మెయన్ ఫీచర్

పెరుగుతున్న కాయధాన్యాల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాయధాన్యాలు నిజంగా నేలకు, మనుషులకు, భూమికి నిజంగా నాడి వంటివే. గాలిలో ఉన్న నత్రజనిని భూమిలో స్థాపితం చేయడం ద్వారా మన పంట పొలాలకు జీవాన్ని ఇచ్చేవి ఈ కాయధాన్యపు మొక్కలే. పురాతన నాగరికతలకు చెందిన ప్రజలు భూసారాన్ని పరిరక్షించుకోగలిగారంటే కేవలం ఈ కారణం వల్లనే. వ్యవసాయం కేవలం హరితవిప్లవం ద్వారానో లేక సింథటిక్ నత్రజని ఎరువుల ద్వారానో ప్రారంభంకాలేదు. వైవిధ్య వ్యవస్థల-పంట మార్పిడి- ద్వారా భారత్‌లోను.. ధాన్యం, చిక్కుడు, గుమ్మడి పంటలను మిశ్రమ పంటగా పండించడం ద్వారా ఉత్తర అమెరికా, మెక్సికోలో అనుసరించిన ‘మిల్పా’ విధానం..అంటే మొక్కజొన్న, చిక్కుడు, గుమ్మడి పంటలను మిశ్రమ పంటగా పండించడం వంటి సంప్రదాయ విధానాల ద్వారానే వ్యవసాయం మొదలైంది. ఈ విధానాలు వ్యావసాయిక పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు ఎంతో దోహదం చేశాయ.
ఆధునిక వ్యవసాయ పితామహుడిగా కీర్తించబడ్డ అల్బర్ట్ హావర్డ్ రాసిన ‘‘అగ్రికల్చరల్ టెస్టామెంట్’’ పుస్తకంలో పశ్చిమ దేశాల్లో, భారత్‌లో అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను సరిపోల్చారు. ‘‘మిశ్రమ పంటల సాగువిధానాన్ని తప్పనిసరిగా పాటించాలి. అది ప్రకృతి నియమం కూడ. పురాతన కాలం నాటి అడవుల్లో మొక్కలను, వృక్షాలను పరిశీలిస్తే ఈ ప్రాకృతిక విధానం స్పష్టంగా అవగాహన అవుతుంది. అందువల్ల తృణధాన్యాల ప్రాధాన్యంగా పండించే మిశ్రమ పంట విధానం సార్వజనీకంగా అత్యంత శ్రేష్టమైనది. చిరు ధాన్యాలు, గోధుమ, బార్లీ, మొక్కజొన్న పంటలను, సముచితమైన రీతిలో కాయధాన్యాలతో లేదా కొన్ని సమయాల్లో తృణధాన్యాలకంటే చాలా ఆలస్యంగా కోతకు వచ్చే జాతి పంటలను సాగు చేయడం శ్రేయోదాయకం. గంగా పరీవాహక ప్రాంతంలో ఒండ్రుమట్టి నేలలు కందిపంటకు అనుకూలం. లెగుమినోసీ తరగతికి చెందిన అతిముఖ్యమైన పంట అయిన కందిని చిరుధాన్యాలు లేదా మొక్కజొన్నతో మిశ్ర మ పంటగా సాగుచేయవచ్చు. 1888వరకు లెగుమినోసీ కుటుంబానికి చెందిన పంటలను సాగుచేయడం సర్వసాధారణంగా కొనసాగేది. ఆ తర్వాత 30 ఏళ్లపాటు పంటల సాగుపై కొనసాగిన వివాదం తర్వాత ఎట్టకేలకు పశ్చిమ దేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు, కాయధాన్యాలు నేల సారాన్ని బాగా వృద్ధి చేస్తాయని తేల్చడంతో సద్దుమణిగింది. నిజానికి తూర్పు దేశాలకు చెందిన రైతులు తరతరాలుగా వీటిని పండిస్తూనే ఉన్నారు. తాము ఏదైతే అనుసరిస్తున్నామో దానే్న పశ్చిమ దేశాల శాస్తవ్రేత్తలనుంచి పాఠంగా ఆయా దేశాల రైతులు వినాల్సి వచ్చింది.
