మెయన్ ఫీచర్

ఆయుధాలు కాదు.. ఆహారం ఇవ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెలరోజులు తిరగక ముందే దండకారణ్యంలో భద్రతా బలగాలు మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకున్నాయి. మూడురోజుల గాలింపు చర్యల సందర్భంగా దాదాపు 20 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని చత్తీస్‌గఢ్‌లోని ‘యాంటీ నక్సల్స్ ఫోర్స్’ చీఫ్ అవస్థి ప్రకటించారు. నక్సలైట్ల ఏరివేతకు తాము ప్రారంభించిన ‘వేట’ ఇంకా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత నెలలో ఎక్కడైతే మావోయిస్టులు ఆదివాసీలను ‘మానవ కవచాలు’గా చేసుకుని భద్రతా జవాన్లపై మెరుపుదాడి చేశారో, ఆ పరిసర అటవీ గ్రామాల్లోనే ఏరివేత కార్యక్రమం కొనసాగినట్టు తెలుస్తోంది. చింతల్‌నార్ గ్రామ ప్రాంతంలో చాలామంది మావోయిస్టులు హతమయ్యారని ఆ అధికారి వివరించారు. హతమైన మావోయిస్టుల్లో గత నెల దాడిలో పాల్గొన్న వారు కొందరున్నారని, సంఘటన స్థలంలో కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమ జవాన్లు ముగ్గురు గాయపడ్డారని తెలిపారు.
దండకారణ్య పరిస్థితులను ఒకసారి అవలోకిస్తే.. ఆదివాసీలకు ఆహారం, ఆవాసం అవసరం. వీటిని పక్కనపెట్టి వారికి మావోయిస్టులు ఆయుధాలు చేతికివ్వడం అన్యాయం. అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్న దృశ్యాలు అనేకం. ఈ ఘర్షణను తట్టుకోలేక చాలామంది అడవిబిడ్డలు తమ ఆవాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. అక్కడ మళ్లీ ఆహారం, ఆవాసం సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా ఈ సుడిగుండంలో వారు చిక్కుకుని విలవిలలాడుతున్నారు.
మానవ హక్కుల గురించి, ఆదివాసీల క్షేమం గురించి చర్చ చేసే అనేక స్వచ్ఛంద సంస్థలు, మేధావులు మావోయిస్టులకు సహకరించడం, చాపకింద నీరులా వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. ఖనిజాల తవ్వకాల వల్ల ‘విస్థాపన’ జరుగుతుందని ఆందోళనలు చేస్తున్న ‘హక్కుల’ బృందాలు ఘర్షణ వాతావరణం కారణంగా ఆదివాసీల ‘విస్థాపన’ జరుగుతున్న విషయంపై మాత్రం మావోయిస్టులను తప్పుపడుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. చత్తీస్‌గఢ్‌లోని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అనేకమంది ఆదివాసీలు తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని చర్ల, భద్రాచలం తదితర ప్రాంతాల్లోకి వలస వస్తున్నారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆదివాసీలకు ఆహారం, ఆవాసం కల్పించే ప్రయత్నాలు గాక, ఆయుధాలు అందించడం వల్ల జరుగుతున్న పరిణామమే ఇదని స్పష్టంగా తెలుస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, ఆదివాసీలపై ఆప్యాయత వ్యక్తం చేసేవారు చేయవలసిందేమిటి? మావోయస్టులు ఆదివాసీల చేతికి ఆయుధాలు ఇవ్వకుండా, వారితో దళాల నిర్మాణం జరపకుండా, వారితో దాడులు చేయించకుండా, వారి మానాన వారు జీవించేలా ప్రయత్నించాలి. అలాకాకుండా హక్కుల పరిరక్షణ పేరిట వారిని సంఘటిత పరుస్తున్నామన్న నెపంతో వారి జీవితాలతో ఆటలాడుకోవడం 21వ శతాబ్దంలో ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాని వ్యవహారమే అవుతుంది. ప్రాథమిక అవసరాలను విస్మరించి, ఆదివాసీల ఆకాంక్షలను పక్కకుతోసి, రాజ్యాధికారం పేరిట వారి చేతికి ఆయుధం అందించడం ఆహ్వానించదగ్గ అంశం కానే కాదు. అమాయకులను మానవ కవచాలుగా చేసుకుని భద్రతా దళాలపై దాడులు చేయడం ‘మర్యాద’ అవదు.
