మెయిన్ ఫీచర్

కాలంతో పరుగెడుతూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షల మాసం మార్చి దగ్గరకొస్తోంది. పిల్లలు, వారి పెద్దలు పడుతున్న శ్రమ చూస్తుంటే, ఇవే స్కూళ్లు, ఇవే పరీక్షలు అప్పటి రోజుల్లో ఎలా ఉండేవో, ఇపుడు పరిస్థితులు ఎలా మారేయో గుర్తుచేసుకుంటూ ఈ చిన్న ప్రయత్నం.
‘‘లేమ్మా.. స్కూలుకి టైం అవుతోంది. ఇవాళ స్టేజీమీద నేనే మాట్లాడాలమ్మా’’ అన్నావు కదా. అంతే! ఠక్కున లేచి కూర్నున్నా నేను. ఆ రోజు జనవరి 26. స్కూల్లో పెద్ద ఫంక్షన్. ఆర్గనైజర్, యాంకర్ అన్నీ నేనే అని గుర్తొచ్చింది. కాళ్ళకి చక్రాలొచ్చేయా అన్నట్టు పరిగెత్తా. అరగంట లేటుగా. స్కూలుకెళ్ళేసరికి వేరే అమ్మాయిని నా స్థానంలో స్టేజ్‌మీద చూసి ఏడుపాగలేదు. కాస్త లేటుగా వెళ్లినా క్లాస్ టాపర్‌ను కనుక టీచర్లు స్టేజెక్కి మైకందుకోమన్నారు. మొత్తంమీద ఎలాగో రిపబ్లిక్‌డే సందడి పూర్తయింది.
‘‘పరీక్షలు దగ్గరకొస్తున్నాయి ఏమైనా చదివేదుందా? లేక ఆగస్టు 15, వార్షికోత్సవం, రిహార్సల్స్ అంటూ తిరుగుతూనే ఉంటావా? సాయంత్రం రాగానే ఆటలంటూ తుర్రుమంటావ్. రాత్రి గడియారం తొమ్మిదో గంట కొట్టకుండానే నిద్రతో తూలిపోతుంటావ్, ఇలా అయితే స్కూల్ ఫస్ట్ ఎలా వస్తావ్?’’ నాకు రోజూ విన్పిస్తూనే వుంటుంది అమ్మ. చిన్నప్పటినించి చదివిన స్కూలు, టీచర్లందరికీ నేనంటే అభిమానం. మళ్లీ ఇలాంటి అవకాశం రాదు కదా అని చిన్ని ఆశతో అమ్మ వద్దని, ఇలాంటి వాటిలో పాల్గొంటే చదువు పాడవుతుందని వారించినా పదవ తరగతికి వచ్చేక స్కూల్ ఎస్‌పిఎల్ అయ్యాను.
ఫస్టుమార్కులు తెచ్చుకుంటే మేమంతా అనుకున్నట్టే బైపిసిలో జాయిన్ అయి డాక్టర్ అవుదామనుకున్నా. స్కూల్ ఫస్ట్ వచ్చింది. వాకబు చేస్తే పెద్ద కాలేజీలో మెడిసిన్ తలకు మించిన ఖర్చని తెలిసింది. ఊర్లోనే పేరున్న, ఫీజు రాయితీ ఇచ్చిన ప్రైవేట్ కాలేజీలో ఎంపిసిలో చేరాను. ఇంజనీరింగ్‌మీద ఆసక్తి లేదు. ఎంసెట్ వద్దనుకున్నా. ఇంజనీరింగ్ చేస్తే మంచి ఉద్యోగం వస్తుందని, ఎంసెట్ రాసి ఇంజనీర్ అవ్వాల్సి వచ్చింది. విదేశాల్లో చదువుకోవాలని ఆశ కలిగింది. పరీక్ష ఫీజుకే స్థోమత లేదని తెలుసుకుని ఆశ వదులుకున్నాను. అడిగింది కుదరదు అని తెలియగానే ఒత్తిడికి లోనయి భవిష్యత్తుని పాడుచేసుకోలేదు నేను. నా కుటుంబ పరిస్థితిని బట్టి భరించగలిగేదానికంటే ఎక్కవ చదివించేరు నా తల్లిదండ్రులు. వారేం చెప్పినా నా మంచికే అని అర్థం చేసుకోగలిగేను. మంచి ఉద్యోగం సంపాదించి, వివాహం చేసుకుని, ఓ బంగారు పాపతో సంతోషంగా జీవిస్తున్నాను. నా ఒక్క విషయమే కాదు, నా తోటి స్నేహితులు చాలామంది మధ్య తరగతి వారికి ఇలా అనుకున్నది కాక వేరే దారిలో ప్రయాణించడం జరిగింది.
