మెయన్ ఫీచర్

జాతీయత ప్రస్ఫుటించిన ‘ఉత్తర’ విప్లవం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన మానస స్వాదుజలం
సమరార్ణవమై లేచెను,
మతోన్మాద రాజకీయ
మలిన శిఖల ముంచెత్తను
అవినీతి విషాలు సోకి
కమిలిన ఉత్తర సీమల
కమల పుష్ప పవనమ్ముల
పరిమళాలు సభ తీరెను..
ఇది అమలిన ప్రజాస్వామ్య పరిమళం. నైతికనిష్ఠకు నిబద్ధులైన సామాన్య జనం సృష్టించిన విజయ పరిమళం. భారతీయ జనతాపార్టీకి ఉత్తరప్రదేశ్ వోటర్లు సమకూర్చిన అభూతపూర్వ విజయం ప్రజాస్వామ్య చరిత్రలో మరో పసిడి పరిమళాల ఘట్టం! ఉత్తరఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఉత్తరప్రదేశ్ విజయ ప్రతిరూపాలు కావడం ‘జన మానస స్వచ్ఛ పాలనా కాంక్షలకు విస్తృతి’ మాత్రమే. ఉత్తరఖండ్ క్రీస్తుశకం 2000 వరకు ఉత్తరప్రదేశ్‌లో భాగం. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘్భజపా’ సాధించిన ఘన విజయానికి ఈ శాసనసభ ఎన్నికల ఫలితాలు అద్భుతమైన పునరావృత్తి. ఈ అద్భుతం అప్పుడు కాని ఇప్పుడు కాని ‘్భజపా’ అధిష్ఠానం సైతం ఊహించనిది! రాజకీయ పండితులు, జ్యోతిష విశే్లషకులు ఊహించనిది.ప్రజలు మాత్రమే ఊహించినది! ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాలలో దేశంలోని దాదాపు ఆరవ వంతు ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు నూట నలబయి మూడు స్వతంత్ర దేశాలు ఉత్తరప్రదేశ్ కంటే జనాభా రీత్యా, ప్రాదేశిక పరిమాణం దృష్ట్యా చిన్నవి. మన దేశపురాజకీయాలలో ప్రధాన మంత్రి తరువాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి! లోక్‌సభలోని ఐదు వందల నలబయి మూడు స్థానాలలో ఎనబయి ఉత్తరప్రదేశ్‌లో విస్తరించి ఉండడం ఈ త్రివేణీ సంగమ క్షేత్ర ప్రాధాన్యానికి చిహ్నం! వేల ఏళ్ల నాటి యదుకుల కృష్ణుడు, యుగాల పూర్వం నాటి రఘుకుల రాముడు జన్మించిన స్థలాలు ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు భారత జాతీయ మనోరథాలు.. ఈ రథాలు ఏ దిశగా పయనిస్తున్నాయన్న దానికి ఈ ఫలితాలు ప్రామాణికమైన కొలమానాలు! 2014 నాటి ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో డెబ్బయి మూడు లోక్‌సభ స్థానాలను గెలిపించిన భాజపా ఇప్పుడు నాలుగు వందల మూడు స్థానాలున్న శాసనసభలో మూడు వందల ఇరవై నాలుగు స్థానాలను సాధించింది! 1962 నుంచి ఏ పక్షానికీ లభించని విజయమిది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా సైతం ఊహించని ‘కమలజాలం’ ఇది! ఎన్నికలు జరిగిన మిగిలిన నాలుగు రాష్ట్రాలకు లోక్‌సభలో ఉన్న స్థానాల సంఖ్య ఇరవై రెండు! ఉత్తరప్రదేశ్‌కు లోక్‌సభలో సంఖ్యాబలం ఎనబయి. అందువల్ల మిగిలిన రాష్ట్రాలలో ఎవరు గెలిచారు, ఎవరు గెలవలేదు-అన్నది ఈ ‘శాసన’ సమరంలో ప్రధానం కాదు! ఉత్తరప్రదేశ్ ఫలితాలు ‘గీటురాయి’పై మాత్రమే ఇప్పుడు వివిధ పక్షాల బలాలను నిగ్గు తేల్చవలసి ఉంది.
భాజపా ఘన విజయానికి దోహదం చేసిన పరిణామ క్రమం రాజకీయ పక్షాలన్నింటికీ గుణపాఠం! వోటర్లను కుల ప్రాతిపదికపై విడగొట్టిన ‘రాజకీయం’ 1990 నుంచి ఉత్తరప్రదేశ్‌లో పెత్తనం చెలాయించింది. 1991 నాటి ఎన్నికలలో ‘రామజన్మభూమి’ ఉద్యమ ప్రభావంతో కుల మాలిన్యం తొలగినప్పటికీ ఆ తరువాతి ఎన్నికలలో ‘కులం’ మళ్లీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలను కమ్ముకోవడం చరిత్ర! ఈ చరిత్ర 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో రద్దయిపోయింది, కులాలకు మతాలకు అతీతంగా జాతీయతా భావం జనాలను మళ్లీ ముంచెత్తిన చరిత్ర మొదలైంది. ఈ జాతీయతా ప్రవృత్తికి ఈ శాసనసభ ఎన్నికల ఫలితాలు పునరావృత్తి! కుల మతాలనతిగమించిన జన మానస ప్రవృత్తి జయించడానికి ప్రేరకం 1991 నాటి ఎన్నికలలో రామజన్మభూమి ఉద్యమం, 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలోను, ఇప్పటి శాసనసభ ఎన్నికలలోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విలక్షణ నాయకత్వం, స్వచ్ఛమైన సౌశీల్యం!
