మెయన్ ఫీచర్

‘అగ్ర’ భూతం నీడలో ఉగ్ర మృగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ సైనిక దళాలతో కలసి ఉమ్మడి విన్యాసాలను జరపడానికి వీలుగా రష్యా సైనిక బృందాలు సెప్టెంబర్ 23న పాకిస్తాన్‌కు తరలిరావడం ‘గొప్ప’ చారిత్రక విపరిణామం. అదే రోజున అమెరికాలో మరో వికృత పరిణామం ప్రపంచ దేశాలను వెక్కిరించింది. జిహాదీ బీభత్సకారులను ఉసిగొల్పిన నేరానికి సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని న్యాయస్థానాలలో నిలబెట్టడానికి వీలుకల్పిస్తున్న ‘బిల్లు’ను అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తిరస్కరించాడు. ఈ ‘బిల్లు’ను అమెరికా ‘కాంగ్రెస్’-పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. జిహాదీ బీభత్స వ్యవస్థగా రూపొందిన పాకిస్తాన్‌తో ‘ప్రజాస్వామ్య’ రష్యా ఇక్కడ ఇలా చేతులు కలుపుతోంది. అతి తెలివిగా జిహాదీ బీభత్సకాండను ఉసిగొల్పుతున్న సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని అమెరికా ప్రభుత్వం వెనకేసుకొస్తోంది! ఈ సమాంతర విపరీత విన్యాసాలకు మరో వైపరీత్యం కూడ తోడయింది! చైనా ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో పాకిస్తాన్‌లో నిర్మిస్తున్న ‘ఆర్థిక ప్రాంగణం’లో తాము కూడ భాగస్వాములం కావాలని భావిస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించడం ఈ వైపరీత్యం! అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో మన దేశానికి మిత్రులెవరన్న నిర్ధారణ జరుపడానికి జరుగుతున్న ప్రయత్నం ఈ విచిత్రాలకు ప్రాతిపదిక! పాకిస్తాన్‌కు చైనావలె మన దేశానికి అత్యంత మిత్రదేశం ఎవరు? ‘ఊరీ’లో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సకారులు మన పదిహేడుగురు సైనికులను హత్యచేసిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వ వికృత స్వభావాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేయడానికి మన ప్రభుత్వం ఉద్యమిస్తోంది. ఈ ఉద్యమం ఫలితాలను ఇస్తోంది కూడ. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ వంటి పొరుగుదేశాలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉగ్ర రాజ్యాంగ వ్యవస్థగా పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్సకాండను పురికొల్పుతున్న వ్యవస్థగా గుర్తించడానికి వీలుకల్పించే ‘బిల్లు’ను సెప్టెంబర్ 21వ తేదీన అమెరికా ‘కాంగ్రెస్’-పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. పాకిస్తాన్‌ను ‘ఒంటరి’ని చేసి ఆ ప్రభుత్వం నిర్వహిస్తున్న బీభత్సకాండను విరోధించాలని మన విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ 26వ తేదీన ‘ఐక్యరాజ్యసమితి’ సర్వప్రతినిధి మండలిలో పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు ముందే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ స్వయంగా పాకిస్తాన్ బీభత్స విధానాన్ని తప్పుపట్టాడు. 21వ తేదీన ఆయన పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను ‘సమితి’ ప్రాంగణంలోనే మందలించాడు. కానీ మరోవైపు పాకిస్తాన్‌కు రష్యా, ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న సౌదీ అరేబియాకు అమెరికా ప్రభుత్వం ‘చెలిమిచేతుల’ను అందిస్తుండడం సమాంతర వైపరీత్యం.. ద్వంద్వ నీతి మాత్రమే అంతర్జాతీయ న్యాయం.