ఇది నా కథ కాదు. బాల్కనీకి రోజూ వినబడే పది స్కూల్ బస్సుల సందడి, బక్కపల్చటి భుజాలమీద బోలెడంత బరువు మోస్తూ బస్ కోసం పరుగులెత్తే పిల్లల్ని చూస్తుంటే, నాలాంటి ఎందరో పేరెంట్స్‌తో వారి చిన్నారులతో ఇలా నాలుగు మాటలు మాట్లాడాలనిపించింది. ఒకప్పుడు తాహతకు, స్థోమతకు మించిన చదువులు చెప్పించడానికి జంకేవారు మా తల్లిదండ్రులు. జ్ఞాన సముపార్జన దైవంతో సమానం అంటారు. నిజమే. శ్రీమహాలక్ష్మితో సమానం ఈ రోజుల్లో. విద్యను అభ్యసిస్తే సమాజంలో విలువుంటుంది అని చెప్తారు పెద్దలు. ఇప్పుడు విలువైన విద్యను అభ్యసిస్తున్నారు పిల్లలు. పాఠశాలలో అడుగుపెట్టిన దగ్గరనుంచిరకరకాల ఫీజులు తడిసి మోపెడవుతోంది సంవత్సరానికి. రెండు చేతులా కాదు నాలుగు చేతులా సంపాదించినా సరిపోదు. ఏ చిన్న వస్తువు కొనకపోతే బిడ్డ ఎంత కష్టపడాతాడో అని నోట మాట రాగానే సమకూర్చుతున్నాం. పాతికేళ్ళు వచ్చేక మొబైల్ ఫోన్ మొహం చూసిన మనము, మన పిల్లలకు మాత్రం పదేళ్ళు రాగానే తెచ్చి చేతిలో పెడుతున్నాం, ఎప్పటికప్పుడు వారి బాగోగులు తెలుసుకోవాలని. మీ కోసం ఇంత శ్రమనోర్చే అమ్మా నాన్న, మొబైల్ ఆటలు కట్టిపెట్టి చదువుకోమంటే అది కేవలం మీ బాగు కోసమే అని అర్థం చేసుకోండి, చిన్నారులూ!
ఇప్పుడేదో వ్యవస్థ చెడిపోయిందనో, చదువులకు అర్థం లేదనో అనటం లేదు. పగలు 8కి మొదలైన రోజు కనీసం రాత్రి 8 అయినా కూడా ముగియడం లేదు. నిజమే అన్నీ మారాయి. ప్రపంచంతో పరుగులెత్తే ఓపిక లేకపోయినా ఎక్కడ వెనుకబడిపోతామో అన్నబెంగ. బిడ్డడు మూడో సంవత్సరం రాకుండానే ఎల్‌కెజిలో సీటు దొరకదే అన్న టెన్షన్. మన పాప/బాబు ఎన్ని ఆటల్లో వుంటే అంత ఆనందం మనకు. ఎన్ని కళలొస్తే అంత పైకి కాలరెగరేయవచ్చు మనం. ఎంతకని సాగుతారు పిల్లలు. ఉన్నవి రెండు కాళ్ళు, రెండు చేతులే. వీడియో గేమ్ అని ఫోన్లకి బానిసలవ్వకుండా ఉండేందుకు ఇలా వారిని తీరిక లేకుండా ఉంచడమే ప్రత్యామ్నాయమా. పోటీ ఉండటం మంచిదే. గొప్పవాళ్ళతో పోల్చి మీరు అంతటివాళ్ళు కావాలని చెప్పడం తప్పు కానే కాదు. కానీ అమ్మో ఫస్ట్ రాంక్ రాకపోతే అమ్మ తిడుతుందనో, ఫలానా వాళ్ళకంటే ఎక్కువ స్పోర్ట్స్‌లో లేకపోతే నాన్న తిడతారనో భయపడుతూ భరించే పోటీ కాదు.
ఒకసారి మనమెలా ఎంతటి ప్రశాంతమైన వాతావరణంలో పెరిగామో గుర్తుచేసుకుందాం. మనమిప్పుడు మంచి ఉద్యోగాలలో స్థిరపడలేదా? ఇప్పుడు వున్న విద్యా వ్యవస్థ వలన మన పిల్లలు ఖచ్చితంగా మనకంటే మంచి స్థానాల్లోనే స్థిరపడతారు నిస్సందేహంగా. అదే కదా మనం కోరుకునేది. మాటలే కాదు, లక్ష్యాలు, పద్ధతులు, సంస్కారం అన్నీ తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. నేర్చుకోవడం కాదు అనుసరిస్తారు. చదువు చెప్పిద్దాం, విజ్ఞానాన్ని అందిద్దాం, అన్ని ఆటలు ఆడనిద్దాం, మంచి చెడులను మనసుకు ఉత్తుకునేలా వివరిద్దాం. మంచి మనుషులుగా మలుద్దాం. సాటిలేని మేటి మానవత్వాన్ని ప్రపంచానికందిద్దాం.

-కౌముది ఎం.ఎన్.కె.