మెయిన్ ఫీచర్

పోటీ ప్రమాదకరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రంగంలోనైనా పోటీ ఉంటేనే బాగుంటుంది. అప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. ముఖ్యంగా ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు ఏ సమస్యా ఉండదు. కానీ పరిధులు దాటిందా.. సిస్టమే చెడిపోతుంది. ఇక సినిమాల విషయానికొస్తే సినిమాల మధ్య పోటీ ఉండొచ్చు కానీ విడుదల విషయంలో నువ్వా? నేనా? అంటూ పోటీలు పడితే మాత్రం ఇద్దరికీ నష్టమే. సినిమా పరిశ్రమ ఒకరి మీద ఆధారపడింది కాదు. సినిమా వెనుక ఎంతోమంది కష్టం, శ్రమ, ధనం ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొన్ని పెద్ద సినిమాల మధ్య పోటీ ఏర్పడటం సహజమే. ఇది పండుగ సమయాల్లో అయితే ఫర్వాలేదు కానీ మిగతా సమయాల్లో ఈ పోటీవల్ల రెండు చిత్రాలకు సంబంధించిన నిర్మాతలకు కానీ, డిస్ట్రిబ్యూటర్‌లకు, బయ్యర్లకు, థియేటర్లకు అసలు సమస్యగా మారింది. ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘్భరత్ అనే నేను’ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ వెంటనే మరుసటి రోజు మరో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య-నాఇల్లు ఇండియా’ అనే చిత్రాన్ని కూడా ఏప్రిల్ 27న విడుదల చేస్తామని ప్రకటించడంతో అసలు సమస్య అక్కడే మొదలైంది. ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్నాయి. ఈ రెండు సినిమాలే పోటీగా ఉన్నాయనుకుంటే మధ్యలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రాన్ని కూడా అదే రోజు అంటే.. ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకే రోజు మూడు భారీ చిత్రాల మధ్య క్లాష్‌స్ రావడం పరిశ్రమ వర్గాలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో కొన్ని చిత్రాల మధ్య కూడా ఏర్పడిన దాఖలాలున్నాయి. నువ్వా? నేనా? అంటూ ఒకేరోజు ఇలా భారీ చిత్రాలు విడుదలకు పోటీ పడటం సరైన పద్ధతి కాదని, దీనివల్ల ఎంతో మందికి తీరని నష్టం కలుగుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. సినిమాల విషయంలో ఎంతో డబ్బు, శ్రమ పెట్టి చేసిన సినిమాలు కచ్చితంగా సంచలన విజయాలు సాధిస్తాయా? అన్న విషయాన్ని ఎవరూ చెప్పలేరు. భారీ అంచనాలతో అత్యంత భారీగా విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పల్టీలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయాలు అందుకున్న సినిమాలూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సినిమా విజయం సాధించాలనే తీస్తారు. కానీ విడుదల అయిన తరువాతే అసలు ఫలితం తెలుస్తుంది.
ప్రస్తుతం తెలుగులో రెండు భారీ చిత్రాలు ఒకేరోజు విడుదలవుతుండటంతో అటు బయ్యర్స్, ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. భారీ చిత్రమన్నాక ఆ స్థాయిలో భారీగా థియేటర్లలో విడుదల చేయాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మూడు భారీ సినిమాలకు థియేటర్లను ఎలా పంచగలమని బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపై నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ అల్లు అర్జున్‌తో మేము నిర్మిస్తున్న ‘నాపేరు సూర్య..’ చిత్రాన్ని ప్రారంభం రోజునే విడుదల డేట్‌ను ప్రకటించామని, మాకు పోటీగా కావాలని మహేష్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని అన్నారు. మహేష్‌తో సినిమా నిర్మిస్తున్న నిర్మాత కూడా మా సినిమా విడుదల తేదీని ముందే ప్రకటించామని తెలియజేశారు. ఈ ఇద్దరి నిర్మాతల వాదన సరిగ్గానే ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వాతావరణం కావాలంటే ఎవరో ఒకరు తగ్గాల్సిందే. లేదూ నేనంటే నేనని వెళ్తే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. మరోవైపు రజనీకాంత్ నటిస్తున్న ‘కాలా’ చిత్రానికి సంబంధించిన నిర్మాతలు కూడా వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు. ఎందుకంటే ‘కాలా’ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. గతంలో ‘బాహుబలి’ సినిమా విడుదల సమయంలో దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమై తమ భారీ చిత్రాలను ఇతర తేదీలకు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందని భావించి అలాంటి చిత్రానికి పోటీగా వెళ్లొద్దని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ‘బాహుబలి’ సినిమా విషయంలోలాగే ప్రస్తుతం పెద్ద సినిమాల విడుదల విషయంలో కూడా పోటీ పడకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో విడుదల చేసుకుంటే అందరికీ మంచిదని పరిశ్రమ పెద్దలు సలహాలిస్తున్నారు. ఇప్పటికే భరత్ అనే నేను, నాపేరు సూర్య సినిమాల విడుదల విషయంలో వచ్చిన విభేదాలను పరిష్కరించే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాతలు రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై దృష్టి సారించి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. ముఖ్యంగా భారీ చిత్రాల మధ్య విడుదల విషయంలో రెండు వారాల గ్యాప్ ఉండాలని వారు పేర్కొన్నట్టు సమాచారం. భారీ చిత్రాల మధ్య విడుదల విషయంలో ఇలాంటి పోటీ ప్రమాదకరమే. సినిమా సినిమాకు మధ్య కనీసం వారం గ్యాప్‌లో విడుదలయితే కనీసం భారీ ఓపెనింగ్స్‌తో సినిమాకు పెట్టిన డబ్బులను తిరిగి రాబట్టుకోవచ్చు. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రయోజనాల గురించి ఆలోచిస్తే తప్పకుండా పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది.

-శ్రీ