మెయన్ ఫీచర్

పాలకులకు ఉలికిపాటెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దారిన పోతున్న దానయ్యకు ఓ గుంతను తవ్వుతున్న కూలీలు కనపడ్డారట! గుంత దేనికని ప్రశ్నిస్తే, కూలీలకు ఉపాధి కల్పించడానికని అన్నాడట మేస్ర్తి, తిరిగి వస్తున్న దానయ్యకు అదే గుంతను పూడ్చడం కనపడిందట! కారణమడిగితే- ఉపాధికేనన్న సమాధానం! ప్రపంచీకరణ తర్వాత ఇలాంటి అభివృద్ధి నమూనాలు దేశవ్యాపితమయ్యాయి. పని ఏదైనా జనాలకు కొంత ఉపాధి దొరికిందని వాదించే పాలకులకు, వీరికి వత్తాసుపలికే మేధావులకు ఈ దేశంలో కొదువ లేదు. పోనీ, ఇలాంటి పనులన్నా కల్గిస్తున్నారా అంటే వీటి స్థానంలో ప్రొక్లేనులు, జేసిబిలు వచ్చి చేరాయి. వీటికి పని కల్పించడమే ఓ అభివృద్ధి నమూనాగా నేడు మారిపోయింది.
అవసరానికి మించిన రోడ్ల వెడల్పు కావచ్చు, జాతీయ రహదారుల విస్తరణ కావచ్చు, పట్టణాల్లో మెట్రోలాంటి నిర్మాణాలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు కావచ్చు! ఇవే నిజమైన అనివృద్ధి పథకాలని పాలకులంటే తందాన అనే అనుంగులు, పాలకుల ముసుగులో వున్న కాంట్రాక్టర్లు, బుద్దిజీవుల ముసుగులో పాలకుల పంచన చేరిన స్వార్థపరులు ప్రజల గొంతుకు తాళంవేయాలని చూస్తున్నారు. ఇలాంటి వారంతా ప్రభుత్వ చర్యల్ని సమర్ధిస్తూ ఇవే ఆర్థిక ప్రగతికి సోపానాలంటూ ప్రభుత్వపక్షాన ప్రచారాన్ని సాగిస్తున్నారు. వ్యవసాయాన్ని, వ్యవసాయ అనుబంధ కుల వృత్తుల్ని, చేనేతను, అనుబంధ పరిశ్రమలను, ఖనిజ, ముడి సరకు ఆధారంగా ఏర్పాటయ్యే భారీ, చిన్నతరహా పరిశ్రమలు ఆర్థిక, సామాజిక ప్రగతికి చోదకశక్తులుగా ఒకప్పుడు భావించే వాళ్ళం. సాంకేతికంగా అభివృద్ధి చెందిన స్నేహపూరిత దేశాల సహకారంతో వీటిని అభివృద్ధి చేసుకోవడం, లక్షలాది మందికి ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాల్ని, ఉపాధిని కల్పించడం నిన్నటి మాటగా మిగిలిపోయింది. ఇప్పుడంతా తారుమారే! కొత్తవాటిని స్థాపించకపోగా, ఉన్నవాటిని మూసివేయడం, వ్యవసాయాన్ని, అనుబంధ వృత్తులను, పరిశ్రమల్ని దెబ్బతీయడం నేటి పాలకుల విధి విధానంగా మారిపోయింది. వీటిపై ఆధారపడిన వర్గాల్ని వీధిపాలుచేసి వలస కూలీలుగా, పట్టణాలల్లో పని మనుష్యులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారేలా, దేశాన్ని విడిచి విదేశాలకు వలస వెళ్ళేలా ప్రణాళికల్ని రచించడం నేటి పాలకులకు మామూలైపోయింది.
