మెయన్ ఫీచర్

ప్రభుత్వ బడుల పయనమెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నసీరొద్దీన్ కొడుకుతో కలిసి గాడిదను తోలుకుంటూ సంతకు పోతుంటాడు. ఎదురుపడిన కొందరు, గాడిదను నడిపించుకుంటూ మీరు నడుచుకుంటూ పోవడమేంటని ఆశ్చర్యపడతారు. దీంతో కొడుకును గాడిదపై ఎక్కించి తాను నడుస్తాడు. ఈ దృశ్యాన్ని చూసిన మరికొందరు, తండ్రి నడుస్తూ, కొడుకును గాడిదపై కూర్చుండబెట్టడమేంటని అంటూ వాపోతారు. వెంటనే కొడుకును దించి తాను కూర్చుండి పయనిస్తుండగా, చిన్న పిల్లవాడిని నడిపిస్తూ తండ్రి గాడిదపై కూర్చుండడమేంటి అంటూ ఇంకొందరు ముఖం చిట్లించడంతో, చేసేది లేక ఇద్దరు గాడిదపై కూర్చుండి పయనిస్తుంటే, అడ్డగాడిదల్లా ఇద్దరూ ఒక్క గాడిదపై ఎట్లా కూర్చుండి పయనిస్తున్నారో చూడండని విస్తుపోతారు మిగతావారు. ఇది అందరికీ తెలిసిన కథే అయినా, ప్రభుత్వ విద్యారంగానికి అన్వయించుకుంటే చక్కగా అతుకుతుంది.
దశాబ్దం క్రితం వరకు అంగరంగ వైభవంగా నడిచిన ప్రభుత్వ పాఠశాలలు, నేడు విద్యార్థుల లేమితో, విడిచిపెట్టిన నివాసాల్లా దర్శనమిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలు లేరా అంటే, ఉన్నా ఈ పాఠశాలల దరిదాపుల్లోకి రావడానికి జంకుతున్న వైనం. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు, ప్రభుత్వ విద్యారంగ దుస్థితికి కారకులనేకులైనా, కనిపిస్తున్నది మా త్రం కేవలం ఉపాధ్యాయులే. ప్రైవేట్ పాఠశాలలు నడవడానికి యాజమాన్యాలు కారణమైతే, ప్రభుత్వ రంగ విద్య వైఫల్యాలకు ఉపాధ్యాయులే కారణమనడం ఎంతవరకు సబబో యాజమాన్య పాత్ర పోషిస్తున్న ప్రభుత్వం ఆలోచించడంలేదు. ఈ దుస్థితి కంతటికి ఆంగ్ల మాధ్యమమే కారణమనే ప్రచారాన్ని ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న ప్రసార మాధ్యమాలు, స్వచ్ఛంద సంస్థలు పనిగట్టుకొని దుష్ప్రచారాన్ని సాగిస్తూనే, ప్రభుత్వ పాఠశాలలో కనీస అభ్యసన కొరవడిందని, చదవడం, రాయడం, గణిత భావనలు శూన్యమని సర్వేల ద్వారా తెలపడం పరిపాటైంది. కుక్కను చంపాలంటే ‘పిచ్చికుక్క’ అనే ముద్ర వేయాలన్నట్టుగా, ప్రభుత్వ పాఠశాలల్ని దెబ్బతీయడానకి ఈ సర్వే హస్తాల్ని కార్పొరేటు సంస్థలు బాగా వినియోగించుకున్నాయి. పోనీ ఈ స్వచ్ఛంద ముసుగులో పనిచేస్తున్న సంస్థ లు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల్ని సర్వే చేయగలవా? చేస్తాయా అంటే, సమాధానం తెలిసిందే.
