మెయన్ ఫీచర్

రాజ్యాంగ స్ఫూర్తికి శరాఘాతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజ్యాంగ స్ఫూర్తికి కలసికట్టుగా తూట్లు పొడవడాన్ని భారత దేశ ప్రజాస్వామ్య వాదులు ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర గవర్నర్, శాసన సభాపతి, ముఖ్యమంత్రి.. ముగ్గురూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవారే. రా జ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తామని వాగ్దానం చేసినవారే. అటువంటి ఆ ముగ్గురు నేతలూ నవ్యాంధ్ర రాజధాని ‘అమరావతి’ సాక్షిగా రాజ్యాంగం మీద అత్యాచారానికి పాల్పడ్డారు.
ఒక పార్టీ గుర్తుమీద ఎన్నికైన సభ్యులు మరో పార్టీలోకి ఫిరాయించినపుడు వారి చట్టసభ సభ్యత్వం రద్దవుతుందని చెబుతోంది రాజ్యాంగం. అయితే- తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఫిరాయింపుదారుల చట్టసభ సభ్యత్వం రద్దు కాకపోగా వారికి మంత్రిపదవులు కట్టబెట్టారు. మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి ఇష్టమని అందరూ అంగీకరించినా, అది కూడా రాజ్యాంగ పరిధిలోకి లోబడే జరగాలి. రాజకీయ ప్రయోజనం ఆశించి ముఖ్యమంత్రులు, ప్రధానులు తమ పరిధిని దాటి తమ పబ్బం గడుపుకునే యత్నం చేస్తారు. అటువంటి సమయంలో జరిగే తప్పులను ఎత్తిచూపి రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రులకు గుర్తు చేయాల్సిన వాడు గవర్నర్. ఆయన స్వయానా రాష్టప్రతి ప్రతినిధి. రాజ్యాంగ బద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్నవాడు. అటువంటి గవర్నర్ తెలంగాణలో ఒక ఫిరాయింపుదారుడిచేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినపుడు రాష్టప్రతి కలుగచేసుకుని చక్కదిద్దాల్సింది. కానీ రాష్టప్రతి తనకేమీ పట్టనట్టు, రాజ్యాంగ పరిరక్షణ తన బాధ్యత కాదన్న విధంగా వ్యవహరించాడు. ఫలితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా నలుగురు ఫిరాయింపుదారుల చేత మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాడు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ చర్యను ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వారి సభ్యత్వం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించాల్సిన గవర్నర్ ఫిరాయింపుదార్లను మంత్రులను చేయడం ఉద్దేశమేమిటి? గవర్నర్ నరసింహన్ తెలంగాణలో తెలుగుదేశం టికెట్ మీద గెలిచిన తలసానిని మంత్రిగాప్రమాణ స్వీకారం చేయించినపుడు- టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించి, ‘ప్రజాస్వామ్యానికి దుర్దినం’ అని నాడు అభివర్ణించాడు. తెలంగాణలో అధికారంలో ఉన్నది ‘టిఆర్‌ఎస్- టిడిపి సంకీర్ణ ప్రభుత్వం’గా ఆయన విమర్శించాడు.
