవడం, మహిళల వారసత్వ హక్కుకు సంబంధించిన అంశాలపై నెలకొన్న అపార్థాలకు ఇస్లామియా దృక్పథంలో వివరణలు ఇవ్వడం జరిగింది.
బాల్య వివాహాలకు సంబంధించి వైద్య, నైతిక కోణాల్లో వివరించారు. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం ద్వారా శిక్షార్హులవుతారు. కానీ ముస్లిం పర్సనల్‌లా దీన్ని వ్యతిరేకిస్తోంది. అమ్మాయిలు ప్రాజ్ఞదశకు చేరుకున్న తర్వాత వయసుతో పనిలేకుండా వివాహం జరిపించవచ్చు. ఆ తర్వాత వారిలో గర్భం దాల్చే సామర్థ్యం కలుగుతుందన్నది వారి వాదన. నిజానికిది ముస్లింల సమస్యకాదని, ముస్లింలలో బాల్యవివాహాలు తక్కువ జరుగుతాయని, హిందువుల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయట. బాల్య వివాహాల పేరిట అమ్మాయిలకు ఒక నిర్దిష్ట వయోపరిమితిని విధించడాన్ని ముస్లిం పర్సనల్ లా వ్యతిరేకిస్తోంది. ఖురాన్, హదీసుల ఆధారంగా ఇస్లామియా దృక్కోణంలో బాల్య వివాహాల్ని ముస్లిమ్ పర్సనల్ లాబోర్డు నిర్ణయాన్ని సమర్ధించడం జరిగింది.
బహుభార్యత్వాన్ని ఇస్లామియా కోణంలో సమర్ధించడం జరిగింది. ముస్లింలలో బహుభార్యత్వం శాపంకాదని, అది వరం లాంటిదని, ఇస్లామ్ దీనికి కేవలం అనుమతి మాత్రమే యిచ్చిందని, ప్రోత్సహించలేదన్నది వీరి వాదన. బహుభార్యత్వ అనుమతి ఒక సామాజిక అవసరం, శీలరక్షణకు ఒక కారకం. బహుభార్యత్వం విషయంలో షరీ అత్ ఏ నిబంధనలు, ఆంక్షలనైతే విధించిందో వాటిని దృష్టిలో వుంచుకోవడం తప్పనిసరి అన్నది సారాంశం. భారతదేశ ముస్లిముల్లో బహుభార్యత్వ ఆచారం అధికంగా వుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, నిజానికి బహుభార్యత్వం హిందువుల్లోనే ఎక్కువగా వుందని ఉదాహరణ పూర్వకంకగా వివరించారు.
ఇక తలాఖ్ (విడాకులు) విషయానికి సంబంధించి ముస్లింలలో విడాకులు ఇచ్చే అధికారాన్ని భర్తకు మాత్రమే ఎందుకిచ్చారన్న దానిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నిజానికి ఇస్లామ్ దృష్టిలో విడాకులు ఒక అయిష్టమైన చర్య అని, కొన్ని విపత్కర సామాజిక అవసరాల దృష్ట్యా దీన్ని అనుమతించడం జరిగిందన్నది వీరి వాదన. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలొచ్చిన పక్షంలో భర్త భార్యనుంచి విముక్తి పొందడంకోసం అనధికార మార్గాలను అవలంభించకూడదని, స్ర్తిలకు దీనికి ప్రత్యామ్నాయంగా తలాఖె తఫ్వీజ్, ఖులా, భాజీ ద్వారా రద్దు లేదా వేర్పాటుకు అవకాశం కల్పించడం జరిగిందన్నది సారాంశం. ఇస్లామియా దృక్పథంలో దత్తత తీసుకోవడం, మహిళలకు భరణం, ఆస్తిహక్కు కల్పించే విషయాలకు సంబంధించి ఇందులో వివరించారు.
దేశం మొత్తానికి ఏకరూపత (యూనికోడ్) చట్టం ఉండాలన్న వాదన నేపథ్యంలో ముస్లిం పర్సనల్‌లా ఆవశ్యకత ఎంతైనా వుందని ఈ పుస్తకంలో వాదన పూర్వకంగా వివరించడం జరిగింది. షరిఅత్ ఆదేశాలను పాటించడంవల్ల కేవలం పరలోక సాఫల్యమేకాదు, ప్రపంచంలో మానవత్వ సంక్షేమం, జీవితంలో ప్రశాంతత యేర్పడుతుంది. అందుకే షరియత్ ఆదేశాలను సక్రమంగా ప్రజలకు చేరవేసి, దానిలోని ఔచిత్యాలను, వ్యూహాలను స్పష్టపరచాల్సిన ఆవశ్యకతను ఇందులో ఆకట్టుకునే రీతిలో వివరించడం జరిగింది.

-ఎ.రజాహుస్సేన్