మెయిన్ ఫీచర్

ఆగని హత్యలు.. ఆత్మహత్యలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్టల్ భవనం మీంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని- అధికారి వేధింపులు తాళలేక ఉద్యోగి బలవన్మరణం- రైలు పట్టాలమీద గుర్తు తెలియని శవం- ఇలా నేడు ఏ వార్తాపత్రిక తిరగేసినా, ఏ న్యూస్ చానల్ పెట్టినా ఇటువంటి వార్తలే కోకొల్లలుగా కానవస్తున్నాయి. ఒకప్పుడు ఒకటో అరో ఇటువంటి సంఘటనలు జరిగేవి. వాటిని చూసినా, చదివినా జనం ఎంతో ఉద్వేగానికి గురయ్యేవారు. ఇవాళ అనునిత్యం అసంఖ్యాకంగా ఇటువంటి వార్తలే దర్శనమివ్వడంతో ఎవరైనా బలవంతంగా ప్రాణం తీసుకున్నారంటే ఆ వార్తకు చలించనివారుండరు. అవే ప్రతిరోజూ వెలువడితే స్పందన కరువవ్వదా మరి. ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని జరుగుతున్నా వాటిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి.
ఇదివరలో ఎప్పుడోగాని సంభవించని ఆత్మహత్యలు ఇపుడు నిత్యం ఎందుకు జరుగుతున్నాయి? వాటిని నిరోధించడానికి కారణాలు తెలిస్తేగాని సలహాలు, సూచనలు ఎవ్వరూ ఇవ్వలేరు.
అసలు యువత ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతోంది? బతుకుమీద తీపి ఉండకనా? బలవంతంగా ప్రాణం తీసుకోవాలంటే భయం ఉంటుంది కదా! మరెందుకంత తెగింపు? ఏం చేస్తే ఈ ఆత్మహత్యలు ఆగుతాయి? ఈ విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారుల పాత్రనే ఎక్కువగా ఉంటుందన్న సంగతి జగద్వితితం.
అయితే అందుకు వారు తీసుకోవలసిన చర్యల్ని నిశితంగా విశే్లషించుకోవాలి. ఎవరు ఎందుకు ప్రాణం తీసుకున్నా అది కన్నవాళ్ళకు కడుపుకోతే. అందులో సందేహం లేదు. మరి అటువంటప్పుడు ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా తల్లిదండ్రుల విషయానికొద్దాం. సాధారణంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టరుగానో, ఇంజనీరుగానో, ఆఫీసరుగానో చూడాలనుకుంటారే తప్ప వారి అభిరుచుల్ని, అభిలాషల్ని తెలుసుకోవడానికి ఎంత మాత్రం ప్రయత్నించరు. ఉదాహరణకి ఒక పిల్లవాడికి లెక్కలమీద పట్టు ఉండదు. ఎలాగో ఆ సబ్జెక్టులో అత్తెసరు మార్కులతో పరీక్ష పాస్ అవుతాడు. అయినా సరే వాడిని ఏదో విధంగా బిటెక్ చదివించి తమ కలని సాకారం చసుకోవాలనుకుంటారు. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు వస్తే తప్ప పిల్లాడికి సీటురాదని తెలిసినా ఎలాగో అలాగ లక్షలు డొనేషన్ కట్టి బలవంతంగా కాలేజీలో చేర్పించి అక్కడితో తమ బాధ్యత తీరిపోయిందనుకుని చేతులు దులిపేసుకుంటారే తప్ప వాడెలా చదవగలడన్న ఆలోచన చేయరు. తరగతి గదిలో లెక్చరరు లెక్కలు బోధిస్తున్నపుడు అవి తనకు బుర్రకెక్కక తెగ మథనపడిపోతాడు విద్యార్థి. పోనీ ఆ చదువు మానేద్దామనుకుంటే కట్టిన డొనేషన్ మాటేంటి? నాన్న ఏమంటాడో! స్థోమతకు మించి డబ్బు కట్టిన తండ్రి కళ్ళముందు మెదులుతాడు. మధ్యలో చదువు స్వస్తి చెబితే తోటివారిలో తన అసమర్థతత బయటపడుతుంది. ఆ పరిస్థితిని ఎదుర్కోలేక, చదువు కొనసాగించలేక యమయానపడుతూ చివరికి ఆత్మహత్యే శరణ్యమనుకుంటాడు. కాబట్టి ప్రతి పేరెంట్ పిల్లవాడి అభిరుచికి అనుగుణంగా తను కోరుకున్న చదువు పట్లే మొగ్గు చూపాలి. విద్యార్థుల ఆత్మహత్యలకు నేడు ఇటువంటి కారణాలే కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు మహిళ చదువుకున్నా ఇంటికే పరిమితమయ్యేది. కాని ఇవాళ అలా కాదు. వాళ్ళల్లో బాగా అవేర్‌నెస్ వచ్చింది. చదువుకున్న అమ్మాయిలంతా తమ కాళ్ళమీదే తాము నిలబడాలనుకుంటున్నారు. ఇది శుభ పరిణామమే. పోతే విద్యార్థులు పిక్‌నిక్‌లకు, విహారయాత్రలకు వెళ్లినపుడు టీచర్స్ తగిన సూచనలు చెయ్యాలి, జాగ్రత్తలు చెప్పాలి. అయితే వారు అవేమీ చెయ్యరు. ఆ కారణంగానే ఈత రానివారు కూడా తోటి మిత్రబృందంతో సరదాకోసం సరస్సులో మునగడం సెల్ఫీలు తీసుకోవడం ప్రాణాలమీదికి తెచ్చుకోవడం జరుగుతోంది.