నాడు చెప్పిన నీతులన్నీ పైపై మాటలేనని నేడు స్పష్టమైంది. నలుగురు వైకాపా సభ్యులను మంత్రివర్గంలో చేర్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టిడిపి, బిజెపి, వైకాపాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంగా తయారుచేసాడు. ఇక ఏపిలో ప్రతిపక్షం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత శాసనసభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో శాసనసభలో వైకాపా బలం 66గా చూపించారు. అప్పటికే 21 మంది సభ్యుల వరకు నిర్లజ్జగా అధికార పక్షంలో కూర్చోవటం అందరికీ తెలిసిందే. వారు వైకాపా సభ్యులని స్పీకర్ భావిస్తుంటే, అధికార పక్షం సీట్లలో ఎలా కూర్చుంటున్నారని వారిని అడగాల్సిన బాధ్యత స్పీకర్‌ది కాదా? అయినా సదరు స్పీకర్‌గారు ఆ విషయంలో పెదవి విప్పరు. ఎంతో పవిత్రంగా ప్రారంభించిన ఏపి శాసనసభ తొలిరోజే అపవిత్రమైన సీటింగ్ ఏర్పాట్లను చవిచూసింది. ఇదెక్కడి విడ్డూరం! దీనికి సమాధానం ఏది? పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం తెచ్చిన తర్వాత కూడా ఆ చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి. గుంపుగా ఫిరాయింపు అవటానికి అవకాశం కల్పించడం చట్టంలోని మొదటి లోపం. ఫిరాయింపులను ధ్రువీకరించి తగిన చర్య తీసుకునే అధికారం శాసనసభ స్పీకర్‌కి అప్పగించడం రెండవ లోపం. పార్లమెంటు ఏర్పడిన 1950ల్లో స్పీకర్‌గా వ్యవహరించిన వౌల్వాంకర్, అనంతశయనం అయ్యంగార్ వంటివారు ఉన్నత వ్యక్తిత్వం కలవారు. పార్టీ రాజకీయాలకు అతీతులు. అటువంటి వ్యక్తిత్వం కలవారు లేని నేటి కాలంలో స్పీకర్‌కి ‘్ఫరాయింపుదార్లను గుర్తించి, శిక్షించే బాధ్యత’ ఇవ్వడం హాస్యాస్పదం. నేడు శాసనసభ స్పీకర్లు అధికార పార్టీ వ్యక్తులే. ఎప్పుడు మంత్రి పదవి వస్తే స్పీకర్ పదవి వదిలేద్దామా.. అని ఎదురు చూసేవారే. స్పీకర్ స్థాయిని తగ్గించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. స్పీకర్‌గా ఉన్న వ్యక్తిని ఎకాఎకిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న బలరామ్ జక్కర్, శివరాజ్ పాటిల్‌లను కేంద్ర మంత్రులుగా చేసింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్పీకర్ స్థానాన్ని వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య.
కాంగ్రెస్ సంస్కృతిని తిట్టిన తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌లు తమ అవసరాల కోసం అదే బాటలో నడుస్తున్నాయి. తెలుగుదేశం నుండి ఫిరాయించి తెలంగాణలో మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై రెండేళ్లయినా స్పీకర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోడు. తాను తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చానని తలసాని స్వయంగా ప్రకటించాడు. అటువంటి రాజీనామా పత్రం తనకు అందలేదని తెలంగాణ స్పీకర్ ప్రకటిస్తాడు. ఇదొక పెద్ద రాజకీయ డ్రామా. దీనిలో ఎవరి పాత్ర ఎంతో తేల్చే యత్నం ఎవరూ చేయరు.
తెలంగాణలో జరిగిన ‘శాసనసభ రాజకీయ డ్రామా’ని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ‘70ఎంఎం’లో ప్రదర్శించింది. ఏకంగా నలుగురు వైకాపా సభ్యులకు మంత్రి పదవులు కట్టబెట్టింది. అధికారికంగా వైకాపా సభ్యులే వారు. శాసనసభలో వారు మాట్లాడిన మాటల్ని వైకాపా ఎకౌంట్‌లోనే వేసి చూపించాడు స్పీకర్. ఫిరాయించిన సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయాలని స్పీకర్‌కి ఫిర్యాదు చేసింది వైకాపా. అయినా వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకునే తీరిక స్పీకర్ డా.కోడెల శివప్రసాద్‌రావుకి లేదు. ఎందుకంటే ఆయన టిడిపి మనిషి. మంత్రిపదవి ఆశిస్తున్న వ్యక్తి.
