మెయన్ ఫీచర్

సెక్యులరిజానికి సెక్యులరిస్టుల హాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవనే మాటతో పోల్చి చెప్పుకోవాలంటే, సెక్యులరిజానికి సెక్యులరిస్టులమనే వారు తప్ప మరెవరూ హాని చేయలేరు. సెక్యులరిజం ఏ సమాజంలోనైనా అంతర్నిహితంగా ఉం టుంది. ప్రజల జీవితంలో భాగమై ఉం టుంది. అది సహజమైన జీవన సిద్ధాంతమే గనుక ఏ సైద్ధాంతికులు ప్రత్యేకంగా బోధించనవసరం లేదు. ఇది వాస్తవాలతో నిమిత్తం లేని కేవలం ఆదర్శవాదమని ఎవరైనా అనవచ్చు. అవును నిజమే. సమాజాలు మొదటినుంచి ఆదర్శంగానే ఉండేవి. వాటిని ఆదర్శ విరుద్ధంగా మార్చింది సాధారణ ప్రజలు కాదు. రకరకాల ప్రయోజనపరులు ఆపని చేశారు.
భారత సమాజం ఇటువంటి అవాంఛనీయమైన దశలోకి ప్రవేశించిందనుకుంటే అందుకు బాధ్యులెవరు? సెక్యులరిజం పట్ల విశ్వాసం లేని శక్తులది ఇందుకు బాధ్యత అని సెక్యులరిస్టులమనేవారు వాదిస్తున్నారు. కాని తమ వైఫల్యాల గురించి ఆత్మ పరిశీలన చేసుకోవడంలేదు. వాటిని సరిదిద్దుకోవడంలేదు. ఈ విధంగా దశాబ్దాలు గడుస్తున్నా వారి ధోరణి మారటంలేదంటే అసలు వీరికి సెక్యులరిజం దెబ్బతినడానకి కారణాలు ఏమిటో అర్థమైనాయా? సెక్యులరిజాన్ని నిలబెట్టాలనే చిత్తశుద్ధి ఉన్నదా? నిలబెట్టగల కార్యాచరణ ఏమిటో తెలుసునా? ఆ పని చేయగల శక్తి సామర్ధ్యాలు ఉన్నాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఈనెల 20వ తేదీన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో లౌకిక వ్యవస్థపై దాడులు పెరుగుతున్నాయిని, ఆ స్థితిని సమైక్యంగా ప్రతిఘటించేందుకు కాంగ్రెస్‌తో సహా లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, శక్తులు అన్నీ ఒకే తాటిమీదకు రావాలని ప్రకటించారు. సమస్యపై ప్రజలను చైతన్యపరిచేందుకు దేశవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించేందుకు తమ పార్టీ జాతీయ సమితి ఇటీవల నిర్ణయించినట్టు చెప్పారు. కనుక ఆ ప్రకారం రానున్న రోజుల్లో విస్తృతంగా సెమినార్లు జరగగలవని, అక్కడ కాంగ్రెస్ సహా వివిధ సెక్యులర్ పార్టీలు, రాజకీయేతర సంస్థల ప్రతినిధులు గంభీరంగా, ఉద్వేగంగా ప్రసంగాలు చేయగలరని భావించవచ్చు. కాని ఇక్కడ ఒక సమస్య ఉంది. దేశంలో సెక్యులరిజానికి ముప్పు ఏర్పడిందని సెక్యులరిస్టులు ఆందోళన చెందుతున్న గత పాతికేళ్లలో ఇటువంటి నిర్ణయాలు, సెమినార్లు, ప్రసంగాలు లెక్కలేనన్ని జరిగాయి. సెమినార్ హాళ్లకు బయట రకరకాల కార్యక్రమాలు అంతులేకుండా సాగాయి. కాని ఈ పాతికేళ్ల తర్వాత వెనుకకు తిరిగి సమీక్షించుకుంటే బ్యాలన్స్ షీటు ఏమిటో వీరెపుడైనా చూసుకున్నారా? అది కేవలం శూన్యానికి చేరడం కాదు, మైనస్ లోకి వెళుతున్నట్లు గ్రహించారా? వీరెవరూ అవివేకులు కాదు, అనుభవం లేనివారు కారు. అందువల్ల తప్పక గ్రహించే ఉంటారు. కాని సమస్య ఏమిటంటే వీరికి చేయవలసిందేమిటో బోధపడటం లేదు. దానితో అక్కడక్కడే వలయాలుగా తిరుగుతున్నారు తప్ప ముందుకు పోలేకపోతున్నారు. మరొకవైపు బ్యాలెన్స్ షీటులో మైనస్ స్థితి పెరుగుతూనే ఉంది.
