మెయన్ ఫీచర్

మీడియా సోషలిజానికి ముకుతాడు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజం ఎప్పటికీ దాగదు. కాకపోతే కాస్త అటు ఇటుగా కొన్నాళ్ల తర్వాతయినా బయటపడుతుంది. దాన్ని దాచాలనుకుంటే గుప్పెటను జీవితకాలం మూసే ప్రయత్నం చేయడమే. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల తెరవెనుక రహస్యాలను వెలికితీస్తున్న వికీలీక్స్‌పై ఎంత అణచివేత చర్యలు చేపట్టినా, నిజాలు బయటకురాకుండా అడ్డుకోలేకపోతున్నారు. నిజానికి ఉన్న శక్తి అదీ! ఎవరు అవునన్నా, కాదన్నా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఒక బలమైన శక్తి.
సోషల్ మీడియావల్ల నష్టపోతూ దానిని కట్టడి చేయాలన్న కాంక్షతో ఉన్న వ్యక్తులు, పార్టీలు కూడా, విధిలేక సోషల్ మీడియాను నిర్వహించుకోవలసిన అనివార్య పరిస్థితి. అన్ని దేశాలను హడలెత్తిస్తున్న ట్రంపునే వణికించిన సోషల్ మీడియాను కట్టడిచేసే ప్రయత్నాలు, అసలు సోషల్ మీడియాకు స్వేచ్ఛ ఇవ్వడం మంచిదా? కాదా? దానిని కట్టడి చేయడం సాధ్యమా? కాదా? అన్న చర్చకు తెరలేచింది.
ఎప్పుడూ దేశం మొత్తానిది ఒకదారయితే, తెలుగురాష్ట్రాలది మరొకదారి. సోషల్ మీడియా తొలిరోజుల్లో సందేశాలన్నీ వింతలు, విశేషాలు, బంధువుల వివరాలు, స్నేహితుల అనే్వషణ ఇతర అంశాల చుట్టూ తిరిగేది. ఒకప్పుడు చిన్ననాటి మిత్రుల ఆనుపానులు తెలుసుకోవాలంటే ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటే చాలు, అర నిమిషంలో వారి అడ్రసులు వచ్చేస్తున్నాయి. అంత బలమైన సోషల్ మీడియా ఇప్పుడు పార్టీలకు శాపంగా, ప్రజలకు వరంగా మారింది.
సమాజంలో జరిగే రోజువారీ వ్యవహారాలపై స్పందించే వారి సంఖ్య మొదట్లో వందలు, తర్వాత వేలు, ఇప్పుడు లక్షలకు చేరింది. అయితే, ఈ తరహా ‘స్పందనకారులు’ల్లో ఎక్కువమంది ఏ ఎన్నికల్లోనూ క్యూల్లో నిలబడి ఓట్లేసే బాపతు కాదు. కానీ మరొకరికి నష్టం కలిగించి, ఇతరుల్లో చైతన్యం నింపి, వాస్తవాలు ఆలోచించేంత వరకూ పనికొస్తారు. అది ఒకరికి లాభం కలిగిస్తే, మరొకరికి నష్టం కలిగించవచ్చు. దానికి కారకులను గుర్తించడం కష్టం. ఎందుకంటే సోషల్ మీడియా అంటే తండ్రెవరో, తల్లెవరో తెలియకుండా పుట్టిన అనాధ కాబట్టి.
ఇప్పుడదే పార్టీలకు పెను ప్రమాదంగా పరిణమించింది. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్‌ను ఆయుధంగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం, వైసీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిని నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. అయితే అవి తర్వాత కాలంలో రాజకీయ పార్టీలు, వాటి సానుభూతిపరుల అధిపత్యంలోకి వెళ్లిపోయాయి. ఫలితంగా ఒక పార్టీ మీద మరొక పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, అభూతకల్పనతో బురద అంటించే సాధనంగా మారిపోయింది. ఇవన్నీ నెటిజన్లకు ఉచిత వినోదంతోపాటు, అందులోని వాస్తవాలు తెలుసుకునే విశే్లషణావేదికగానూ పనికొస్తున్నాయి.
