మెయన్ ఫీచర్

ప్రజా వైద్యం దారి ఎటు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదలందరికి ఆధునిక వైద్యసేవలు..2 అంటూ ఏప్రిల్ 19న తన జన్మదిన కానుకగా చంద్రబాబు 275 సంచార్ ప్రాథమిక చికిత్స కేంద్రాలను ప్రారంభిస్తూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో (ఉమ్మడి రాష్ట్రంలో) ప్రజారోగ్యం కుంటుపడిందన్నారు. కాని దశాబ్దం క్రితం వరకు రాష్ట్రం బాబు పాలన కిందనే సాగిందనేది మరచిపోయాడు. ఆకాలంలో కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా ఏరియా, జిల్లా, గాంధీ దవఖానల నిర్మాణాల్ని చేపట్టింది మాత్రం నిజమే! ఇదే కాలంలో కార్పొరేట్ వైద్యం ఊపందుకున్నది కూడా నిజమేనన్నది బాబు ఒప్పుకోకపోవచ్చు!
ఇదే సందర్భంగా బాబు మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ డాక్టర్లలో 33 శాతం మంది ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) రాష్ట్రానికి చెందినవారేనని సెలవిచ్చారు. ఇది నిజం అని అనుకుంటే ఒక్కో డాక్టరు తయారికై ప్రజలు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేస్తుంటే, వీరికి సేవలందించాల్సిన డాక్టర్లు విదేశాలకు ఎందుకు ఎగిరిపోతున్నారో, వారిని నిరోధిం చడానికి అందుకు బాబు తీసుకున్న చర్యలేమిటో చెప్పలేదు. ఇక రాష్ట్ర స్థాయిలో చేపట్టబోతున్న ఆరోగ్య సేవల గురించి మాట్లాడుతూ, కేరళ రాష్ట్ర ఆరోగ్య విధానాల కంటే ఉన్నతస్థాయి పథకాలు అమలు చేస్తామంటూ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో మెరుగైన వౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూనే, పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్) విధానంలో పేద రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపిస్తామనడంలోని ఆం తర్యం మాత్రం ఎవరికీ అర్థమై ఉండదు. దీంతోపాటుగా పారిశుద్ధ్య పనులను ప్రైవేటు ఏజెన్సీలకు ఆప్పజెప్పాలనడంతో బాబు 2000 నాడు ప్రస్తావించిన విజన్ 2020 తిరిగి కనబడుతున్నది. ఇప్పటికే డాక్టర్లందరు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ స్వంత క్లినిక్‌లను, నర్సింగ్ హోమ్‌లను నడుపుకుంటూ కార్పొరేటు ఆసుపత్రుల్లో పనిచేస్తూ వారి దోపిడికి కావల్సినంతగా దోహద పడుతూనే ఉన్నారు. రెగ్యులర్ డాక్టర్ల తీరు ఇం దుకు భిన్నం కాదు. రోజుకో రంగు దుప్పటి మారుస్తూ ప్రభు త్వ వైద్యాన్ని గాడిలో పెడతామంటూనే, ఏప్రిల్ 25న బ్రిటీషు, వైద్య కార్పొరేట్ బృందంతో రాష్ట్రంలో వైద్య సేవల అభివృద్ధికై చర్చలు జరపడం గమనార్హం.
ఇదే బ్రిటీషు బృందంతో ఇదే ఏప్రిల్ 25న కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ఒప్పందానే్న చేసుకున్నారు. ఇండో యుకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వెయ్యిపడకల అంతర్జాతీయ ప్రమాణాలు గల అసుపత్రిని పూర్తి విదేశీ పెట్టుబడుల విధానంలో నిర్మించాలని, ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం భూమిని, వౌలిక సదుపాయలైన నీటిని, విద్యుత్‌ను, పరికరాల కొనుగోలుపై రాయల్టీలను, పేషెంట్లను రవాణా చేయడానికై 108 లాంటి అంబులెన్స్ సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. మిగిలింది అవగాహన ఒప్పందంపై సంతకాలే!
దీనికి మూడు రోజుల ముందే, మంత్రివర్గ అనుచరులతో, ఆరోగ్యశాఖ అధికార్లతో, వైద్య, ఆరోగ్యశాఖ పనివిధానంపై కెసిఆర్ ఓ సమీక్షను నిర్వహించారు. ఇందులో హైదరాబాద్‌తో సహా, కరీంనగర్, ఖమ్మంలలో ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను 750 పడకల చొప్పున విదేశీ బ్యాంకు 3‘రాబో’2 సహకారంతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియాను వెయ్యిపడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా కొత్తగా 4250 పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న బోధనా ఆసుపత్రుల్లో కలుపుకుంటే ఈ పడకల సంఖ్య ఆరువేలు దాటుతాయి. అంటే ప్రతి ఐదువేల జనాభాకు ఒక పడక అందుబాటులోకి వస్తే నిజంగా అద్భుతమే.
