మెయన్ ఫీచర్

గత వైభవ పునరుద్ధరణ దిశగా నవ్యాంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతీ నగర ప్రాంతంలో తొలి ప్రభుత్వ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 17న భూమిపూజ చేస్తూ, ఆ ప్రాంత గత వైభవ పునఃప్రతిష్ఠకు ఆ విధంగా శ్రీకారం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఛానళ్లలో చూసినవారికి, ఆ మాటలంటున్న సమయంలో తన స్వరంలో, మొహంలో కూడా ఒకింత ఉద్వేగం కనిపించి ఉండాలి. ఇటువంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రి ఆవిధంగా మాట్లాడటం గాని, ఆయనలో ఉద్వేగం గాని చాలా సహజమైనవి. ఆ భవనాల నిర్మాణమే కాక మొత్తం రాజధాని నగర నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి కూడా ఆయన కోరుకున్నట్టు, రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నట్టు సాగాలాని తక్కిన దేశమంతా కూడా భావిస్తుంది.
కొద్ది మాసాల క్రితం అమరావతీ నగర శంకుస్థాపన, ఇప్పుడు కార్యాలయ భవనాలకు భూమిపూజ, వాటి నిర్మాణాలు పూర్తయిన తర్వాత అందులోకి ప్రవేశించే మొదటిరోజూ కొత్త ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాళ్లుగా, చిరస్మరణీయ ఘట్టాలుగా నిలిచిపోతాయి. ఇవి తాత్కాలిక భవనాలా లేక శాశ్వతమైనవా అన్న వివాదం అర్థరహితమైనది. ప్రస్తుతం ఇంకా హైదరాబాద్‌లోనే గల ప్రభుత్వ యంత్రాంగం స్వరాష్ట్రానికి తరలివచ్చి తమ ప్రజల మధ్య ఉండి పాలించటమన్నది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. ఇందులో జాప్యం జరుగుతున్నదని, అందువల్ల సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలనుంచి విమర్శలు ఏడాదికాలంగా వినవస్తున్నాయి. ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రంలో బస చేసే రోజులు పెరిగినా విమర్శలు ఆగలేదు. అది గమనించినందుకే ఆయన కొద్ది మాసాల క్రితం అక్కడ కృష్ణాతీరాన ఒక శాశ్వత నివాసం వంటిది ఏర్పరచుకున్నారు. అది చాలా మంచి చేసింది. ఆ తర్వాత, ప్రభుత్వ యంత్రాంగం తరలింపు వీలైనంత వేగంగా జరగడం తప్పనిసరి అవసరంగా మారింది. అది తార్కికమైనది కూడా. హైదరాబాద్ పది సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధాని అయినప్పుడు ఈ తరలింపులకు తొందరేమిటన్నారు కొందరు. కాని అవి వారి స్వీయ దృక్కోణం నుంచో, రాజకీయంగానో అన్నది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలను, కొత్త పరిపాలనావసరాలను, భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని అన్నది కాదు. కనుక, ప్రభుత్వ సిబ్బంది సత్వర బదిలీకి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయమే సరైంది. అదేవిధంగా,శాశ్వత భవన నిర్మాణాలకు ఇంకా సమయం తీసుకుంటుంది. అంతవరకు కార్యాలయాలు ఎక్కడో దూరాన కొనసాగడం వల్ల పాలనలో ఇబ్బందులుంటాయి. కనుక రాగల నాలుగు మాసాలలో ఆరు బ్లాకుల నిర్మాణం పూర్తిచేయడమన్నది వివేకవంతమైన నిర్ణయం. వీటిపై జరిగే ఖర్చు వృధా అవుతుందనే విమర్శలు అర్థం లేనివి. భూమిపూజ రోజున చంద్రబాబు చెప్పినట్లు వీటిని అప్పుడు మరో అవసరం కోసం ఉపయోగిస్తారు తప్ప వృథాగా పడి ఉండవు కదా.
కనుక, పైన అనుకున్నట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావలసింది తమ ప్రభుత్వం వీలైనంత త్వరగా తమ మధ్యకు వచ్చి పరిపాలన సాగించడం. అందుకు ఈ నెల 17వ తేదీ నాటి భూమిపూజతో ఆరంభం జరుగుతున్నది. ఇది ప్రజలకు సంతోషం కలిగించే అంశం. భవన నిర్మాణాలు చేయనున్న రెండు కంపెనీలు కూడా అగ్రశ్రేణివి అయినందున, పనులు సకాలంలో పూర్తి కావడంలో సందేహాలు అక్కరలేదు. వచ్చే జూన్ మధ్య నాటికి, ముఖ్యమంత్రి ప్రకటించినట్టు, సుమారు 15వేల మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి కొత్త రాజధాని ప్రాంతానికి తరలివెళ్లడం ఇక నిశ్చయమైనట్లే. తక్కిన నిర్మాణాలు కూడా జరిగిన కొద్దీ, లేదా అద్దె భవనాలు లభించిన కొద్దీ ఇతర కార్యాలయాలు, సిబ్బంది మార్పు కూడా జరుగుతూ పోతుం ది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రభుత్వం మద్రాసు నుంచి కర్నూలుకు మారినప్పటి పరిస్థితులతో పోలిస్తే, ఇప్పుడు అంతా ఎంత సజావుగా సాగుతున్నదో అర్థమవుతుంది. ఈ తరలింపులోనూ కొంత ‘బాధ’ అనదగ్గది ఉండవచ్చుగాని, కాందిశీకుల వలె వేదనా భరితమైన పరుగుల దుస్థితి లేదిప్పుడు.
ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గత వైభవ పునఃప్రతిష్ఠ అనడం గత చరిత్రను అనివార్యంగా గుర్తుకు తెస్తుంది. దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకొని ఇప్పటికి 70 సంవత్సరాలు పూర్తికావస్తున్నాయి. భాషా రాష్ట్రాల భావన మొదలై వందేళ్లు గడిచాయి. తొలి సంపూర్ణ భాషా రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 60 సంవత్సరాలు. ఇటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం 57 సంవత్సరాల కిందటి ఆంధ్రరాష్ట్ర భౌగోళిక స్వరూపానికి వెనుదిరిగి మారడం, తన చారిత్రక వైభవ పునః ప్రతిష్ఠను కోరుకుంటుండమన్నది నిజంగా ఒక అసాధారణ పరిణామం. ఈ మొత్తం వందేళ్లకు పైగా గల పరిణామ క్రమాలపై నికరమైన, నిష్పాక్షికమైన పరిశోధనా చరిత్ర అన్నది లేదు. ఇది ఇప్పటికప్పుడు సాధ్యమయ్యేది కాదు. కాని ఎప్పటికైనా రావలసిన అవసరం ఉంది. 1949కు ముందు, 1947-53 దశ, 1953-56 దశ, 1956-2014 దశల శోధన చెప్పగల చరిత్ర, పాఠాలు ఒక మహాభారతం వంటివి కాగలవు. జాతి, భాష, భౌగోళికం, అభివృద్ధి, రాజకీయం, ఉద్యమాలు, స్థానిక- జాతీయ వ్యవహారాలన్నీ ఇంత సుదీర్ఘంగా, గాఢంగా రసవత్తరంగా కలగలిసిన చరిత్ర ఈ దేశంలో మరే ప్రాంతంలోనూ లేదు. 1905లో ఒక భాషా ప్రాంతమైన బెంగాల్ విభజన ఉద్యమాలకు దారివేయగా ఆ విభజనలో ప్రజలు వలస పాలకుల రాజకీయం ఉన్నట్లు చూశారు. చివరకు ఆ చర్య ఏడేళ్లకు రద్దయి బెంగాల్ ఒక్కటైంది. అర్ధ శతాబ్దం వెనుక తెలుగుజాతి జనులలో ఒక వర్గం విలీనంలో రాజకీయాన్ని చూసి విభజన కోసం ఉద్యమించింది. చివరకది జరిగిపోగా, ఉమ్మడి చరిత్రతో పాటు విడివిడి చరిత్రలూ వైభవాలూ గల ఇద్దరు తెలుగు ప్రజలు ఎవరికి వారుగా తమ గతవైభవాలను తిరిగి నెలకొల్పుకునే దారిలో ఉన్నారు. ఇది నిజంగానే ఒక ఆధునిక వ్యాసుడు రచించవలసిన మరో భారతం. దానినట్లుంచి, ఎవరికి వారుగానైనా అభివృద్ధి చెందడం అవసరం కనుక, అందులో భాగం గా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, గత వైభవాన్ని పునఃప్రతిష్ఠింప చేయాలని అందరూ కోరుకోవాలి.
