మెయన్ ఫీచర్

ఉభయ రాష్ట్రాల ఉమ్మడి వారసత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్‌లోని ధార్మిక క్షేత్రాలను సందర్శించి రావడం ఒకే భాషా కుటుంబానికి చెందిన రెండిళ్లలోని సోదరీ సోదరుల మధ్య మమతానురాగాలు మరింతగా వికసించడానికి దోహదం చేసిన శుభ పరిణామం! ఈ పరిణామ స్ఫూర్తి రెండు తెలుగు రాష్ట్రాల పుట్టిన దినం పండుగలకు ‘సాంస్కృతిక తోరణం’ వంటిది. ఈ సంస్కృతి భారత జాతీయ సీమల నలు చెరగుల వివిధ భాషల ద్వారా వివిధ భాషా జన సముదాయాల జీవనంలో అనాదిగా ప్రస్ఫుటిస్తున్న అద్వితీయ స్వభావం.. ఈ స్వభావం సంస్కారాల సమాహారం! ఈ సంస్కృతి భౌగోళికమైన రాజ్యాంగ విభాగాలన్నింటికీ సమానం. భాషా సంప్రదాయ సమానత్వం భౌగోళిక సాన్నిహిత్యం కలిగిన తెలుగు రాష్ట్రాలకు ఈ ఏకత్వం మరింత సహజం! ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మూడేళ్లుగా అనేక ‘సమస్యలు’ తలెత్తుతున్నాయి! ఈ సమస్యలన్నీ పరిష్కారం కాగలవని చంద్రశేఖరరావు తిరుపతి పర్యటన సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేయడం కూడ ఉభయ రాష్ట్రాల జన్మదిన వర్షోత్సవాలకు సమన్వయ నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేములవాడ రాజన్నను దర్శించవచ్చు, యాదగిరినెక్కి మొక్కులు చెల్లించవచ్చు, బాసరకు వెళ్లి దివ్యభారతిని అర్చించవచ్చు! భద్రగిరి దాశరథి కళ్యాణ మహోత్సవానికి, ఒంటిమిట్ట రఘురాముని బ్రహ్మోత్సవానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కలసి హాజరయినట్టయితే ‘సమస్యల’కు పరిష్కారం సులభ సాధ్యం కాగలదు! సమస్యలు లేని స్థితి ఉభయ రాష్ట్రాల మధ్య మాత్రమే కాదు, సువిశాల జాతీయ అంతర్జాతీయ సమాజాలలో సైతం ఏర్పడడం దాదాపు అసంభవం. పురిటి నొప్పులు నూతన రాష్ట్రాలకు మరింత సహజం! మహనీయులకు జన్మనిస్తున్న మాతృమూర్తులకు సైతం పురిటి నొప్పులు సహజం! సమస్యలతో సమాంతరంగా పరిష్కారాల కోసం సమన్వయ కృషి కూడ జరగాలన్నదే నిజమైన ప్రగతి! తెలంగాణ రాష్ట్రావతరణ వార్షికోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆత్మీయ అతిథిగా పాల్గొనవచ్చు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ వార్షికోత్సవ వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి కూడ ఉపస్థితుడు కావచ్చు. భారత గణతంత్ర దినోత్సవాలకు, ఇతర ఉత్సవాలకు విదేశాల ప్రభుత్వాధినేతలనే ఆహ్వానిస్తున్నాము. ఒకే భరత మాతృదేహ స్వరూపాలైన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి ఆత్మీయ సంస్కార బంధం ఎందుకని నెలకొనరాదు? ముఖ్యమంత్రి కాకపోతే ఒక మంత్రి ఇలా రెండవ రాష్ట్రం వేడుకలలో పాల్గొనవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా పునర్ వ్యవస్థీకరణ కావడం ప్రగతి వేగాన్ని పెంచగల చారిత్రక పరిణామం! పరిపాలన మరింతగా వికేంద్రీకృతం కావడానికి, ప్రజలకు దగ్గర కావడానికి ఒకే రాష్ట్రం రెండుగా ఏర్పడ్డం దోహదం చేస్తోంది. ఉభయ రాష్ట్రాలలోను ఇది మూడేళ్లుగా ధ్రువపడిన వాస్తవం! కొత్త జిల్లాలు ఏర్పడడం పాలనా సౌలభ్యం.. అంతేకాని ‘విడిపోవడం’ కాదు, కొత్త రాష్ట్రాలు ఏర్పడడం రాజ్యాంగ సౌలభ్యం.. విడిపోవడం కాదు! ఈ రాజ్యాంగ పాలనా విభాగాలు లేదా ‘రాజ్యాలు’ లేదా ‘రాష్ట్రాలు’ ఏర్పడడం పునర్ వ్యవస్థీకృతం కావడం అనాది భారత జాతీయ ప్రస్థానంలో అనేకసార్లు పునరావృత్తం కావడం చరిత్ర! శాశ్వతమైనది ఈ దేశపు జాతీయత, జాతీయ సంస్కృతి.. నదులు, పర్వతాలు సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రాలు. మన దేశంలో శాశ్వత భౌగోళిక ప్రతీకలుగా అనాదిగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రజలకైన, ఆంధ్రప్రదేశ్ జనావళికైన ఈ శాశ్వత భౌగోళిక ప్రతీకలు సమానం! శుభ సంకల్పాలలో ఉభయ రాష్ట్రాల ప్రజలూ- ‘కృష్ణా గోదావరీ నద్యోః మధ్యప్రదేశే..’- కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రాంతంలో- మనం ఫలానా శోభనకృత్యాన్ని మొదలుపెట్టుతున్నట్టు ప్రకటిస్తున్నాము. ఈ శాశ్వత భౌగోళిక అస్తిత్వం ఉభయ రాష్ట్రాల ప్రజల ఉమ్మడి వారసత్వ సంపద! ఆద్యంత రహితమైన ఈ ఉమ్మడి భౌగోళిక అస్తిత్వం విస్తృత ‘జంబూ ద్వీప భరత వర్ష భరత ఖండం’లో భాగం! కృష్ణాగోదావరి నదుల మధ్య ప్రాంతంలో మాత్రమే కాదు, కృష్ణా కావేరీ నదుల మధ్య ప్రాంతంలోను, గోదావరీ నర్మదా గోదావరీ మహానదుల మధ్య ప్రాంతంలోను కూడ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు! వారు కూడ ఇలా శాశ్వత భౌగోళిక అస్తిత్వాన్ని మాత్రమే ‘సంకల్పం’లో స్మరిస్తున్నారు! ‘గలగలా గోదారి కదలిపోతున్న’ దృశ్యం, ‘బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతున్న’ దృశ్యం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అజరామరం.. ఇదీ ఉమ్మడి భౌగోళిక వారసత్వం! ఈ భౌతిక జలాలు ఆర్థిక ప్రగతి సాధకాలు మాత్రమే కాదు, భారత జాతీయ సంస్కృతి ప్రస్ఫుటిస్తున్న సుగతి కారకాలు కూడ! ఈ నదుల సుధాస్రవంతులు నిరంతరం ఉభయ రాష్ట్రాల వారికి సమానమైన తెలుగుతల్లిని అభిషేకిస్తున్నాయి. ఈ దృశ్యాలను ఆవిష్కరించిన మహాకవి స్వర్గీయ శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెనుగుతల్లికి మల్లెపూదండ’ గీతం ఉభయ రాష్ట్రాల తెలుగువారికీ ఉమ్మడి వారసత్వం! తెలుగువారందరూ ఈ గీతాన్ని నిరంతరం పాడుకోవాలి! తెలంగాణ తల్లి, ఆంధ్రప్రదేశ్ తల్లి, కర్ణాటక తల్లి, జమ్మూ కశ్మీర్ తల్లి- వీరందరూ భూమాత స్వరూపాలు, దివ్యధాత్రికి ప్రతీకలు. ఒకే భరతమాతకు వివిధ ప్రతిబింబాలు.. భాషలు జనజీవన భావాలు ఆవిష్కృతవౌతున్న భారతీ స్వరూపాలు! అందువల్ల తెలుగు భాష సరస్వతికి రూపం! ఈ ‘తెలుగు సరస్వతి’ ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ఒకే తల్లి! తెలుగు భాషా జననిని రక్షించడం తెలుగు సాహిత్యాన్ని పరిపోషించడం ఉభయ రాష్ట్రాల ఉమ్మడి కర్తవ్యం! ‘తెలుగుతల్లి’ని ఉమ్మడిగా కీర్తించాలి! మన తెలుగుతల్లికి ఉభయ రాష్ట్రాలలోను మల్లెపూదండలు సమర్పించాలి! తల్లి స్వరూపాలు రెండు రాష్ట్రాలు. తల్లి స్వభావం ఒకే భాష! ఆచార్య సి.నారాయణరెడ్డి చెప్పినట్టు- మహాభారతం రాజమహేంద్రవరంలో వెలసింది, మహాభాగవతాన్ని పోతన్న ఏకశిలా నగరమైన ఓరుగల్లు సమీపంలోని ‘బొమ్మర’ గ్రామంలో వ్రాశాడు! ‘ఈ రెంటిలోన ఏది కాదన్న వెయ్యేళ్ల తెలుగు నిండు సున్న..’. ఆ మహాకవి చెప్పినట్టు ‘వచ్చిండన్న వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్న..!’ మరో ఇద్దరు తెలుగు మహాకవులు చెప్పినట్టు ‘గోదావరీ పావనోదారవాః పూరమఖిల భారతము మాదన్న’ నాటిది. ‘కృష్ణా తరంగ పంక్తిన్ తొక్కి తుళ్లింత ఆంధ్ర నౌకలు నాట్యమాడిన’ నాటిది. ఆ మహాకవులు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బరావు.
ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించడం ఉభయ తెలుగు రాష్టాల ప్రజల ఉమ్మడి వారసత్వానికి వినూతన పునరావిష్కరణం! ఈ సమన్వయ వారసత్వం ఉభయ ఆంధ్ర రాష్ట్రాల అవతరణ తృతీయ వార్షికోత్సవాలకు చారిత్రక నేపథ్యం! తెలంగాణ, రాయలసీమ, తీరవాటిక ప్రజలందరూ అనాదిగా ఆంధ్రులు... ఆంధ్రులన్నా తెలుగువారన్నా ఒకటే! ఆంధ్ర భాష, తెలుగు భాష పర్యాయ పదాలు! అందువల్ల కేవలం ‘సింహపురి’ నుంచి శ్రీకాకుళం వరకు వ్యాపించి ఉన్న ప్రాంతానికి మాత్రమే ‘ఆంధ్రత్వం’ వారసత్వం కాదు! ఇప్పటి రాయలసీమకు, తెలంగాణ రాష్ట్రానికి కూడ ‘ఆంధ్రత్వం’ తరతరాల వారసత్వం! ఆంధ్రత్వం, తెలుగుతనం ఒకే భాషా జన సముదాయానికి చెందిన రెండు వైవిధ్యవంతమైన పేర్లు.. మహాభారత యుద్ధం కలియుగం పూర్వం ముప్పయి ఆరవ ఏట జరిగింది. కలియుగంలో ప్రస్తుతం ఐదువేల నూట పంతొమ్మిదవ సంవత్సరం నడుస్తోంది! మహాభారత యుద్ధం జరిగిన నాటికి, అంటే ఇన్ని వేల సంవత్సరాల పూర్వం నాటికి ‘ఆంధ్ర’ ఉంది, ‘త్రిలింగ’ దేశం ఉంది! ‘త్రిలింగ’ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం ఒకటే! అప్పటి ‘తెలుగునేల’ గోదావరి నుంచి, ‘చంద్రభాగ’నుంచి, మహానది నుంచి కావేరీ తీరం వరకు విస్తరించి ఉంది! కావేరీ నది ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులలో ప్రవహిస్తూ ఉండవచ్చుగాక! కానీ ఆ ‘తీరం’లోని ప్రాచీన తెలుగు సాహిత్య సుగంధాల స్మృతులు ఇప్పటి ఉభయ ఆంధ్ర రాష్ట్రాల ప్రజల హృదయాలలో మాత్రమే కాదు, ఈ రెండు రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులకు వెలుపల ఉన్న వారి మది మదిలో సజీవ రసానుభూతులు! ఇదీ ఉమ్మడి వారసత్వం! తెలుగుతనం, ఆంధ్రత్వం, ఆంధ్ర భాష, తెలుగు భాష, ఆంధ్ర సాహిత్యం, తెలుగు సాహిత్యం, ఆంధ్ర జీవన సంప్రదాయం, తెలుగు జీవన సంప్రదాయం ఒకే అర్థాన్ని ఆవిష్కరిస్తున్న, వైవిధ్య పర్యాయ పదాలు! ఈ వైవిధ్యాల స్వరూపం, స్వభావం ఒక్కటే! ఇదీ ఉమ్మడి వారసత్వపు అద్వితీయ జన జీవనం...
‘తెలుగదేలనన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ!
ఎల్లనృపులు కొలువ ఎఱుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగులెస్స..’
- అని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుచే పలికించిన వాడు ఆంధ్రభోజుడు! తెలుగు భాష ఆంధ్ర భాష వేఱువేఱు కాదు.. వేర్వేరని చెప్పడం విబుధ దైత్యులు కొనసాగిస్తున్న కుట్రలో భాగం.. ఈ విబుధ దైత్యులు చిన్నయసూరి వ్యాకరణ సూత్రాలకు వక్రభాష్యాలు చెపుతున్నవారు, థామస్ బాబింగ్టన్ మెకాలే, బిషప్ రాల్డ్ వంటి బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారుల వారసులు.. ‘తెలుగు, ఆంధ్రం’ ఒకటి కావడం తరతరాల వాస్తవం! ఈ వాస్తవం హంపీ విజయనగరం నాటిది, ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యం నాటిది, కోటిలింగాల, ‘అమరావతి’ రాజధానులుగా విలసిల్లిన నాటిది! శాతవాహనులు ‘గిరివ్రజం’ రాజధానిగా మొత్తం భారత ఖండాన్ని పాలించిన క్రీస్తునకు పూర్వం తొమ్మిదవ శతాబ్దినాటిది.. మహాకవి మోచర్ల రామకృష్ణయ్య తెలుగును ఇలా ప్రార్థించాడు!
‘శ్రుతి మధురాక్షరంబయి,
విశుద్ధ పదార్థ పరంపరా పరి
ష్కృతమయి, లక్ష్య లక్షణ
విశేష వికస్వర సూరి సూత్ర సం
స్కృతమయి దేశ భాషల
కిరీటముగా పర పండితైక సం
స్తుతమయి, వెల్గు తెల్గు తలతున్
కమనీయ వచో విశుద్ధికై!’’
*

-హెబ్బార్ నాగేశ్వరరావు