రాజకీయాలలో నైతిక విలువలకు పాతర వేస్తున్న నేత చంద్రబాబు. పార్టీ ఫిరాయించినప్పుడు వారిని తమ పార్టీ సభ్యత్వానికే కాక ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి రమ్మని చెప్పి స్వాగతించి వుంటే చంద్రబాబుని మెచ్చుకునేవారం. కానీ చంద్రబాబులో రాజకీయ సచ్ఛీలత వెతకడం అంటే నేతి బీరకాయలో నెయ్యి వెతకడం వంటిదే. ఈ విషయంలో చంద్రబాబుకన్నా ప్రతిపక్ష నేత జగన్ ఎంతో మెరుగు. కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు తన ఎంపి పదవికి, తల్లి విజయమ్మచేత ఎంఎల్‌ఏ పదవికి రాజీనామా ఇచ్చి తిరిగి ఎన్నికయ్యారు. చట్టసభలో ‘విప్’ని ధిక్కరిస్తే తమ సభ్యత్వం రద్దు అవుతుందని తెలిసినా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ధైర్యంగా విప్‌ని ధిక్కరించిన 16మంది ఎంఎల్‌ఎలది నిబద్ధత. వారు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసారు. వారిలో ఒకరిద్దరు వైకాపా టికెట్ మీద పోటీచేసి ఓడిపోయి ఉండవచ్చు. అయినా వారు తమ నిబద్ధతను నిరూపించుకున్నారు. కానీ ఆ సాహసం చేయించలేని పిరికివాడిగా చంద్రబాబు మిగిలిపోయాడు.
ఇదంతా ఒక రాజకీయ కుట్ర. ఆ కుట్రలో స్పీకర్ పాత్ర ఉండడం విచారకరం. సభా విలువలు దిగజారటం, స్పీకర్లు రాజకీయ పావులుగా మారడం కొత్తేమీ కాదు. 1991 నుండి ఫిరాయింపులను కాంగ్రెస్ ఎలా ప్రోత్సహించినది, స్పీకర్ ఆఫీసును తమ రాజకీయాలకు అనుగుణంగా ఉపయోగించుకున్నది అందరికీ తెలిసిందే. అందుకే ఫిరాయింపుదారులు, వారిపై చర్యల విషయంలో ప్రశ్నించే నైతికతను కోల్పోయింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చట్టసభ నిర్వహణ, స్పీకర్ సభా నిర్వహణ అంశంలో విలువలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చేసిన తీరు ఒక్కటి చాలు స్పీకర్ స్థానం ఎంతగా దుర్వినియోగం అయిందో చెప్పటానికి. లోక్‌సభలో విభజన చట్టం ఓటింగ్ సమయంలో తలుపులు మూయించారు. డివిజన్ అడిగినా పట్టించుకోక మూజువాణి ఓటుతో ‘మమ’ అనిపించారు. ఇంత దారుణంగా లోక్‌సభ స్పీకర్ వ్యవహరించగలరని ఎవరూ అనుకోలేదు. భారత పార్లమెంటు సంప్రదాయాలకు ఆనాడే కాలం చెల్లింది.
ఇక ఇపుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ స్పీకర్లు సభా సాంప్రదాయాలకు పూర్తిగా పాతర వేసారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అండతో స్పీకర్లు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఉమ్మడి గవర్నర్ వారితో చేతులు కలిపి రాజ్యాంగ విలువలకు సమాధి కట్టాడు. ఇది రెండవ దుర్దినం. తొలి దుర్దినం పార్లమెంటులో విభజన చట్టం ఆమోదమైందని ప్రకటించిన రోజు, రెండవది ఫిరాయింపుదార్ల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన రోజు.
ఈ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ముఖ్యమంత్రి, గవర్నర్ తుంగలో తొక్కడం ద్వారా రాజ్యాంగ ధిక్కారానికి, కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారు. ఒకసారి పార్టీ ఫిరాయింపు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆ సభ్యుడి సభ్యత్వ రద్దును కోరే హక్కు రాజకీయ పార్టీలకే కాదు, ఓటరుకూ ఉందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఫిరాయింపుదారుల అనర్హత పిటిషన్ మీద స్పీకర్ తన నిర్ణయంలో టంబాల్‌గాని, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా అనర్హత పిటిషన్‌ని పక్కనపెట్టి ఉంచడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఫిరాయింపు అంశం ధ్రువీకరించుకోవడానికే స్పీకర్‌కి సమయం ఇస్తున్నది చట్టం. అంతేకాని తన ఇష్టమొచ్చినంత కాలం పిటిషన్లను పెండింగులో పెట్టి వుంచుతాననేది ఫిరాయింపు నిషేధ చట్ట స్ఫూర్తికి వ్యతిరేకం.
