మెయన్ ఫీచర్

న్యాయం నీడలో మత్తెక్కిపోతున్న జనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు మద్యపానం చేయడం నేరమా? అని గట్టిగా గద్దించి, గర్జించి, గాండ్రించి ప్రశ్నించాడు ‘దృశ్య మాధ్యమ’ తరంగిణీ- టెలివిజన్ చానల్ నిర్వాహకుడు! ఆవైపు నుంచి సమాధానం చెప్పవలసిన పోలీస్ ఉన్నతాధికారి కొన్నిక్షణాలు వౌనం వహించడంతో ‘ప్రసార మాధ్యముడు’ రెట్టించిన తీవ్ర స్వరంతో మళ్లీ అదే ప్రశ్నను సంధించాడు. పోలీస్ ఉన్నతాధికారి సమాధానం చెప్పలేదు!
‘తాగి రాత్రిపూట ఇంట్లో నృత్యం చేశారట ఆ మహిళలు- పురుషులతో కలిసి!’ అని అదనపు సమాచారాన్ని మాత్రమే ఆ పోలీస్ అధికారి బయటపెట్టాడు! వెంటనే మాధ్యమ నిర్వాహకుడైన ‘మోడరేటర్’కో, ‘యాంకర్’కో లేదా ‘టింకర్’కో మరింత ఆగ్రహం వచ్చినట్టు ఆయన ప్రదర్శించిన ముఖ భంగిమల వల్ల స్పష్టమైపోయింది. ‘రాత్రిపూట తాగడం నేరమా? మద్యం తాగిన మహిళలు తమ ఇం ట్లో డాన్స్ చేయడం నేరమా..?’ అని దృశ్య మాధ్యముడు పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు! దాదాపు రెండేళ్ళక్రితం ఒక ‘దృశ్యమాధ్యమ తరంగిణి’లో ప్రసారమైన వికృత విచిత్రం వుంది. బిహార్‌లోని ఒక నగరంలో ఓ ఇంటి యజమానురాలు తన ఇంట్లో అద్దెకు ఉంటున్న కొందరు యువతులను బలవంతంగా బయటకి ఈడ్చేయించిందట! ఎందుకంటే ఆ యువతులు అప్పుడప్పుడు రాత్రిపూట మద్యం తాగి ఇంట్లో డాన్సులు చేసేవారట! ఇలా తాగి ఊగడాన్ని నిరసించిన ఇంటి యజమానురాలి హెచ్చరికలను ఆ యువతు లు లెక్కచేయలేదట! అందువల్ల ఆమె కొంతమంది దౌర్జన్యకారులను పురికొలిపి ఆ మద్యం తాగే మహిళలను ఇంటినుంచి వెళ్లగొట్టించిందట! ఇలా బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించడం చట్ట ప్రకారం నేరం. బలవంతపు బహిష్కరణకు గురైన ఆ మహిళలు- పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యజమానురాలిపై చర్య తీసుకోలేదన్నది దృశ్యమాధ్యమ నిర్వాహకునికి ఆగ్రహం కల్గించిన పరిణామం. మహిళలు, పురుషులు, తృతీయ ప్రాకృతులు ఎవరైనాసరే మద్యం తాగడం నేరం కాదన్నది మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నడచిపోతున్న చట్టం. తాగి వాహనాలు నడపడం మాత్రమే నేరం! తాగి డాన్స్ చేయడం తప్పుకాదన్నది ఆ మాధ్యమ నిర్వాహకుని మాటల్లోని మహాధ్వని.
‘నృత్యశాలల్లో మద్యం సరఫరా చేయకపోతే ఎలా?’ అని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం వారు స్వయంగా ప్రశ్నించడం మద్యపాన ప్రవృత్తికి మన దేశంలో పెరిగిపోతున్న ‘మన్నన’కు పరాకాష్ఠ! గుజరాత్‌లో తప్ప మన దేశంలోని మరే ప్రాంతంలోను మద్యపాన నిషేధం లేకపోవడం గత ఏడాది చివరి వరకు నడిచిన చరిత్ర. ప్రభుత్వం చట్టం చేసి అనుమతినిస్తే మద్యపానం నేరం కాదు, అనుమతిని నిరాకరిస్తూ చట్టం చేస్తే మద్యపానం నేరం! ఇలా కొన్నాళ్ళు ఒక ‘పని’ నేరం కావడం, మరికొన్నాళ్లు నేరం కాకపోవడం, ఒక ప్రాంతంలో మద్యపానం నేరం కావడం, మరో ప్రాంతంలో నేరం కాకపోవడం విచిత్రమైన, వికృతమైన స్థితి! నైతిక విలువలు, నైతిక నిష్ఠ సహజమైన సమాజ సంప్రదాయాలు, వాటికి అనుగుణంగా మాత్రమే చట్టాలుండాలన్న ప్రాకృతిక న్యాయసూత్రాల- ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్‌కు క్రమంగా కాలం చెల్లిపోతోంది. చట్టాలు, తీర్పుల ప్రాతిపదికగా కొత్త నైతిక నియమాలు పుట్టుకొస్తున్నాయి. పెళ్లికాని యువతీ యువకులు కాని, పెళ్లితో నిమిత్తం లేని స్ర్తి, పురుషులు కాని కలిసి సంసార జీవనం గడపడం ఈ దేశంలో అనాదిగా అనైతికత! ఇప్పుడు ‘సహజీవనం’- ఆల్ ఇన్ రిలేషన్‌షిప్ పేరుతో ఈ అక్రమ శృంగారం సక్రమ శృంగారం అయిపోయింది! సర్వోన్నత న్యాయస్థానమే ఈ ‘అక్రమాన్ని’ సక్రమ కార్యక్రమమని నిర్థారించిన తరువాత అడిగేదెవరు? ఇలా ‘సహజీవన’ మహిళలకు గర్భవిచ్ఛిత్తి చేసుకునే హక్కు కూడా ఉందని బొంబాయి హైకోర్టు సెప్టెంబర్ 21వ తేదీన తీర్పు కూడా ఇచ్చిందట! అదే సమయంలోనే నృత్యశాలల - డాన్సింగ్ బార్‌లు- లోమద్యం సరఫరా చేయవలసిందేనన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్ మిశ్రా వ్యక్తంచేశారు.
కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యపానాన్ని నిరోధించడానికి, నియంత్రించడానికి యత్నిస్తున్న సమయంలోనే మరి కొన్ని రాష్ట్రాల రాజకీయ నిర్వాహకులు మద్యపానాన్ని మరింతగా ప్రోత్సహిస్తుండడం సమాంతర విపరిణామం. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాలు ఇలా నియంత్రించడానికి యత్నిస్తున్నట్టు ప్రచారవౌతోంది. ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలలో మాత్రం మద్యపానం మరింత విస్తరించడానికి ప్రభుత్వాలు రంగాలను సిద్ధం చేశాయి. అర్ధరాత్రి పనె్నండు గంటల వరకు హైదరాబాద్‌లో మద్యం అమ్మడానికి, తాగడానికి వీలుందట! మద్యం తాగినవారు వాహనాలు నడపరాదు! క్లబ్బులలో, పబ్బులలో, బార్‌లలో, రెస్టారెంటులలో అర్ధరాత్రి వరకు తప్పతాగి ఊగినవారు ఇళ్లకు ఎలా పోతున్నారు? ఈ తాగినవారిని ఇళ్లకు తీసుకొనిపోవడానికి తాగనివారు వాహనాలను ఉంచుకొని క్లబ్బులవద్ద, రెస్టారెంట్‌లవద్ద ఓపికగా వేచి ఉంటున్నారా? లేక తాగిన వారందరూ రహదారుల వెంట నడచి ఇళ్లకు చేరుతున్నారా? వ్యవస్థలో ‘వంచన’ నిహితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ముప్ఫయివేల జనాభాకు ఒక ‘మద్యశాల’- బార్- ఏర్పాటు చేసినట్టు 2015 డిసెంబర్‌లో ప్రచారమైంది. ఇదేమి ఏర్పాటని మద్యం తాగనివారు ప్రశ్నించడం లేదు! ‘ఇంతమంది జనాభాకు ఇన్ని పాఠశాలలు’ అని ప్రగతి పథకాలు రూపొందించినట్టుగా, ‘ఇంతమంది జనాభాకు ఇన్ని నియోజకవర్గాలు’ అని ఏర్పడినట్టుగా జనాభా ప్రాతిపదికగా మంచి నీటి ‘నల్లా’లను ఏర్పాటుచేయవచ్చు. మద్యం ‘నల్లా’లను ఏర్పాటు చేశారు! మంచినీరు వలె మద్యం కూడా అందరికీ అవసరమని పరిపాలకులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ప్రతి పదమూడు వేలమందికి ఒకటి చొప్పున మద్య విక్రయశాలలు నడుస్తున్నాయట! గ్రామీణ జానపదులకూ, నాగరికులకూ మధ్య ఎంతో కొంత ‘అంతరం’ ఉండాలన్నది కూడా పాలకుల విధానం! ‘మద్యం’లో మంచినీరు కలిపి ‘కల్తీ’ చేసినట్టయితే తాగినవారి తలలకు త్వరగా మత్తెక్కదట! అందువల్ల వారు వెంటనే తైతక్కలాడడానికి వీలుండదట! ‘దుర్మార్గులైన’ కొందరు పానశాలా నిర్వాహకులు ఇరవై శాతం నీరు కలిపి మద్యసేవకులను మోసం చేస్తున్నట్టు ప్రభుత్వం వారు నిర్థారించారు. ‘మగ్గు’లలో పోసి మద్యం సరఫరా చేస్తే కదా నీటితో కలిసి ‘మద్యం’ స్వచ్ఛత చెడిపోయేది. అందువల్ల హైదరాబాద్‌లోని పానగృహాలలో ‘మగ్గుల’ ద్వారా సరఫరా చేయరాదని అధికారులు 2015 జూన్‌లో నిబంధనలను విధించినట్టు ప్రచారమైంది. ఈ ‘మగ్గు’లను ‘పెగ్గులు’ అని పిలవడం సంప్రదాయమట! మూత గట్టిగా బిగించిన చిన్న చిన్న సీసాల ద్వారా, మధ్యరకం సీసాల ద్వారాను, పెద్ద సీసాల ద్వారాను మధుశాలల నిర్వాహకులు తాగేవారికి స్వచ్ఛ మద్యాన్ని సరఫరా చేయాలని అధికారులు నిబంధనలను విధించారట! ‘స్వచ్ఛ్భారత్’ నిర్వాహకులకు సమాంతరంగా ‘స్వచ్ఛసురా’ ఉద్యమం కూడా నడుస్తున్నట్టు తెలీదేమో? లేక తెలుసునేమో??