చైనా, రష్యాలు అమెరికాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచ్ఛన్నయుద్ధం జరుపుతుండడం నడుస్తున్న చరిత్ర. దీనివల్ల రష్యా మనదేశానికి దూరంగా జరిగింది, ఇంకా జరుగుతోంది. మన దేశం పట్ల స్నేహం కంటె అమెరికాతో తాము జరుపుతున్న ప్రాబల్య సమరానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందువల్ల రష్యాతో చైనా జట్టుకట్టకలిగింది. రష్యా,చైనాల మైత్రి ఫలితంగా రష్యా పాకిస్తాన్ ‘రక్షణ’ వ్యూహాత్మక మైత్రిని పెంపొందించుకొనడం గత కొన్ని ఏళ్ళుగా రూపుదిద్దుకుంటున్న విపరిణామం. ‘రష్యా-పాకిస్తాన్’ల ఉమ్మడి సైనిక విన్యాసాలు ఇప్పుడు పాకిస్తాన్‌లో నడుస్తున్నాయి. చరిత్ర ఇలా తల్లకిందులు అయింది. 1947 నుంచీ పాకిస్తాన్‌కు అమెరికా అత్యంత సన్నిహిత దేశం. అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమిలో పాకిస్తాన్ భాగస్వామి అయింది. క్రీస్తుశకం 1965వ సంవత్సరంలోను, 1970వ, 1971వ సంవత్సరాలలోను మనకూ పాకిస్తాన్‌కు జరిగిన యుద్ధాలలో అమెరికా పాకిస్తాన్‌కు అండగా నిలబడింది. 1971లో మనకూ, రష్యాకు మధ్య ‘శాంతి స్నేహ’ సహకారపు ఒప్పందం కుదిరింది. ఇరవై ఏళ్ల తరువాత ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించుకొనే నాటికి అంతర్జాతీయ రాజకీయం, రష్యా రూపురేఖలు మారిపోయాయి. 1991వరకు సోవియట్ రష్యా, అమెరికా అగ్రరాజ్యాలు! అమెరికా చంకనెక్కిన పాకిస్తాన్‌ను సోవియట్ రష్యా శత్రుదేశంగా పరిగణించడం చరిత్ర.. శత్రువులైన పాకిస్తాన్, రష్యాలు ఇప్పుడు గొప్పమిత్రులుగా మారిపోయారు. చైనా మనకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న అంతర్జాతీయ విష వ్యూహంలో ఈ ‘రష్యా పాకిస్తాన్‌లవి నూతన విచిత్ర మైత్రి’్భగం, రష్యా ప్రభుత్వం చైనాకు ‘వాలం’..!
క్రీస్తుశకం 1990వ దశాబ్ది ఆరంభం వరకు సోవియట్ రష్యాకు అమెరికాకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. 1980వ దశకం చివరిలో ఐరోపా దేశాలవారు, 1991లో సోవియట్ రష్యా ప్రజలు కమ్యూనిస్టు నియంతలపై తిరుగుబాటుచేశారు. ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థను తొలగించి బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. కమ్యూనిస్టు సామ్రాజ్య విచ్ఛిన్నం తరువాత ‘సోవియట్ రష్యా’ పదహైదు దేశాలుగా విడిపోవడం సమాంతర పరిణామం! సంయుక్త సోవియట్ రష్యా ప్రాతినిధ్య వారసత్వం ‘రష్యా’ కు లభించడం సహజం. ఎందుకంటె ఈ పదిహేను దేశాలలో రష్యా అతి పెద్దది. మిగిలిన పదునాలుగు దేశాల మొత్తం జనాభా రష్యా జనాభాకంటె తక్కువే! మిగిలిన దేశాలు మొత్తం భూభాగం విస్తీర్ణం యాభైఐదు లక్షల చదరపు కిలోమీటర్ల కంటె తక్కువ. రష్యా భూమి వైశాల్యం ఒక కోటి డెబ్బయి లక్షల చదరపు కిలోమీటర్ల కంటె ఎక్కువ. అందువల్ల కమ్యూనిస్టు సోవియట్ రష్యాకు ప్రస్తుత ప్రజాస్వామ్య రష్యా ప్రతినిధి కావడం సహజం. మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం. ‘కమ్యూనిస్టు రష్యా’ మన దేశంలో అతి సన్నిహిత మైత్రిని నెరపడం ‘ప్రజాస్వామ్య రష్యా’ మనకు వ్యూహాత్మకంగా వ్యతిరేకంగా మారడం ద్వైపాక్షిక దౌత్య విచిత్రాలు. అగ్రరాజ్యాల ఆధిపత్య సమరం వివిధ దేశాల విధానాలను నిర్ధారిస్తోంది. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తరువాత రష్యా ‘అగ్రస్థానాన్ని’ కోల్పోయింది. అమెరికా దాదాపు దశాబ్దికి పైగా ఏకైక అగ్రరాజ్యంగా అంతర్జాతీయ గతిని నిర్దేశించింది. ఆ తరువాత మళ్లీ అమెరికాకు ‘ప్రత్యర్థి’ అవతరించింది. ఈ ప్రత్యర్థి చైనా! ఇప్పుడు, పదేళ్లుగా అమెరికా,చైనాల మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న సమరం ప్రత్యక్ష సమరంగా మారడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ ‘రంగభూమి’ వియత్నాంకు తూర్పుగా చైనాకు దక్షిణంగా విస్తరించి ఉన్న సముద్రం. ఈ సముద్రంలో మన దేశం వియత్నాంతో కలసి ‘ఇంధన తైలం’, ‘ఇంధన వాయువు’ల అణ్వేషణ జరపడాన్ని చైనా ఐదేళ్లకు పైగా నిరోధిస్తోంది. ఈ సముద్రం అంతా తనదేనని ప్రకటించిన చైనా ఇతర దేశాల వాహనాల రాకపోకలను నిరోధించ యత్నిస్తోంది. దీన్ని అమెరికా ఐరోపా దేశాలు ఆస్ట్రేలియా జపాన్ దేశాలు తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా దేశాలు ప్రతిఘటిస్తున్నాయి. ఈ సముద్ర జలాలలో చైనాకు, చైనా ప్రత్యర్థులకు మధ్య సమర జ్వాలలు రాజుకుంటున్నాయి. ఈ ప్రత్యర్థులకు అమెరికా నాయకత్వం వహిస్తోంది. జపాన్‌కు దక్షిణంగా చైనాకు తూర్పుగా విస్తరించిన సముద్రం కూడ మొత్తం తన సార్వభౌమ జలమని చైనా రెండేళ్లక్రితం ప్రకటించి, ఈ సముద్రంపై విస్తరించి ఆకాశంలో ‘రక్షణ మండలాన్ని’ ఏర్పాటుచేసింది. ఇతర దేశాల ‘గగన శకటాలు’ తమ అనుమతి లేకుండా ఈ ఆకాశంలో పయనించరాదని కూడ చైనా ప్రభుత్వం నిర్దేశించింది. అందువల్ల అమెరికా, చైనాల ఆధిపత్య సమరానికి ఈ సముద్ర ప్రాంతం మరో రంగభూమి..