ఆయన అన్నట్లు అమరావతీ నగరంగాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని, దేశంలో, మొత్తం ప్రపంచంలోని ఏ ర్యాంక్‌కు చేరుతాయన్నది సాంకేతికంగా తీసుకుని చర్చించవలసిన విషయాలు కావు. రాష్ట్రాన్ని 2023 నాటికి దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి పూర్తి అగ్రరాష్ట్రంగా, 2050 నాటికి యావత్ ప్రపంచంలోనే అత్యున్నతమైనదిగా చేయగలమని అన్నారాయన. మరొకవైపు స్వయంగా ఆయనే, ఆంధ్రప్రదేశ్ 2019 వరకు లోటు రాష్ట్రంగా ఉండగలదన్నారు. అనగా తర్వాత కేవలం నాలుగేళ్లలో దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటి కావడమన్నమాట. తర్వాత మరో ఆరేళ్లలో అన్ని రాష్ట్రాలను మించడం. ఆర్థిక లోటులో ఉన్నంత మాత్రాన అభివృద్ధి ఆగుతుందని కాదు. కాని ఈ క్రమంలో జరుగవలసినవి అనేకం ఉంటాయి. అధికారంలో కొనసాగటం, కొనసాగకపోవడం అనే ప్రశ్న ఉండనే ఉంటుంది. అయితే పైన అన్నట్లు ఇవన్నీ సాంకేతికంగా పరిగణించి విమర్శించవలసిన విషయాలు కావు. సంకల్పం చెప్పుకోవడం, అందుకు పాటుపడటమన్నది ప్రధానం. చంద్రబాబులో కష్టించే తత్వం ఉన్నదన్నది నిర్వివాదాంశం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఆయన పాలనలో శీఘ్రంగా ముందుకు పోగలదని ఆశించాలి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అభివృద్ధి అనేది ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదు, సామాజకాభివృద్ధి కూడా. కేంద్రీకృతంగా కాక వికేంద్రీకృత అభివృద్ధి జరగాలి. ఈ రెండు విషయాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తిగా ఉండటం ఏడాది క్రితం నుంచి కనిపిస్తున్నది. చంద్రబాబు తన పాలనలో హైదరాబాద్ నగరం, తెలంగాణ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందడం గురించి పదేపదే చెప్పడం తెలిసిందే. కాని అంతగా అభివృద్ధి చెందిన ప్రజలు టిడిపిని 2004, 2009లో వరుసగా ఓడించారు. 2004కు ముందు అభివృద్ధి జరిగిన మాట నిజం. కాని అది కొన్ని వర్గాలకు ఉపయోగపడే ఆర్థికాభివృద్ధి అయింది తప్ప సామాన్య ప్రజలకోసం కాదని, అదేవిధంగా కొన్ని వర్గాలకు అవసరం కనుక హైదరాబాద్ నగరంపై దృష్టి పెట్టారు కాని, గ్రామీణ ప్రాంతాలను విస్మరించారని, అందుకే ఓడారని కొందరి అభిప్రాయం. ఆ మాటను చంద్రబాబు కూడా ఆమోదిస్తున్నారా అన్నట్టు 2004 ఓటమి నుంచే ఆరంభించి కొన్ని మాటలు అంటూ వచ్చారు. తాను సాధించిన అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదన్నది వాటిలో ప్రధానమైంది. వాస్తవానికి పరిస్థితి ఆయనకు 2004 ఎన్నికలకు ముందే అవగతమైనట్లుంది. దానితో ఎన్నికలకు కొద్ది మంది రైతులకు కోటి వరాలు అన్నవి ప్రకటించారు. తన అభివృద్ధి వికేంద్రీకృతంగా జరగలేదనే ఒప్పుకోలు అందులో ఉంది కాని జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. దాంతో ఓటమి తప్పలేదు. 2009 ఎన్నికలు రానుండగా తన ఆర్థిక విధానాలలో సవరణలు అంటూ ఒక పత్రం విడుదల చేశారు. వామపక్షాలకు తిరిగి దగ్గరయ్యారు. టిఆర్‌ఎస్‌తోనూ పొత్తు పెట్టుకున్నారు. అయినప్పటికీ ఓటర్లు గత అనుభవాలను మరిచిపోక తిరిగి ఓడించారు. మరి అభివృద్ధికి విలువేమిటి?
విషయమేమంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రంగా ఏర్పడి, చంద్రబాబు అభివృద్ధి గురించి మాట్లాడుతూ, తను ఉమ్మడి రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి అంటున్నప్పుడు, గత ఇరవై నాలుగు మాసాల పాలనను గమనించిన ప్రజలకు వెనకటి అనుభవాలు గుర్తుకు వస్తున్నాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరడం, వికేంద్రీకృత అభివృద్ధి తన లక్ష్యాలని చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ ఇరవై మాసాల్లో హామీ ఇవ్వలేదని కాదు. తనకు ఆ ఉద్దేశం లేనే లేదని కూడా అనడం లేదు. కాని ఆచరణలో ఆ విధంగా జరుగుతున్నట్లు ప్రజలను నమ్మించవలసిన బాధ్యత, అవసరం ఆయనకున్నాయి. అది జరగనిదే నిజమైన అర్థంలో గత వైభవ పునఃప్రతిష్ఠ సాధ్యమూ కాదు. కనుక ప్రజలకు నమ్మకం కలిగేట్లు అన్ని పునఃపరిశీలనలు అవసరమని తాను గుర్తించాలి.
చివరగా చెప్పవలసింది ఒకటున్నది. మంచో చెడో రాష్ట్ర విభజన జరిగిపోయి రెండేళ్లు కావస్తున్నది. మొదట ఉండిన వైమనస్య భావనలు నాయకత్వ స్థాయిలో, ప్రజల స్థాయిలో కూడా తగ్గిపోతున్నాయి. పరస్పర సహకారం, సుహృద్భావం అవసరమనే ఆలోచనలు రెండు వైపులా బలపడుతున్నాయి. అటువంటి స్థితిలో చంద్రబాబు ‘‘అనైతికంగా విభజించినవారు అసూయపడేలా’’ రాజధానిని అభివృద్ధి చేస్తాం తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానివేయడం మంచిది. ఇంకా అవి అవసరమైన స్థితిలో లేరాయన. ఆ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇంకా మెప్పించేందుకు ఏమీ మిగలలేదు కూడా. అందుకు చేయాల్సినవి వేరే ఉన్నాయి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)