AADIVAVRAM - Others

అరుదైన ప్రతిభ.. అనుపమ ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ అనుపమ కైలాశ్ అత్యుత్తమ కూచిపూడి, విలాసినీ నృ త్య కళాకారిణి. దశాబ్దాలుగా కళకు అంకితమైన అనుపమ సౌందర్య రాశి. నర్తకిగా, గురువుగా, తల్లిగా, గృహిణిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ నృత్యంలో పరిశోధన చేసి, ‘అన్నమయ్య పదములు - నాయికలు’ అనే అంశంతో పిహెచ్.డి చేశారు. ఆ పుస్తకాన్ని ప్రచురించి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీలో బోధన చేస్తున్నారు డా.అనుపమ కైలాశ్. ఆమెతో జరిపిన సంభాషణలో కొన్ని ముఖ్యాంశాలు...
ప్రశ్న: మీ ప్రస్థానం నృత్యంలో ఎలా జరిగింది?
జ: చిన్నప్పటి నుండి కళలంటే మక్కువ నాకు. తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో బి.ఏ, ఎం.ఏ చేశాను. నాకు ఎం.ఏలో స్వర్ణ పతకం వచ్చింది కూడా. తరువాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో నృత్యంలో పిహెచ్.డి చేశాను. దూరదర్శన్‌లో నేను ‘ఏ’ గ్రేడ్ కళాకారిణిని. నా పిహెచ్.డి సిద్ధాంత వ్యాసం ప్రచురించాను. అలాగే ‘క్షేత్రయ్య పదములలో నాయికలు’ అనే పుస్తకం కూడా ప్రచురించాను.
ప్ర: గురువుగా మీకు ఎలా అనిపిస్తుంది?
జ: నేను కూచిపూడి రీతులను డా.ఉమారామారావు గారి వద్ద నేర్చుకున్నాను. అలాగే విలాసినీ నృత్యం పద్మభూషణ్ స్వప్నసుందరి గారి వద్ద నేర్చుకున్నాను. ఇప్పుడు నాకే ఎంతోమంది శిష్యులు ఉన్నారు. అలాగే సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఏ కోసం నేను బోధన చేస్తున్నాను. గురువుగా, పరిశోధకురాలిగా, నర్తకిగా అన్ని కోణాలలో రాణిస్తున్నాను. ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. నేను ‘అనుభవ్’ అనే నాట్యాలయం స్థాపించి అక్కడ కళాకారులను రూపుదిద్దుతున్నాను.
ప్ర: మీకు సంగీతం కూడా వచ్చు కదా!
జ: అవును! హిందుస్తానీ సంగీతంలో నేను విశారద చేశాను. ఇది నాకు అఖిల భారతీయ గంధర్వ మహావిద్యాలయం నుండి వచ్చింది.
ప్ర: మీరు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన ప్రదర్శనలు...
జ: ఎన్నో ప్రదర్శనలిచ్చాను దేశ విదేశాలలో. అన్నీ మనసుకు హత్తుకుపోయినవే. అందులో కొన్ని...
ఐసిసిఆర్ (హైదరాబాద్), విలాసినీ నాట్యం ఫెస్టివల్ (చెన్నై), జాతీయ దేవదాసి ఫెస్టివల్ (్భవనేశ్వర్ -2008), హంపీ ఫెస్టివల్- 2008, నృత్య సంగం ఫెస్టివల్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ (కోల్‌కత -2008), నాట్యాంజలి (చిదంబరం -2012), దక్షిణ మూకాంబికా నేషనల్ డాన్స్ ఫెస్టివల్ (కేరళ -2009), ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ (చెన్నై).
నేను దాదాపు 35 సంవత్సరాల క్రితం నృత్యంలో ప్రయాణం మొదలు పెట్టాను. ఇప్పుడు నా శిష్యులు కూడా ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
ప్ర: మీరు చాలా విదేశాలలో నృత్యం ప్రదర్శించారు కదా..
జ: అవును. యుకె, జర్మనీ, స్వీడన్, మస్కట్, మలేసియా, ఒమన్, కెనడాలలో ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చాను. యుఎస్‌ఏలో డల్లాస్, హూస్టన్, అట్లాంటా మొదలగు నగరాల్లో ప్రదర్శనలిచ్చాను. సియోల్, సౌత్ కొరియాలో చేశాను.
ప్ర: మీరు నృత్య రూపకాలు కొరియోగ్రఫీ చేశారా?
జ: చాలా నృత్య రూపకాలు రూపకల్పన (కొరియోగ్రఫీ) చేశాను. అందులో కొన్ని-
భక్తి మార్గం - భక్తి వాగ్గేయకారుల మీద, విశ్వం నారాయణం - శ్రీ మహావిష్ణువు, శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వర స్వామి మీద. జీవ నాయిక - అన్నమాచార్య నాయికల మీద, శివార్పణం వంటివి.
ప్ర: నృత్యంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
జ: నేను ఎంతో అదృష్టవంతురాలిని. చిన్నప్పుడు మా అమ్మ, నాన్నగారు ఎంతో ప్రోత్సహించేవారు సంగీతంలో, నృత్యంలో. ఇప్పుడు భర్త కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. మా పాప ‘చూర్ణిక’. నిజం చెప్పాలంటే ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగింది నా నృత్య ప్రయాణం.
ప్ర: సంప్రదాయ కళలు ఇంకా బాగా సమాజంపై ప్రభావం చేయాలంటే ఎలా?
జ: కళాకారులు బాగా వివరించి, అర్థం వచ్చేటట్లు ప్రేక్షకులకు చెప్పాలి. చక్కగా ప్రేక్షకులకు మనం చెయ్యడంలో, చూపించడంలో కళాకారుడి గొప్పదనం ఉంది. కేవలం ఈ అంశం రాగం - తాళం అంటే సరిపోదు కదా.
ప్ర: మీరు లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్స్ ఇచ్చారు.. వాటి వివరాలు..
జ: ఎన్నో సెమినార్లలో లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్స్ ఇచ్చాను. రీసెర్చ్ పేపర్స్ అర్పించాను. ఎన్నో ప్రముఖ సావనీర్లు నా రీసెర్చ్ వ్యాసాలు ప్రచురించాయి.
ప్ర: అవార్డులు కొంతమందికే లభిస్తున్నాయి. వాటికి ఆర్థిక స్తోమత, రాజకీయ పలుకుబడి సహాయపడుతోంది.. అని కొంతమంది అంటారు. మీరేమంటారు?
జ: అది అన్ని రంగాల్లోనూ ఉంది. కేవలం నృత్యంలో మాత్రమే కాదు. ఎంతోమంది ప్రతిభ, సృజన ఉన్న కళాకారులు ఉన్నారు. కాని, అవార్డుల కోసం కాకుండా కళను నమ్ముకోవాలి. అప్పుడు గుర్తింపు స్వయం ప్రతిభతో వస్తుంది.
ప్ర: మీరు కళాకారులకు ఇచ్చే సందేశం ఏమిటి?
జ: బాగా చదవాలి. నేర్చుకోవాలి. అభ్యాసం చేయాలి. కేవలం ఇంకొకరి మెప్పు కోసం కాకుండా మనస్సుకు నచ్చినట్లు, ఆత్మసంతృప్తి కోసం కళకు అంకితమవ్వాలి. అప్పుడే మన ప్రదర్శనలు రాణిస్తాయి. అలా చేస్తే మనం రాసే వ్యాసాలు, ప్రచురించే పుస్తకాలు వేరే వారికి దారి దీపాలు అవుతాయి.
*

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట