మాతో - మీరు

ఆలోచింపజేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవర్‌స్టోరీ ‘చదువా చంపకే’ ఆలోచింపజేసింది. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటంతో సహజంగానే ఆ కాలేజీల్నే దోషులుగా చూడటం జరుగుతోంది. కాని మార్కులు, ర్యాంకులూ అంటూ తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి కూడా ముఖ్య కారణమే. ఏ చదువులూ, పరీక్షలూ లేకుండా విద్యార్థులు పదో తరగతి వరకు వచ్చేసి అక్కడ నుంచి పరీక్షల గట్టు ఎక్కలేక ఒత్తిడికి గురి కావడం మరో ముఖ్య కారణం. ఇదొక విష వలయం. విషమ వలయం. దీన్ని ఛేదించడం అంత సులభం కాదు.
-ఆర్.సత్య (కరప)
ఉత్తేజం
మన నైపుణ్యాలు పెంచుకోవడానికి ఉద్యోగం ఒక అవకాశం కల్పిస్తుంది. ఎదురవుతున్న సవాళ్లని అధిగమించడానికి మెదడుని ఉత్తేజపరుస్తుంది ఉద్యోగం అంటూ సండే గీత-లో చక్కగా వివరించారు. మరణించిన వారిని స్మరించుకుంటూ ప్రతి ఏటా మనం తద్దినాలు పెడతాం. అది మన సంప్రదాయం. కాని మెక్సికో దేశ ప్రజలందరూ ఒకే రోజు తమ కుటుంబాల్లో మరణించిన వారికి నివాళి అర్పించడం వింతగా ఉంది. 7వేల గుమ్మడి పండ్లను కళాఖండాలుగా తీర్చిదిద్ది వాటిలో వెలుగు దివ్వెలను అమర్చి అద్భుత కళాకాంతులు వెదజల్లే ఉత్సవం భలేగా ఉంది.
-ఎస్.సంపూర్ణ (సాంబమూర్తినగర్)
సంగీత దానం
గోపాలంగారు ‘లోకాభిరామమ్’లో చెబుతున్న సంగతులు చదువుతూంటే అలా అలా ప్రశాంతంగా గతంలోకి వెళుతున్నట్టు అనిపిస్తుంది. సంగీత మిత్ర సంగీత దానాల గురించి చెప్పిన విషయాలు అలరించాయి. అమృతవర్షిణిలో కూడా ‘ఆనంద సాగరమీదని దేహము భూమి భారమంటూ’ చెప్పిన విషయాలూ ఆనంద సాగరంలో ఓలలాడించాయి. గుండ్రని బంతి లాంటి గూడులో ఏకధాటిగా ఏడు నెలలు నిద్ర పోడానికి ఇష్టపడే నిద్రప్రియ దోర్‌వౌస్ విశేషాలు అబ్బురపరిచాయి. ఆడ నైటింగేల్‌ని ఆకర్షించడానికి మగ నైటింగేల్ కూత పెట్టడం, తర్వాత జత కట్టి గుడ్లు పెట్టాక వాటిని రక్షించడానికి తమ ఉనికి తెలియకుండా కూత మాని జాగ్రత్త పడటం ఆహా! ప్రకృతి వైచిత్రి!
-జె.్ధర్మతేజ (గొడారిగుంట)
ప్రశంసనీయం
ఏదో ఒక ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని వస్తువులు కొంటాం కాని నిర్లక్ష్యం వల్ల గాని అశ్రద్ధ వల్ల గాని వాటిని సక్రమంగా ఉపయోగించకుండా వృధా చేస్తాం. అయితే మనని మనం వృధా చేసుకోకుండా మనల్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పిన ‘ఓ చిన్న మాట’ ప్రశంసనీయంగా ఉంది. 20 ర్యాంపులు, 15 బయటకు వెళ్లే మార్గాలతో సుమారు 17 కిలోమీటర్ల పొడవున్న పద్మవ్యూహం లాంటి వంతెనల మార్గం ఫొటో అద్భుతం. ఐలయ్య రేపిన దుమారాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన కవిత భేషుగ్గా ఉంది. చివరి పంక్తులు మరీ భేష్.
-శాండో ప్రచండ్ (శ్రీనగర్)
చాదస్తం
పెద్ద ఉద్యోగం, హోదా లభించగానే తల్లిదండ్రులను తలతిక్క చాదస్తులనుకుంటాడు కొడుకు. ఎత్తుకెదిగి మారిపోయిన కొడుకుని మందలించలేక వౌనంగా బాధను దిగమింగడం తల్లిదండ్రుల వంతు అని సుతిమెత్తగా చక్కగా వివరించింది ‘గమనం’ కథ. పని ఒత్తిడిలో తీరిక లేక పిల్లవాడిని నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లవాడిలో కలిగే భావ సంచలనం ఎలా ఉంటుందో చైల్డ్స్ ప్లే కథ చక్కగా వివరించింది. నిజానికి ఈ కథలో విలన్స్, స్కౌండ్రల్స్, రాస్కెల్స్ లేరు. క్రైం కథ కూడా కాదు. అయితే తండ్రి నిర్లక్ష్యమే అనర్థానికి మూలం అని చెప్పే నీతి ఉంది. బాగుంది.
-బి.సోనాలి (సూర్యారావుపేట)
శ్లాఘనీయం
తాత తండ్రులు లాగానే ఏ మార్పూ లేకుండా వ్యవసాయం చేస్తూ అది కిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులున్న ఈ రోజుల్లో ఎరువులు, పురుగు మందులు వాడకుండా వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నత ఉద్యోగుల్లాంటి విద్యావంతులు సేంద్రియ సేద్యం చేపట్టి అద్భుత విజయాలు సాధించడం శ్లాఘనీయం. కాస్త ధర ఎక్కువైనా ప్రజలు సేంద్రియ పదార్థాలు తినేందుకు ఇష్టపడటం శుభ సూచన. ఏది ఆలోచనో అదే యధార్థం అని చెప్పిన కథాసాగరంలోని కథ అలరించింది. ఆలోచింపజేసింది. దుర్మార్గపు అసంబద్ధ ఆలోచనలు తగవని పరోక్ష నీతి చెప్పారు.
-కె.సుధీర్ (శ్రీనగర్)
పరమాత్మ స్వరూపం
అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు. నిజమే కదా. రాగ ద్వేషాలకు అతీతంగా మెలగడం అత్యంత దుర్లభం. ద్వేషాన్ని త్యజించాలి. రాగము అనబడే అనురాగము లేని మనసున్నవాడు మనిషి కాజాలడు. మరెవరు? పశువా - పశుపతా? రాగద్వేషాలకు అతీతుడు దేవుడు. దేవుడెవరు? ఎలా ఉంటాడు? ఇది తర్కానికి, జ్ఞానానికి అందని ప్రశ్న. ఏకాగ్రత ఏర్పడడానికో స్వరూపం కావాలి. ఆ స్వరూపం మన ఇష్టదైవం కావచ్చు - మరొకరు కావచ్చు. స్వరూప ధ్యానంలో నిష్టాగరిష్టుడై తన్మయత్వంలో అలౌకికానందానికి చేరి ఆత్మానంద స్థితికి చేరుకున్న వారికిక స్వరూపం గోచరించదు. ఈ చరాచర జగత్తులోని అన్ని పదార్థాలలోనూ నిరాకారుడైన భగవత్ స్వరూపాన్ని దర్శించగలిగిన మహానుభావులెందరో ఈ పుణ్యభూమి, వేదభూమి మీద జన్మించి తాము చరితార్థులై, ముందు తరాల వారికి సుగమమైన బాటను చూపారు. మనం చూస్తున్నదంతా మిథ్య. మాయ. ఈ మాయ నుంచి బయటపడటం మాటలు కాదు. అనుభవమయితే గాని తత్వం బోధపడదు. ‘అమృతవర్షిణి’లో ఇటువంటి ఎన్నో విషయాలను చక్కగా వివరిస్తున్నందుకు కృతజ్ఞతలు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)