రాష్ట్రీయం

మళ్లీ తెరపైకి ‘అనర్హత’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడుతుందా? పడదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయించిన వారిపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం తప్పకుండా అనర్హత వేటు పడుతుంది. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నిన్న మొన్నటి వరకు టిడిపి శాసనసభాపక్షం నాయకునిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకర్ ముందు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పీకర్ త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం లేదని కోర్టునూ ఆశ్రయించారు. దయాకర్‌రావు ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో చేరినందున, ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుని యథేచ్ఛగా టిఆర్‌ఎస్‌లో చేరిపోవచ్చు. కానీ ఎమ్మెల్యేలంతా ఒకేసారి చేరలేదు కాబట్టి ఈ విలీనం చెల్లదని టిడిపి వాదిస్తోంది. దీనిపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుంది? అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రూపొందించిన చట్టంలో అనేక లొసుగులు ఉండడంతో, వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో (2003) 10వ షెడ్యూలును పకడ్బందీగా రూపొందించారు. దీని ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుంది. తాను ఫలానా పార్టీలో చేరానంటూ ప్రకటించినా అనర్హత వేటు పడేలా చట్టం చేయడం జరిగింది. అయితే మూడింట రెండు వంతుల మంది ఫిరాయించినట్లయితే అది చెల్లుబాటు అవుతుంది. ఆ లెక్కన 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున ఎన్నికైన 15 మంది ఎమ్మెల్యేలలో 10మంది టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు కాబట్టి వారంతా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదనేది అధికారపక్షం వాదన.
పిఆర్‌పి విలీనంలో చిక్కే లేదు
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ మేరకు పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, తీర్మానం ఆమోదించి నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి తమ పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు ఆ పార్టీ విలీనానికి పెద్దగా చిక్కులేమీ రాలేదు. ఎందుకంటే 2002లో జరిగిన చట్ట సవరణ ఆ పార్టీకి కలసి వచ్చింది. పార్టీ మొత్తం విలీనం కావాలని అనుకున్నప్పుడు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు (కనీసం మూడింట రెండు వంతులమంది) సమర్థించాలి. ఈ నిబంధనల మేరకే ప్రజారాజ్యం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అయితే ఈ విలీనాన్ని తాము ఆమోదించడం లేదని, తాము ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతామని అప్పటి ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈలోగా పిఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనమైనట్లు సిఇసి ప్రకటించింది. కానీ శోభానాగిరెడ్డి, కాటసాని మాత్రం తాము పిఆర్‌పి ఎమ్మెల్యేలమేనని ప్రకటించుకున్నారు. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు తమకు ఇష్టం వచ్చిన పార్టీలో చేరిన తర్వాత కూడా ఇష్టం లేని వారు పూర్వపు పార్టీకి చెందిన వారిగానే పరిగణించాలని చట్టంలో స్పష్టంగా ఉంది. పార్టీ లేకపోయినా, గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలు 2/3 వంతు చొప్పున విడిపోతూ తమకు నచ్చిన పార్టీలో చేరేందుకు 10వ షెడ్యూలు అవకాశం కల్పించింది.
స్పీకర్‌దే నిర్ణయం?
ప్రస్తుత విషయానికొస్తే, టిడిపికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలలో 10 మంది టిఆర్‌ఎస్ గూటికి చేరినందున 2/3 ప్రకారం వారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి వస్తారా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. టిడిపి ఎమ్మెల్యేల విషయంలో పదిమందీ ఒకేసారి కాకుండా, ఒకరొకరుగా టిఆర్‌ఎస్‌లో చేరారు.
ఇది చెల్లదని టిడిపి వాదిస్తోంది. ఒకవేళ స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేల విలీనాన్ని ఆమోదించినట్లయితే మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలనూ టిడిపి ఎమ్మెల్యేలుగా పరిగణించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనే జరిగితే ఆ రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందన్నది టిడిపి వాదన.