మెయిన్ ఫీచర్

కష్టం విలువ తెలిస్తే రాణించడం సులువే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగినవాడు వెనకడుగు వేయడమే ఉండదని అంటోంది తిరుచికి చెందిన ఆశా సుల్తానా. చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చే భర్త ఆల్‌జఫర్ ఇంటి అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని అనుక్షణం వేధిస్తూ ఉండేవి. ఆ సమయంలో తాను కూడా ఏదో ఒకటి చేసి భర్తకి అండగా నిలవాలని సుల్తానా అనుకుంది. అయితే అప్పటికప్పుడు కుటుంబ పోషణకు సరిపడా సంపాదించగల ఉద్యోగం వచ్చేపాటి చదువు ఆమె చదువుకోలేదు. దాంతో ఏం చేయాలా అని బాగా ఆలోచించింది. కానీ ఏ దారీ కనిపించలేదు.
అలా రోజులు భారంగా గడుస్తున్న సమయంలో భారతీదాసన్ యూనివర్సిటీలో చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు స్థాపించేందుకు మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలిసింది ఆమెకి. వెళ్లి చూద్దాం.. ఖాళీగా ఉండడం కంటే అక్కడికి వెళితే ఏదో ఒక దారి దొరక్కపోదు కదా అనుకుంది. భర్తకి చెప్పి రెండు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాముకి వెళ్లింది. ఒమెన్ ఎంటర్‌ప్రీనియర్స్ అసోసియేషన్ ఆఫ్ తమిళనాడు (డబ్ల్యుఇఎటి) ఆధ్వర్యంలో జరిగిన ఆ శిక్షణ కార్యక్రమంలో అనేక అంశాలపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. అవన్నీ స్ర్తిలు సొంత కాళ్ళపై నిలబడి జీవనోపాధి పొందే కోర్సులే. మార్కెట్ స్థితిగతులు, వైవిధ్యంగా ఆలోచించడం, పోటీ తక్కువగా ఉండే అంశమైతే మంచిదని భావించిన సుల్తానా అక్కడ నేర్పిస్తున్న హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ తయారీలో శిక్షణ తీసుకుంది. హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ అంటే ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు వాడే మాస్కులు, గ్లౌజులు, వారు విధులు నిర్వర్తించేందుకు ఉపయోగపడే యాఫ్రాన్స్ వంటివి కుట్టే పని. నిజానికి అక్కడికి వచ్చిన చాలామంది మహిళలు ఫినాయిల్ తయారుచేయడం, కొవ్వొత్తులు, నీలిమందు తయారుచేయడం వంటి సాదాసీదా వృత్తుల్లో శిక్షణ తీసుకుంటే సుల్తానా మాత్రం వైవిధ్యంగా ఆలోచించి హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ తయారీలో శిక్షణ పొందింది.
అదే ఇప్పుడు ఆమె చక్కగా రాణించేందుకు సహాయపడింది. శిక్షణ పూర్తిచేసుకున్న సుల్తానా ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, రోగులు ఉపయోగించే దుస్తులు, ఇతర పరికరాల తయారీలో తీసుకున్న శిక్షణను పట్టుదలతో సాధన చేసింది. భర్త సహకారంతో వాటిని రూపొందించేందుకు అవసరమయ్యే కుట్టుమిషన్, ఇతర పరికరాలను సమకూర్చుకుని తక్కువ సమయంలోనే వాటిని మార్కెట్ చేసే స్థాయికి చేరుకుంది. ఫ్రీ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ పేరిట వాటిని మార్కెట్‌లో సప్లై చేయడానికి నడుం బిగించింది. తొలుత మార్కెట్‌లో వారి ఉత్పత్తులపట్ల ఆదరణ కనిపించలేదు. అయితే సుల్తానా ఉత్పత్తుల్లోని నాణ్యత, మన్నిక, గట్టిదనాన్ని గమనించిన ఒకటి రెండు ఆసుపత్రులవారు కొద్దిగా ఆర్డర్ చేసారు. ఇతర ప్రొడక్టులకన్నా సుల్తానా ప్రొడక్టులు తక్కువ ధరకు రావడం, మన్నిక ఇతర వాటి కంటే బాగుండడం, సరకు అయిపోయిన వెంటనే ఆర్డర్ చేయగానే నిమిషాల్లో స్టాక్ అందడం వంటి సౌలభ్యం గుర్తించి వారే ఆర్డర్ ఒకటికి రెండింతలు చేసారు. అంతే కాకుండా తమకి తెలిసిన వాళ్లకి కూడా ఈ విషయాలు చెప్పడంతో సుల్తానా వ్యాపారం అనతికాలంలోనే వేగం అందుకుంది. దాంతో సుల్తానా తన వ్యాపారాన్ని విస్తరించింది.
మెడికల్ స్క్రబ్, సిసేరియన్, నార్మల్ డెలివరీ మ్యాట్స్, మెటర్నిటీ శానిటరీ నాప్‌కిన్స్ వంటి ఆసుపత్రుల్లో ఉపయోగించే అన్ని రకాల ఉత్పత్తులను చక్కగా రూపొందించి మెల్లగా మార్కెట్‌లో తన ఉత్పత్తులకు తిరుగులేని స్థాయిని కల్పించగలిగింది. తొలుత తానొక్కతే అంత పనిని చేసుకుంటూ నెట్టుకు వచ్చిన సుల్తానా ఇప్పుడు ఏకంగా ఏడుగురు మహిళా ఉద్యోగులను ఫుల్‌టైం ప్రాతిపదికన పనిలో పెట్టుకుని తాను ఉపాధి పొందడమే కాకుండా తనలాంటివారు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది.
అలా ఇంట గెలిచిన ఆమె ఇప్పుడు తన మెడికల్ ఉత్పత్తులతో గుజరాత్‌వరకు వ్యాపారాన్ని విస్తరించి రచ్చ కూడా గెలుస్తోంది. భర్త సహకారంతో మార్కెట్‌లో వారానికి రెండుసార్లు తిరుగుతూ ఆర్డర్లు సంపాదిస్తుంది సుల్తానా. తమ ఉత్పత్తులకు సొంతంగా వారే లేబిలింగ్ కూడా చేసుకుంటారు. ఇప్పుడు వారు తమ ఉత్పత్తులను తిరుచిలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రులకు, తంజావూరులో ఒకటి, చెన్నైలో ఒక్క ఆసుపత్రికి సప్లై చేస్తున్నారు.
ఈ విజయంపై ఆమె మాట్లాడుతూ తొలుత తాను అయిదువేల రూపాయల పెట్టుబడితో తన ఇంట్లోనే ఒక చిన్నపాటి గదిలో ఈ పనిని మొదలుపెట్టానని, అయితే పట్టుదల, కష్టపడే తత్వం, ఓర్పుతో ఈ స్థితికి వచ్చానని, కష్టం విలువ ఇప్పుడు తనకి అర్థమయిందని అంటోంది.

-బాబు