మెయన్ ఫీచర్

కుల రాజకీయాల ‘మూడోదశ’ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో కుల రాజకీయాలు ఎప్పుడూ ఉన్నవే. స్వాతంత్య్రం తర్వాత, స్వాతంత్య్రానికి ముందు, బ్రిటిష్ పాలనకు ముందు, మొఘల్ కాలానికి ముందు ఇంకా చెప్పాలంటే క్రీస్తు పూర్వం కూడా ఇవి కనిపిస్తాయి. కుల రాజకీయాలు చేయటమేగాక, రాజ్యాలను ఏలిన వారిలో పై కులాలవారు, కింది కులాలవారు చరిత్ర పొడవునా ఉన్నారు. ఈ విధమైన రాజకీయ ఆధిపత్యాలు ఒక పార్శ్వం. భావజాల పరంగా, సామాజికంగా ప్రాబల్యం పొందటంలోనూ ఏదో ఒక దశలో, ఏదో ఒక ప్రాంతంలో ఉన్నత కులాలు, కింది కులాల వారూ సఫలీకృతులు అవుతూనే వస్తున్నారు. ‘్భవజాల- సామాజిక’ అనే దానిలో మతాన్ని కూడా కలిపి చూడవలసి ఉంటుంది. కొన్నిసార్లయితే కింది కులాల వారికి సంబంధించి ‘్భవజాలం- సామాజికం- మతం’ అనే మూడు పరస్పరం విడదీయరానివిగా కలగలిసి వర్ధిల్లాయి. ఈ మూడింటి సమ్మిశ్రీత రూపానికి పై కులాల ఆధిపత్యంపై కిందివారి తిరుగుబాటు స్వభావం అబ్బింది. అందుకు రాజకీయాధికారం కూడా తోడైనపుడు వారి వ్యవస్థ సంపూర్ణమైంది.
అయితే, ఇందులో మనకు ఇంకా స్పష్టంగా తెలియని విషయాలు కొన్నున్నాయి. ఇటువంటివి ప్రత్యామ్నాయ భావజాలాలు, ప్రత్యామ్నాయ వ్యవస్థలు అనుకుంటే, అవి కింది కులాల జన సామాన్యపు ఆర్థిక స్వరూపాన్ని, స్థితిగతులను ఏ విధంగా మార్చాయి? ఎంతవరకు మార్చాయి? అసలు మార్చాయా? లేదా? వాస్తవానికి అది కూడా జరిగితేనే అది పరిపూర్ణమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ అవుతుంది. భావజాలాలకు రాజకీయాధికారం తోడుఅవుతే అది సంపూర్ణ వ్యవస్థ అవుతుందని పైన అనుకున్నాము. గాని అది నిజమైన అర్థంలో సంపూర్ణత కాదు. పై కులాలు అనే వారిలోనూ ఆర్థిక బలం, భుజబలం గల వారిది ఆధిపత్యం కాగా అందులోని జన సామాన్యానిది చాలావరకు సాధారణ స్థితే కావటం మనకు చరిత్రలో కన్పిస్తుంది. అది ఒక నమూనా అనుకుంటే, సరిగా అదే నమూనా కింది కులాలలోకి దిగుమతి అయింది. ఈ వర్గాలలోనూ ధనబలం, భుజబలం గలవారు రాజ్యం చేశారు. కాకపోతే కింది కులాల సామాన్యులకు ఆయా సమయాలలో భావజాలపరమైన దాస్యం తప్పినట్లయింది. ఆర్థిక దాస్యం కాదు.