హరిత విప్లవం, ఒకే రకం పంటల సాగును ప్రోత్సహించడం వల్ల కాయధాన్యాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దీంతోపాటు జీవ వైవిధ్యం, భూసారం సమాంతరంగా క్షీణించిపోయాయి. హరిత విప్లవంలో అత్యధిక ఉత్పత్తికే ప్రాధాన్యత కనుక, పెద్ద మొత్తంలో రసాయన ఎరువుల వాడకం కొనసాగుతుంది. అందువల్ల ఈ విధానంలో మిశ్రమ పంటల సాగు సాధ్యం కాదు. మిశ్రమ పంటల స్థానే ఎప్పుడైతే ఒకే రకమైన పంటను పండించే విధానం అనుసరించడం మొదలైందో, క్రమంగా కాయధాన్యపు పంటల విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో భూమిలో లెగ్యూమ్‌లు, నత్రజని స్థాయిలు దారుణంగా పడిపోయాయి. హరిత విప్లవం కారణంగా భారత్‌లో వరి, గోధుమ ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. ఇదే సమయంలో మన వ్యవసాయ క్షేత్రాలనుంచి కాయధాన్యాలు అదృశ్యమైపోయాయి. 1960-61.. 20010-11 మధ్య కాలంలో గోధుమ పంట విస్తీర్ణం 29.58శాతం నుంచి 44.5 శాతానికి, వరి విస్తీర్ణం 4.79 శాతం నుంచి 25 శాతానికి విస్తరించింది. ఇదే కాలంలో కాయధాన్యపుపంటల విస్తీర్ణం 19 శాతం నుంచి 0.21 శాతానికి, నూనె గింజలు 3.9 శాతం నుంచి 0.71 శాతానికి, తృణధాన్యాలు 11.26శాతం నుంచి 0.21 శాతానికి పడిపోయాయి. ఒక ఎకరానికి ఉత్పత్తి అయ్యే పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తే, హరిత విప్లవం పుణ్యమాని పంజాబ్‌లో తక్కువ పోషకాహారం ఉత్పత్తి అవుతున్నట్టు తేలింది.
కాయధాన్యాలు ఎకరాకు 150-200 కిలోల నత్రజనిని స్థాపితం చేస్తాయి. ఎప్పుడైతే కాయధాన్యాల పంటలు వేయడం మానుకున్నారో, భూమికి అవసరమైన నత్రజనిని రసాయన ఎరువుల రూపంలో ఇవ్వడం మొదలైంది. సేంద్రీయ పదార్థం భూమిలోకి చేరుకోవడం వల్ల నేలలో నత్రజని శాతం పెరుగుతుంది. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తున్న క్షేత్రాల్లో సర్వే చేపట్టినప్పుడు నేలలో నత్రజని శాతం అంతకుముందుకంటె 44 నుంచి 144 శాతం పెరిగినట్టు స్పష్టమైంది. అయితే ఈ పెరుగుదల సాగుచేసే పంటలపై ఆధారపడివుంటుంది.
‘‘సాయిల్ నాట్ ఆయిల్’’ అని నేను రాసిన పుస్తకంలో..పారిశ్రామిక వ్యవసాయం, శిలాజ ఇంధన ఆధారిత వ్యవస్థలు 40 శాతం కంటే అధికంగా కర్బన వాయువులను వాతావరణంలో కలిసేందుకు దోహదం చేస్తున్నట్టు వివరణాత్మకంగా వెల్లడించాను. ఇంతటి స్థాయిలో వాతావరణంలో కలుస్తున్న కర్బన వాయువులు వాతావరణ మార్పునకు దోహదం చేస్తున్నాయి. రసాయన ఎరువుల వల్ల నైట్రోజన్ డై ఆక్సైడ్ వాతావరణంలో కలుస్తుంది. పర్యావరణంపై దీని దుష్ప్రభావం గ్రీన్‌హౌజ్ వాయువులకంటే 300 రెట్లు అధికం. అంతేకాదు ఇదే నైట్రోజన్ డైయాక్సైడ్ వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరపడం వల్ల ఆమ్లవర్షాలకు కారణమవుతోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడే సింథటిక్ నత్రజనిని తయారు చేస్తారు. ఇదే విధానంలో పేలుడు పదార్ధాలను కూడా తయారు చేయవచ్చు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఇదే విధానంలో పేలుడు పదార్థాలు పెద్ద మొత్తంలో తయా రు చేయించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమోనియం నైట్రేట్ పెద్ద మొత్తంలో మిగిలిపోయింది. ఈ స్టాక్‌లను రసాయన ఎరువులను తయారుచేయడానికి ఉద్దేశించారు. దీంతో వ్యవసాయ అవసరాలకోసం ఈ అమోనియా స్టాక్‌లను తరలించారు.