సెక్యులరిస్టులమనే వారు తెలుసుకోవలసిన మొట్టమొదటివిషయం అది. కేవలం గాలిలో తేలియాడే ఉత్తేజకరమైన నినాదం కాదు. శుష్కమైన ఆదర్శం కాదు. దానికొక మెటీరియల్ ఆధారం ఉంటుంది. ఈ మాట ను ముఖ్యంగా మార్క్సిస్టులైన మెటీరియలిస్టులకు చెప్పవలసిన అవసరం ఉండకూడదు. సెక్యులరిజం జీవితంలో, సమాజంలో ఒక సహజమైన భాగం అనుకున్నప్పుడు అందుకు తగిన మెటీరియలిస్టు ఆధారాలు, పునాదులు కూడా జీవితంలో, సమాజంలో ఉండాలి. లేనపుడు ఏ సహజ నిర్మాణాలైనా, సంస్కరణలైనా దెబ్బతింటాయి. దేశానికి స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన నాయకత్వం ఈ అవసరాన్ని గుర్తించింది. స్వాతంత్య్రానంతరం చిరకాలం పాటు అదేస్థితి కొనసాగింది. ఆ కాలమంతా సెక్యులరిజానికి ప్రత్యేకమైన ప్రమాదమేమీ ముంచుకు రాలేదు. ఎందుకంటే సెక్యులరిజపు మెటీరియల్ ఆధారాలను కాపాడేందుకు నాయకత్వం ప్రయత్నించింది. దానితో సెక్యులర్ కావాలనేవారి ప్రవేశానికి ఒక శూన్యం అంటూ ఏర్పడలేదు.
వాస్తవానికి సెక్యులరిజం ఆ నిర్దిష్టకోణంతో సంబంధం లేకుండా ఒక శూన్యం అంటూ ఏర్పడడం దేశంలో 1960ల నుంచే మొదలైంది. ఆ శూన్యం వల్లనే 1960ల మధ్యకాలం నుంచే దేశంలో యువజనులు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, ప్రాంతీయంగా వెనుకబడిన శక్తులలో అశాంతి తలెత్తడం మొదలైంది. అటువంటి వైఫల్యాల పట్ల నిరసనకు కొనసాగింపుగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో ఓడడం, కేంద్రంలో బలం తగ్గడం, ప్రాంతీయ ప్రత్యామ్నాయాల ఆవిర్భావం, నిరంతర ఆందోళనలు నక్సలైట్ ఉద్యమం, గుజరాత్-బిహార్ ఉప్పెనలు, ఎమర్జెన్సీ విధింపు, కేంద్రంలో అస్థిరతలు, పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు అధికారం వంటి పరిణామాలు అనేకం దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వేగంగా సాగాయి. అనగా, ఇటువంటి పరిణామాలకు మూలమైన శూన్యా న్ని సృష్టించినవారు తమ అధికార పరిరక్షణకు తాపత్రయ పడ్డారుగాని, ఆ శూన్యాన్ని తొలగించేందుకు అవసరమైన చర్యలను మాత్రం తీసుకోలేదు. స్వాతంత్రోద్యమ కాలపు మహోన్నత భారత నాయకత్వం స్థానంలో, ఆ తరం గడిచిపోయిన వెనుక ఒక హ్రస్వదృష్టి గల మరుగుజ్జు నాయకత్వం అవతరించింది.
ఈ శూన్యంలో అనేకానేకం లేకుండా తొలగిపోయినట్లే, సెక్యులరిజానికి జీవితంలో, సమాజంలో ఆధారభూతం కాగల అంశాలు కూడా తొలగిపోవడం మొదలైంది. అది గ్రహించి అందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టవలసిన నాయకత్వం ఆ పని చేయకపోగా, కేవలం తన అధికార పరిరక్షణ కోసం సెక్యులరిజాన్ని ఒక ఉద్వేగపూరిత నినాదంగా మార్చింది. అందులో కపటం తప్ప నిజాయతీ లేకపోయింది. గమనించదగిన దేమంటే కాంగ్రెస్ మాట సరేసరి కాగా సుధాకర రెడ్డి పార్టీ సహా వామపక్షాలు సైతం ఇదే వలయంలో చిక్కుకొని పోయాయి. సూటిగా చెప్పుకోవాలంటే ఇది అంతిమ సారాంశంలో అధికార తాపత్రయపు వలయం. వామపక్షాలకు సెక్యులరిజం పట్ల నిజమైన నిబద్ధత లేదనలేము. కాని ఆ రాజకీయ కల్లోలం మధ్య ఇతర అంశాలు ముందుకు వచ్చి ఇది వెనుకకుపోయింది. మాటల ప్రాధాన్యతకు తగిన చేతల ప్రాధాన్యత కన్పించలేదు. కాంగ్రెస్ పార్టీ స్వయంగా వ్యూహాత్మకగా సెక్యులర్‌గానైనా ఎత్తుగడల రీత్యా మతం కార్డు ఉపయోగించడం ఆరంభించిన తర్వాత కూడా వామపక్షాల తీరు మారలేదు. సరిగా అటువంటి స్థితిలో భాజపా నాయకుడు ‘సూడో సెక్యులర్’ అనే పదబంధాన్ని సృష్టించారు. అది కాంగ్రెస్‌కు, కమ్యూనిస్టులకు చాలా ఇబ్బంది కలిగించింది గాని అందులోని నిజాన్ని చాలామంది గుర్తించారు. చివరకు మైనారిటీ వర్గాలవారు కూడా. అందుకే తమ అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపకుండా తమను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారనే విమర్శను సెక్యులరిస్టులపై భాజపాతో పాటు వారు కూడా చేయడం మొదలుపెట్టారు. పశ్చిమ బెంగాల్ ముస్లింల స్థితిగతులపై సచార్ కమిటి నివేదికతో ఇందుకు తిరుగులేని విలువ ఏర్పడింది. ఇప్పుడక్కడి ముస్లింలు ఎవరికి ఓటు వేస్తున్నారో తెలిసిందే. ఇతరత్రా కూడా ఆ వర్గాలు కాంగ్రెస్, కమ్యూనిస్టుల నుంచి దూరమై ప్రాంతీయ పార్టీలకు సన్నిహితం కావటమో లేక తమ పార్టీల ఏర్పాటుకు ప్రయత్నించడమో ఒక కొత్త రాజకీయ ధోరణిగా మారింది. దీనంతటిలోని వాంఛనీయతలు, అవాంఛనీయతల గురించి చర్చించడంలేదిక్కడ. కాని సెక్యులరిజం దెబ్బతినడానికి కారణాలేమిటి? బాధ్యులెవరు, పైని పేర్కొన్న అనేకానేక కొత్త పరిస్థితులు, భావజాలాల ప్రవేశానికి వీలుగా ఒక శూన్యం అంటూ ఏవిధంగా ఏర్పడిందన్నది మనం గుర్తించవలసిన వౌలిక విషయం. ఇదే గుర్తింపు సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలకు, సంస్థలకు కలగనంతవరకు, అందుకు తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టనంతవరకు, ఎన్ని ‘పార్టీలూ, శక్తులూ’ ఏకమైనా, ఎన్ని సెమినార్లు జరిపినా ప్రయోజనం శూన్యం. పశ్చిమ బెంగాల్ అటువంటి చోట 34 సంవత్సరాల ఏకధాటి పరిపాలన అనంతరం కమ్యూనిస్టులే అటువంటి శూన్యాన్ని సృష్టించుకున్నారంటే, ఇక చెప్పవలసింది ఏముంటుంది? ఇతరత్రా దేశంలోనూ సెక్యులరిస్టుల పట్ల విశ్వాస రాహిత్యం, వారిసంస్థాగత బలహీనతలు, మేధో దారిద్య్రాలు అందరికీ అర్థమవుతున్నాయి. అటువంటి స్థితిలో సెమినార్లు, ధర్నాలు అసహాయ ఆక్రందనలు మాత్రమే అవుతాయిగాని, విషయం చక్కబడగలదనే సూచనలు కాబోవు.
ఈ దుస్థితికి సెక్యులరిస్టులు తమను తామే నిందించుకోగలరు. సెక్యులరిజానికి ఇతరులు చేస్తున్న హాని మాట ఎట్లున్నా స్వయంగా వారు కొన్ని దశాబ్దులుగా తమకు తాము చేసుకుంటున్న హాని అనేక రెట్లు ఉంది. పైన అనుకున్నట్లు జీవితంలో, సమాజంలో సెక్యులరిజం ఒక సహజస్థితి. అది మొదటినుంచి ఉంది, ఇప్పటికీ ఉంది. దానిని అందుకోలేనిది, అందుకు తగినట్లు వ్యవహరించలేనిది సెక్యులర్ నినాదాలవారు మాత్రమే. వారు ఆ వాదనను తాము రాజకీయంగా బలహీన పడుతుండిన క్రమంలో ఒక అధికార సాధనంగా ఉపయోగించుకోడవం, సెక్యులర్ భావనకు గల జీవితాధారాలను, సామాజిక ఆధారాలను పట్టించుకొనకపోవడం, అట్లా పట్టించుకోనందున మొత్తంమీదనే దెబ్బతినడంవల్లనే సెక్యులరిజం అనే నిర్దిష్ట అంశంతో కూడా తమకు తాము హాని కలిగించుకోవడం అన్నవి ఈ కథలోని చేదు నిజాలు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)