రచ్చ బండ

గ్రేటర్ ‘హారం’ ఎవరి మెడలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నిజానికి ఈ ఎన్నికలు అన్ని పార్టీలకూ ఓ పరీక్ష వంటివే. గ్రేటర్ హైదరాబాద్‌లో కొద్దిగా ఎక్కువ, తక్కువతో అన్ని పార్టీలకూ బలం ఉంది. అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలకే బలం ఎక్కువ ఉన్నా, టిడిపి, కాంగ్రెస్‌ల నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపుల తర్వాత ఆ పార్టీ పుంజుకుంది. ఇక పాతనగరంలో పట్టు ఉన్న మజ్లీస్ పార్టీ తోడుగా ఉండడంతో, మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చన్న భావనతో టిఆర్‌ఎస్ ఉంది. అంతేకాకుండా ఎక్స్‌అఫిషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లూ కలిసి రావడం వల్ల మేయర్ స్థానాన్ని సునాయసంగా సాధిస్తామన్న నమ్మకంతో టిఆర్‌ఎస్ ఉంది. మేయర్‌ను ప్రజలు ఓటింగ్ ద్వారా కాకుండా, ఎన్నికైన కార్పోరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. కాబట్టి ఈ ఫిరాయింపులు, మజ్లీస్ సహకారం దోహదపడుతుందన్న నమ్మకంతో టిఆర్‌ఎస్ ఉంది.
తాజాగా వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయదుందుభి మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. మరోవైపు నగర ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు ఆకర్షనీయమైన అస్త్రాలను ప్రయోగించింది. 1200 రూపాయల లోపు ఆస్థి (ఇంటి) పన్ను చెల్లిస్తున్న వారు ఇక మీదట ఏడాదికి 110 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. నగరంలో నీటి బిల్లుల బకాయిల మాఫీని ప్రకటించింది. విద్యుత్తు, నీటి సరఫరాలో ఆటంకం, ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతున్నది. ఇంకా గృహా నిర్మాణంలో కొన్ని నిబంధనలను సరళీకృతం చేయడం, రెండు పడకల గదుల ఇళ్ళ నిర్మాణం, ఐటి హబ్, వైఫై వంటివి హామీల జల్లు కురిపించడంతో ఓట్ల వర్షం కురుస్తుందన్న ఆశతో టిఆర్‌ఎస్ శ్రేణులు ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో పూర్తిగా బలపడాలన్న పట్టుదలతో టిఆర్‌ఎస్ ఉంది. టిఆర్‌ఎస్‌కు తెలంగాణ జిల్లాల్లో పట్టు ఉన్నా, హైదరాబాద్‌లో అంతగా బలం లేదన్న భావన ఉంది. గత అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో టిడిపి, బిజెపి హవానే కొనసాగింది. కాబట్టి టిడిపి-బిజెపిలను కాదని సంపూర్ణంగా బలం సాధించి, మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది.
ఇక మిత్రపక్షాలైన టిడిపి-బిజెపిలు గ్రేటర్ పరీక్షను ఎదుర్కొబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిథిలో టిడిపి-9, బిజెపి-5 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. నిరూపించుకోలేకపోతే రెండు పార్టీల బలం తగ్గిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ మేరకు రెండు పార్టీల నాయకులు ఇదివరకే కసరత్తు ప్రారంభించారు. కలిసి నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు ఈ సమావేశాలు హాజరయ్యారు. ఈ నెల 9న (శనివారం) నగరంలోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభను టిడిపి ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. మిత్రపక్షమైన బిజెపినీ ఆహ్వానించారు. ఇలాఉండగా నగరంలో, నగర శివారులో ఉన్న సెటిలర్ల ఓట్లపై టిడిపి ఆశలు ఎక్కువగా పెట్టుకున్నది. సెటిలర్లు టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓట్లు వేయరు కాబట్టి తమ పార్టీల అభ్యర్థులకే వేస్తారన్న ఆశాభావంతో టిడిపి-బిజెపి నేతలు ఉన్నారు. టిడిపి హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ప్రపంచంలో హైదరాబాద్‌కు గుర్తింపు లభించిందని ఆ పార్టీ ప్రచారం చేస్తున్నది. గతంలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్ స్థానాన్ని నగర ప్రజలు తమకే కట్టబెట్టారని, ఇప్పుడూ తమకే లభిస్తుందన్న ధీమాతో టిడిపి ఉంది. ‘షహర్ హమారా...మేయర్ హమారా’ నినాదంతో టిడిపి ప్రచారాన్ని ఉధృతం చేసింది. మరోవైపు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో పరోక్షంగా మద్దతు ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను తమ తరఫున ప్రచారం చేయాల్సిందిగా టిడిపి-బిజెపి నేతలు కోరనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నది. స్థానిక సంస్ధల కోటా నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకోవడంతో నిలదొక్కుకోగలమన్న నమ్మకం నేతలకు ఏర్పడింది. ప్రత్యామ్నాయం తామేనని, బిజెపి-టిడిపిలకు ఆ సత్తా లేదన్న ధీమాతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రిజర్వేషన్లు ప్రకటించకపోవడం, ఎన్నికల ప్రక్రియను కుదించడం, ఎన్నికల తర్వాత కరెంటు, నీటి బిల్లుల మోత ఉండబోతుందన్న ప్రచారం చేస్తూ ఎదురు దాడికి దిగింది. గ్రేటర్‌లో విజయం సాధిస్తేనే ఎఐసిసి వద్ద తమకు గౌరవం ఉంటుందన్న పట్టుదలతో టి.పిసిసి నాయకులు కష్టపడుతున్నారు.
మజ్లీస్ పార్టీ ధీమాగా ఉంది. పాతనగరంలోని పట్టు ఉన్నందున 40 నుంచి 45 డివిజన్లలో విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నారు. ఫలితాల తర్వాత టిఆర్‌ఎస్‌కు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేంత మెజారిటీ వచ్చే అవకాశం లేనందున, తప్పకుండా తమపైనే ఆధారపడాల్సి వస్తుందని, అప్పుడు మేయర్ స్థానాన్ని రెండున్నర సంవత్సరాల చొప్పున తీసుకోవచ్చన్న ఆలోచనతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉంది. సెటిలర్లు అధికంగా ఉన్న డివిజన్లలో విజయం సాధించవచ్చని భావిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరామర్శ యాత్ర నిర్వహించారు. తక్కువ సీట్లు వచ్చినా, కనీసం పునాది పడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వామపక్షాలూ గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. వామపక్షాలతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. ఇలా అన్ని పార్టీలూ గ్రేటర్ పరీక్షలో విజయం కోసం వ్యూహప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి