మెయన్ ఫీచర్

స్పష్టమైన సరిహద్దులు ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య తరచుగా వినిపిస్తున్న పదం ‘‘జాతీయవాదం’’. దీన్ని గురించి ఎవరైనా రాయాలనుకుంటే, ఇప్పటికే ఈ పదంపై వ్యక్తమైన సాధారణ అభిప్రాయాలను ప్రస్తావించకుండా ఉండటం సాధ్యమవుతుందా? బహుశా ఒక ప్రశ్నను మనం అడగవచ్చు, భారతీయ జాతీయవాదం (దేశభక్తి లేదా గుర్తింపు..ఈ రెంటింటిలో మీ ఇష్టం వచ్చిన పదాన్ని ఎంచుకోండి) మూలాలు 18వ శతాబ్దం తర్వాతి కాలానికి చెందినవా? ఎందుకంటే అప్పటి కాలంలోనే ఐరోపా జాతీయవాదం, చైనా, జపాన్ జాతీయ వాదాలు బాగా ప్రాచుర్యంలో ఉండేవి.
భారతీయ జనతాపార్టీకి చెందిన రాజకీయవేత్త జస్వంత్ సింగ్, విదేశాంగ మం త్రిగా పనిచేసే కాలంలో..‘‘్భరతీయులకు సరిహద్దులపై ఒక స్థిరమైన అభిప్రాయం లేదు. మ్యాపుల చిత్రీకరణ, స్పష్టమైన సరిహద్దులు వంటివి కేవలం బ్రిటిష్ వారు మాత్రమే ఏర్పరచారు. ఇప్పటికీ స్వతంత్ర భారత్‌కు గుర్తించిన స్పష్టమైన సరిహద్దులు లేవు. అస్పష్టంగా ఉన్నవాటి తోనే సర్దు కోవడం తప్ప,’’ అని తరచుగా అంటుండేవారు. ఈవిధంగా నిర్దిష్టమైన సరిహద్దులు ఏర్పరచుకోని విధానాన్ని సోమరితనంగా ఆయన అభివర్ణించేవారు. అంతేకాదు దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరి వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇంకా కొనసాగుతున్నదంటూ విమర్శించేవారు. ఒక రాజకీయ వేత్తగా ఆయన ఈ మాటలు అన్నప్పటికీ ఒక ఆలోచనాపరుడిగా ఆయన దీన్ని ఒక రాజకీయ బలహీనతగా గుర్తించలేదు. కాకపోతే మన సమా జం, ప్రజల సహజ లక్షణంగా మాత్రమే భావించారు. నిజంగా ఈ లక్షణం భారతీయుల డిఎన్‌ఏలోనే సహజంగా ఉన్నదేమో?
ఈ లక్షణం నరనరానా జీర్ణించుకుపోయిన భారతీయులు, తమ చుట్టుపక్కల దేశాలతో పాక్షికంగా తెరచిన లేదా పూర్తిగా తెరచిన సరిహద్దులతో సంతృప్తి చెందడం, తరచుగా దేశాన్ని, రోజువారీ దేశభద్రతను గురించి ఆలోచించే వారిలో ఆగ్రహం వ్యక్తం కావడానికి కారణమవుతోంది. అయితే ఈ పరిస్థితిలో మార్పు తీసుకొని రావాలన్నా, లేదా అందుకు యత్నించాలన్నా ముందు కావలసింది భారతీయుల్లో జీర్ణించుకుపోయిన ఈ ప్రవృత్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం. మరి భారతీయుల్లో ఈ లక్షణం ఎక్కడినుంచి వస్తున్నది? భారత్ సహజ లక్షణమా ఇది? లేక భౌగోళికత, చరిత్ర ఈ లక్షణాన్ని శాసిస్తున్నాయా? లేకపోతే సహజలక్షణం, అనుభవాల కలగలుపు ఇందుకు కారణమవుతున్నాయా?
పైవాటిని జీర్ణం చేసుకోవడం కష్టమైనప్పుడు..చైనీయుల నమూనాను ఒక్కసారి పరిశీలించండి. ఆధునిక చైనా, తన సరిహద్దు రేఖలను నిర్దిష్టం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతోంది. ముఖ్యంగా పచ్చికలో, మంచులో, సముద్రంలో, ఇసుకలో కూడా తనకంటూ స్పష్టమైన సరిహద్దు నిర్ధారణ కావాలని భావిస్తోంది. ఇది కేవలం చైనా కమ్యూనిస్టు పార్టీ సెంటిమెంట్ మాత్రమే కాదు: ప్రతీకార భావన- భౌగోళిక, జాతుల చరిత్ర ఆధారంగా తాము కోల్పోయామనుకుంటున్న ప్రాంతాలను తిరిగి కోరడం అనడం ఇక్కడ బహుశా సముచితంగా ఉండవచ్చు-చియాంగ్ కై షెక్ మ్యానిఫెస్టోలో తీవ్రస్థాయిలో వేళ్లూనుకొని ఉంది. చియాంగ్ కై షెక్ రైట్‌వింగ్ జాతీయ వాది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశంలో అధికారం కోసం జరిగిన పోరాటంలో, మావో జిడాంగ్ చేతిలో ఓడిపోయాడు.
మరింత వెనక్కి వెళితే చైనా చరిత్రలో మన ‘ప్రాంతానికి’ సంబంధించిన అటువంటి మూలాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చైనా గోడను కట్టే సమయంలోకూడా ఈ మూలాలను గమనించవచ్చు. ఈ గ్రేట్ వాల్‌ను నిర్మించారు, పునర్‌నిర్మించారు, విస్తరించారు, తమకు చెందిన సరిహద్దు ప్రాంతం మారిందన్న ఉద్దేశంతో ఈ గ్రేట్ వాల్‌ను మరింత విస్తరించారు. ఎప్పటికప్పుడు తమ ‘ప్రాంతంలో మార్పు’ అనే పదాన్ని కేవలం తాము అటవికులుగా భావించేవారిని దూరంగా ఉంచడం కోసమే చైనీయులు ప్రయోగించారనుకోవాలి. గత వెయ్యి సంవత్సరాల కాలంగా ఈ ‘‘అటవికులు’’ అనే పదం, జాతి, సాంస్కృతిక లేదా మతపరమైన అంశాల్లో పదే పదే పునర్‌నిర్వచనానికి లోనైంది. జాతీయత గుర్తింపు అనేది గ్రేట్ వాల్ ద్వారా ప్రాదేశికంగా నిక్కచ్చిగా, సురక్షితంగానే ఉంది. మరి గ్రేట్ వాల్ ద్వారా సరిహద్దు సమస్య పరిష్కారమైంది కదా? అని ప్రశ్నిస్తే అందుకు వౌనమే సమాధానమవుతోంది.
మంచికో లేదా చెడుకో భారత్ పరిస్థితి ఇందుకు భిన్నం. వేలాది సంవత్సరాల దేశ చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాలు చాలా తక్కువకాలమే మనుగడ సాగించినందువల్లనే ఈ దుస్థితి ఏర్పడి ఉండవచ్చు. వైవిధ్యమే మనదేశానికి అచ్చి వచ్చిందేమో! ఒకరకంగా చెప్పాలంటే భౌగోళికతే ఈ వైవిధ్యాన్ని శాసించింది. ముఖ్యంగా ఉత్తర భారతం..మధ్య ఆసియా, యురేసియా భూభాగాలతో సంబంధాన్ని కలిగివుండగా, బెంగాల్, ఈశాన్య భారత్‌తో కూడిన దక్షిణ భారత్‌కు..ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానత ఎక్కువ. భిన్నత్వం కారణంగా దేశంలో రాజకీయ విభజనలు సహజం. వీటి ఫలితంగా సాంస్కృతిక, భాష మరియు సామాజిక వైవిధ్యాలు కూడా ఏర్పడ్డాయి. అంటే ఇవన్నీ విభిన్న రాజకీయాలతో పాటు సమాంతరంగా జనించినవే. బహుళ జాతీయ భావనలు వ్యక్తమవడానికి ఇదే ప్రధాన కారణం. నిజంగా ఇవి మనల్ని విస్మయచకితులను చేస్తాయి. మనకు గందరగోళంగా అనిపించినా, కొందరు మరింత ‘స్థిరంగా’, క్రమానుగత గుర్తింపును ఎందుకు కోరుకుంటారనేది ఇది కొంతమేర వివరిస్తుంది. మరి ఈ ‘స్థిరత్వం’ ఆధునిక వాణిజ్య వ్యూహాలకు, వర్తమాన పాలనకు ఎంతో ఉపయోగకరం.
అయితే ఇటీవలికాలంలోకొన్ని కొన్ని అసంగతమైన వ్యాఖ్యలు వినవస్తుండటం విచిత్రం. నిజంగా ఇటువంటివి ఖండనార్హమైనవి. కొద్ది వారాలక్రితం కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ అంశాన్ని పరిశీలిస్తే అవి ఎంత అసంగతంగా ఉన్నాయో అర్థమవుతుంది. భారతీయులు కూడా ఖైబర్ కనుమ వద్ద ఒక పెద్ద గోడను నిర్మించాలనుకున్నారట! బహుశా ఇది అలెగ్జాండరు దండయాత్ర చేసిన తర్వాత మాత్రమే భారతీయులు విధమైన ఆలోచన చేసినట్టు కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ గోడను భారతీయులు నిర్మించలేదు కనుక ఈ వ్యాఖ్యలు పరిహాసాస్పదమైనవిగా పరిగణించాలి. ఇక్కడ భారతీయులు గోడను నిర్మించారా లేదా అన్నది కాదు ప్రశ్న. గోడను నిర్మించాలన్న ఆలోచన పూర్వకాలంలో జరిగింది అనే భావన, ప్రజల మనసుల్లో చొచ్చుకొని వెళ్లడం వల్ల, రాచరికం అంతరించి ఇనే్నళ్లయినా వందలాది ఏళ్ల క్రితంనాటి రాచరిక భావన ఇంకా ప్రజల మెదళ్లలో ఎక్కడో ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గతంలో జరిగిన ఒక సంఘటనను మనం పరిశీలిద్దాం.
కొన్ని సంవత్సరాల క్రితం చైనాలో నియమితులైన మన దేశానికి చెందిన ఒక సీనియర్ దౌత్యవేత్త, టిబెట్ రాజధాని లాషాను సందర్శించారు. లాషాలో రెండు రోజులపాటు గడిపిన ఆయన, అక్కడి ప్రదేశాలు చూసిన అలసట మాట అట్లా ఉంచి ము ఖ్యంగా భారతీయ వంటలకోసం ముఖంవాచిపోయారు. దీంతో ఆయన తన కారులో గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణించడం మొదలు పెట్టారు. నిజానికి ఆ మార్గం ఉత్తరాఖండ్‌కు వెళ్లేది. ఉత్తరాఖండ్‌కు వెళ్లే మార్గమైనా, భారత్‌కు చేరాలంటే ఆయన ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. సువిశాలమైన టిబెట్‌తో పోల్చుకుంటే లాషాకు ఆవల ఈ దౌత్యవేత్త ప్రయాణిస్తున్నది చాలా తక్కువ దూరమనే చెప్పాలి. అయితే తాను వెళుతున్న మార్గం పురాతన వాణిజ్య కారిడార్ అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. ఆవిధంగా చాలా దూరం ప్రయాణించాక ఆయన రోడ్డు పక్కనే ‘టిబెటన్ దాబా’ అని బోర్డు ఉన్న ఒక దాబాలోకి ప్రవేశించారు. ఈయన్ను చూసిన వెంటనే దాబా వ్యక్తి ‘మీరు భారత్ నుంచి వచ్చారా? పరాటాలు తింటారా?’ అని అడిగాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం దౌత్యవేత్త వంతైంది. అప్పటికే మొహం వాచి ఉన్న ఆయన పరోటాలను ఆవురావురు మంటూ తినేశారు. ఆంటే టిబెట్‌లోని రోడ్ల పక్కన కూడా భారతీయ వంటకాలు దొరికే దాబాలుంటాయన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. అదేవిధంగా నేపాల్‌లో, ఢిల్లీలో పరాటాలను తయారు చేసే నైపుణ్యం ఒక్కటే. రుచిలో కూడా ఏవిధమైన తేడా ఉండదు. మరి ఈ పరాఠా తయారు చేసిన వ్యక్తి ఏ పాస్‌పోర్టు కలిగివున్నాడనేది ఈ దౌత్యవేత్త పట్టించుకోలేదు.
మరి ఆ దాబా వ్యక్తి లాంటి వారు ఎం తమంది ఉన్నారో తెలియదు. కేవలం ఇటువంటి వారివల్లనే చైనాకు సరిహద్దుల విషయంలో అనుమానాలను రేకెత్తించి ఉండవచ్చు. తెరచి ఉన్న సరిహద్దుల గుండా గుర్తింపులేని వ్యక్తులు, విదేశీ ఏజెంట్లు టిబెట్‌లోకి ప్రవేశించి అక్కడినుంచి చైనాలోకి విస్తరించవచ్చని చైనా భయపడి ఉంటుంది. మరి ఇదే మాదిరి అనుభవాలు భారత్‌కు కూడా కావచ్చు. ముఖ్యంగా నిర్ధారణ కాని సరిహద్దుల, భద్రతపై నిఘా సంస్థలు, బ్యూరోక్రసీ తమ ఆందోళనను వ్యక్తం చేయడం అత్యంత సహజం. నిజానికి వెసులుబాటు ఉన్న సరిహద్దుల గుండా పాక్ ఉగ్రవాదులు మనదేశంలోకి ప్రవేశించి, మారణకాండను కొనసాగిస్తున్నారు. అందువల్ల నిశ్చిత సరిహద్దులు ఉండి తీరాలి. అయతే రాజకీయ మ్యాపులను రూపొందించే వారు ఎంతటి కృతనిశ్చయులై ఉన్నా, సరిహద్దు ప్రాంతాలు, సహజ సరిహద్దుల్లో దేశంలోకి ప్రవేశించడానికి అనువుగా ఉన్న మార్గాలు, వంటి వాటిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. చివరగా దేశమంటే ప్రేమ ఉన్నా ఉండకపోయినా..దేశం, జాతీయత, దేశవాసి అనేవి పరస్పరం కలిసి ముందుకెళతాయన్న చైతన్యపూరిత భావనే ఉత్తమ వివేచన అని గుర్తించాలి.

- అశోక్ మాలిక్