సాహితి

కాళ్లకూరికి అన్యాయం జరిగిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యావహారిక భాషలో వ్రాయబడిన కన్యాశుల్కం నాటకంలోగల ఇంగ్లీషు వాక్యాలు సంస్కృత వాక్యాలు తత్వాలు నేటితరంవారికి ఏమీ అవగాహన కావు. అవగాహన కాని ఘట్టాలు ఆ నాటకంలో ఇంకా ఉన్నాయి. వరవిక్రయ నాటకానికి కూడా కన్యాశుల్కం నాటకానికి ఇచ్చిన గౌరవం ఇవ్వాలి.

వ్యేషు నాటకం రమ్యం’’ అన్నారు లాక్షణికులు. ఇది అక్షర సత్యం. నాటక రచనకు సంప్రదాయరీతిలో కొన్ని నియమాలున్నాయి. అవి సంస్కృత నాటకాలకు సంబంధించినవి. వాటినే తెలుగు నాటకకర్తలు అనుసరించారు. అనగా నాందీప్రస్తావన నటి సూత్రధారులు పాత్రలు మంగళాంతము భరతవాక్యము మొదలయినవి. గుఱజాడవారు వీటిని పాటించకుండా వ్యావహారిక భాషలో కన్యాశుల్కం వ్రాశారు. ఈ నాటకం గత శతాబ్ద ప్రారంభంలో రచింపబడింది. ఆరోజులలో ఇలా వ్రాయడం గొప్ప విప్లవం వంటిది. 1947వ సంవత్సరం వరకు దీనికి తగిన ప్రాచుర్యం లభించలేదు. కొందరు విమర్శకులు వామపక్ష భావజాలంగలవారు దీనిని కాగడాలతో చూపి వెలుగులోకి తెచ్చారు. రంగస్థలంపై ఈ నాటకం రాణించలేక పోయింది. నాటక ప్రాచుర్యానికి కారణం అప్పారావుగారు వర్తమాన సాంఘిక వ్యవస్థలోగల దురాచారాలు ఎత్తిచూపడమే. ఈ నాటకాన్ని చదువుకుని ఆనందించవలసిందే. గతంలో ఎవరూ ఈవిధంగా నాటకం వ్రాయలేదు. ఈ పద్ధతికి ఆయనే ఆద్యుడు అని చెప్పవచ్చు. ఆంగ్ల ఆంధ్ర సంస్కృత సాహిత్యాలు లోతుగా పరిశీలించిన మహావిద్వాంసుడు ఆయన. ఈ మూడు భాషలలోను కవిత్వం చెప్పగల సమర్ధుడు. జానపద సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశారు. నాటకంలో వాడుక భాష వాడడంవలన వివిధ ప్రతులలో భేదాలు కనిపిస్తున్నాయి. భాష వ్యావహారికమే కనుక వీటిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. ఈ నాటకంపై వెలువడిన వ్యాసాలు విమర్శలు పరిశోధనలు అనేకం ఉన్నాయి. ఏ నాటకంపైన ఇన్ని వెలువడలేదు. దీని విషయంలో విశేష పరిశోధన చేసిన సెట్టి ఈశ్వరరావుగారు ఇలా అన్నారు.
‘‘కన్యాశుల్కం ఆధునిక సాహిత్యంలో అపూర్వ సృష్టి. అన్నిటికంటె ముఖ్యంగా అది సామాజిక సాహిత్య ప్రయోజనాల మేలుకలయిక’’ రంగ స్థలంపై రాణించలేని ఈ నాటకానికి ఇన్ని ప్రశంసలు ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తే దానికి అప్పారావుగారి ప్రతిభయే కారణం అని చెప్పాలి. పాత్రోచిత సంభాషణలు హాస్యరసం ఉట్టిపడే మాటలు, దీనికి గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. ఈ నాటకం రెండవ కూర్పు 1909వ సంవత్సరంలో జరిగింది. దానిపై ‘‘హాస్యరస ప్రధానమగు నాటకము’’అని ఉంది. కన్యాశుల్కం తరువాత సంఘాన్ని పట్టిపీడించిన దురాచారం వరవిక్రయం. ఈ సమస్యను ఆ పేరులోనే మహాకవి కాళ్లకూరి నారాయణరావుగారు నాటకంగా వ్రాశారు. ఇది 1920వ దశకంలో వ్రాయబడింది. అప్పారావుగారు ఈయన సమకాలికులే. ఈ నాటకంతోపాటు చింతామణి మధుసేవ అను నాటకాలు కూడా రచించారు. చింతామణి బహుజనాదరణ పొందింది. నిరక్షరాస్యులకు కూడా దానిలోని పద్యాలు కంఠస్థమైనాయి. వరవిక్రయం నాటకంలో కూడా హాస్యరసం చక్కగా పోషింపబడింది. ఈ మూడు నాటకాలు సంప్రదాయరీతిలో వ్రాయబడినవే. కన్యాశుల్కంకన్నా వందరెట్లు పెరిగిపోయిన వరవిక్రయాన్ని నారాయణరావుగారు తీవ్రంగా ఖండించారు. నాటకం చివర మంగళవాక్యాలలో కమల పాత్రచే పలికించిన మాటలు చూడండి.