ఇదే తరహాలో ఏప్రిల్ మొదటి వారంలో రెండు సమావేశాలు జరిగాయి. ఏప్రిల్ 3న ఒకటి జరగ్గా, మరొకటి ఏప్రిల్ 6న జరిగింది. రాబోయే జూలై నాటికి జిల్లా స్థాయి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతామని, వీటిల్లో ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్, ఐసియు, యూనిట్లతో పాటు జిల్లాకు నాలుగు డయాలిసిస్ యూనిట్లు చొప్పున 40 యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఇందుకు రూ.361 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆయనే ఇంకా మాట్లాడుతూ పిహెచ్‌సి భవనాల మరమ్మతులకై, రంగులకు, రూ.521 కోట్లు, వీటిలో వౌలిక సదుపాయాల కోసం రూ.171 కోట్లను, కొత్త మంచాలకు, పరుపులకు, దుప్పట్లకు, ఇతర పనిముట్లకై రూ.600 కోట్లను, మందులుకోసం రూ.117 కోట్లను మంజూ రు చేసినట్లు మంత్రి చెప్పారు. వీటికి తోడు గతంలో లేని విధం గా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లకు సంవత్సరానికి రూ. కోటి చొప్పున, జిల్లా హెడ్స్‌కు రూ. రెండు కోట్ల చొప్పున అత్యవసర ఖర్చులకై వాడుకునే విధంగా అందుబాటులో ఉంచుతారు. ఇవన్నీ వినియోగంలోకి వచ్చి, ప్రజావైద్యం పరిఢవిల్లాలంటే డాక్టర్లు ఎలాగో అవసరం కాబట్టి, 2400 మంది డాక్టర్ల ఖాళీలను నింపాలని పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌కు ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలకు వచ్చేవాళ్లంతా పేదలు కాబట్టి, వీరికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, కార్పొరేట్ వైద్యాన్ని తలదనే్నలా వైద్యసేవలుండాలని మాట్లాడటం నిజంగా హర్షించదగిందే. ఇంత భారీస్థాయిలో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులుగా మారబోతున్న ఆసుపత్రుల్లో అందరూ వైద్య సౌకర్యాలు పొందే అవకాశం ఉండాలి. అలాంటప్పుడు ఆరోగ్య శ్రీ కార్డులను, ఉద్యోగులకు గల హెల్త్ కార్డులను, రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని, మంత్రులకు, రాజకీయ ప్రతినిధులకు, బ్యూరోక్రాట్లకు ఇచ్చే భారీ వైద్య ఖర్చులను కూడ రద్దు చేయాలి. ప్రజావైద్యం, అందునా నాణ్యతతో కూడుకొన్నది అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని వర్గాలకు ప్రజాధనాన్ని ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఎందుకనే ప్రస్తావన కూడా ముఖ్యమంత్రి చేస్తే బాగుండేది. ఇది జరక్కపోగా, 20 రోజులు కూడ గడవక ముందే, యుకె బృందంతో ఆసుపత్రి ఏర్పాటుకై చర్చలు జరపడం, పైన ప్రస్తావించిన మాటలన్నీ ఉత్తిత్తివేనని తేలిపోవా?