ఈ విధంగా ఇరువర్గాలలోని ప్రాబల్యశక్తుల ఆధిపత్యం అన్నది కుల రాజకీయాలలోని మొదటి రెండు దశలు అనుకుంటే, ఇదంతా ప్రాచీన, మధ్యయుగాల కాలపు స్థితి అనాలి. ఇది ఫ్రెంచ్ విప్లవం, యూరోపియన్ విప్లవాలు, పారిశ్రామిక విప్లవం, సోషలిస్టు విప్లవాల అనంతర కాలంలో మారాలి. ఆర్థిక మార్పులు, ఆధునిక విద్య, ప్రజాస్వామిక హక్కులు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే నాలుగు కలిసి ఆ మార్పులను తేవాలి. అందుకు బ్రిటిష్ వలస పాలనా కాలంలో పూర్తిగా కాకున్నా పాక్షికమైన అవకాశాలు ఉండేవి. అవి వారు ఉద్దేశ పూర్వకంగా కల్పించినవా? లేక ఈ విప్లవాలన్నింటి స్వభావరీత్యా సహజమైన విధంగా వచ్చినవా? అనే చర్చను పక్కన ఉంచితే, అటువంటి అవకాశాలకు ఒక ఆరంభం జరిగిన మాట నిజం. ఒకవేళ సదరు ఆరంభ స్థితిని వలస పాలకులు తమ ప్రయోజనాల కోసం కొన్ని విధాలుగా వక్రీకరించి ఉండకపోయినట్లయితే మార్పులు మరింత ఎక్కువ స్థాయిలో, మరింత ఆరోగ్యకరంగా రూపుతీసుకుని ఉండేవి. కాని అట్లా జరగలేదు.
దానితో స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ అందులో భాగంగానే భిన్నమైన కులాల రాజకీయాలు కన్పించాయి. ఆ విభజన కొంత వ్యగ్రరూపం తీసుకుని కొందరు వలస పాలనను బలపరిచే వైఖరి తీసుకున్నారు. కొందరు ఉద్యమం పట్ల ఉదాసీనత చూపారు. స్వాతంత్య్రం వల్ల పై కులాలకు, ధనికులకు లాభం తప్ప తమకు ఒనగూరేదీ ఏమిటన్నది వారి వాదన అయింది. కాని ఇందులో గమనించవలసింది ఏమంటే, ఈ వాదన ఆ కింది కులాలలోని పెద్దవారిది అయింది తప్ప జనసామాన్యానిది అయినట్లు లేదు. ముఖ్యంగా మహాత్మా గాంధీ 1915లో దక్షిణాఫ్రికానుంచి తిరిగి వచ్చి వేర్వేరు కార్యక్రమాల ద్వారా కింది కులాల రైతులను, కూలీలను, కార్మికులను మొదలుకొని ‘హరిజను’లను, భంగీలను సైతం రాజకీయ ఉద్యమంలోకి, సంస్కరణల ఉద్యమంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించి చెప్పుకోదగ్గ విజయం సాధించారు. ఆ విధంగా వివిధ విప్లవాల వల్ల, వలస పాలన వల్ల జరగనిది స్వాతంత్య్రోద్యమంవల్ల జరిగింది. సరిగా ఇవే వర్గాలు స్వాతంత్య్రోద్యమ చివరి దశలో, రాజ్యాంగ నిర్మాణ దశలో, స్వాతంత్య్రానంతరం చూపిన హక్కుల చైతన్యాల వెనుక ఈ నేపథ్యమంతా ఉంది.