కులాల పేరుతో వోటర్లను విడగొట్టడం ద్వారా లేదా కలపడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలోని ‘సమాజ్ వాదీ పార్టీ’-సపా- మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని ‘బహుజన సమాజ్ పార్టీ’ ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం 1990 నుంచి నడుస్తున్న చరిత్ర! 2007 నాటి శాసనసభ ఎన్నికల సందర్భంగా మాయావతి కులతత్త్వ పథంలో మరింత ముందుకెళ్లి ‘బ్రాహ్మణ్ జోడో’ కార్యక్రమం ద్వారా తన పార్టీ కుల బలాన్ని మరింత పెంచుకోగలిగింది. చతుర్ముఖ పోటీలో ముప్పయి శాతం వోట్లను గెలుచుకుని శాసనసభలో పూర్తి ‘మెజారిటీ’ సాధించగలిగింది! 2007 నుంచి 2012 వరకు మాయావతి ముఖ్యమంత్రిత్వంలో సాగిన ‘బహుజన సమాజ్’ పాలన అవినీతికి ‘విగ్రహం’గా పేరుమోసింది, మారుమోగింది. అందువల్ల 2012 నాటి శాసనసభ ఎన్నికలలో కేవలం ఇరవై తొమ్మిది శాతం వోట్లతో ‘సపా’ అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగింది, ములాయంసింగ్ తనయుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి కాగలిగాడు! ‘అఖిలేశ్ యాదవ్ విద్యాధికుడని, సంస్కార వంతుడని, అతని పాలన ‘స్వచ్ఛం’గా ఉండగలదని’ అప్పుడు ప్రచారమైంది.. కానీ గత ఐదేళ్లలో అవినీతితోపాటు అరాజకాలు, అబలలపై అత్యాచారాలు ‘కనీ వినీ ఎరుగని రీతి’లో పెరిగిపోవడం అఖిలేశ్ యాదవ్ ‘రీతి’కి ప్రత్యక్ష ప్రమాణం! మహిళపై లైంగిక అత్యాచారం జరిపినట్టు ఆరోపణకు గురైన ‘గాయత్రి ప్రజాపతి’ అనే నేత అఖిలేశ్ యాదవ్ మంత్రివర్గంలో-ఈ ఎన్నికల పరాజయం తరువాత అఖిలేశ్ రాజీనామా చేసే వరకూ-కొనసాగడం భయంకర పాలనను పైశాచిక ప్రవృత్తికి పరాకాష్ఠ. పదేళ్లుగా ఇలా కుల రాజకీయాలలో, అవినీతి విష ప్రభావంతో ఊపిరాడని వోటర్లు ఇప్పుడిలా ‘స్వచ్ఛత’కు మరోసారి శ్రీకారం చుట్టారు!
ఈ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో ‘్భజపా’కు నలబయి రెండు శాతం వోట్లు లభించడం మరో అద్భుతం! 1962 తరువాత 1977లోను 1991లోను మాత్రమే ఒకే పార్టీకి ఇలా నలబయి శాతానికి మించిన వోట్లు లభించాయి. 1977లో ‘ఎమర్జెన్సీ’ బీభత్సం తరువాత జరిగిన ఎన్నికలలో ‘నాలుగు పార్టీల కూటమి’ ఒకే పార్టీగా ఏర్పడింది. అలా ఏర్పడిన జనతాపార్టీకి నలబయి శాతం కంటే ఎక్కువ వోట్లు లభించాయి. 1991లో రామజన్మభూమి ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండిన స మయంలో ‘్భజపా’కు కూడ నలబయి శాతం కంటే మించి వోట్లు లభించాయి. ఇరవై ఆరుఏళ్ల తరువాత మళ్లీ ఈ ఘనత ‘్భజపా’కు దక్కడానికి కారణం ‘స్వచ్ఛ భారత్’ పునర్ నిర్మాణానికి కృషి చేస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వం. ‘స్వచ్ఛత’ కేవలం ‘్భతికం’ కాదన్నది ధ్రువపడింది! అధికార, రాజకీయ అవినీతి అంటని పరిపాలన ‘స్వచ్ఛత’ స్వభావం. మానసిక బౌద్ధిక స్వచ్ఛత వికసించే సమాజం- నిజమైన మానవ సమాజం! ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సాధించడం ఈ మానసిక స్వచ్ఛతకు శ్రీకారం. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడం నల్లధనంపై, నకిలీ ధనంపై, అవినీతిపై అక్రమాలపై పడిన గొడ్డలి వేటు.. జనం ఈ చర్యను ఆమోదించారు, అభినందించారు, మతదాన పేటికల-బ్యాలెట్ బాక్సెస్ అన్న వోటింగ్ యంత్రాల-ద్వారా ఉత్తరప్రదేశ్‌లోను, ఉత్తరఖండ్‌లోను మరో రాజ్యాంగ విప్లవాన్ని ప్రస్ఫుటింప చేసారు. 2012 నాటి శాసనసభ ఎన్నికలలో కేవలం పదిహేను శాతం వోట్లను పొందిన భాజపా ఈ ఎన్నికలలో ఇలా మూడు రెట్లుగా తన వోట్ల బలం పెంచుకొనడానికి కారణం కేంద్ర ప్రభుత్వం వారి ‘స్వచ్ఛ‘ పాలనం.. వికసించిన ‘స్వచ్ఛత‘ విస్తరిస్తోంది!