ఒకవైపు ప్రైవేట్ విద్యారంగాన్ని నియంత్రిస్తున్నట్లు నటిస్తూ, సమాజం ఒత్తిడి మేరకు కొన్ని జీవోలైన 1,91,42,780లను ప్రభుత్వం ఆయా సందర్భాలల్లో విడుదల చేసింది. 1994, 2014ల మధ్యన విడుదలైన ఈ జీవోలు ఒక్కటి ఆచరణలోకి రాకపోగా, కోర్టుల్లో నానుతున్నాయి. మనసా, వాచా వీటిని అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడమే కారణమని అందరికి తెలిసిందే. దీన్ని కప్పిపుచ్చుకునేందుకై, జనమంతా ఆంగ్ల మాధ్యమం కావాలంటున్నారనే ప్రచారాన్ని మొదలుపెట్టింది. దీనికితోడు, ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణను, ఉపాధ్యాయుల, మండల విద్యాశాఖాధికార్ల నియామకాలను గాలికి వదిలేసింది. వీటికితోడు సర్వశిక్షా అభయాన్ ప్రయోగాలు విద్యను గాడిలో పెట్టాల్సింది పోయి, పెనంపైనుంచి పొయ్యిలోకి తోసేసాయి. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో సక్రమంగా నడిచిన పాఠశాలల్ని విడదీసి ప్రాథమిక విద్యను వేరు చేసింది. వృత్యంత శిక్షణ పేరుపై ఉపాధ్యాయుల్ని తరగతులకు దూరం చేసింది. ఖాళీలకు అనుగుణంగా, వెనువెంటనే శిక్షణ పొందిన వారిని నియామకం చేయాల్సింది పోయి, డిఎస్సీల నాటకంతో వాయిదా వేయడంతో పారా టీచర్ల వ్యవస్థ ప్రత్యామ్నాయంగా రూపొందింది. మాడ్యూళ్ల రూపకర్తల పేరున అసలైన పుస్తకాల్ని అటకెక్కించింది. తరగతి గది బాధ్యత పేరున విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విసుగు కలిగించే విధానాన్ని ముందుకు తెచ్చింది. మధ్యమధ్యన వినూతన పథకాలంటూ నూతనపోకడలంటూ, ఎంఆర్‌పి వ్యవస్థంటూ, కింది స్థాయినుంచి రాష్ట్రా స్థాయిదాకా జూనియరు ఉపాధ్యాయులు, కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు కానివారిని, సీనియరు ఉపాధ్యాయుల్ని, ప్రధానోపాధ్యాయుల్ని, చివరికి డైట్ ఫ్యాకల్టీని పర్యవేక్షించే స్థాయి దాకా సర్వశిక్షా అభియాన్ ఎదిగింది.
ఈ ప్రయోగాల్ని పర్యవేక్షించి, తగు సూచనల్ని చేయాల్సిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి గుడ్లప్పగించి చూడడమేకాక, సర్వశిక్షా అభియాన్‌ను గుప్పిట్లో పెట్టుకున్న ముగ్గురు నలుగురు సభ్యులు చెప్పుచేతల్లోకి వెళ్లిపోయింది. ప్రాథమిక విద్యారంగాన్ని ఎంతగా భ్రష్టు పట్టించాలో అంతగా పట్టించిన ఈ అభియాన్ మాధ్యమిక అభియాన్‌గా, సెంకండరీ విద్యకు చుట్టుకుంది. సర్వశిక్ష అభియాన్‌ను ఆడించిన ముఠా సభ్యులే, ఇప్పుడు విద్యా పరిశోధనా మండలికి వలస రావడంతో మొత్తంగా విద్యారంగం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కాదు, కూడదని వీరంటే, నేటి ప్రభుత్వ విద్యారంగ దుస్థితికి కారణాలు బహిరంగంగా చెప్పగలగాలి. ఇంతగా ప్రభుత్వ రంగ విద్య కాలం చెల్లిందిగా మారుతుంటే, కనీసం సమీక్షించుకునే స్థితిలో లేరు. చివరికి ఆంగ్లం బోధించడానికై ఉపాధ్యాయులు కావలెను అని ఓ ప్రభుత్వ పాఠాశాల కమిటి పత్రికా ప్రకటనలివ్వగా, ప్రభుత్వ పాఠశాలల్లో కేరళ ఉపాధ్యాయినిలచే ఆంగ్ల బోధనంటూ మరో పాఠశాల ప్రకటించే స్థితికి దిగజారాయి. నిజంగానే ఆంగ్ల మాధ్యమం అవసరం అని భావిస్తే, ఉన్న ఉపాధ్యాయులు ఎందుకు ఆంగ్ల మాధ్యమంలో బోధించరో ప్రభు త్వం అడగదు. ప్రజలు అడగరు. ఆంగ్లమాధ్యమ బోధన పేరున నియామకం చేయబడే ఉపాధ్యాయుల జీతభత్యాన్ని గ్రామ కమిటీలు ప్రారంభించినా, చివరికి వసూలు చేసేది సాధారణ ప్రజలనుంచే అనేది అందరికి తెలిసిందే. అంటే, విద్యాహక్కు చట్టానికి గండికొట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజుల్ని వసూలు చేయడం జరుగుతుందన్నమాట.
స్వయాన ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తామని ఉపాధ్యాయులు ముందుకు రారు. శిక్షణనిచ్చి వీరిచేతనే బోధించేలా చూడా లని ప్రభుత్వం భావించదు. ఈ సంధికాలంలో ఊరూరా, వాడవాడన, ప్రైవేటు బస్సులు డేగల్లా తిరుగుతూ కోడిపిల్లల్ని వేటాడిన విధంగా పిల్లల్ని వేటాడి పట్టుకుపోవడం జరుగుతూనే ఉంది. కానున్న పనిని గంథర్వులు చేశారన్న సామెతలా, ప్రభుత్వ తలంపును, ఉపాధ్యాయులు నెరవేరుస్తూ, సమాజం ముందు దోషుల్లా నిలబడాల్సి వస్తున్నది. ఆత్మపరిశీలన, స్వయం విమర్శ లేని ఈ వర్గం భవిష్యత్తే అగమ్యగోచరంగా మారింది. రాబోయే పరిణామాలు ఎలా వుంటాయో వీరికి తెలిసిరావడం లేదు. తెలిసి చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యతల్ని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడో భుజాలనుంచి జారవిడుచుకున్నాయి. వీరికి సర్వీసు సమస్యల చింత తప్ప సేవా చింత వెతికినా కానరాని వైనం.