తాజాగా నవ్యాంధ్రలో పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. చంద్రబాబుప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అందులో దాగున్న అవినీతి, గతంలో వైఎస్ ఏం చేశారు? ఇప్పుడు బాబు ఏం చేస్తున్నారు? లోకేష్ ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? మంత్రుల ముచ్చట్లేమిటి వంటి అంశాలే అన్ని అండ్రాయిడ్ ఫోన్లలో పరిభ్రమిస్తున్నాయి. ఇవన్నీ వైసీపీ ఏలుబడిలోని సోషల్ మీడియా నిర్వాకమేనన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఈ విషయంలో వైసీపీ ఒక మెట్టు పైనే ఉంది. లోకేష్ వ్యవహారశైలి, ప్రసంగాల్లో తడబాటు వ్యవహారం గత నెలరోజుల నుంచి నెట్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లలోనూ దర్శనమిస్తోంది. వైసీపీ లోకేష్‌ను చైతన్యరహితనేతగా, అచేతననేతగా జనం ముందు నిలబెట్టడంలో సఫలీకృతురాలయింది. తాజాగా ఆ పార్టీ నేత రోజా మాట్లాడుతూ గూగుల్‌లో పప్పు అని కొడితే లోకేష్ ఫొటోలు వస్తున్నాయని వ్యంగ్యాస్త్రం సంధిస్తే, పప్పు శరీరానికి మంచిదని తమ్ముళ్లు చెప్పుకోవడం ద్వారా రోజా వ్యాఖ్యను నిజం చేసినట్టయింది. పైవారిని మెప్పించేందుకు కిందవాళ్లు చేసే ఓవర్ యాక్షన్ వికటిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి మరి!
భావినేత లోకేష్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయన్నది నిజం. ఆయన తరచూ నోరుజారి చేస్తున్న వ్యాఖ్యలు నగుబాటవుతున్నాయన్నదీ నిష్ఠుర నిజం. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు సహా కింది స్థాయి వరకూ బాబు-లోకేష్ సారూప్యం, సమర్ధతను చర్చించుకుంటున్నారన్నది దాచినా దాగని వాస్తవం. నిజానికి ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కనిపెట్టిన అద్భుతాలేవీ లేవు. కాకపోతే చినబాబు నోరుజారి చేస్తున్న క్లిప్పింగులే ఉంచి, దానికి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారంతే. నాయకత్వం పనితీరు నచ్చక, చినబాబు వ్యవహారశైలి నచ్చని సొంత పార్టీ శ్రేణులు కూడా వీటిని ఆస్వాదించడం లేదనుకుంటే పొరపాటు.
సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ నిజాలనుకుంటే అది పిచ్చితనమే. నేరుగా ప్రశ్నించేందుకు భయపడేవారు, తమ కోరికలను ప్రచారరూపంలో తీర్చుకునేవారు, ఎదుటివారిని భ్రష్ఠుపట్టించడమే పనిగా పెట్టుకునే సామాజిక కార్యకర్తలే వీటిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఒక్క లోకేష్‌కే పరిమితమైన వ్యవహారం కాదు. తాజాగా బిజెపిని నోటిమాటతో శాసిస్తున్న నెల్లూరు నాయుడుగారిపైనా వ్యంగ్యాస్త్రాలు మొదలయ్యాయి. అవి సొంత పార్టీ వారికి అనందం కలిగిస్తున్నా అందులో నిజానిజాలేమిటన్నది అనుభవిస్తున్నవారికే అర్ధమవుతుంది. ఏపిలో బిజెపిని సాధ్యమైనంత వరకూ ఎదగకుండా నాయుడుగారు పుణ్యం కట్టుకుంటున్నారంటూ వస్తున్న సోషల్ విశే్లషణను తిప్పికొట్టి అసలు నిజాలేమిటో చెప్పుకోవడం తప్ప, ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పడమనేది అసాధ్యం, అసంభవం.
ఎందుకంటే తప్పులు చేస్తుంటేనే కదా విమర్శకు గురయ్యేది? అసలు ఆ తప్పులు చేయకపోతే విమర్శకే తావుండదు కదా? లోకేష్‌పై గత కొద్దికాలం నుంచి వస్తున్న వ్యంగ్యాస్త్రాలు పార్టీ, వ్యక్తిగతంగా చినబాబుకూ నష్టం కలిగించేవే అయినప్పటికీ, తప్పులు ఎత్తిచూపే వారిపై ఆగ్రహించడం తెలివైనపని కాదు. జనంలోకి వెళ్లే ముందు ఏం మాట్లాడాలన్న ముందస్తు కసరత్తు లేకుండా, పక్కనున్న వారు రాసిచ్చినవి చదవడం యువనాయకుల తప్పే కదా? అసలు తెలుగుపై పట్టు సాధించేంత వరకూ జనంలోకి వెళ్లకుండా బాగుండేమో? పోనీ యువరాజు పక్కనేమైనా రాజకీయాల్లో తలపండినవారు, క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నవారేమైనా ఉన్నారా అంటే అదీ లేదు. గుమాస్తాగిరీ స్వభావం ఉన్న వారి నుంచి మేధస్సు ఆశించడం తప్పే కదా?
