మెయిన్ ఫీచర్

ఇక బడ్జెట్టే హీరో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా లావైపోతోంది. హిట్టు ఫలితాల మాటెలావున్నా -కట్టలుకట్టలుగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైపోతోంది. హీరో ఎవడైతే ఏంటి? హీరోయిన్ ఎలాగుంటే ఏంటి? సినిమాలో కథ సాదా సీదాగా వున్నా నో ప్రాబ్లెమ్. కథనం పరుగులు తీయకున్నా ఫరవాలేదు. హంగులు ఆకాశమంతా ఎత్తులో ఉన్నాయంటే చాలు.. ఇక ఆ సినిమా ఓకే అయిపోతుంది. ఈ సూత్రాన్ని ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో హీరోలు ఒంటబట్టించుకుంటున్నారు.
దాదాపు వెయ్యికోట్ల మార్క్ దాటిన బాహుబలి సినిమాను చూసిన స్టార్ హీరోలు.. ఆ స్థాయిలో కాకున్నా తమ చిత్రాలనూ చెప్పుకోదగినంత బడ్జెట్‌తో తీయాలని ఆశిస్తున్నారు. అన్ని భాషల్లో రూపొందిస్తే ఇంకా బావుంటుందన్న ఆశలూ బయటపెడుతున్నారు. ఇప్పటికే తెలుగు హీరోలూ పలు భాషల్లోకి మార్కెట్ విస్తరిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా సూపర్ హిట్ అయిందంటే ఆనందానికి ఆనందం, కెరీర్‌కు కొత్త బలం. కనుక ఒక్కదెబ్బకి పలు పిట్టలన్నట్టుగా కొత్త ప్రణాళికలపై తెలుగు హీరోలు దృష్టి పెడుతున్నారు. ఇక్కడ ఒకరిని మించి ఒకరు బడ్జెట్‌ను కోట్లకు పెంచుకుంటూ పోవడమే కొత్త గేమ్‌లా సాగనుంది.