గత విద్యా సంవత్సరం గణాంకాల ప్రకారమే ఆంధ్ర ప్రదేశ్‌లో దాదాపు11,165 ప్రాథమిక, ఉచ్ఛతర పాఠశాలలు మూతపడుతుండగా, ఇందులో పనిచేసే 27,500 మంది ఉపాధ్యాయుల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది. తెలంగాణలో 4,481 పాఠశాలలు మూత పడుతుండగా, 50 మంది కన్నా తక్కువగల విద్యార్థుల పాఠశాలలు 12,138గా తేలింది. ఈ విద్యాసంవత్సరం ఈ సంఖ్య కూడా ఉండే పరిస్థితి కనిపించడంలేదు. ఈ లెక్కన 20 వేలమంది ఉపాధ్యాయులపై వేటుపడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న 250 గురుకుల పాఠశాలలు మొగ్గ తొడిగితే వీటికి తోడు కెజిబివిలు, ఇప్పటికే ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు జతకడితే, రెగ్యులర్ ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలేవి ఎన్ని అనేది ప్రశ్న. ఇక కె.జి.టు పిజి ఆంగ్ల మాధ్యమమే వస్తే (ఊహాజనిత పథకమే అయినా) పరిస్థితి ఏంటనేది తేలని ప్రశ్ననే.
ఇవన్నీ నిజమైతే, కొత్తగా కాంట్రాక్టర్లకోసం కట్టే రెసిడెన్షియల్ పాఠశాలలు కెజిబివిలు ప్రభుత్వ రంగంలో మిగలగా, ఇప్పుడున్న పాఠశాలలన్నీ ప్రైవేటు రంగంలో నడుపుకోవడానికై కిరాయిలకు ఇవ్వబడుతాయి. కేరళలో ఒకప్పుడు జరిగినట్టుగా స్థానిక ప్రభుత్వ అధికారుల దగ్గర ఉపాధ్యాయులంతా హాజరవుతూ సంక్షేమ పథకాల, సర్వే పనుల ఆజమాయిషిని చేయాల్సి వస్తోంది. కొందరికి ఇది ఇష్టంగా ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో ఉచిత విద్య, అందుబాటులో విద్య, అన్ని వర్గాల పిల్లలు ఒకే గొడుగు కింద విద్యను పొందే అవకాశం సమాజం మొత్తంగా కోల్పోతుంది. ఇప్పటికే ఆర్థిక స్థోమతను బట్టి, వర్గాలను బట్టి, కులాల్ని బట్టి మతాల్ని బట్టి రూపుదిద్దుకున్న పాఠశాల వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతున్నది. పాలకులు ప్రవచించే వసుదైక వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియదు.
రోజురోజుకు రోగగ్రస్తంగా మారుతున్న విద్యారంగం సేవా దృక్పథానికి తెరను దింపి, దోపిడి తెరను ఎత్తడం ప్రజాస్వామ్యానికే తీరని నష్టం. ప్రభుత్వం విద్యనందించే బాధ్యతనుంచి తప్పుకుంటూ ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తుంటే చేష్టలుడిగి, చూడడం ఉపాధ్యాయుల తప్పిదమే. ఉపాధ్యాయుల్లో గూడుకట్టిన జడత్వాన్ని వదలుకుంటే, ఆర్‌టిసి కార్మికుల్లా కదిలితే విధిగా ప్రభుత్వ విద్యారంగం కాపాడబడుతుంది. ఇప్పటికే వైద్యం ప్రైవేటు కోరల్లో ఇరుక్కుంది. ప్రభుత్వ రంగసంస్థలు బేజారవుతున్నాయి. ప్రభుత్వ రంగ సేవలన్నీ అవుట్ సోర్సింగ్‌కు అప్పజెప్పబడ్డాయి. ప్రతీ పనికి వందల రూపాయల సేవాపన్నుతోపాటు, లంచాల్ని చెల్లిస్తున్నాం. బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగాలు, చివరికి పోస్ట్ఫాసు సేవలు పే అండ్ యూజ్‌గా మారిపోయాయి. ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ తప్ప అంతా ప్రైవేటు అవుతే, ప్రజాస్వామ్యానికి అర్థాలు వెతకాల్సిందే.
(జూన్ 15న మాగ్నాకార్టా ఆవిర్భావదినాన్ని, జూన్ 18న జపాన్‌లో రైలు బడిని ప్రారంభించిన సొసాకు కొబయాషి జన్మదినాన్ని పురస్కరించుకొని..)

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162