ఇదే సందర్భంగా 108 సేవల గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రతి లక్ష జనాభాకు ఒక ఆంబులెన్స్ అందుబాటులో ఉందని, దీన్ని 75 వేల జనాభాకే పరిమితం చేస్తున్నట్లు చెబు తూ, ప్రస్తుతం వున్న 145 అంబులెన్స్‌లకు గాను మరో 24ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కాని ఈ అంబులెన్స్‌లు ఏరియా ఆసుపత్రుల నుంచి, ఇతర ప్రమాద ప్రాంతాలనుంచి కార్పొరేట్ ఆసుపత్రులకు ఇక ముందు తీసుకు పోకూడదని సెలవిస్తే బాగుండేది. వీటితో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బంది మైండ్‌సెట్ కూడా మారాల్సిందే! ఈ మధ్యనే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వివిధ అంశాల్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన 132న పేజీల నివేదిక వైద్య విద్యపై, డాక్టర్ల మైండ్‌సెట్‌పై తీవ్ర వ్యాఖ్యలనే చేసింది. ఈ పార్లమెంటరీ సమావేశాల్లో చర్చకు రానున్న నివేదికలో, డాక్టరు చదువు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేదని, ఎంబిబిఎస్ చదివిన వైద్యుడు వైద్యుడిగానే భావించక పిజి చేయాలని, స్పెషలిస్టు కావాలని, పరీక్షల చుట్టే ఆలోచిస్తూ, వృత్తి ధర్మాన్ని మరచి ఆర్జించడానికే మార్గా లు వెతుకుంటున్నాడని, ఇందుకు గాను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) అవినీతికరంగా మారడమే కారణమని ఎత్తి చూపింది. 14 ఏళ్ల క్రితం రూపొందిన పాఠ్య ప్రణాళికలే నేడు చదవడంతో కొత్త జబ్బుల పట్ల అవగాహన లేకుండా పోయిందని, తక్షణం సెలబస్ మార్చాల్సిన అవసరాన్ని కూడా ఈ నివేదిక నొక్కి చెప్పింది. వైద్య విద్యని కేంద్రీకరిస్తే తప్ప గ్రామీణ ప్రాంతాలకు వైద్యసేవలందవని, పబ్లిక్ హెల్త్‌లో విధిగా శిక్షణ ఇవ్వాలని నివేదిక పేర్కొనడం గమనార్హం. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గమనంలోకి తీసుకుంటే, నిజంగానే ప్రజావైద్యం అందుబాటులోకి వస్తుంది. వీటన్నింటితో పాటు ప్రజల మైండ్‌సెట్ కూడా మారాల్సిందే. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం లభించదని, వైద్యులు సేవలు చేయరనే భావనను దూరం చేసుకొని, వైద్యాన్ని పొందడం ఓ హక్కుగా గుర్తించాలి. అప్పుడే ప్రభుత్వ సంస్థలు మనగలుగుతాయి.
ఓ దళారి, మరో దళారీని తయారు చేసుకుంటాడన్నట్టుగా ప్రభుత్వమే ప్రభుత్వ సంస్థల్ని సక్రమంగా నడపకుండా ప్రైవేటును ప్రోత్సహిస్తూ, కొన్ని వర్గాలను నోరుమూయించడానికై కొన్ని రాయితీలను కల్పించం దళారి వ్యవస్థను ప్రోత్సహించడమే అవుతుంది. ఇలా లబ్ది పొందేవారే లాభం జరిగితే పొగడడం, ఇబ్బందులుంటే విమర్శించడం చేస్తూ ఉంటారు. వీరికి స్వార్థ చింతన తప్ప ప్రజాసంక్షేమం పట్టదు. పైగా ప్రజా బాహుళ్యానికి వీరంతా అతీతం అని భావిస్తుంటారు. ఈ వర్గాలనే ప్రభుత్వం మచ్చిక చేసుకోవడం, ప్రజాసంక్షేమాన్ని మరవడం జరుగుతుంటుంది. ఇది రూపుమాపాలంటే, అందరికి ఓకే విధమైన వైద్య విధానం అందుబాటులోకి రావాల్సిందే. ఈ దిశగా తెలంగాణ సర్కారు కదిలితే అభినందనీయమే.
ఇదేగనక జరిగితే, ఒకటి రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో వేళ్లూనుకున్న కార్పొరేట్ ఆసుపత్రులు బిచాణా ఎత్తివేస్తాయి. అవి అమ్ముకున్నా ఎవరూ కొనరు కాబట్టి, ప్రభుత్వానికే అప్పజెప్పాల్సి వస్తుంది. జనాల సొమ్ముతోనే నిర్మితమైనవి కాబట్టి తిరిగి ప్రజాపరం కావడం జరిగితే ప్రభుత్వం భావించినట్టు ప్రచారం చేస్తున్నట్లు బంగారు తెలంగాణ సాకారమైనట్లే. కాని, ఇదో కల అని మన అనుభవాలు చెబుతున్నాయి. ఈ కార్పొరేట్ ఆసుపత్రులు అన్నీ ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న విషయం తెలిసిందే. వీటిని నియంత్రించడం అంత సులువైన పని కాకపోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం భావించినట్లు వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తే, వైజాం కాలంనాటి వైద్య విధానం అందుబాటులోకి వచ్చినట్లే. నైజాంను పదే పదే పొగిడే కెసిఆర్ ఈ విధంగానన్నా నైజాంను అనుకరిస్తే మంచిదే. కనీసం ఇప్పుడన్నా కెసిఆర్, ఆయన మంత్రివర్గం, వివిధ ప్రజా నాయకులు, ప్రభుత్వ వైద్యశాలల్లోనే అవసరం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో సహా చికిత్సలు చేయించుకుంటే కెసిఆర్ మాటల్లో ఓ అద్భుతం జరిగినట్టే. లేదంటే మాటలు వేడి నీటి బూరెలుగా మిగిలిపోతాయి. ఇది జరగవద్దని ఆశిద్దాం.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162