తెలంగాణ విషయంగా కొన్ని అంశాల్లో జాతీయస్థాయిలో ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రంగా సర్వేలు తెలుపుతున్నాయి. ఈ సర్వేలకున్న నేపథ్యాన్ని పక్కనబెట్టి వాస్తవమని నమ్మితే బుద్దిజీవులుగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. సాలుసాలుకు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లోటుతో కాకుండా, మిగులుగా వుంటున్నట్లు ఆర్థికమంత్రి గణాంకాల్ని చూపుతున్నాడు. ఈసారి రూ.4000 మిగులు వుంటుందనేది అంచనా! అలాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి 19.5 శాతంగా చెపుతున్నప్పుడు, ఆర్థికాభివృద్ధికి, సామాజికాభివృద్ధికి సాపేక్షికంగా అనులోమానుపాత సంబంధం వుండాలి. అంటే అన్నివర్గాలు ఆర్థికంగా నిజంగా బాగుపడాలి. కాని, ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఆసరా పథకాల్ని అమలుచేస్తున్నట్లు చెపుతున్నది. అంటే, 40 లక్షల కుటుంబాల పరిస్థితి బాగులేనట్లే కదా! వీటికితోడు షాదీముబారక్‌లు, పెళ్ళికానుకలు ఎందుకిస్తున్నట్లు? ఎవరికిస్తున్నట్లు? ఇంతగా ఆర్థికప్రగతి సాధిస్తున్న రాష్ట్రంలో విద్య, వైద్యం ఎందుకు కునారిల్లుతున్నది? మూతబడిన, లేఆఫ్ ప్రకటించబడిన సిర్పూర్ పేపర్ మిల్లును, నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేసి నడపకపోగా, కార్మికుల ఉసురును ఎందుకు తీస్తున్నది?
ఇలా ఆర్థికంగా బాగుపడుతున్న రాష్ట్రంలో గతంలో లాగానే రైతులు, చేనేత కార్మికులు, ఇతర వర్గాలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? విద్యాపరమైన ఒత్తిళ్ళను తట్టుకోలేక విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటే, తెలంగాణను ఎందుకు సాధించుకున్నట్లు? పోనీ, మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించామని చెపుతున్న 18వేల చెరువుల కింది ఆయకట్టు రైతులు సంతోషంగా వుంటున్నారా? ఈ ప్రాంతాల్లో కూడా ఆత్మహత్యలెందుకు జరుగుతున్నాయి? వీటికికూడా గత ప్రభుత్వాలే కారణమంటూ ఎంతకాలం నిందిస్తారు? విద్యార్థులకు సన్నబియ్యాన్ని తినిపిస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం రైతులు పండించిన సన్న ధాన్యానికి మద్దతు ధర ప్రకటించకపోవడం, కొనక పోవడం రైతు సంక్షేమ పాలన అవుతుందా? అడిగేవారి నోరుమూయించడం, గదమాయించడం తప్ప ఇది ప్రజాస్వామ్య విధానం ఎలా అవుతుంది? ఇవన్నీ వేసుకోవాల్సిన ప్రశ్నలే కాదు- సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కూడా!
తెలంగాణ ఏర్పడగానే చైతన్య, నారాయణ లాంటి విద్యాసంస్థలు, జనాల్ని నిలువునా దోచుకుంటున్న కార్పోరేట్ హాస్పిటల్స్ తోకముడుస్తాయని భావించాం. పైగా తెలంగాణ పాలకుల కనుసన్నల్లో ఇవి మరింతగా విస్తరిస్తూ విజృంభిస్తున్నాయి. వీటికితోడుగా వెలాసిటీ లాంటి కొత్త దోపిడి సంస్థలు వెలుస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంటే, ప్రభుత్వ వైద్యశాలలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. గత ప్రభుత్వాలు నిర్మించిన పిహెచ్‌సిలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు తప్ప, తెలంగాణ ఏర్పడిన తర్వాత గాంధీ లాంటి ఒక్క హాస్పిటల్‌ను నిర్మించని వైనం. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి గాని, కులాల వారిగా, మతాలవారిగా భవనాలు కావని ప్రభుత్వం గుర్తించడం లేదు. ఉద్యమకాలంలో మొక్కుల ప్రస్తావన చేయని కెసిఆర్, అధికారం చేజిక్కించుకొని మొక్కుల పేరున యువత త్యాగాల్ని ఫణంగా పెట్టడం నియంత లక్షణమే! ఈ లెక్కన నిజాం ప్రభువులు కూడా ప్రవర్తించలేదు. పైగా ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేసినందుకు రామదాసుకు, సయ్యద్ షాదుల్లాకు శిక్షలుపడిన చరిత్ర తెలంగాణది.
