మెయన్ ఫీచర్

రాష్ట్రాల మద్దతుతో నల్లధనంపై పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ కూడా మనది సహకార సమాఖ్య వ్యవస్థ అని తాను అధికారానికి వచ్చినప్పటి నుంచీ అంటున్నారు. దీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ఈ మాటలోని విలువేమిటో అనుభవ పూర్వకంగా తెలిసిన విషయమే. అందువల్ల నల్లధనం-అవినీతికి సంబంధించిన తదనంతర చర్యల విషయమై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు ఒక ప్రజాస్వామిక ప్రక్రియ మాత్రమేగాక, ఆ చర్యల అమలుకు ఆచరణాత్మక అవసరం అవుతున్నది. ఆచరణాత్మక ఏమిటి? దాని అవసరం ఏ విధంగా? అనే వివరణలు ఇక్కడ చెప్పుకోనక్కరలేదు.

నల్లధనం, అవినీతి నిర్మూలనపై మోదీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు రాష్ట్రాలతో, అన్ని పార్టీలతో చర్చించటం మంచిది. తర్వాత తన నిర్ణయాలు తాను తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఎట్లానూ ప్రధానికి ఉంటాయి. అటువంటి చర్చలు కచ్చితంగా అవసరమనే అభిప్రాయం పెద్ద నోట్ల రద్దు రూపంలో తీసుకున్న మొదటి చర్య పర్యవసానాలను గమనించిన తర్వాత కలుగుతున్నది. నిజానికి ఇటువంటి చర్చల తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం జరగవలసిందని కొందరంటున్నారు. అయితే, ముందస్తు చర్చల వల్ల నల్లకుబేరులు జాగ్రత్తపడిపోయేవారని, అందువల్ల అక్రమ నగదు చేయి దాటి ఉండేదన్నది ప్రభుత్వ వివరణ. ఈ వివరణలో తగిన తర్కం ఉంది. కాని 50 రోజుల సుదీర్ఘ గడువు అనంతరం కన్పిస్తున్న ఫలితాలను చూడగా, ‘నల్లదొర’లకు కలిగిన నష్టం ఏమైనా ఉందా? అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. ఈ సందేహాలు ప్రభుత్వానికి కూడా ఉన్నట్లున్నాయి. కనుకనే ఈ విషయమై అస్పష్టంగా తప్ప నిర్దిష్టంగా ఏమీ చెప్పటం లేదు. ఏదిఏమైనా, నోట్ల రద్దుపై ముందే చర్చిస్తే ఈ వర్గం జాగ్రత్తపడి ఉండేదనే వాదనలో తర్కం ఉందనుకుంటున్నారు గనుక, అంతిమ ఫలితాలు ఏవైనా ప్రభుత్వానికి ‘సందేహ లాభం’ (బెనిఫిట్ ఆఫ్ డౌట్) ఇద్దాము.
మొత్తానికి ఈ తొలి చర్య, దానితోపాటు తొలి దశ గడిచిపోయాయి. ఇక మలిదశ, మలి చర్యల కోసం రంగం ఎదురుచూస్తున్నది. నల్లధనం, అవినీతిపై తమది సుదీర్ఘ యుద్ధమని ముందే ప్రకటించిన ప్రధాని, నోట్ల రద్దు పిమ్మట ‘ఇతర చర్యలు’ ఉంటాయన్నారు. మంచిదే. కాని ఆ పని చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో, ప్రతిపక్షాలతో, ఆర్థిక శాస్తవ్రేత్తలతో పలు విడతలుగా చర్చించాలి. నల్లధనం, అవినీతి సమస్యలపై లోగడ అధికారిక కమిటీలిచ్చిన నివేదికలను పరిశీలించాలి. ఈ చర్చలు, పరిశీలనల నుంచి మోదీ ప్రభుత్వం ఏది స్వీకారయోగ్యంగా భావిస్తే దానినే స్వీకరించవచ్చు. చర్చలు అవసరమనేందుకు రెండు కారణాలున్నాయి. ప్రభుత్వం తలపెట్టన పని అసాధారణమైనది, దేశంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఆర్థిక కార్యకలాపానికి సంబంధించినందున, భవిష్యత్తుపై ఎనలేని ప్రభావం చూపగలది అయినపుడు, ఒక ప్రజాస్వామిక దేశంలో ఆ విధమైన చర్చలు మేలుచేస్తాయి. నోట్లరద్దు గురించి మనం ఇపుడు వింటున్న విమర్శలు, ఆరోపణలకు ఆస్కారం ఒకింత తగ్గుతుంది. సాధారణ ప్రజలకు అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదనే అభిప్రాయం కలుగుతుంది.