తప్పులు సరిదిద్దుకుని, విమర్శలకు తావులేకుండా వ్యవహరిస్తే సోషల్ మీడియాకు దొరికే అవకాశమే ఉండదు. అలా కాకుండా ఉన్న విషయాలు మాట్లాడేవారిని, తెరపైకి తెచ్చే వారిని నియంత్రించాలన్న ధోరణి నేతల అప్రజాస్వామ్య, నియంతృత్వ లక్షణాలను బయటపెడుతుంటాయి. నిజం దాచే ప్రయత్నాలు ఎంత బలంగా చేస్తే, అవి అంతకంటే బలంగా జనాలకు చేరువవుతాయి.
ఎందుకంటే మునుపటిలా జనం ఒకటి రెండు పత్రికలు చదివి అవే నిజమని భ్రమించే రోజులు పోయాయి. గత కొనే్నళ్ల వరకూ రాజగురువులుం గారు ఏది చెబితే అదే నిజమని నమ్మేవాళ్లు. ముఖ్యమంత్రి తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు అసమర్ధులు, అవినీతిపరులన్న విచిత్ర ప్రచారం నిజమేకామోసనుకునేవారు. ఆయన ఆలోచన ప్రకారమే ప్రపంచం పరిభ్రమించాలన్న భ్రమలు తర్వాత పటాపంచలయిపోయాయి. ఆ తర్వాత తెరపైకి వచ్చిన మరో మీడియా కులగురువు రెండో కృష్ణుడు అవతారమెత్తి మొదటి రాజగురువుదారిలోనే నడుస్తూ, తాను మెచ్చిన పార్టీని నడిపిస్తున్న భ్రమలు కల్పిస్తున్నారు.
అయితే, తమ మీదకు వదిలే వార్తల్లో నిజమెంత? అబద్ధమెంత? అవి పార్టీల కోసం రాయించినవా? లేకపోతే పైవారిని మెప్పించి కొత్త కాంట్రాక్టుల కోసం రాసినవా? అదీగాకపోతే తన కోర్కెల చిట్టాను పాలకులు పక్కకుపెట్టినందుకు అలిగి రాసిన కథనాలా? అన్నది జనం ఇట్టే చెప్పేస్తున్నారు.
ఒకప్పుడంటే ‘ఆ రెండు పత్రికలు’ చెప్పినవే నిజాలని నమ్మే పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం, వైసీపీ, సీపీఎం, సీపీఐకి ఎవరి మీడియా దుకాణాలు వారికున్నాయి. కాబట్టి నిజాన్ని ఎవరు సమాధి చేసే ప్రయత్నాలు చేసినా ‘కనిపించని ఐదో సింహ’మైన సోషల్ మీడియా ఉండనే ఉంది. అందువల్ల నిజాన్ని సమాధి చేయడమంటే గుప్పిట్లో నిప్పును ఎక్కువసేపు ఉంచుకునే సాహసమే.
ఇప్పుడు పరిశుద్ధిడిలా, బాబు పాలనపై సోషల్ మీడియాలో యుద్ధం చేయిస్తున్న జగన్ కట్టుకున్న ఇంధ్రభవనాలపైనా అప్పట్లో సోషల్ చర్చ జరిగింది. కానీ దానికి ఇప్పటివరకూ ఆయన జవాబివ్వలేదు. జగన్ ఆస్తులు, భవంతులు, అక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వ్యంగ్యాస్త్రాలు కూడా నెటిజన్లకు వినోదం కలిగిస్తున్నాయి. కాబట్టి నిజాన్ని ఎవరు దాచాలని చూసినా అభాసుపాలయి, జనంలో దానిపై మరింత ఆసక్తిపెంచేందుకు కారకులవుతారన్న ‘అసలు నిజాన్ని’ గుర్తిస్తే మంచిది.

-మార్తి సుబ్రహ్మణ్యం