బడులను, విశ్వవిద్యాలయాలను పక్కనపెట్టి ఏడుకొండలకు పోటీగా యాదాద్రిని పునర్ నిర్మాణం చేయడం కెసిఆర్ ఒంటెత్తు ఆలోచనకు నిదర్శనం. ఉద్యమ కాలంలో ఏనాడూ కనిపించని చిన జీయర్‌స్వామిని ప్రభుత్వ అతిథిగా గుర్తించి, కొత్తగా నిర్మించిన ప్రగతిభవన్‌లోని సీటుపై కూర్చుండబెట్టడమంటే తెలంగాణ త్యాగాల్ని విస్మరించడమే! నిజానికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి పదవులు ఒకప్పుడు గౌరవనీయమైనవిగా భావించేవాళ్ళం. నాడు నిస్వార్థంగా రూపాయి ఆశించకుండా, పైగా స్వంత ఆస్తుల్నిధారపోసి ప్రజలకు నిరంతరం సేవలందించేవారు. అందుకే వారి పేరు ముందు ‘గౌరవ’అనే పదాన్ని వాడేవారం. కానీ, నేడు లక్షలాది రూపాయల్ని జీతాలుగా, భత్యాలుగా పొందుతూ, విలాసవంతమైన జీవితాన్ని, భద్రతను అనుభవిస్తూ, స్వంత వ్యాపారాల్ని, క్షేత్రాల్ని అభివృద్ధిచేసుకుంటూ కూడా గౌరవనీయులుగా చలామణి కావడమే నేటి ప్రజాస్వామ్య దుస్థితికి ప్రధాన కారణం. దీన్ని కెసిఆర్ గుర్తించకుంటే, మరో ఉద్యమానికి తెర లేపిన వాడె అవుతాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంకా విద్య, వైద్య రంగంలో అనూస్యమైన మార్పులు జరగాలని, జరుగుతాయని భావిస్తే, అంతా తారుమారైంది. నేటికి డి.ఇడి ప్రథమ సంవత్సరం ప్రారంభంకాకపోగా, బి.ఇడి రెండో విడత కౌన్సిలింగ్ జరక్క, అనేక కాలేజీల్లో విద్యార్థులు లేక తరగతులు నడవని స్థితి. గత ప్రభుత్వాలే ఏర్పాటుచేసిన విద్యా, వైద్య సంస్థలే తప్ప ఏ ఒక్క సంస్థను, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించలేదు. ప్రారంభించాలనే ఆలోచన కూడా లేకపోగా, కులాల వారిగా, మతాలవారిగా నియోజకవర్గానికో రెసిడెన్షియల్ పాఠశాలంటూ 119ని, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీవర్గాలకంటూ మరో 300దాకా ఇదే తరహా పాఠశాలల్ని నిర్మించాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. కుల, మత, వర్గ, లింగ బేధాలకతీతంగా పిల్లలందరు ఒకే నీడన చదువుకోవడం, ఒకేస్థాయి విద్యను, ఒకే రకమైన సౌకర్యాలతో పొందడం రాజ్యాంగ హక్కు. ఈ విధానం మనం ప్రవచించే వసుదైక కుటుంబానికి బాటలువేస్తుంది. పోతే, అవసరానికి అనుగుణంగా ప్రత్యేక హాస్టళ్ళను ఏర్పాటుచేయవచ్చుగాని, విద్యాలయాల్ని ఏర్పాటుచేయడం సమాజాన్ని మరింతగా విభజించడమే అవుతుంది. వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్ వారి వారి అనుయాయులకు కాంట్రాక్టులను ఇప్పించడానికై ఇలాంటి పథకాలు ముందుకుతెస్తే, వీటిని నివారించి, ఇప్పటికే వున్న భవనాల్ని ఉపయోగించుకుంటూ, ఉన్న ఉపాధ్యాయులతో సక్రమంగా పనితీసుకుంటూ నడపాల్సిన విద్యారంగాన్ని, తెరాస ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ల లబ్దినే ఆలోచించడం తెలంగాణ ఆకాంక్షలకే విరుద్ధం.