చర్చలు జరపాలనేందుకు ఇది ఒక కారణం కాగా, రెండవది.. నల్లధనం, అవినీతిని అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదు. కేంద్రానికి ఎన్ని అధికారాలున్నా, ప్రధానమంత్రి ఎంత సమర్ధుడూ, కఠినంగా వ్యవహరించేవాడు అయినా, ఇంత పెద్ద దేశంలోని సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల సహకారం లేనిదే ఏ చర్యలైనా కుంటుపడతాయి. 2012లో కేంద్ర ప్రభుత్వ కమిటీ నల్లధనంపై ఇచ్చిన నివేదిక కూడా- ‘సూచనల అమలుకు రాష్ట్రాల భాగస్వామ్యం తప్పనిసరి’ అని స్పష్టం చేసింది. మోదీ కూడా మనది సహకార సమాఖ్య వ్యవస్థ అని తాను అధికారానికి వచ్చినప్పటి నుంచీ అంటున్నారు. దీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ఈ మాటలోని విలువేమిటో అనుభవ పూర్వకంగా తెలిసిన విషయమే. అందువల్ల నల్లధనం-అవినీతికి సంబంధించిన తదనంతర చర్యల విషయమై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు ఒక ప్రజాస్వామిక ప్రక్రియ మాత్రమేగాక, ఆ చర్యల అమలుకు ఆచరణాత్మక అవసరం అవుతున్నది. ఆచరణాత్మక ఏమిటి? దాని అవసరం ఏ విధంగా? అనే వివరణలు ఇక్కడ చెప్పుకోనక్కరలేదు. పరిపాలనతో కొద్దిపాటి పరిచయంగల వారికి కూడా తెలిసినవే అవి.
ఇంతకూ మలి చర్యలేమిటి? కేంద్రం నుంచి ఇంతవరకు నిర్దిష్టంగా కన్పిస్తున్నది నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించటం ఒక్కటే. అటువంటి లావాదేవీలతో నల్లధనం- అవినీతి నిర్మూలన లక్ష్యాలు ఏ విధంగా నెరవేరగలవనే చర్చ ఒకవైపు ఉంది. ఇంత తక్కువ బ్యాంకులు, ఇంత నిరక్షరాస్యత, తదితర అనేక సమస్యలున్న దేశంలో, సైబర్ నేర ప్రమాదం కూడా పొంచి ఉన్నపుడు డిజిటల్ ఎకానమీ ఏమేరకు, ఎంత కాలానికి అమలుకాగలదనేది మరొక చర్చ. ఇది రాత్రికి రాత్రి గాని, సంపూర్ణంగా గాని సాధ్యం కాదని ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ, ఈ లావాదేవీలను వీలైనంత సులభతరం, సురక్షితం చేసేందుకు రకరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నది. ఇందువల్ల వ్యాపారులు, ఇతర లావాదేవీలవారు పన్నుల పరిధిలోకి రాగల అవకాశం ఉండటం నిజం- పన్నులు ఎగవేసేవారు ఇందుకు విరుగుళ్లు కనిపెట్టనంత మేరకు. ప్రస్తుతానికి కనిపిస్తున్న చర్య ఇదొకటి. ప్రజలను నగదు రహితం వైపు నెట్టేందుకే కొత్త కరెన్సీని మార్కెట్లోకి ఎక్కువ తేవటం లేదన్నది కూడా కనిపిస్తున్నదే. ప్రస్తుత చర్చ సందర్భంలో గుర్తించవలసింది- నగదు రహిత లావాదేవీలను ముందుకు తీసుకుపోవటంలో ప్రధాన పాత్ర రాష్ట్రాలదే. బ్యాంకులకు నగదు సరిగా విడుదల చేయక కేంద్రం ప్రజలపై ఎంత వత్తిడిని సృష్టించినా, మార్కెట్లో ఘర్షణాత్మక స్థితి తలెత్తకుండా వ్యవహారం సాఫీగా నడిచేందుకు, ప్రజలలో సానుకూల వాతావరణం ఏర్పడేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కావాలి. ఇది మోదీ ప్రభుత్వం కాదనలేని వాస్తవం. అటువంటి సహకారం వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర చోట్ల స్పష్టంగా కన్పిస్తున్నది.