తమిళనాడు ప్రభుత్వం, అధికార పార్టీవారి శాసనసభ ఎన్నికల వాగ్దానం మేరకు దశల వారీగా మద్యాన్ని నిషేధించే కార్యక్రమాన్ని గత మే నెలలో ఆరంభించింది. ఐదు నక్షత్రాల హోటళ్లలో తప్ప ఇతర హోటళ్లలో కాని, రెస్టారెంట్‌లలో కాని మద్యం సరఫరా చేయరాదని కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరువును 2015 డిసెంబర్‌లో సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. అందువల్ల కేరళలోని మద్యం ప్రియులు దుకాణాలలో కొనుక్కొని ఇళ్లకు వెళ్లి తాగవలసిందే! దేశ జనాభాలో నాలుగు శాతం మాత్రమే ఉన్న కేరళ ప్రాంతంలో పదునాలుగు శాతం మద్యాన్ని తాగేస్తున్నారట! అక్షరాస్యత వంద శాతం నెలకొన్న ప్రాంతంలో మద్యపాన ప్రవృత్తి ఇలా మూడింతలకుపైగా పెరగడం విడ్డూరం కాదు, అధిక ‘విద్యావంతులు’ అత్యధికంగా తాగేస్తున్నారు. ఇలా కేరళ ‘నియంత్రణ’ను సమర్థించిన సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మాత్రం తప్పుపట్టింది. ‘నృత్యగృహా’ల డాన్సింగ్ బార్స్‌లో మద్యం సరఫరా చేయరాదన్న మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ‘అర్థం లేనిదని’, ‘ఏకపక్ష నిరంకుశ చర్య’ అని సెప్టెంబర్ 21న సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్ మిశ్రా వ్యాఖ్యానించాడు! నృత్యాంగనలు కాని, నృత్య వీక్షకులు కాని మద్యం తాగినట్టయితే ‘డాన్సింగ్ బార్’లలో మరిన్ని బీభత్స దృశ్యాలు ఆవిష్కృతం కావడం ఖాయం. అందువల్లనే ఈ నృత్య గృహాలలో మద్యం వద్దన్నది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇలా మద్యాన్ని నిషేధించడం తిరోగమన విధానమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం ఏ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణం? గతంలో ఈ నృత్యశాలలను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మూయించింది. అర్ధనగ్నంగా అసభ్యకరమైన నృత్యాలను ప్రదర్శించడం ఇందుకు కారణం! కానీ ఇది కూడా ప్రగతిశీల వ్యతిరేకమని సుప్రీంకోర్టు నిర్థారించింది. ‘డాన్సింగ్ బార్’లను తెరిపించింది! బిహార్ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం విధించడం చెల్లదని పాట్నా హైకోర్టు తీర్పు చెప్పడం పరాకాష్ఠ. మద్యనిషేధం విధిస్తూ బిహార్ ప్రభుత్వం రూపొందించిన సవరణ చట్టం ‘రాజ్యాంగ వ్యతిరేకమని’ పాట్నా హైకోర్టు వ్యాఖ్యానించడమే అంతుపట్టని వ్యవహారం. ఆరోగ్యానికి హానికరమైన మద్యాలను మద్య పదార్థాలను సేవించడాన్ని నిషేధించడానికి ప్రభుత్వాలు కృషిచేయాలని రాజ్యాంగంలోని 47వ అధికరణంలోని ఆదేశసూత్రం. ఆదేశ సూత్రాలను ప్రభుత్వాలు విధిగా అమలుజరుపనక్కరలేకపోవచ్చు. కానీ బిహార్ ప్రభుత్వం అమలు జరుపడం రాజ్యాంగ విరుద్ధం ఎలా అయిందో? జనం మద్యం సేవించి మత్తెక్కిపోవాలన్నదే న్యాయమా?
కృతయుగంలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు, ‘మద్యపానం చేసినట్టయితే ప్రజలు పతనమైపోతారు..’ అని శపించాడు.
‘్భసురులాదిగ గల జను
లీ సుర సేవించిరేని ఇది మొదలుగ పా
పాసక్తి పతితులగుదురు
చేసితి మర్యాద, దీని చేకొనుడు జనుల్’
-అని శుక్రుడు చెప్పినట్టు ఆదికవి నన్నయ్య భట్టారకుడు మనకు చెప్పాడు. కానీ ఇపుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వంటివి అత్యధిక మేధావులకు తెలీదు. కోతియుగం, రాతియుగం, లోహయుగం, మోహయుగం వంటి విచిత్ర యుగాలను పాశ్చాత్యులు మననెత్తిన రుద్దిపోయారు! ఈ భావదాస్యపు ‘మత్తు’ దిగడం లేదు..

- హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352