1947లో స్వాతంత్య్రం, 1952లో మొదటి ఎన్నికల సమయం నుంచే అప్పటికేగల కమ్యూనిస్టులు, సోషలిస్టులు తమ ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు, రాజకీయాల ద్వారా ఈ వర్గాలకు వేదికలు కల్పించే ప్రయత్నాలు చేశారు. గాని అవి వివిధ కారణాల వల్ల ఒక పరిధిలో ఆగిపోయాయి. క్రమంగా బలహీనపడ్డాయి. సోషలిస్టు వేదికలు ముఖ్యంగా గంగానదీ పరీవాహక ప్రాంతంలో మధ్యమ స్థాయి కులాలు, రైతాంగ వర్గాల ద్వారా నరేంద్రదేవ్ లోహియా- జయప్రకాశ్‌ల భావజాలపు పార్టీలయాయి. జాట్లను కూడా కలుపుకుని వాటిని బి.సి. పార్టీలన్నారు. వారితో సరితూగ గల వనరులు లేని ఎస్సీలు కాంగ్రెస్, బిఎస్‌పి, రకరకాల కమ్యూనిస్టుల మధ్య పంపిణీ అయారు. ఒక దశ తర్వాత వారిలో కొందరిని బిజెపి ఆకర్షించింది. మొత్తానికి బిసిలను, ఎస్సీలను కలిపి ఒకే విధమైన నిమ్నవర్గంగా భావిస్తే, వీరు బలమైన రీతిలో రాజకీయాలు నడపటం 1960ల నుంచే మొదలైందని చెప్పాలి. వారు కొన్ని పార్టీలను స్వయంగా నడపగా, ఇతర పార్టీలలో భాగంగా మారి తమ ప్రాబల్యాన్ని చూపినవారు కొందరున్నారు.
మొత్తానికి ఇదంతా రెండవ వర్గం వారి, లేదా రెండవ దశ రాజకీయం. వీరు రాజ్యం నడపటం గాని, ఆ పనిలో కీలక పాత్ర వహించటం గాని గత ముప్పయి సంవత్సరాలుగా మరీ ప్రముఖంగా కనిపిస్తున్నది. అందుకు మళ్లీ గంగానదీ పరీవాహక ప్రాంతం ఒక పెద్ద ఉదాహరణ అవుతున్నది. తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర ఉదాహరణలూ ఉన్నాయి.
కుల రాజకీయాలలో మూడవ దశ ఎప్పుడు అనే ప్రశ్న? ఈ సందర్భంగా వస్తున్నది. ఈ కాలమంతా ఈ పార్టీలు అనేక ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ఈ వర్గాల నుంచి పలువురు ముఖ్యమంత్రులయ్యారు. ఆ పార్టీల వ్యవస్థాపకులు, నాయకులు, ముఖ్యమంత్రులు అంతా ఈ వర్గాల కిందకు వచ్చే వివిధ కులాలలోని ధన బలం, భుజ బలం గలవారు. మొత్తం ఈ అన్ని పార్టీలు, ప్రభుత్వాల గత 30 సంవత్సరాల పరిపాలనలను కలిపి పరిశీలించినట్లయితే తేలేది ఏమిటి? అందువల్ల లాభపడింది ఈ బలవంతులు మాత్రమేనా? లేక ఆయా కులాల జన సామాన్యం కూడానా? ఈ వర్గాల వారు మధ్యయుగాలలో, పూర్వయుగాలలో రాజ్యం చేసినపుడు ఆయావర్గాల సామాన్యుల కోసం భావజాలపరమైన మేలు జరిగినా, ఆర్థిక- సామాజిక పరమైన మేలు ఏమి జరిగిందో స్పష్టంగా తెలియదని పైన అనుకున్నాము. అప్పటి రికార్డులు లేకపోవటం అందుకు కారణం. జానపద- వౌఖిక సాహిత్యాన్ని, చారిత్రక ఆధారాలను జాగ్రత్తగా పరిశీలిస్తే కొంత ఏమైనా తెలియవచ్చు. అందుకు భిన్నంగా వర్తమానానికి సంబంధించి అన్ని వివరాలు ఎదురుగా ఉన్నవే. అవి రికార్డులలో లభ్యమవుతాయి. నేరుగా క్షేత్ర స్థాయికి వెళితే అర్థమవుతాయి. అటువంటి స్థితిలో, గతానికి భిన్నంగా ఏమైనా వర్తమానంలో జరుగుతున్నదా?