నిర్మాణాత్మక, పాలనాపరమైన లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికై, పరీక్షల సమయంలో మాత్రం ఎంతో పారదర్శకంగా పనిచేస్తున్నట్లు నటిస్తూ, ప్రభుత్వం నిముషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థుల్ని అనుమతించకపోవడం జరుగుతున్నది. ఈ ఆలోచనను ముందుకుతెచ్చిన అధికారులు గాని, పాలకులు గాని, వారివారి విద్యార్థిదశలో దీన్ని ఆచరించారా అనేది ప్రశ్న! పార్లమెంటు, అసెంబ్లీలే సక్రమంగా జరగని వ్యవస్థలో, కార్యాలయాలకే రాని సిబ్బంది, పాఠశాలలకే రాని ఉపాధ్యాయులు, వచ్చినా విధులు సక్రమంగా నిర్వర్తించని స్థితిలో, వీరిని అజమాయిషి చేయని ప్రభుత్వ యంత్రాంగం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం శోచనీయం. అంటే, పరీక్ష కేంద్రాల దగ్గరనే విద్యార్థులు నిద్రపోవాలన్న మాట! ఇలాంటి ట్రిక్కులతో ప్రజల్ని బురిడీ కొట్టించడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది.
ఇక నియామకాల విషయంగా ప్రభుత్వ వర్గాలు, కొంతమంది మంత్రులు ప్రచారం చేస్తున్నట్లు 28వేలకు పైగా ఉద్యోగాల నియామకం జరిగినట్లైతే, ఏయే రంగాల్లో, ఏస్థాయి ఉద్యోగాల్ని, ఎలాంటి జీత భత్యాలతో నియామకం చేసారో ఓ స్వేతపత్రాన్ని విడుదల చేయాలి. అంతేగాని, తామే అన్నింటికి ధర్మకర్తలమని భావిస్తూ నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడం ఓ నిరంకుశ చర్యనే అవుతుంది. రాజకీయ చైతన్యంగల తెలంగాణలాంటి రాష్ట్రంలో ఇలాంటి ప్రజావ్యతిరేక చర్యలు ఎలా వైఫల్యం చెందాయో గత చరిత్రనే నిదర్శనం. కెసిఆర్‌తోపాటు, నిజమైన తెరాస శ్రేణులకు ఈ విషయం తెలుసు. ఇవన్నీ తెలిసికూడా కెసిఆర్ ప్రవర్తిస్తున్నాడంటే, ఆయనలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా భావించాల్సి వస్తుంది.
ఏ పాఠశాలలో, కళాశాలలో, చివరికి వైఎస్‌ఆర్ రాజకీయంకోసం ప్రారంభించిన విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది లేకపోగా, కిందిస్థాయి ఉద్యోగాలైన అటెండర్, మాలి, నైట్‌వాచ్‌మెన్ ఉద్యోగాలు పూర్తిగా తెరమరుగైపోయాయి. సఫాయి కార్మికులది కాంట్రాక్టు విధానమే. అత్యవసరానికి నింపుతున్న ఇతర ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతే! డిగ్రీ, పిజీ కళాశాలల్లో ఇదే స్థితి. వీటన్నింటిని పట్టించుకోకుండా, పరిష్కరించకుండా, గత ప్రభుత్వాలకన్నా మొండిగా ప్రవర్తిస్తూ ప్రజాపాలన అంటూ బంగారు తెలంగాణ అంటూ, తెలంగాణ ప్రజల కలలు సాకారమైతుంటే వారి కలల్ని కొందరు చెడగొడుతున్నారంటూ గోబెల్స్ ప్రచారం చేయడం తెరాస ప్రభుత్వ వింత పోకడనే అవుతుంది.
ప్రగతి గూర్చి మాట్లాడుతున్న వారంతా నిన్నటి ప్రభుత్వాల్లోని పాతకాపులే! నిన్నైనా, నేడైనా వారే పాలకులు. రేపుకూడా వీరే పాలకులుగా అవతారం ఎత్తుతారు. మారేది జెండానే గాని వీరి స్వభావం కాదు. అందుకే వీరికి ప్రజలు చీమల్లా, జోరీగల్లా కనపడుతారు. యువతను సంఘవిద్రోహక శక్తులుగా ముద్రవేస్తారు. అవసరమైతే తీవ్రవాదులంటూ నిందిస్తారు. కాని, ఈ విధంగా ముద్రవేయబడుతున్న సన్నాసులే తెలంగాణను సాధించారని గుర్తిస్తే సన్యాసులని భావిస్తున్న వారికి రాజకీయ భవిష్యత్తు వుంటుంది. లేదంటే నిజంగా సన్యాసం పుచ్చుకోవాల్సి వస్తుందని గ్రహిస్తే అందరికి మంచిది.
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162