ఇటువంటి మలి చర్యలపై రాష్ట్రాలతో చర్చించటం మంచిదని వేరే చెప్పనక్కరలేదు. తదుపరి చర్యలంటూ నిర్దిష్టమైన రీతిలో ప్రకటించకున్నా పరోక్ష సూచనలు చేస్తున్నవి కొన్నున్నాయి. నల్లధనం అంతా నగదు రూపంలో ఉండదని, బంగారం, ఆస్తులు, బినామీ ఆస్తుల వంటి రూపాలలో ఉండగలదని ఇపుడు ప్రధానమంత్రి, ఆర్థికమంత్రితో సహా బాధ్యులంతా అంగీకరిస్తున్నారు. ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత, పన్నుల వ్యవస్థలో మార్పులు, ఇతర దేశాలతో ద్వంద్వ పన్నుల పద్ధతి రద్దు, మనీ లాండరింగ్- రౌండ్ ట్రిప్పింగ్- పార్టిసిపేటరీ నోట్స్ వంటి పద్ధతులను అరికట్టటం వంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇవిగాక లోగడ నల్లధనంపై కమిటీ నివేదికలు ఈక్విటీ ట్రేడింగ్ మార్కెట్లు, గనుల తవ్వకం వంటి పర్మిట్లు, మంత్రులూ అధికారులూ, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తమ విచక్షణపై కేటాయింపులు చేసే అధికారం ఉండకపోవటం, వేర్వేరు ప్రభుత్వాలూ ప్రభుత్వ సంస్థల డేటాబేస్‌లను ఏకీకృతం చేయటం, రాష్ట్రాల భాగస్వామ్యంలో చర్యల అమలు వంటి సిఫారసులున్నాయి. ఇవన్నీగాక, ఇతర దేశాలలోని రహస్య అకౌంట్లలోని నల్లధనాన్ని వెనుకకు రప్పించటం అనే బృహత్ సమస్య ఒకటుంది. ఈ చివరి దాని గురించి 2014 ఎన్నికల సమయంలో చాలా మాట్లాడిన ప్రధానమంత్రి ఇపుడు కారణం ఏమైతేనేమి- ఆ ప్రస్తావనలు చేయటం లేదన్నది అట్లుంచి, తక్కిన అంశాలను చూసినట్లయితే, అవి ఎంత అమలు జరిగితే నల్లధనం, అవినీతి అంతగా అదుపుకాగలవనటంలో సందేహం లేదు. ఇవన్నీ గతం నుంచి ఉన్న సమస్యలు కాగా, వాటి అదుపుకోసం గట్టి ప్రయత్నాలు అప్పటినుంచి జరిగినట్లయితే ఇపుడింత తీవ్రత ఉండేది కాదు.