అమెరికా వ్యతిరేకతతో మాత్రమే వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలో రష్యా చైనాతో జట్టుకట్టింది. ‘సోవియట్ రష్యా’ విచ్ఛిత్తి తరువాత అవశేష రష్యాకు చైనాతో పెద్ద సరిహద్దు లేకుండాపోయింది. చైనాకు,రష్యాకు నడుమ- మధ్య ఆసియాలోని స్వతంత్ర దేశాలు నెలకొన్నాయి! ఈమధ్య ఆసియా దేశాలు 1991వరకు ‘సోవియట్ రష్యా’లో ఉండేవి. ఇలా 1991 తరువాత రష్యాకు చైనాతో సరిహద్దు వివాదం సహజంగా పరిష్కారమైనది. అందువల్ల చైనాతో చెలిమికి రష్యా సిద్ధపడింది! చైనా ప్రభుత్వం కారణంగానే రష్యా, పాకిస్తాన్‌లు 2014 నవంబర్‌లో చరిత్రలో మొదటిసారిగా ‘ఆయుధాల’ వినిమయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఉభయ దేశాల ఉమ్మడి సైనిక విన్యాసాలు మొదలైపోయాయి.
క్రీస్తుశకం 2001లో అమెరికాపై దాడి చేసిన జిహాదీ బీభత్సకారులలో అత్యధికులు సౌదీ అరేబియా పౌరులు. దాడి చేయించిన ఒసామా బిన్‌లాడెన్ కూడ సౌదీ అరేబియాలో పుట్టిపెరిగిన వాడు. ఈ దాడి ఫలితంగా అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం- వరల్డ్ ట్రేడ్ సెంటర్- కూలిపోయింది. అనేక మంది హతులయ్యారు. ఈ హతుల కుటుంబాల వారికి సౌదీ అరేబియా ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నది అమెరికా ‘కాంగ్రెస్’ ఆమోదించిన ‘బిల్లు’నకు ప్రాతిపదిక! అమెరికాపై దాడిచేసిన వారినేకాక అంతర్జాతీయంగా అనేక జిహాదీ ముఠాలవారిని సౌదీ అరేబియాలోని అధిక శాతం ప్రజలు బలపరుస్తున్నారు. సౌదీ అరేబియాలోని సంపన్నులు ‘జిహాదీ’లకు వేలాది కోట్ల రూపాయల నిధులను సమకూర్చారు. సౌదీ అరేబియా ప్రభుత్వం అమెరికాతో చెలిమిని నటిస్తోంది, పరోక్షంగా జిహాదీ ఉగ్రవాదులకు మద్దతును ప్రకటిస్తోంది! కానీ సౌదీ అరేబియా నిజ రూపాన్ని బట్టబయలు చేయడానికి అమెరికా సిద్ధంగా లేదు. అలా బట్టబయలుచేస్తే తమ దేశంలోని అమెరికా సంస్థలు ఆస్తులను తాము వశపరచుకొంటామని సౌదీ అరేబియా ప్రభుత్వం అమెరికాను బెదిరిస్తోంది. అందువల్లనే అమెరికా అధ్యక్షుడు తమ కాంగ్రెస్ మోదించిన చట్టాన్ని రద్దు- వీట్టో చేశాడు. సౌదీ అరేబియా మనకు కూడ ‘మిత్ర దేశం’! ఇరాన్, సౌదీ అరేబియాలు పరస్పరం శత్రు దేశాల వలె వ్యవహరిస్తున్నాయి. ఇరాన్ మనతో గొప్ప మైత్రి నటిస్తోంది. కానీ పాకిస్తాన్‌లో చైనాతో కలసి ‘ఆర్థిక మండలం’ నిర్మిస్తుందట.. ఎవరు మనకు మిత్రులు?

- హెబ్బార్ నాగేశ్వరరావు e-mail: 2013hebbar@gmail.com