‘సిమి’ వంటి జిహాదీ సంస్థలకు, పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకారులకు ‘కొమ్ము కాచిన’ రాజకీయాలకు జనం చేసిన మహాభిశంసన- ‘ఉత్తర’ సమర ఫలితాలు! ములాయంసింగ్ యాదవ్ వంటివారు, దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ వారు ‘సిమి’కి మాత్రమే కాదు దేశంలోని జిహాదీ ముఠాలన్నింటికీ ‘అనధికార ప్రతినిధులు’గా మారి ఉండడం నడుస్తున్న చరిత్ర.. ఉత్తరప్రదేశ్ వోటర్లు ఈ చరిత్రను చింపి చెత్తకుండీలలో పారేశారు. మూడేళ్ల క్రితం ముజఫర్‌నగర్ జిల్లాలోను పరిసర ప్రాంతాలలోను ‘జిహాదీ’లు హిందూ బాలికలను, యువతులను అత్యాచారాలకు, వేధింపులకు గురి చేసిన సందర్భంగా చెలరేగిన హింసాకాండను అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం అదుపు చేయలేదు! జిహాదీలను పరోక్షంగా సమర్ధించడం ద్వారా ముస్లింల మూకుమ్మడి వోట్లను పొందాలనుకున్న వ్యూహం ఈ ఎన్నికలలో ఇలా బెడిసికొట్టింది! జాతీయతా నిష్ఠ గల ముస్లింలు కూడ అఖిలేశ్ యాదవ్ మతోన్మాద రాజకీయాలను తిరస్కరించడం దేశవ్యాప్తంగా మతతత్త్వ రాజకీయాలను నడుపుతున్న వారికి గొప్ప గుణపాఠం. ముజఫర్‌నగర్ ప్రాంతం నుంచి రెండేళ్లుగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన హిందువుల వ్యధ ఈ ఎన్నికల ఫలితాలను ఇలా ప్రభావితం చేసింది! జనవంచక రాజకీయాలను జనం ఎంతోకాలం సహించరు.. 2012లో స్వయంగా ఇరవై తొమ్మిది శాతం వోట్లను పొంది ‘సపా’ ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిపి కేవలం ఇరవై ఎనిమిది శాతం వోట్లను పొందడం ఇందుకు నిదర్శనం...
అయోధ్య రామజన్మభూమిపై వెలసి ఉండిన జాతీయ వీరుని మందిరాన్ని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదన్న విశ్వాసం ఉత్తరప్రదేశ్ వోటర్లలో పెరగడం కూడ ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలోను, ప్రస్తుత ‘శాసన’ సమరంలోను కూడ ‘అయోధ్య రామాలయ’ పునరుద్ధరణను ‘్భజపా’ ప్రస్తావించింది, రాజ్యాంగబద్ధమైన రీతిలో రఘురాముని మందిరాన్ని పునరుద్ధరించనున్నట్టు వాగ్దానం చేసింది! రఘురాముడు త్రేతాయుగంలో పుట్టి పెరిగిన భరతమాత వజ్రాల బిడ్డడు. అతడు జన్మించిన అయోధ్య రామజన్మభూమిగా- తరాల తరబడి జాతీయతా స్ఫూర్తి కేంద్రం! ఈ కలియుగంలో రెండు వేల వంద సంవత్సరాలకు పూర్వం విక్రమ సమ్రాట్టు రఘురాముని మందిరాన్ని మళ్లీ నిర్మించడం చరిత్ర.. ఈ మందిరాన్ని క్రీస్తుశకం 1528లో బాబర్ అనే విదేశీయ బీభత్సకారుడు కూలగొట్టడం చరిత్ర! విదేశీయ దౌర్జన్యకారులు కలిగించిన వైపరీత్యాలను తొలగించినప్పుడు మాత్రమే దేశానికి నిజమైన స్వాతంత్య్రం లభించినట్టు కాగలదు! రఘురాముడు, యదుకుల కృష్ణుడు జాతీయ మహాపురుషులు, కుల భాషా మతాలకు అతీతంగా స్వజాతీయులందరికీ వందనీయులు! విజయం సాధించిన భాజపా తన ముందున్న లక్ష్యాలను కూడ సాధించగలగాలి.. ఇదీ ‘ఉత్తర’ ఎన్నికలలో జనాదేశం...

- హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352