ఆ గతంలోకి పోకుండా ప్రస్తుతాన్ని చూస్తే, తనది స్వతంత్ర భారత చరిత్రలోనే ఎపుడూ లేని మహాయుద్ధమని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పదే పదే హామీ ఇస్తున్నందున, ఈ దిశలో ఆయన తీసుకోగల తదుపరి చర్యలు ఏమిటో వేచి చూడవలసి ఉంది. అన్ని చర్యలు ఒకేసారి తీసుకోగలవి కావు. కాని వీలైనంత ఎక్కువ ప్రభావం చూపి వీలైనంత ఎక్కువ ఫలితాలు ప్రజలకు కన్పించేట్లు చేసి, దేశ ఆర్థిక వ్యవస్థకూ సామాన్యులకూ వీలైనంత ఎక్కువ మేలు కలగజేయగల వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది స్వయంగా మోదీతోపాటు అందరికీ లాభిస్తుంది. అందువల్ల ప్రజలిపుడు తదనంతర చర్యల కోసం వేచి చూడాలి. అవి సవ్యంగా జరిగిన పక్షంలో నోట్ల రద్దువల్ల ఎదురైన కష్టనష్టాలను ప్రజలు క్రమంగా మరచిపోగలరు. నోట్లరద్దుతో నల్లధనం ఎంత బయటకు వచ్చిందనే చర్చ ప్రజలలో నలుగుతుండటాన్ని పక్కన ఉంచితే, అందువల్ల రెండు విధాలైన సమస్యలు ఏర్పడటం తెలిసిందే. డబ్బుకోసం క్యూలలో నిలబడవలసి రావటం ఒకటైతే, అంతకన్న ముఖ్యంగా ఇన్‌ఫార్మల్ ఎకానమీ, ఉపాధులు చాలా దెబ్బతిన్నాయి. బ్యాంకుల్లోకి నగదు వచ్చినపుడు క్యూల సమస్య పోవచ్చు గాని, దెబ్బతిన్న ఇన్‌ఫార్మల్ ఎకానమీ, ఉపాధులు కుదుటపడేందుకు చాలాకాలం అవసరం. ఈ నష్టాలకు గురవుతున్న వారిలో అసంతృప్తి ఇంకా వీధులకెక్కకపోయినా పేరుకుపోతున్నది. నోట్ల రద్దుతో ఏదో మేలుకలుగుతుందనే ఆశ నెమ్మదిగా ఆవిరవుతున్నది కూడా. కనుక, మోదీ ప్రభుత్వం తదనంతర చర్యల ద్వారా, వాటి ఫలితాలను నికరంగా చూపించటం ద్వారా ప్రజలలో నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన దశ ఇదే. ఇక్కడ పట్టు జారినట్లయితే పర్యవసానాలు ఏ విధంగా ఉండేదీ ఊహించవచ్చు.
అయితే, ఈ చర్యలలో ఏవి అమలు కావాలన్నా రాష్ట్రాల సహకారం అవసరమన్నది కేంద్ర ప్రభుత్వం గుర్తించవలసిన విషయం. నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, ఇతర బ్యాంకులు తమ పరిధిలో అమలుపరచగలవి. వాస్తవానికి ఆ చర్యల అమలులోనూ రాష్ట్రాలలో నిఘా విభాగాలు, పోలీస్ శాఖల పాత్ర ఉంటుంది. కేవలం ఆదాయం పన్ను శాఖ, కేంద్ర నిఘా అధికారులు, సిబిఐ చేయగలది కొంతే ఉంటుంది. నోట్ల రద్దుగాక తక్కిన చర్యలలో రాష్ట్రాల పాత్ర ఇంకా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మునుముందు చర్యలు సఫలం కావాలంటే మోదీ ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చా సమావేశాలు నిర్వహించటం అవసరం. ఇది రాజకీయాలను పక్కనపెట్టి జరగాలి. నిర్ణయాలు ఏకపక్షం కావటం, సహకరించకుండాపోయే రాష్ట్రాలను ప్రజలముందు ఎండగడతామనుకోవటం, సహకరించే వారికి ప్రయోజనాలు అందిస్తామనటం వంటివి రాజకీయంగా ఉపయోగపడతాయేమో గాని, అసలు లక్ష్యాలు దెబ్బతింటాయి. *

టంకశాల అశోక్ సెల్: 98481 91767