ముఖ్యమంత్రికి మంత్రులను ఎంచుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. తన పార్టీ వారిని లేదా ఏ పార్టీకి చెందని వారిని ఎంచుకునేందుకు తప్ప- ఇతర పార్టీల సభ్యులను ఎంచుకునే హక్కు లేదు. ఈ విషయం గవర్నర్ ముఖ్యమంత్రికి ఎత్తి చూపకపోవడం ఉమ్మడి గవర్నర్ అలసత్వం. మంత్రివర్గ నిర్మాణం, మంత్రివర్గ నిర్ణయాల మధ్య ఉన్న ‘టేడ్’ను గవర్నర్ విస్మరించాడు. గవర్నర్, స్పీకర్‌కి విచక్షణాధికారాలను రాజ్యాంగం ఇచ్చింది. అయితే ఆ విచక్షణాధికారాలను దుర్వినియోగం చేసినపుడు న్యాయస్థానాలకు జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. తాజాగా వెలువరించిన అరుణాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు, శాసనసభలను సస్పెన్షన్‌లో పెట్టడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. గవర్నర్లు రాజకీయాలు నడపడం తప్పని హెచ్చరించింది కూడా. ఇవన్నీ బహిరంగ అంశాలే అయినా వాటిని పక్కనపెట్టి గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కుమ్ముక్కు అవడం నిరసించదగిన విషయం. ఫిరాయింపుదార్లకు మంత్రిపదవులెందుకు కట్టబెట్టాల్సి వచ్చిందో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంతవరకు వివరించలేదు. తను రాజకీయ స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని, చట్టాలను బేఖాతరు చేయగలమన్న నియంతల్లా ప్రవర్తించారు కెసిఆర్, చంద్రబాబు. తమ సొంత పార్టీలో మంత్రి పదవులు నిర్వహించగలిగిన సమర్ధులు లేరా? చంద్రబాబు చెబుతున్న సామాజిక వర్గాల సమతుల్యం కోసం మంత్రివర్గ పునర్విభజన అన్నది- అతి పెద్ద అబద్ధం. అదే నిజమైతే మంత్రివర్గంలోని తన సామాజిక వర్గ మంత్రులను తొలగించి వుండాల్సింది. నిజానికి మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గం వారి సంఖ్య అధికం. అయినా ఒక్కరిని తొలగించకపోగా అదే సామాజిక వర్గానికి చెందిన తన కుమారుడు లోకేష్‌ని మంత్రిని చేసాడు. సమాజానికి చంద్రబాబు ఇస్తున్న సందేశం ఏమిటి! టిడిపి మా సామాజిక వర్గ పార్టీ, ప్రభుత్వం మా సామాజిక వర్గం పెత్తనం కింది పడివుండాల్సిందే అనేనా?
ఎల్లకాలం ఒక సామాజిక వర్గం ఆధిపత్యం చెల్లదు. స్పీకర్, మహిళా కమిషన్ చైర్మన్, ఎపిపిఎస్‌సి చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఐటి సలహాదారు, ఆర్థిక సలహాదారు, తెలుగు అకాడమీ చైర్మన్, ఎన్‌ఆర్‌ఐ సలహాదారు, ఇలా నామినేటెడ్ పదవులన్నీ తన సామాజిక వర్గానికే కట్టబెడతానంటే మిగిలిన సామాజిక వర్గాలు వౌనంగా వుంటాయనుకుంటే చంద్రబాబు పొరపడినట్టే. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నాటికి 1989 నాటి సామాజిక ఘర్షణ వాతావరం నెలకొనబోతున్నది. ఆ ఘర్షణ వాతావరణ సృష్టికర్త చంద్రబాబు- తాను పెట్టిన సామాజిక చిచ్చుకు తానే బలి కాక తప్పదు!

-అడుసుమిల్లి జయప్రకాష్ (మాజీ ఎమ్మెల్యే)