హేబర్ బోస్చ్ విధానంలో అమోనియాను తయారుచేస్తారు. ఈ విధానంలో పెద్దమొత్తంలో ఇంధనం ఖర్చవుతుంది. వాతావరణలోని నత్రజనిని కృత్రిమ పద్ధతుల్లో స్థాపితం చేయడం కోసం, సహజవాయువును ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ విధానంలో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అమోనియా తయారవుతుంది. ఒక కిలో నత్రజని ఎరువును తయారు చేయడానికి రెండు లీటర్ల డీజిల్‌కు సరిసమానమైన శక్తి అవసరమవుతుంది. 2000 సంవత్సరంలో రసాయన ఎరువులు తయారు చేయడానకి 191 బిలియన్ లీటర్ల డీజిల్ వినియోగం కాగా, 2030 నాటికి ఇది 277 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. పర్యావరణ మార్పునకు ఇదొక ప్రధాన కారకంగా మారింది. అయినప్పటికీ ఈ వాస్తవాలను బయటకు రానివ్వడం లేదు.
హరిత విప్లవం కాయధాన్యాల స్థానే క్రమంగా బీటీ పత్తిని, సోయా పంటలను ప్రవేశపెట్టడానికి కారణమైంది. 2014లో మనదేశంలో 11.6 మిలియన్ హెక్టార్లలో బీటీ పత్తిని సాగు చేశారు. ఈ మొత్తం భూమిలో కేవలం సగం విస్తీర్ణంలోనైనా కాయధాన్యాలను పండించినట్లయితే అదనంగా 4 మిలియన్ టన్నుల కాయధాన్యాలు మనకు అందుబాటులో ఉండేవి. 2014లో 12.12 మిలియన్ హెక్టార్లలో సోయా పంటను పండించారు. పది మిలియన్ హెక్టార్లలో పండించే కాయధాన్యాలు మన దేశీయ అవసరాలకు సరిపోతాయి. కేవలం ఎగుమతుల కోసం సోయాను మనం ఎందుకు పండిస్తున్నాం? ఇదే సమయంలో తినడానికి కావలసిన కాయధాన్యాలను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం?
కాయధాన్యాల కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా సామాన్యులకు అవి అందుబాటులో లేకుండా పోయాయి. ఈ కృత్రిమ కొరత సృష్టి వల్ల ప్రభుత్వం కాయధాన్యాలను కార్గిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి కార్పొరేట్ సంస్థల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. నేడు మనదేశం అత్యధిక మొత్తంలో కాయధాన్యాలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా రూపొందింది. మనం సాగుచేసిన విధంగా విభిన్న రకాలైన కాయధాన్యాలను ఇతర దేశాలు పండించవు. ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో అవి సగటు భారతీయుడి ఆహారంలో ఉండే వైవిధ్యాన్ని పూరించలేవు. పెద్ద మొత్తంలో పచ్చిబటానీ రకాన్ని మనం అమెరికా, కెనడాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇందుకోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 5 మిలియన్ల టన్నుల కంటే అధిక మొత్తంలో పచ్చిబటానిని దిగుమతి చేసుకోవాలని తలపోస్తున్నది. 2012లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా-కాగ్- పచ్చి బటానీ దిగుమతులపై ఆడిటింగ్ నిర్వహించి, పదేపదే వీటిని ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని ప్రభుత్వాన్ని ప్రశించారు. పచ్చిబటానీ దిగుమతికోసం ఏజెన్సీలను అనుమతించకూడదని 2008లో కేంద్రం నిర్ణయించినా, తిరిగి 2009లో ఏజెన్సీలకు అనుమతినివ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. పెద్ద మొత్తంలో స్టాక్‌లు ఉన్నప్పటికీ ఈ ఏజెన్సీలు ఎడాపెడా పచ్చబటానీలను దిగుమతి చేసుకోవడం వల్ల రూ.897.37 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
ఈ నష్టం కేవలం ఖజానాకు మాత్రమే కాదు, ప్రజలకు, భూమికి కూడా. ముఖ్యం గా నేల ఆరోగ్యం క్షీణించిపోవడం తధ్యం. అదీకాకుండా ఈ పచ్చిబటానీలో కేవలం 7.5 శాతం మాత్రమే ప్రొటీన్లు ఉంటాయి. అదే దేశీయ కాయధాన్యాల్లో 20-30శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి. అంతర్జాతీయ కాయధాన్యాల సంవత్సరంగా 2016ను ప్రకటించారు. మనం పండించే విభిన్న కాయధాన్యాలు నేలకు మాత్రమే కాదు మనుషులకు కూడా ఎంతటి ఆరోగ్యకరమో తెలియజెప్పేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. మన వ్యవసాయ క్షేత్రాల జీవాన్ని మరింత పునరుజ్జీవింప జేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- వందనా శివ