గుంటూరు

మంగళగిరిలో ఐ క్లిక్ కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జనవరి 24: పట్టణంలోని గౌతమబుద్ధ రోడ్డులో వైష్ణవి కల్యాణ మండపం వద్ద నూతనంగా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఐ క్లిక్ కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం రాష్ట్ర డిజిపి జెవి రాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి జెవి రాముడు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నగరానికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరిలో పోలీసు వ్యవస్థలో స్టాండర్డ్స్ పెంపుదలలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో భాగంగా ఇక్కడ ఐ క్లిక్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో ఐ క్లిక్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. బ్యాంకులకు వెళ్ళకుండా ఎటిఎంలో నగదు డ్రా చేసినంత తేలిగ్గా పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండా బాధితులు ఫిర్యాదును ఐ క్లిక్ కేంద్రాల్లో చేయవచ్చని డిజిపి రాముడు వివరించారు. మాటల ద్వారా చెప్పినా ఇక్కడ రికార్డ్ అవుతుందని, టైప్ చేసినా, రాసి తీసుకెళ్లినా ఫిర్యాదును రికార్డు చేసి ఐక్లిక్ యంత్రం రశీదు కూడా ఇస్తుందని ఆయన చెప్పారు. ఫిర్యాదుదారుడు సెల్‌ఫోను నెంబరిస్తే ఎక్‌నాలెడ్జ్‌మెంట్ సమాచారం కూడా సెల్‌ఫోనుకు వస్తుందని, పోలీసు స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడే వారికి ఇక్కడ ఏ భయం లేకుండా ఐ క్లిక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ఒంగోలు, గుంటూరు మొదలైన ప్రాంతాల్లో ఐ క్లిక్ కేంద్రాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, ఒంగోలు ఐక్లిక్ కేంద్రాల్లో ఆరు నెలల్లో 1500 ఫిర్యాదులు నమోదయ్యాయని, అనేకచోట్ల ప్రజలు ఈ ప్రయోగం బాగుందని మెచ్చుకుంటున్నారని డిజిపి రాముడు అన్నారు. స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, గుంటూరు ఐజి సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టి త్రిపాఠి, రూరల్ ఎస్పీ నాయక్, అడిషనల్ ఎస్పీ భాస్కరరావు, పలువురు డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు. ఎన్నారై అకాడమీ ఆఫ్ సైనె్సస్ వారు ఐ క్లిక్ కేంద్రం ఏర్పాటుకు ఆర్ధిక సహాయం అందించారని డిజిపి రాముడు వారిని అభినందించారు. ఐ క్లిక్ కేంద్రం ఏర్పాటుకు స్థలంతో పాటు విద్యుత్ సౌకర్యం సొంత ఖర్చుతో భరించేందుకు ముందుకు వచ్చిన వైష్ణవి కల్యాణ మండపం యజమాని నన్నపనేని నాగేశ్వరరావును కూడా డిజిపి రాముడు అభినందించారు.

ఉల్లాసంగా... ఉత్సాహంగా 10కె వాక్
* అలరించిన సినీ ఆర్టిస్ట్ విన్యాసాలు
గుంటూరు (స్పోర్ట్స్), జనవరి 24: ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదాంతో వేలాదిగా తరలివచ్చిన అన్ని వయస్సుల పురప్రజలు, పాఠశాల, కళాశాలల విద్యార్ధులతో ఆదివారం ఆద్యంతం 10కె వాక్ అట్టహాసమైంది. ఎన్‌ఆర్‌ఐ, ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలల ఆధ్వర్యంలో స్థానిక విద్యానగర్‌లోని ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల నుండి ప్రారంభమైన 10కె వాక్ పురవీధుల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. ప్రారంభంలో వివిధ కళాకారులతో సాగిన విన్యాసాలు, సినీ ఆర్టిస్ట్‌ల నృత్యాలు అలరించాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, ఎంపి రాయపాటి సాంబశివరావు, కలెక్టర్ కాంతిలాల్‌దండే, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రపసాద్, మాజీ ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాసరావు, శాప్ చైర్మన్ మోహన్, డిఎస్‌డిఒ రామకృష్ణ, ఎం రవీంద్ర, టివి రావు తదితరులు పాల్గొని నడకలో పాల్గొన్నవారిని అభినందించారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే నడక ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అతిథులు పిలుపునిస్తూ పోటీలు ప్రారంభించారు. అనంతరం వివిధ వయస్సు విభాగాల్లో విజేతలైన క్రీడాకారులకు నగదు, ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. 16 సంవత్సరాల బాలురలో డి విజయ్‌కుమార్, బాలికల్లో జి శ్రీలత మొదటిస్థానంలో నిలిచారు. అలాగే 25 సంవత్సరాల విభాగంలో గౌరీస్వామి, నూర్జహాన్, 45 సంవత్సరాల్లో జి రవికుమార్, బి అనూష, 60 సంవత్సరాల్లో కె రాజశేఖర్, ఎ లక్ష్మీసామ్రాజ్యంలు మొదటి స్థానాలను కైవసం చేసుకున్నారు.