ఇతర ప్రాంతాల పరిస్థితే కాదు, ఇక్కడ కూడా. రెండు తెలుగు రాష్ట్రాలలో కుల సంఘాలు అనేకానేకం ఉన్నాయి. ఒక్కొక్క కులంలోనూ పలు సంఘాలున్నాయి. ఇంకా ఏర్పడుతున్నాయి. ఇంత కాలం ఈ ధోరణి లేని కులాల వారు సైతం సంఘాలు పెట్టుకుంటున్నారు. వీరందరి ఆకాంక్షలు, డిమాండ్లు సాధారణ సమస్యలు మొదలుకొని రాజ్యాధికారం వరకు ఉన్నాయి. ఈ పరిణామాలు, మహామథనాలలో ఆహ్వానించదగిందే తప్ప ఆక్షేపించవలసిందేమీ లేదు. కాని ఈ సంఘాలు, నాయకులు కలిసి విషయాన్ని రెండవ దశలోనే ఉంచుతున్నారా? ఉంచదలచుకున్నారా? లేక మూడవ దశకు తీసుకువెళ్లే ఉద్దేశం ఏదైనా ఉందా? రెండవ దశలోనే ఉంచటం అంటే ఆయా కులాలకు చెందిన ప్రాబల్యవర్గాలు, వ్యక్తుల కోసం మాత్రమే లాభం చేసుకోవటం. ఆ కులాలలోని సామాన్యులది అరణ్యరోదనగానే మిగలటం. మూడవ దశకు తీసుకువెళ్లటమంటే తాము బాగుపడటంతోపాటు సామాన్యులను కూడా బాగుపరచటం.
ఇటువంటి రెండు లక్ష్యాల కోసం తాము పనిచేస్తూ వస్తున్నామని తమ ఆత్మసాక్షిగా చెప్పగలవారెందరున్నారు? జాతీయ స్థాయిలో గాని రాష్ట్రాల స్థాయిలో గాని ఈ వర్గాల కోసం ఉద్దేశించిన చట్టాలు, పథకాలు కోకొల్లలుగా ఉన్నాయి. నిధుల కేటాయింపులు అపారంగా ఉన్నాయి. కాని అవి సద్వినియోగం కాకపోవటంలో, దుర్వినియోగం కావటంలో ఈ ప్రభుత్వాల నాయకులు, రాజకీయ నాయకులు, సంఘాల నాయకుల పాత్ర తక్కువేమీ కాదు. బిసి, ఎస్సీ, ఎస్టీ నాయకులలో అనేకులది ఇందులో దోషం ఉంది. తాము బాగుపడ్డారు, బాగుపడుతున్నారు గాని తమ వారిని వదిలివేసారు. వారిని తమకోసం ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటున్నారు. పైన అన్నట్లు పూర్వ కాలపు వివరాలు స్పష్టంగా తెలియవు గాని, పరిస్థితి అప్పటికన్న పతనమై ఉంటుందనే అనుమానం కలుగుతున్నది. ఉన్న చట్టాలను, నిధులను తమ వారికోసం సరిగా వినియోగించుకునే నిజాయితీ లేనివారు, రాజ్యాధికారమంటూ ప్రాగల్భ్య నినాదాలు మాత్రం బాగానే ఇస్తున్నారు. నిజాయితీ లేని వారు ఇటువంటి నినాదమివ్వటం వంచన అవుతుంది.
వాస్తవానికి వీరి గురించి ఇటువంటి చర్చ, విమర్శలు కొత్తకాదు. కాని వారిలో ఆత్మపరిశీలన, మార్పు కనిపించటం లేదు. పైన పేర్కొన్న పలు విప్లవాలు, ఆధునిక ప్రజాస్వామ్యం, 70 ఏళ్ల స్వాతంత్య్రం, అనేకానేక ఉద్యమాలు, చైతన్యాల తర్వాత ఈ వర్గాల రాజకీయం మూడవ దశలోకి ప్రవేశించటం అవసరం. ఆ పని ఎవరో ఒకరు, ఎక్కడో ఒకచోట చేసి ఇతరులకు స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలరా?
*

టంకశాల అశోక్ సెల్ : 98481 91767