మెయన్ ఫీచర్

‘తెలుగు’ తెలివి తెల్లారినట్లే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి నారాయణ వంటి ‘కార్పొరేట్’ పొలిటీషియన్లు, జనం ఆలోచనలతో పనిలేకుండా నిర్ణయాలు తీ సుకునే ఐఎఎస్‌లు ఉంటే ఎపి సిఎం చంద్రబాబుకు వేరే విపక్షం అక్కర్లేదు. వారు చాలు.. బాబును మళ్లీ విపక్షం వైపు చేర్చడానికి! మాతృభాష మీద మమకారంతో అలనాడు ఎన్టీఆర్ తాను స్థాపించిన పార్టీతో పాటు, తన పాలనలో ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లోనూ ‘తెలుగు’ను వెలిగిస్తే, ఇపుడు ఆ పార్టీలో కాలుపెట్టిన నారాయణ వంటి కార్పొరేట్ నేతలు ‘అన్న గారు’ వెలిగించిన దీపాన్ని అధికారుల సాయంతో ఆర్పేంతవరకూ నిద్రపోవడం లేదు. మున్సిపల్ స్కూళ్లలో పదవ తరగతి వరకూ కొనసాగుతున్న తెలుగు మీడియాన్ని తొలగించి, దాని స్ధానంలో ఆంగ్లభాషను రుద్దుతూ ఎపి సర్కారు తాజాగా ఒక ఉత్తర్వు వెలువరించింది. అన్ని రకాల శిక్షణలు అధిగమించి వచ్చిన సర్కారీ పంతుళ్లకు- పురపాలక శాఖామంత్రి నారాయణ గారి ‘మహా విద్యాలయం’లో ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం పెద్ద జోకు. సదరు ఫౌండేషన్ కోర్సుపై ఉపాధ్యాయ సంఘాలు ఒకదశలో పెద్దగొంతుతోనే నిరసించాయి. ఆ తర్వాత ఎందుకో ఆ గళాలు వినిపించడం మానేశాయి. బహుశా నారాయణ గారి ‘మేనేజ్‌మెంట్’ ప్రతిభకు పంతుళ్ల సంఘాల నేతలు ముగ్ధులైపోయారేమో? మళ్లీ తెలుగు మీడియం రద్దుపై అధికారిక ఉత్తర్వులొచ్చాక, అదీ మీడియాలో ప్రముఖం గా వచ్చాక నిరసన గళాలు వినిపిస్తున్నాయి.
‘టెన్త్ దాకా కొనసాగుతున్న తెలుగు మీడియంను అర్ధంతరంగా విషమిచ్చి ఎందుకు చంపేస్తున్నార’ని మాననీయ ఐఎఎస్ అధికారిని అడిగితే, ‘మన విద్యార్థులు ఇతర భాషల్లో జరిగే పోటీ పరీక్షల్లో బాగా రాణించేందుకేన’ని సెలవిచ్చారు. ఈ మాట చెప్పినవాడు మన తెలుగువాడు కాదు. పక్కనే ఉన్న అరవ రాష్ట్ర మూలాలున్న అధికారి కాబట్టి అతనికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల నుంచి ఐఎఎస్, ఐపిఎస్‌లుగా వెలిగిన వారిలో 90 శాతం తెలుగు పాఠశాలల మూలాలే ఉన్నాయి! సిఎం చంద్రబాబు కూడా సర్కారీ బడిలో చదివినవారే. అప్పట్లో నారాయణ లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే బాబు పరిస్థితి ఎలా ఉండేదో? అందాకా ఎం దుకు? మున్సిపల్ స్కూళ్లలో తెలుగును ఎత్తివేస్తున్నామంటూ ఉత్తర్వులిచ్చిన ఇదే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కరికేల్ వలవన్‌కు- ఈ పని తమిళనాడులో చేసే గుండె ధైర్యం ఉండేదా? టెన్త్ వరకూ తమిళాన్ని రద్దు చేస్తున్నామని చెప్పడం సంగతేమో కానీ.. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉప్పందితేనే ఆ రాష్ట్రం భగ్గుమనేది. అలాంటి ఆలోచనలు చేసే ఏ మేధావికైనా బుద్ధి చెప్పేవరకూ తమిళులు నిద్రపోరు. తెలుగువారికి చర్మం మందం కాబట్టి, భాషాభిమానం ఎప్పు డో చచ్చిపోయింది కాబట్టి, మ రో భాష వాడికి తెలుగును ‘హత్య’ చేసే అవకాశం ఇవ్వకుండా- ఆ పుణ్యకార్యం కూడా నారాయణ తన ఖాతాలో వేసుకున్నారు. ఎబివిపి నేతలు అప్పుడెప్పుడో ‘వియ్యంకుల చేతుల్లో విద్య నలిగిపోతోంద’ని అన్నట్టు విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం. ‘తెలుగు’ ప్రభువులు ఆ రకంగా ‘వియ్యంకులిద్దరి’కీ (మంత్రులు గంటా, నారాయణ) విద్యను ధారాదత్తం చేశారు మరి! అసలు ఈ లంపటాలేమీ లేకుండా సర్కారు స్కూళ్లన్నీ శ్రీమాన్ నారాయణ గారి పాదపద్మాల వద్దకు చేర్చి, ‘తమిళనాట అన్నాడిఎంకె అసమర్థ ఎమ్మెల్యేలంతా ఒకచోట చేరి.. అమ్మా నీవే దిక్కు, పార్టీ పగ్గాలు చేపట్టి మమ్మల్ని ధన్యుల్ని చేయమని శశికళను ప్రార్ధించినట్లే’.. నారాయణ గారిని వేడుకుని, సర్కారీ బడులనూ మీరే తీసుకోండని క్యాబినెట్‌లో ఒక తీర్మానం చేస్తే ఈ తిప్పలేవీ ఉండవు కదా?! అప్పుడు తెలివైన నారాయణ గారు కోట్ల ఖరీదు చేసే ప్రభుత్వ స్కూళ్లలోని ఖాళీ స్థలాల్లో- పైన కానె్సప్టు స్కూళ్లు, కింద కమర్షియల్ కాంప్లెక్సులు కట్టించేసి, వాటిలో మల్టీప్లెక్సులు, సూపర్ మార్కెట్లు తెరిచి.. ఆ వచ్చే అద్దెలతో తరతరాలూ తరిస్తారు. ఇక పనికిరాని తెలుగు భాష ఉంటేనేమి? పోతేనేమి? నెల్లూరు నారాయణ సంతోషపడితే చాలు.. పార్టీ భేదం లేకుండా గతంలో ముఖ్యమంత్రులందర్నీ మెప్పించారు కాబట్టి, రాబోయే కాలంలో సొంత సర్కారు లేకున్నా నారాయణకు వచ్చే భయమేమీ లేదు.
‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు’.. నారాయణ అత్యుత్సాహం మంత్రులు, పెద్దలకు ఇరకాటంగా పరిణమించింది. తెలుగును దివ్యంగా వెలిగించేందుకు ఉన్న మార్గాలేమిటో అనే్వషించేందుకు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సారథ్యంలో ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, పరకాల ప్రభాకర్ వంటి ప్రముఖులతో ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. వారు రెండు రాష్ట్రాలనూ చుట్టివచ్చి, అధికార భాష అమలు తీరు తెన్నులు, అందుకోసం కేటాయిస్తున్న నిధులు తదితరాలను అధ్యయనం చేసి వచ్చింది. ఆ ప్రకారంగా ఇంటర్ వరకూ తెలుగు తప్పనిసరి చేయాలని, మాతృభాషను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు పొందాలంటే తెలుగు తప్పనిసరిగా చదవాలన్న నిబంధనలు పెట్టాలనే ఇత్యాది సిఫార్సులతో రేపోమాపో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. మరి ఈ దశలో మంత్రి నారాయణ చొరవతో వచ్చిన ఈ దిక్కుమాలిన ఉత్తర్వు- ఆ కమిటీని వెక్కిరించినట్టే కదా? దీన్నిబట్టి సర్కారులో ఏం జరుగుతోందో ఆ శాఖలను ఏలే వారికే తెలియని గుడ్డి దర్బారుగా మారిందనుకోవడంలో తప్పేమిటి? ‘పల్లె’ సారథ్యంలో తెలుగు భాషాభివృద్ధిపై అధ్యయన కమిటీని వేసిన సంగతి మరో మంత్రి నారాయణకు తెలియదా? ఆ విషయం తెలుసుకోకుండానే ‘తెలుగు మీడియం’ రద్దు ఉత్తర్వులిచ్చారా? అదే నిజమైతే అమాత్యవర్యుడు నారాయణ రోజూ పత్రికలు చదవరన్న విషయం రుజువవ్వాలి. లేకపోతే తానే సూపర్ సీఎం కాబట్టి, పార్టీని విపక్షంలో బతికించినందున, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తానెవరికీ జవాబుదారీ కాదన్న ధీమా అయినా అయి ఉండాలి.