బాల్య వివాహాల నిర్మూలనకు నడుంకట్టాలి
అమరావతి, జనవరి 24: బాల్యవివాహాలను అరికట్టేందుకు అందరూ కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అమరావతి సర్పంచ్ జి నిర్మలాదేవి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో తాడికొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అమరావతి, ధరణికోట సెక్టార్ల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ బాలికా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సమావేశానికి అమరావతి సెక్టార్ సూపర్‌వైజర్ ప్రమీలారాణి అధ్యక్షత వహించగా సర్పంచ్ నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైందని, చదువుకునే వయస్సులో పసి మొగ్గలకు బాల్యవివాహమనే దురాచారానికి బలి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్ సాయి మాస్టారు ఆధ్వర్యంలో కిషోర బాలికలకు జాతీయ బాలికా దినోత్సవంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు సిహెచ్ భారతి, ఉమాదేవితో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి అంగన్‌వాడీ కార్యకర్తలు, కిశోరబాలికలు పాల్గొన్నారు.
అమరావతి పురవీధుల్లో ర్యాలీ...
బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలు, విద్యార్థులు ప్లకార్డులు ధరించి అమరావతి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్ వద్ద ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా దుర్గావిలాస్ సెంటర్ వరకు చేరుకుని వెనుదిరిగింది. ఈ ర్యాలీకి సెక్టార్ సూపర్‌వైజర్ ప్రమీలారాణి, సిహెచ్ భారతి నాయకత్వం వహించారు.

ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో
పెరిగిన నమ్మకం
* స్పీకర్ కోడెల శివప్రసాదరావు
గుంటూరు (పట్నంబజారు), జనవరి 24: గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ప్రభుత్వాసుపత్రులపై సామాన్య ప్రజల్లో నమ్మకం కల్గించారని రాష్టశ్రాసనసభ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో మోకాలి శస్తచ్రికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌ను ఆదివారం సభాపతి డాక్టర్ కోడెల పరామర్శించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ మంత్రిగా ఉండి ప్రభుత్వ వైద్యశాలలో శస్తచ్రికిత్స చేయించుకోవడం వలన ప్రజలతో పాటు అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోనే కాక విదేశాల్లో సైతం పేరు గడించిన ఎందరో గొప్ప డాక్టర్లలో అధికశాతం మంది గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యనభ్యసించిన వారేనని స్పీకర్ గుర్తుచేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంకా ప్రభుత్వాసుపత్రుల్లో కొంతమేర పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అనేక రకాల శస్తచ్రికిత్సలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాలు నష్టదాయకం
పొన్నూరు, జనవరి 24: పొన్నూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆదివారం నిర్వహించబడిన బాలికా దినోత్సవం సందర్భంగా కిశోర బాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. సిడిపిఒ సుజాతాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ హెల్త్‌సెంటర్ వైద్యురాలు ప్రదీప, ఎంఇఒ నవీన్‌కుమార్ తదితరులు లింగ వివక్ష తగదని, వరకట్నం, బాల్యవివాహాల వల్ల సంభవించే అనర్ధాలను వివరించారు. స్ర్తికి విద్య ఎంత అవసరమో వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన మెహందీ, తాడు ఆట పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.

రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి
* మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన విద్యార్థి సంఘాలు

గుంటూరు (కొత్తపేట), జనవరి 24: హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ పిహెచ్‌డి విద్యార్థి వేముల రోహిత్ బలవన్మరణానికి దారితీసిన అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా నగరంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, డిహెచ్‌పిఎస్ నాయకులు కొత్తపేట సిపిఐ కార్యాలయం నుండి జిన్నాటవర్ సెంటర్ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి, గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తంచేశారు. దళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లాడ్జిసెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గుఱ్రం జాషువా విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల చిన కోటేశ్వరరావు నేతృత్వంలో స్థానిక లాడ్జిసెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి నగరంలోని పలు వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సముద్రాల డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రోహిత్‌కు మద్దతుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్న విద్యార్థి సంఘాలపై పోలీసుల వైఖరి అమానుషమని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేంద్రప్రభుత్వం స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. కార్యక్రమాల్లో ఆయా సంఘాల నాయకులు మహంకాళి సుబ్బారావు, సిహెచ్ రామకృష్ణ, కె ప్రసాద్, అరుణ్‌కుమార్, అనిల్, జంగాల చైతన్య, హనుమంతరావు, గోవిందు, జిఆర్ భగత్‌సింగ్, ఎన్ మోహన్‌కుమార్ వర్మ, బ్రహ్మయ్య, షేక్ రియాజ్, వైకె, బివి రమణయ్య, విద్యాసాగర్, శ్రీను, రియాజ్, విష్ణు, సాంబశివరావు, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ పటిష్ఠతకు ధూళిపాళ్ల, పరిటాల కృషి
గుంటూరు (కొత్తపేట), జనవరి 24: తెలుగుదేశం పార్టీ పటిష్ఠతకు, కార్యకర్తల సంక్షేమం కోసం మాజీ మంత్రు లు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, పరిటా ల రవి కృషి చేశారని పలువురు టిడిపి నాయకులు కొనియాడారు. ఇద్దరు నేత ల వర్ధంతిని పురస్కరించుకుని ఆదివా రం జిల్లా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు మాట్లాడుతూ పరిటాల పరిటాల రవి మృతి పార్టీకి తీరని లోటన్నారు. జిల్లాలో సంగం డెయిరీ ఏర్పాటుచేసి రైతులను అభివృద్ధిచేసిన ఆదర్శ నాయకుడుగా వీరయ్యచౌదరి కీర్తిపొందారన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ అనంతపూర్ జిల్లాలో టీడీపీ పటిష్ఠంగా ఉందంటే కారణం పరిటాల రవీంద్రని కొనియాడారు. కురియన్ జాతీయ పాల ఉత్పత్తిని పెంచడానికి కృషిచేస్తే జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచిన ఘనత ధూళిపాళ్లకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ వీరయ్యచౌదరి, పరిటాలలను కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు, తూర్పు ఇన్‌ఛార్జ్ మద్దాళి గిరి. పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాసయాదవ్, లాల్‌వజీర్, కంచర్ల శివరామయ్య, సుఖవాసి శ్రీనివాసరావు, మాదల వెంకటేశ్వర్లు, దారపనేని నరేంద్ర, చిట్టాబత్తిన చిట్టిబాబు, ముత్తినేని రాజేష్, నల్లపనేని విజయలక్ష్మి, మల్లె విజయ, ఉప్పలమర్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బస్సుయాత్ర
మంగళగిరి, జనవరి 24: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాన్ పొలిటికల్ జెఎసి ఆధ్వర్యాన ఈనెల 27న శ్రీకాకుళం నుంచి బస్సుయాత్ర ప్రారంభించ నున్నట్లు జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల శ్రీహరినాయుడు వెల్లడించారు. ఆదివారం జెఎసి కోకన్వీనర్ వివి ప్రసాద్, ఆర్గనైజర్ చెన్నా అజయ్‌కుమార్, ప్రభాకర్, కోటేశ్వరరావు, వీసం వెంకటేశ్వరరావు, కోటిరెడ్డి తదితరులతో కలిసి స్థానిక పెన్షనర్స్ హోంలో బస్సు యాత్ర పోస్టరును ఆవిష్కరించారు. శ్రీహరినాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి ప్రారంభించి బస్సుయాత్రను తిరుపతిలో ముగింపుసభ ఫిబ్రవరి 2న జరుగుతుందని, మేధావులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక హోదా కోసం గళం విప్పాలని, కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ అమలు జరపాలని కోరారు.