రాజ్యాధికారం చేపట్టి, పాలన చేసే ఆలోచన ఆదివాసీలది కాదు. వారిని సాకుగా చూపించి మావోయిస్టులు రెచ్చిపోవడం, తమ డిమాండ్ ఆదివాసీలదే అనడం అంతగా నప్పని మాట. ఒకరి రాజ్యాధికారం కోసం ఒక సమూహం, కొన్ని తెగలు, జాతులు తమ సర్వస్వం త్యాగం చేయాలని కోరడం, ఆ పరిస్థితులను సృష్టించడం దారుణం. డిజిటల్ టెక్నాలజీతో ‘నాలెడ్జి ఎకానమీ’ ఊపుమీదున్న నేపథ్యంలో, కృత్రిమ మేధ ఆధారంగా ‘రోబో’లు ఉత్పత్తిలో పాల్పంచుకుంటున్న సందర్భంలో, మనుషులు లేకుండానే కార్లు, ట్రక్కులు నడిచే సమయం ఎంతో దూరం లేదని చెప్పుకుంటున్న కాలంలో ఇంకా ‘వర్గ పోరాటం’ అని మావోలు అనడం విడ్డూరం. ఐదు, పది సంవత్సరాల క్రితం వచ్చిన టెక్నాలజీ సైతం ఆటోమేషన్ కారణంగా పాతబడిపోయి, ఆ టెక్నాలజీతో ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదమున్నదని ఆందోళన పడుతున్న సంధి సమయంలో- కొండకోనల్లో ఉంటూ ‘రాజ్యం’పై యుద్ధం చేస్తున్నామని మావోయిస్టులు నమ్మబలుకుతున్నారు. ‘వైఫై’ ఆధారంగా ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) అద్భుతాలు సృష్టిస్తుండగా, సముద్ర గర్భం నుంచి అత్యంత విలువైన ఖనిజ సంపదను వెలికి తీసే ప్రణాళికలను రచిస్తున్న వేళ, ప్రపంచమంతా ఒక కొత్త కక్ష్యలోకి మారి పరిభ్రమిస్తున్న సమయంలో ఆదివాసీలకు అందించాల్సింది- జ్ఞానం, తెలివితేటలు, బుద్ధి వికాసం. వారికి ఇవ్వాల్సింది మందుపాతరలు, మర తుపాకులు కాదు.
ఇటీవల చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో సిఆర్‌పిఎఫ్ జవాన్లపై మావోయస్టుల దాడి సందర్భంగా ఆదివాసీల చేత బాణాలకు బాంబులు కట్టి వదిలేలా చేశారు. ఈ రకమైన పాశవిక, ఆటవిక దాడుల వల్ల, పురాతన ఆయుధాలకు ఆధునికత అద్దుతున్నామన్న ఆలోచనల వల్ల ఆదివాసీలకు మేలు జరిగే అవకాశం వీసమంత కనిపించదు. కొన్ని మాసాల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ మండల కేంద్రంలో జరిగిన నాగోబా జాతరలో అధికారులు ‘వైఫై’ సౌకర్యాన్ని ఆదివాసీలకు పరిచయం చేసారు. వారికి ‘4జి’ సేవలు అందించారు. ‘హాట్‌స్పాట్’ను ఏర్పాటు చేసారు. సెల్ టవర్లు అంతకుముందే ఏర్పాటు చేసారు. ఆ జాతరకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఆదివాసీలు హాజరయ్యారు. ముఖ్యంగా చత్తీస్‌గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు వచ్చారు. తమ సంప్రదాయాలను, పండుగలను, ఉత్సవాలను ఎంతో ఉల్లాసంగా జరుపుకునే ఆదివాసీల చేతికి ఆధునిక ఆయుధ సంపత్తి అందేలా చూడడంలో విజ్ఞత ఉందా? వారికి ‘ఎకె-47’ తుపాకులను ఇవ్వడంలో విజ్ఞత ఉందా?