ఆడు బిడ్డల వివాహములకై తండ్రులు
పడు బాధ లెల్లను బాయుగాక
వెల మగల్ మెడల బుస్తెలుగట్టు దౌర్భాగ్య
దశ కన్నియలకింక దప్పుగాక.
ఇక్కడ వెల మగల్ అంటే కట్నం తీసుకునే వరులు.. మన చట్టాల విషయంలో న్యాయాధికారికి ఆమె విన్నవించిన మాటలు చూడండి ‘‘అయ్యా చట్టము వేరు సందర్భము వేరు. సందర్భమునుబట్టి చట్టము మారునుగాని చట్టములనుబట్టి సందర్భములు మారవు. నా తండ్రిగారు సహాయవాదులు. నాకు వకీలును పెట్టుకొనుటకవకాశము లేదు. చట్టమునందు చెప్పబడిన రుూడు రాకపోయినా స్వవిషయమును సమర్ధించుకొనుటకు తగిన జ్ఞానమును సర్వేశ్వరుడు నాకు ప్రసాదించినాడు. ఇట్టి స్థితిలో నా మాటలు వినకుండుట నా కన్యాయము చేయుటకాదా?’’
నేటి న్యాయకోవిదులు ఈ విషయాన్ని ఆలోచించాలి. కేవలం చట్టాలే వేదం అని భావించకూడదు. సింగరాజు లింగరాజు వ్రాయించి ఇచ్చిన కోర్కెల చిట్టా (కట్న పూజాచిత) చదివి తీరవలసిందే. ఆ రోజులలో రజస్వలానంతర వివాహాలు కష్టమై పోయినాయి. పిల్లకు పది సంవత్సరాలు రాగానే వరులకొరకు తీవ్ర ప్రయత్నంచేసి తలిదండ్రులు ఎలాగో మూడుముళ్లు వేయించేవారు. మగ పెళ్లివారి ఆశలకు హద్దుండేది కాదు. కట్నంయొక్క పుట్టుపూర్వోత్తరాలు పెళ్లిళ్లపేరయ్య ఎంత చక్కగా వివరించాడో ఈ పద్యంలో చూడండి.
గీ॥ బ్రాహ్మణుల యింట దొలదొల్త బ్రభావమంది
కోమటింటను ముద్దులుగొనుచు బెరిగి
కమ్మవారింట పెళ్లునగాపురంబు
సేయుచున్నది కట్నంపు జేడె నేడు
కట్నం తీసుకు వివాహం చేసుకున్నా బసవరాజు. (లింగరాజు కుమారుడు) పశ్చాత్తాపం చెంది న్యాయస్థానంలో తన తండ్రి దుస్తంత్రాలు వెల్లడించి తన దావా ఉపసంహరించుకున్న సమయంలో ఆతని పలుకులకు న్యాయాధికారి ఎంతో సంతోషిస్తాడు. నాటకం చివర ఆతని హెచ్చరిక చూడండి.
సీ॥ కట్నాలకై పుస్తకములు చేగొని పాఠ
శాలల కేగెడు చవట లార
పిలచి కాళ్లుకడిగి పిల్లనిచ్చిన వారి
కొంపలమ్మించెడు కుమతులార
అల్కపాన్పులెక్కి యవి యివి కావలె
నని శివమాడెడి యధములార
ఎంత పెట్టిన దిని యెప్పటికప్పుడు
నిష్ఠురోక్తులు పలుకు నీచులార
కట్నమున పేరనొక చిల్లిగవ్వగొనిన
భార్యకమ్ముడువోయిన బంటులగుచు
జన్మదాస్యంబు సలుపుడు సలుపకున్నా
నత్తవారింట గుక్కలై యవతరింత్రు
సంప్రదాయ రీతిలో ఉన్న పై పద్యం ఎంత సులువుగా అవగాహన అయిందో పరిశీలించండి. అలక పాన్పు అనేది ఆరోజులలో ఒక వివాహవేడుక. అత్తవారింట ఒక పాన్పుపై కోపగించి పెళ్లికుమారుడు కూర్చుంటాడు. అప్పుడు అత్తమామలు అతనివద్దకు వెళ్లి అతని కోరిక తీర్చేవారు. సంప్రదాయ పద్యాలు మంచి చెప్పినా అనవసరం అనే పిడివాదన మానాలి. వ్యావహారిక భాషలో వ్రాయబడిన కన్యాశుల్కం నాటకంలోగల ఇంగ్లీషు వాక్యాలు సంస్కృత వాక్యాలు తత్వాలు నేటితరంవారికి ఏమీ అవగాహన కావు. అవగాహన కాని ఘట్టాలు ఆ నాటకంలో ఇంకా ఉన్నాయి. వరవిక్రయ నాటకానికి కూడా కన్యాశుల్కం నాటకానికి ఇచ్చిన గౌరవం ఇవ్వాలి. తెలుగు సాహిత్య అకాడమీవారు నారాయణరావుగారి నాటకాలు పరిష్కరింపజేసి ముద్రించాలి. ఆ మహాకవి స్మారక చిహ్నం ఏదీ లేకపోవడం దురదృష్టం.

- వేదుల సత్యనారాయణ, 9618396071