సినిమా అన్న తరువాత కథ, కాకరకాయ ఉండాలన్నట్టుగానే ఓ హీరో కూడా ఉండాలి కదా! హీరో ఉంటే ఖచ్చితంగా ఆడటానికి, పాడటానికి హీరోయిన్ కూడా ఉండొద్దూ! ఈ రెండూ ఉంటేనే ఎలాంటి కథనమైనా నల్లేరుపై నడకలా సినిమా సాగిపోతుంది. ఇదంతా ఒకప్పటిమాట. ఇప్పుడంతా హీరో ఎవడైతే ఏంటి? హీరోయిన్ ఎలాగుంటే ఏంటి? సినిమాలో కథ సాదా సీదాగా వున్నా, కథనం మాత్రం భారీ స్థాయిలో, హంగులు ఆకాశమంతా ఎత్తులో ఉన్నాయంటే ఆ సినిమా ఓకే అయిపోతుంది. ఈ సూత్రాన్ని ఇప్పుడిప్పుడే మన టాలీవుడ్‌లో హీరోలు ఒంటబట్టించుకుంటున్నారు. అందుకే భారీ స్థాయిలో సినిమాలను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కథ, కథనాలు ఎలా వున్నా భారీ స్థాయిలో సినిమా వుందంటే బాహుబలిలాగా పలు భాషల్లో మార్కెట్ వుంటోంది. కనుక, ఎలాంటి కథతో రూపొందించినా ప్రేక్షకుడు మినిమమ్ గ్యారంటీ అని చూస్తాడు కనుక పెట్టిన భారీ పెట్టుబడి తిరిగి పొందవచ్చునన్న నమ్మకం ఇప్పుడు ఏర్పడింది. దాదాపు వెయ్యికోట్ల మార్క్ దాటిన తెలుగు సినిమాను చూసిన హీరోలు ఆ స్థాయిలో తమ చిత్రాలను అన్ని భాషల్లో రూపొందిస్తే బావుంటుంది కదా అని ఆలోచిస్తున్నారు. ఒకవైపు పలు భాషల్లో మార్కెట్ వుంటుంది, సినిమా సూపర్ హిట్ అయిందన్న ఆనందమూ మిగిలి కెరీర్‌లో ఓ హిట్ సినిమా ఖాతాలో పడుతుంది. కనుక ఒక్కదెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా అటు భారీ కలెక్షన్లు, మరోవైపు అద్భుతమైన ఫాలోయింగ్ వస్తుంది అని ఆలోచిస్తున్నారు. అందుకే, ఆ వైపుగా ప్రయాణిస్తూ కొత్త కొత్త కథలను వినేస్తున్నారు. గతంలో కూడా కొందరు హీరోలు తెలుగు, తమిళ భాషలతోపాటుగా హిందీ భాషలో కూడా తమ చిత్రాలను రూపొందించారు. ఉదాహరణకు, చిరంజీవి తెలుగుతోపాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసి కొన్ని సినిమాలు అందించారు. నాగార్జున కూడా అటు తమిళ ప్రేక్షకులకు, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు. గీతాంజలి చిత్రం తరువాత తమిళంలో ఏర్పడిన మార్కెట్‌ను నాగార్జున క్యాష్ చేసుకోలేకపోయాడన్న వాదన అప్పట్లో వినిపించింది. అయితే ఇప్పుడు వున్న పరిస్థితుల నేపథ్యంలో ఏ భాషలో మార్కెట్ లేకపోయినా ఫర్వాలేదు, సినిమాను అదో అద్భుతంగా చూపించి భారీ స్థాయిలో విడుదల చేస్తే ఫలితాన్ని పొందవచ్చు అని ఇటీవల కొన్ని రుజువులు దొరికాయి. బాహుబలికి ముందు ప్రభాస్‌కు తమిళంలోగాని, హిందీలోగాని మార్కెట్ లేదు. కానీ ఇప్పుడు దాదాపు 1500 కోట్ల కలెక్షన్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్న చిత్ర కథానాయకునిగా గుర్తింపు లభించడంతో అన్ని భాషల్లో చిత్రాలు చేయడానికి ప్రభాస్‌కు మార్గం సుగమమం అయింది. ఇదే నేపథ్యంలో మహేష్‌బాబు కూడా అటు హిందీ, ఇటు తమిళ భాషల్లో చేయడానికి సిద్ధమవుతున్నాడు. సినిమాకు బడ్జెట్‌ను హీరోను బట్టి నిర్ణయించే స్థాయి దాటి, బడ్జెట్‌ను బట్టి హీరోను నిర్ణయించుకునే స్థాయికి మారిపోయింది సినిమా పరిశ్రమ. కథానాయకులకు వున్న మార్కెట్‌ను పెంచాలన్నా, తగ్గించాలన్నా అదంతా భారీ సినిమాల చేతిలోనే వుంది. అందుకే ఎలాంటి కథలైనా సరే, దానికి అన్ని హంగులు జత చేర్చి ఓ రకంగా స్వర్గాన్ని కిందకు దింపినట్లుగా చిత్రీకరించి విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిరంజీవి 150వ సినిమా దాదాపు 120 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కడానికి గల కారణం కూడా ఇదే. అలాగే ప్రభాస్ తరువాతి చిత్రం సాహో కూడా భారీ స్థాయిలోనే రూపొందిస్తున్నారు. ఇది అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. మహేష్‌బాబు తాజాగా నటిస్తున్న స్పైడర్ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రూపొందించి భారతీయ సినిమా మార్కెట్‌ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘్భరత్ అను నేను’ చిత్రంతోపాటుగా మరో సినిమాను కూడా మహేష్‌బాబు ఇదేవిధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అరవింద్ తాజాగా రామాయణం సినిమాను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ స్థాయిలోనే రూపొందిస్తారు. రామాయణం అనగానే భారతదేశం మొత్తం ప్రదర్శించే అవకాశం ఉంది కనుక అన్ని భాషల్లోనూ విడుదల చేయనున్నారు. దాంతో సినిమాకు పెట్టిన 500 కోట్లు మరో 500 కోట్లను సాధించే వీలుంది. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో భారీ సినిమాల వైపు మళ్లిన బాలకృష్ణ కూడా తాజాగా రూపొందిస్తున్న చిత్రంతో తెలుగు, తమిళ, హిందీ భాషలపై టార్గెట్ చేశారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి అటు కె.ఎస్.రవికుమార్‌తో తమిళ మార్కెట్, బాలకృష్ణ ఉండడంవల్ల తెలుగు మార్కెట్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుందని యూనిట్ అభిప్రాయపడుతోంది. పలు భాషల్లో మార్కెట్ సంపాదించడం ఆయా హీరోల స్టామినాను బట్టి గతంలో సాగేది. ఇప్పుడు అదంతా మారిపోయింది. సినిమాను ఎంత గొప్పగా రూపొందిస్తే ఆ హీరోకు అంత గుర్తింపు వస్తుంది. అల్లు అర్జున్‌కు మలయాళంలో మంచి మార్కెట్ వుంది. తమిళంలోకూడా సాధించడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇదే విధంగా తెలుగు హీరోలు భారీ మార్కెట్‌ను చేరుకోవడానికి కథ కథనాల సంగతి పట్టించుకునే స్థితి దాటిపోయింది. కేవలం సినిమా స్థాయి, రేంజ్ ఎంత అనే ఆలోచనలే ముసురుకుంటున్నాయి. భారీ సినిమానా? లేక చిన్న చిత్రమా? అని ఆలోచిస్తున్నారు. గుర్రాల వెనుక పరుగులు తీస్తున్నారు.
హీరో, దర్శక నిర్మాతల ఆలోచనా విధానం ప్రకారం ఓ సినిమా అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించి కలెక్షన్లు రాబట్టాలంటే కథ ముఖ్యమా, లేక సినిమాను భారీ స్థాయిలో చిత్రీకరించాలా? హీరో ముఖ్యమా? ఆ చిత్రంలో ఏ ఏ భాషలకు సంబంధించిన తారాగణం ఉండాలి? అనే గ్రామర్ సినిమాకు ఇప్పుడు గ్లామర్‌ను తీసుకొస్తోంది. ‘దిమాకున్నోడు దునియా అంతా చూస్తాడు’ అన్నట్లుగా, ఒక్కో సినిమాకు ఒక్కో విధమైన సూత్రాల పడికట్టుతో సినిమాకు గ్లామర్‌ను ముందుగానే ప్రేక్షకుల హృదయాల్లో నింపగలిగితే ఆ సినిమా హిట్టే! అందుకే ఇప్పుడు కథ, కథనాలు, హీరోలు లాంటి పాత చింతకాయ ముడిసరుకులు మూటకట్టి అటకమీద పారేసే రోజులు దగ్గరపడుతున్నాయి. ఇది ఏ ప్రస్థానాలకు వెళుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

-శేఖర్