పల్లె రఘునాథ రెడ్డి సీనియర్ నాయకుడు. మండలి బుద్దప్రసాద్ విలువలున్న నాయకుడు. పరకాల ప్రభాకర్ అనుభవశాలి. ఇలాంటి వారి కలయికతో ఏర్పడ్డ కమిటీ ఇప్పుడు ఏ నివేదిక ఇస్తుంది? మంత్రి నారాయణ ఇప్పటికే ‘తెలుగు’ రద్దు ఉత్తర్వు ఇచ్చి, దాన్ని మరికొన్నాళ్లు వాయిదా వేశారు కాబట్టి, ‘పల్లె’ కమిటీ కూడా ‘వాయిదా’ మంత్రంతో తన గౌరవం దక్కించుకుంటుందా? లేక తెలుగు బతకాలంటే కచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసిందేనని చెబుతుందా? మరి చంద్రబాబు ఎవరి మాట కాదంటారు? ఎవరి మాట అవునంటారు? అసలు ఇదంతా సిఎంకు తెలిసే జరిగిందా? నారాయణ సొంత నిర్ణయం తీసుకున్నారా? ఒకవేళ నారాయణ సొంత నిర్ణయం తీసుకున్నా, దానిపై నిరసన సెగలు ఎగసిపడినప్పుడు కూడా బాబు వౌనంగా ఉన్నారంటే- ఆయనకు తెలిసే తీసుకున్న నిర్ణయమనుకోవాలా?.. ఈ ప్రశ్నలకు జవాబులేవీ?
* * *
మొత్తానికి జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ నిద్ర లేచి, జూలు విదిలిచి ఉద్దానం వైపుకదిలారు. అటుగా ఆగ్రహ పవనాలు కదిలేసరికి ఇక్కడ సర్కారు మేఘావృతమైంది. ‘దేవుడు శాసిస్తాడు, ముత్తు పాటిస్తాడ’ని రజనీకాంత్ అదేదో సినిమాలో డైలాగులు చెప్పినట్లు.. ఇక్కడ వ్యవహారం పవన్ చెబుతాడు, చంద్రబాబు చేస్తారన్నట్లు మారింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు, నీటి కాలుష్యం గురించి పవన్ చెప్పేవరకూ సర్కారు వారికి తెలియదట. పవన్ గడువువిధించడం, మంత్రి కామినేని వారు ఆగమేఘాలమీద ఉద్దానం వెళ్లటం, అక్కడ జరుగుతున్నవి చూసి ఆశ్చర్యపోవడం, ఆ వివరాలను బాబుగారికి పూసగుచ్చి చెప్పడం, పిదప సిఎం కూడా గంటన్నర సేపు మేధోమథనం చేసి, తన కుప్పం మాదిరిగా ఉద్దానానికి మంచినీటి ప్రాజెక్టు తీసుకువస్తానని ప్రకటించడం చకచకా జరిగింది.
పవన్ లేటుగా వస్తున్నా ఆయన డిమాండ్లు లేటెస్టుగానే ఉంటున్నాయి. ఆ క్రెడిట్ తన విరోధి వైఎస్ జగన్ ఖాతాలో పడితే మరీ ప్రమాదం కాబట్టి, పవన్ కోరిన వెంటనే చంద్రబాబు అన్ని పనులూ చకచకా చేసేస్తున్నారు. ఆ రకంగా ఆయన ఎన్నికల బరిలోకి వచ్చేసరికి- ‘ఇక చేయాల్సిన పనులేవీ లేవు. అన్నీ మేమే చేసేశాము కాబట్టి, మళ్లీ మునుపటి మాదిరిగా మా భుజం మీద ఎక్కమ’ని చెప్పినా ఆశ్చర్యం లేదు. జగన్‌బాబు కాళ్లకు బలపాలు కట్టుకుని రాష్టమ్రంతటా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కాంగ్రెస్ ఉన్న కాస్త బలాన్ని కూడగట్టి ధర్నాలు చేస్తుంటే ఆలకించదు. మిత్రపక్షం భాజపా అసమ్మతి నేతల పెదవి విరుపులనూ పట్టించుకోని ప్రభుత్వం.. పవన్ విషయంలోనే ఎందుకు స్పందిస్తోంది చెప్మా? జగన్, రఘువీరా, సోము వీర్రాజు, పురంధ్రీశ్వరి వంటి నేతలు తెదేపాను, చంద్రబాబును విమర్శిస్తే ఇంతెత్తున లేచి ఖండనపర్వంలో మునిగే తమ్ముళ్లు.. పవన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం- ‘ఆయన విమర్శలను స్వీకరిస్తాం. ఆయన ఆలోచనలపై ప్రభుత్వం చర్చిస్తుంద’నే మెతకమాటలు మాట్లాడటంలో మతలబేమిటో? ఇంతకూ టిడిపికి హైకమాండ్ ప్రజలా? పవన్ కల్యాణా?
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144