అన్నిటికి మించి ప్రేమ వ్యవహారాలు ఆత్మహత్యలకు మరింతగా దోహదవౌతున్నాయి. ప్రేమ ఫలించలేదని, క్షణికావేశంలో బతుకు కడతేర్చుకోవడం వంటి దుర్గటనలు నిత్యం మన సమాచార మాధ్యమాల్లో వీక్షిస్తున్నాం. అంతేకాదు కోరుకున్న అమ్మాయి తనని ప్రేమించలేదన్న కక్షతో ఆమెపై యాసిడ్‌దాడి, పెట్రోల్ పోసి చంపడం లాంటి సంఘటనలు కూడా వింటున్నాం. దానికితోడు రహదారి వాహన ప్రమాదాల్లో మరణించడం ఇలా ఎన్నో ఎనె్నన్నో.
ఇక ఉద్యోగుల విషయానికొద్దాం. జాబ్ చేసే కొంతమంది మహిళలు బాస్‌ల లైంగిక వేధింపులు భరించలేక, ఉద్యోగం మానేయలేక ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతోంది. అయినా అటువంటి అధికార్లమీద ఎటువంటి చర్యలు ఉండడం లేదు. అలాంటప్పుడు ఈ సమస్యకు ముగింపు ఎలా సాధ్యం? అన్నిటికి మించి ఆర్థిక పరిస్థితులు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అల్పాదాయంతో ఆలుబిడ్డల్ని సుఖపెట్టలేక, దారిద్య్రాన్ని అనభవించలేక కన్నబిడ్డల్ని చంపి తాము ఆత్మహత్య చేసుకునే విషాద సంఘటనలు మరెన్నో...
ఈమధ్య అన్నదాతలు ఆత్మహత్యలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఋణం తీసుకుని పంటమీద పెట్టుబడి పెట్టినా తగిన దిగుబడి రాదు. వచ్చినదానికి గిట్టుబాటు ధర ఉండదు. ఏం చెయ్యలో తోచని నిస్సహాయ స్థితిలో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో అనునిత్యం మన కళ్ళముందే జరుగుతున్నాయి. ఋణమాఫీ చేస్తామని రైతులకు అండగా ఉంటామని రాజకీయ నాయకులు ప్రగల్భాలు పలకడం తప్ప ఆచరణలో మాత్రం అంతంత మాత్రమే అని చెప్పుకోవాలి.
ఆత్మహత్య ఎవరు ఎలా చేసుకున్నా వారి కుటుంబ సభ్యులకు విషాదానే్న మిగులుస్తుంది. ఏ ఆత్మహత్య అయినా క్షణిక ఆవేశంలో జరుగుతుంది. కాబట్టి అటువంటప్పుడే మనసును అదుపులో ఉంచుకొని కొన్ని క్షణాలు ఆలోచించగలిగితే ఇటువంటి అనర్థాలకు తావుండదు. దంపతులమధ్య, కుటుంబ సభ్యుల్లో ఏవైనా సమస్యలు తలెత్తినపుడు వాటిని ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆత్మీయులు, బంధువులు వాళ్ళ సమస్యల్ని ముందుగానే పసిగట్టి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అలా కౌన్సిలింగ్ తీసుకున్న ఆలుగమలు సమస్యలకు భయపడి పారిపోరు. ప్రాణాల్ని పోగొట్టుకోరు. సమాజంలో ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే తప్ప ఆత్మహత్యలు ఆగవు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ సమస్య తీరదు.

-దూరి వెంకటరావు