బాల్య వివాహాలు అనర్ధదాయకం
మంగళగిరి, జనవరి 24: బాల్య వివాహాలు చేయటం అనర్ధదాయకమని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. పట్టణంలోని 30వ వార్డులో జాతీయ బాలికా దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. పౌష్టికాహార ప్రాముఖ్యాన్ని వివరించారు. ఆడపిల్లల పట్ల వివక్ష ప్రదర్శించ వద్దని అన్నారు. పెదవడ్లపూడిలో జరిగిన బాలికా దినోత్సవంలో సర్పంచ్ చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ శ్రీలత పాల్గొన్నారు. బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ జరిపారు. ఆటల పోటీలు జరిపి విజేతలకు బహుమతులు అందజేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నకరికల్లు, జనవరి 24: ఆగి ఉన్న లారీని మరొక లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని శాంతినగర్ వద్ద ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. దాచేపల్లి నుండి నరసరావుపేటకు వెళ్ళేందుకు సిమెంటు లోడుతో బయలుదేరిన లారీ శాంతినగర్ వద్ద ఆగింది. అదే సమయంలో దాచేపల్లి నుండి చీరాలకు వెళ్ళేందుకు బయలుదేరిన మరోలారీ వెనుక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ బత్తుల వెంకటేశ్వర్లు (45) మృతి చెందగా, నంద్యాల ఏడుకొండలకు తీవ్ర గాయాలైనాయి. ఏడుకొండలును 108 వాహనంలో నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించిన అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు. నకరికల్లు ఎస్‌ఐ రమేష్ కేసు నమోదుచేసి, దర్యాప్తుచేస్తున్నారు.

విద్యలో మెళకువలు తెలుసుకోవాలి
భట్టిప్రోలు, జనవరి 24: కరేటే, కుంఫూ విద్యలలో మెళకువలు తెలుసుకుంటే తేలికగా విజయం సాధించవచ్చునని ఏపి కుంఫూ ఇన్‌స్ట్రక్టర్ వై ప్రభాకర్ అన్నారు. స్థానిక విశ్వశాంతి ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఆదివారం రాష్ట్ర స్థాయి కుంఫూ, కరాటే పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల కరస్పాండెంట్ వెంకటరావు అధ్యక్షత వహించారు. ప్రభాకర్ మాట్లాడుతూ ఈపోటీలు విద్యార్థులలో శారీరక శక్తిని పెంచడమేగాక, క్రమశిక్షణ అలవస్తాయన్నారు. విజయం గొప్పకాదని పోటీలలో తలపడటమే ముఖ్యమన్నారు. అనంతరం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖ, తూర్పు, పశ్చిమ తదితర జిల్లాల నుండి వచ్చిన 280మంది విద్యార్థులు సింగల్, గ్రూపు, వెపన్ డిమానుస్ట్రేషన్, ఫైరింగ్ విభాగాలలో తమ ప్రతిభను కనబరిచారు. ఉత్సహంగా సాగిన ఈ పోటీలు సందర్శకులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో టోర్నమెంటు ఆర్గనైజర్ కె జ్యోతి, పాఠశాల అడ్మినిస్ట్రేటర్ వెంకటప్పయ్య, వివిధ పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్లు పాల్గొన్నారు.