నాలెడ్జి ఎకానమీని, ప్రస్తుతం చెలామణిలో ఉన్న టెక్నాలజీని తోసిరాజని అందుకు ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టే పరిస్థితి కాగడాపెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు. ఈ పరిస్థితిలో ఆదివాసీలపై సానుభూతి గలవారు చేయవలసింది ఏమిటి? బస్తర్‌లో జర్నలిస్టు శుభ్రాంశు చౌధురిలా ఆదివాసీల సమస్యలను పరిష్కరించడం మావోయిస్టులకు తెలియదు. శుభ్రాంశు, ఆయన బృందం ప్రజల వద్దకు వెళ్లి తమ హక్కుల గురించి వారు తెలుసుకునేలా కృషి చేస్తున్నారు. అలా ఆదివాసీలు స్వతహాగా ఎదగడానికి అవకాశం కల్పించడం ముఖ్యం కానీ, రాజ్యాధికారం పేర ఆయుధం చేతికి ఇవ్వడం ఏ రకంగా చూసినా అన్యాయం. లక్షమంది ఆదివాసీలతో ప్రైవేటు సైన్యాన్ని రూపొందించినా ఏమిటి ప్రయోజనం? వారిలో అక్షర జ్ఞానం, అవగాహనా శక్తి, ఆధునిక పరిస్థితులకు స్పందించే జ్ఞానం లేకపోతే ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? అసలు ప్రయోజనం ఆదివాసీలకు మాత్రం కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
ఉద్యమం, పోరాటం స్వల్పకాలికమైనవే అయితే, వాటి ఫలితాలు ఆపన్నులకు అందుతాయన్న భరోసా ఉంటుంది. సాయుధ పోరాటం దీర్ఘకాలికమైనది. ఈ తరం కాకపోయినా రాబోయే తరాలు ఫలితాలను అనుభవిస్తాయన్న అస్పష్ట ఆలోచనలతో ప్రాణత్యాగాలకు పురికొల్పడం దుర్మార్గం తప్ప మరొకటి కాదు. మరో రెండు, మూడు సంవత్సరాల తరువాత లేదా దశాబ్దం తరువాత ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించని స్థితిలో అటు పాలకులు, ఇటు నిపుణులు, శాస్తవ్రేత్తలు ఉంటే త్యాగాల వంతెనపై రక్తం చిందిస్తూ ‘లాంగ్‌మార్చ్’ చేద్దామని ఆదివాసీలను రెచ్చగొట్టడం అవివేకం. సామ్రాజ్యవాదం, భూస్వామ్య విధానం, పెట్టుబడిదారీ విధానం ఊహించనంతగా రూపాంతరం చెందాయి. కానీ, మార్క్సిజాన్ని విశ్వసించే మావోయిస్టులు పిసరంత కూడా రూపాంతరం చెందలేదు. అలా మూర్ఖంగా కొనసాగడం వల్ల ఏ ప్రజానీకానికి మేలు జరుగుతున్నది? ఇటీవల ఝార్ఖండ్‌లో కరడుగట్టిన మావోయిస్టు నాయకుడు కుందన్ పహాన్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అతనిపై 128 కేసులున్నాయి. సీనియర్ పోలీసు అధికారిని, నిఘా అధికారి ఫ్రాన్సిస్ ఇంద్‌వర్‌ను హత్యచేసిన నేరారోపణలు ఆయనపై ఉన్నాయి. అయిదు కోట్ల రూపాయలను లూటీ చేసిన కేసులోనూ అతను నిందితుడు. ప్రభుత్వం అతని తలపై రు.15 లక్షల రివార్డును ప్రకటించింది. ఫ్రాన్సిస్ లొంగుబాటు దేనికి సంకేతం? మావోయిజం బలపడుతోంది, త్వరలో దిల్లీలోని ఎర్రకోటపై ‘ఎర్రజెండా’ ఎగురవేస్తుందన్న ఆశలు కల్పిస్తుందా..? లేదు.
ఇటీవల బస్తర్‌లో మరో మావోయిస్టు నాయకుడు కైలాష్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతని తలపై ప్రభుత్వం 16 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. దాంతో అతను ఎంత కరడుగట్టిన మావోయిస్టో ఎవరికైనా అవగతమవుతుంది. మావోయిస్టులు లొంగిపోవడం, ఎన్‌కౌంటర్లలో మరణించడం వల్ల ప్రజలకు ఒరిగింది ఏమైనా ఉందా? ఆదివాసీల చైతన్యం ఆవిరి కావడం తప్ప! ఆహారం, ఆవాసం, అక్షర జ్ఞానం అందించాల్సిన సమయంలో ఆయుధాలు అందివ్వడం వల్ల అనర్థమే తప్ప అద్భుతమేదీ జరిగే సూచనలు కనిపించడం లేదు.

-వుప్పల నరసింహం సెల్ : 99857 81799